ఖమ్మం

శోభాయమానం.. ఉత్తరద్వార దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, డిసెంబర్ 18: గుబాళించే సాంబ్రాణి పొగలు.. గజ గజ వణికించే చలిగాలులు.. ఘల్లు ఘల్లు మంటూ గుడిగంటల జోరు.. వేద పండితుల మంత్రోచ్ఛారణలు.. మిన్నంటిన సన్నాయి మేళాలు ప్రతిధ్వనిస్తుండగా వైకుంఠ ద్వారంలో కోదండపాణి కొలువుదీరారు. వేల కళ్లు ఆర్తిగా, ఆతృతగా ఎదురుచూసిన శుభ సమయాన.. దివ్య తేజస్సులో తెల్లవారుజామున చీకట్లను చీల్చుకుంటూ.. ధూపదీప, నైవేద్యాల నడుమ.. జై శ్రీరామా.. జగదభిరామా.. నామస్మరణలు మారుమోగుతుండగా ఉత్తరద్వార దర్శనం గుండా శ్రీరామచంద్ర ప్రభు సాక్షాత్కరించారు. శేష పాన్పుపై మహా విష్ణువు అవతారంలో కొలువుదీరిన రామయ్యను భక్తులు కనులారా వీక్షించారు. ఆ దివ్యక్షణం.. ఆమోఘం.. అనిర్వచనీయైన అనుభూతితో భక్తజనం ధన్యులం ప్రభూ అంటూ పులకించారు. పవిత్ర ముక్కోటి శుభవేళ ఉత్తరద్వారాన స్వామిని దర్శించుకొని తరించారు. గరుడ వాహనంపై నీలిమేఘశ్యాముడు.. గజవాహనంపై సీతమ్మ.. హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి వేంచేయగా.. నేత్రపర్వమే నెలకొంది. దక్షిణ అయోధ్య క్షేత్రం భద్రాచలంలో వేలాది మంది భక్తులు భూలోక వైకుంఠ పుణ్యస్థలిని కీర్తించి.. జయ జయ ధ్వానాలతో తన్మయత్వం చెంది తిరుగు పయనమయ్యారు.
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఉత్తరద్వారంలో గరుడ వాహనరూడుడైన శ్రీరామచంద్రుడు భక్తులకు శ్రీమహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామికి విశేష ఆరాధన నిర్వహించారు. శ్రీరామ షడక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన జరిపారు. చతుర్వేదాలు, ద్రవిడ ప్రబంధాలు, ఇతిహాసాలు, శరతాగతి గద్య, గరుడ దండకం, భక్తరామదాసు రచించిర దశరథి శతకం పఠించారు. వైకుంఠ రాముడికి అష్టోత్తర శతహారతి(108 వత్తుల హారతి)తో మంగళాశాసనం, సకల వాయిద్య సమేతంగా సమర్పించారు. ఉత్తరద్వార దర్శనాన్ని పురస్కరించుకొని ముందుగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు భద్రాచలం తహసిల్దార్ రెవెన్యూశాఖ తరుపున ధృవమూర్తులకు తొలి పంచామృత అభిషేకం నిర్వహించారు. భక్తరామదాసు తహసిల్దార్‌గా ఉన్న కాలం నాటి నుంచి సంప్రదాయం కొనసాగుతోంది. ఈ సమయంలో స్వామివారికి తిరుప్పావై గోష్టి, బాలభోగం, తీర్థప్రసాద వినియోగం చేశారు. అనంతరం స్వామివారిని ఉత్తరద్వారం వద్దకు చేర్చి గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. ఉదయం 5 గంటలకు జేగంటలు మార్మోగుతుండగా వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఉత్తరద్వారం తెరుచుకుంది. వైకుంఠాన్ని తలపించేలా అలంకరించిన వేదిక వద్ద ధూపదీపాలు, గుగ్గిలం పొగల మధ్య గరుడ వాహనంపై వేంచేసిన శ్రీరామచంద్రుడు దర్శనం ఇవ్వడంతో భక్తులు తన్మయులయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరద్వారంలో గంకసేపు స్వామికి పూజలు జరిగాయి. శ్రీరామా తారకనామ అష్టోత్తర పూజలు నిర్వహించారు. మంత్రపుష్పం సమర్పించారు. రుగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, ఆధ్వరణ వేదాలను పఠించారు.
స్వామిని దర్శిస్తే మోక్షం..
వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారంలో స్వామివారిని వీక్షిస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుందని దేవస్థానం అర్చకులు ఈ సందర్భంగా వివరించారు. ఉత్తరద్వారం తెరుచుకునే ముందు వైకుంఠ ఏకాదశిని భక్తులకు వివరిస్తూ కీర్తనలు ఆలపించారు. ఏడాదిలో వచ్చే ఏకాదశుల్లో ముక్కోటి అత్యంత పవిత్రమైందని అర్చకులు పేర్కొన్నారు. స్వామిని ఉత్తరద్వారంలో దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందన్నారు. 21 రోజుల పాటు సాగే అధ్యయనోత్సవాల్లో అత్యంత కీలకఘట్టం వైకుంఠ ఏకాదశి నాడు ఉంటుందన్నారు. కాగా ఆద్యంతం ఈ వేడుక కడు రమణీయంగా సాగింది. గజగజ వణికే చలిని లెక్కచేయకుండా భక్తులు భారీగా ఉత్తరద్వారంలో స్వామిదర్శనం కోసం బారులు తీరారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు ఉత్తరద్వారం వద్ద ఎదురు చూడ సాగారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఉత్తరద్వార దర్శనం వీక్షించేందుకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భద్రగిరి రామనామస్మరణతో మారుమోగింది. ఉత్తరద్వార దర్శనం అనంతరం భక్తులు రామయ్య ప్రసాదాల కోసం బారులు తీరారు. ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. ఈ సందర్భంగా పోలీసులు ఆలయ ప్రాంగణం చుట్టూ వలయాకారంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పగల్‌పత్తు ఉత్సవాలు ముగియడంతో నిత్యకల్యాణాలను బుధవారం నుంచి పునరుద్ధరించనున్నారు.
వైభవోపేతంగా తిరువీధి సేవ
ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిచ్చిన వైకుంఠరాముడు అనంతరం తిరువీధి సేవకు తరలివెళ్లారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్, నమ్మాళ్వార్, మరో వాహనంపై అండాళ్ళమ్మవారు, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజ వాహనంపై సీతమ్మవారు, గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తిల తిరువీధి సేవ సాగింది. మేళతాళాలు, భాజాభజంత్రీలు, కోలాటాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరువీధి సేవ శోభాయమానంగా కొనసాగింది. ఈ సమయంలో గిరి ప్రదక్షిణగా అంబాసత్రం మీదుగా రాముడి కోవెలకు స్వామివారు చేరుకున్నారు. ఉత్తరద్వార దర్శన వేడుకలో హైకోర్టు జడ్జి జస్టిస్ శివశంకర్, ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, హరిప్రియ, రాములునాయక్, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఎస్పీ సునీల్‌దత్, జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వరరావు, సబ్‌కల్టెర్ భవేశ్‌మిశ్రా, ట్రైనీ కలెక్టర్ ఐలా త్రిపాఠి, ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.