ఖమ్మం

ముగ్గురు కార్పొరేటర్ల అనర్హతపై తీర్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 23: ఇటీవల ముగ్గురు కార్పొరేటర్లు తాము గెలిచిన పార్టీ నుంచి మారడంతో వారిని అనర్హులుగా ప్రకటిస్తూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నగర మేయర్ డాక్టర్ పాపాలాల్ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టిఆర్‌ఎస్‌కు చెందిన తోట రామారావు, చేతుల నాగేశ్వరావు, హనుమాన్‌లు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారారనే ఆరోపణలపై అధికార పక్ష సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఆ ముగ్గురు సభ్యులు అధికార పక్ష సభ్యులపై మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్, వైసిపిలకు చెందిన కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించిన వారిపై ఎందుకు తీర్మానం ప్రవేశపెట్టలేదని ఇప్పుడెందుకు తమపై అనర్హత వేటు వేస్తున్నారని మండి పడ్డారు. అధికార పక్షానికి ఒక రూలు, ఇతర సభ్యులకు ఇంకోరూలు ఉంటుందా అని వారు ప్రశ్నించారు. అయినప్పటకి అధికార పక్ష సభ్యులు పట్టుబట్టి తీర్మానం ఆమోదింపచేశారు. అంతకుముందు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ రెండోదఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పువ్వాడపై ప్రశంసల జల్లుతో ప్రారంభమైన మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం తర్వాత వాడివేడిగా సాగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతోపాటు అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు బత్తుల మురళి, కమర్తపు మురళి, పగడాల నాగరాజులతో పాటు ప్రతిపక్ష సభ్యులు సిపిఐ కార్పొరేటర్ క్లైమెంట్, కాంగ్రెస్ కార్పొరేటర్ వడ్డెబోయిన నరసింహారావులు మాట్లాడుతూ నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే కృషి ఎనలేనిదన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు చెందిన 62కోట్ల నిధులతోపాటు వందలాదికోట్ల నిధులను ప్రభుత్వం నుండి మంజూరుచేయించి నగర సుందరీకరణకు అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. క్షేత్రస్థాయిలో పెండింగ్ పనులు పూర్తిచేసి విజన్‌తో ముందుకుపోయిన పువ్వాడ ఖమ్మం నగర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారన్నారు. భవిష్యత్‌లో కూడా తన వంతుగా సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి పాటు పడాలన్నారు. సిపిఎం కార్పొరేటర్ అఫ్రోజ్ సమీనా మాట్లాడుతూ పెండింగ్ సమస్యలు పూర్తిచేసి అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ అభినందన తీర్మానానికి ధన్యవాదాలు తెలిపారు. రెండోదఫా ఎన్నిక కావడం ఎంతో గర్వకారణంగా ఉందని ప్రజలు తనపై మోపిన గురుతర బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకతీతంగా అభివృద్ధికి పాటుపడతానన్నారు. కార్పొరేషన్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. అనంతరం 20 అంశాల అజెండాతో ప్రారంభమైన సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు దీపక్‌చౌదరి లేచి మాట్లాడుతూ గత సమావేశాలలో నగర సమస్యలపై చేసిన తీర్మానాలకు ఎలాంటి సమాధానాలు లేవని ఆ సమస్యల స్థితిగతులు ఏమిటో చెప్పాలని పట్టుబట్టారు. మేయర్ డాక్టర్ పాపాలాల్ మాట్లాడుతూ అన్నింటికి సమాధానం చెపుతామంటూ దాటవేశారు. గత సమావేశాల్లో కూడా అవే మాటలు చెప్పారని ఇప్పుడు కూడా అంతే అంటున్నారని అసలు సమస్యల స్థితిగతులపై నిగ్గుతేల్చాలని పట్టుబట్టారు. దీంతో అధికార పక్ష సభ్యులు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి అడ్డుతగిలి ఎజెండా ప్రకారంగా సమావేశం జరుగుతుందని మధ్యలో కలుగజేసుకోవడం సమంజసం కాదన్నారు. దీపక్‌చౌదరితో పాటు కాంగ్రెస్ సభ్యులు వడ్డెబోయిన నరసింహారావు, బాలగంగాదర్ తిలక్‌లు మాట్లాడుతూ గత సమావేశాల్లో చర్చించిన సమస్యలకు సమాధానం చెప్పకుండా ఎజెండాప్రారంభించడానికి వీలులేదని, రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను ఎందుకు ఎజెండాలో చేర్చలేదని 50డివిజన్లలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించడంతో కర్నాటి కృష్ణతో పాటు అధికారపక్ష సభ్యులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ సభ్యులతోపాటు సిపిఎం కార్పొరేటర్లు అఫ్రోజ్ సమీనా, శైలజలు పోడియం వద్దకు చేరి గత సమస్యల పరిష్కారానికి సమాధానం చెప్పాలని పట్టుబట్టడంతో సమావేశం మరింత వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశం జరిపి తీరాల్సిందేనని అధికార పక్ష సభ్యులు పట్టుబట్టడంతో కాంగ్రెస్, సిపిఎం కార్పొరేటర్లు వాకౌట్ చేసి సభనుండి వెళ్ళిపోయారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. పొంగులేటి మాట్లాడుతూ సభను హుందాతనంగా నిర్వహించుకోవాలని ఎన్నికల అనంతరం మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు వాకౌట్ చేసిన సభ్యులను కూడా గౌరవప్రదంగా సమావేశానికి ఆహ్వానించాలన్నారు. సిపిఐ కార్పొరేటర్ క్లైమెంట్ మాట్లాడుతూ వాకౌట్ చేసిన సభ్యులను సాదరంగా ఆహ్వానించాలని కోరారు. అనంతరం పలు సమస్యలపై సభ్యులు చర్చించారు. కాగా అనర్హత వేటువేయాలని తీర్మానం చేయడంతో పాటు తనను మాట్లాడనీయకుండా మైక్ కనెక్షన్ తీసివేయడంతో కార్పొరేటర్ తోట రామారావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైక్ విసిరివేసారు.