ఖమ్మం

రాజకీయ అదృష్టవంతుడు భట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, జనవరి 19: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎంపికైన మధిర శాసనసభ్యుడు మల్లు భట్టివిక్రమార్క రాజకీయ అదృష్టవంతుడిగా పేరుగాంచారు. 2004 శాసనసభ ఎన్నికలలో మధిర నుండి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయగా సిపిఎంతో పొత్తు ఉండటంతో నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, డి శ్రీనివాస్ సూచనల మేరకు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఆ తరువాత 2007లో ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సిగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికలలో మధిర నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సిపిఎం అభ్యర్థిపై విజయం సాదించడంతో రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో తొలిసారిగా ఎంఎల్‌ఎగా ఎన్నికైన భట్టికి చీఫ్‌విప్ పదవి లభించింది. అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో డిప్యూటీ స్పీకర్‌గా నియమితులై తెలంగాణ విభజన భిల్లును శాసనసభలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపడంలో కీలకపాత్ర పోషించారు. 2014లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటి కన్వీనర్‌గా నియమితులయ్యారు. 2014లో జరిగిన ఎన్నికలలో 2వ సారి ఎంఎల్‌ఎగా మధిర నుండి ఎన్నికై కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష కార్యదర్శిగా ఎంపికయి, 2015లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి చేపట్టారు. 2018 ఎన్నికలలో భట్టి సమర్థతను గుర్తించిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించారు. తాజాగా గత డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలలో తెలంగాణాలో హేమా హేమీలైన కాంగ్రెస్ దిగ్గజాలు ఓటమి చెందినప్పటికీ 3వసారి మధిర నుండి విజయం సాధించిన భట్టీకి సిఎల్‌పి పగ్గాలు దక్కుతాయనే ఊహగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నుండి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు సిఎల్‌పి పదవి కోసం పోటీ పడినప్పటికీ ప్రధానంగా టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టీవిక్రమార్కల మధ్య పోటీ నెలకొనడంతో ఎఐసిసి ప్రత్యేకంగా పరిశీలకులను పంపించి ఎంఎల్‌ఎల మద్దతును తెలుసుకొని భట్టీవిక్రమార్కను సిఎల్‌పి నేతగా ఎంపిక చేశారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన నాటి నుండి వరస విజయాలు సాధిస్తూ అంచెలంచెలుగాఎదిగి సిఎల్‌పి నేతగా అరుదైన గౌరవం దక్కించుకున్న భట్టీవిక్రమార్క రాజకీయ అదృష్టవంతుడిగా పేరుగాంచారు. మధిర నుండి గతంలో సిపిఎం నుండి గెలిచిన సీనియర్ నాయకుడు బోడేపూడి వెంకటేశ్వరరావు సిపిఎం శాసనసభాపక్ష నేతగా పని చేయగా, తాజాగా భట్టీవిక్రమార్క కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేతగా ఎంపిక కావడంతో రాష్ట్ర రాజకీయాలలో మధిర నియోజకవర్గం మరోసారి గుర్తింపుపొందింది.

భట్టీకి సిఎల్పీ పదవి పట్ల హర్షం
బోనకల్, జనవరి 19: స్థానిక మధిర శాసనసభ్యుడు, టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్కను కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అధిష్టానం నియమించడం పట్ల ఆ పార్టీ నేతలు శనివారం సంబరాలు జరుపుకున్నారు. స్ధానిక ఖమ్మం-బోనకల్ బస్టాండ్ సెంటర్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు మాట్లాడుతూ నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషిచేస్తున్న భట్టివిక్రమార్క సేవలను గుర్తించిన అదిష్టానం సిఎల్పీ నేతగా ఎన్నుకువడం సంతొషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు క్షేత్రస్ధాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు భట్టివిక్రమార్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి కిషోర్‌కుమార్, బొబ్బిళ్ళ నర్సింహరావు, కనగాల లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

సిఎల్పీనేతగా భట్టి ఎన్నికపట్ల హర్షం
వైరా, జనవరి 19: తెలంగాణ శాసనసభ కాంగ్రెస్‌ప్రతిపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా కాంగ్రెస్ అధిష్ఠానం మల్లు భట్టివిక్రమార్కను నియమించినందుకు వైరామండల కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక మండల కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ రాష్టక్రిసాన్‌ఖేత్ కన్వీనర్ దాసరి దానియేలు మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా మల్లు భట్టి కాంగ్రెస్‌పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి పార్టీ ఆయనకు ఎంతో ఉన్నత పదవిని కట్టబెట్టిందని అన్నారు. రానున్న కాలంలో మల్లు భట్టివిక్రమార్క మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నారని ఆయన తెలిపారు. నిత్యం ప్రజలకోసం పనిచేసే నాయకుడు కావడం చేతనే ఆయనకు మధిర నియోజకవర్గ ప్రజలు పట్టంకట్టారని అన్నారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి మల్లు భట్టి అని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు శీలం వెంకటనర్సిరెడ్డి, వెంపటి నాగేశ్వరావు, వీరయ్యచౌదరి, పొదిల హరినాథ్, మట్టూరి వీరయ్య, జగన్నాథం, రామక్రిష్ణ, గంగారావు, రాచబంటి నాగేశ్వరావు, పమ్మి అశోక్ తదితరులు పాల్గొన్నారు.