ఖమ్మం

ప్రాధాన్యతా పరంగా పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 18: నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు తమ గ్రామంలోని సమస్యలను ప్రాధాన్యతా పరంగా గుర్తించి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సూచించారు. స్థానిక మహిళా ప్రాంగణంలోని సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ గ్రామాభివృద్దికి గాను గ్రామస్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై సర్పంచ్‌లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు హరితహారం, పారిశుద్ద్య పనులు, రోడ్ల అభివృద్ది, ఉపాధి పనులు, అంగన్‌వాడీ సబ్ సెంటర్ల పనులను పర్యవేక్షించాలన్నారు. దీనికి గాను గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకే ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మహిళా సర్పంచ్‌లు సమావేశాలలో పాల్గొని వివిధ అంశాలపై చర్చించాలని, పరిపాలనా విషయాలలో భర్తలపై మాత్రం ఆధారపడవద్దన్నారు. మహిళలు తమ శక్తిని గ్రహించాలని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో లేని విధంగా స్థానిక సంస్థలలో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించబడిందని, అందుకే మహిళలు తమ పదవి ప్రాముఖ్యతను తెలుసుకుని గ్రామాభివృద్దికి పాటుపడాలని కోరారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 యొక్క విధివిధానాలను కూలంకశంగా నూతన సర్పంచ్‌లకు తెలియచేసేందుకే ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ద్య కార్యక్రమాలు, పంచాయతీ ఆదాయ వనరులు, పన్నుల వసూళ్ళు, గృహ, ఇతర అనుమతుల పద్దతులపై చట్టంలోని సుమారు 200 సెక్షన్ల గురించి ఈ శిక్షణలో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. తమ సందేహాలను నివృత్తి చేసుకుని, సమస్యల పరిష్కారానికి చేయాల్సిన విధానాలను తెలుసుకుని ఐదు సంవత్సరాల పాలనలో జవాబుదారీతనంతో పనిచేస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు.
కాగా జిల్లాలోని 584 మంది సర్పంచ్‌లకు ఈ నెల 29 వ తేదీ వరకు విడతలవారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సర్పంచ్‌లకు ప్రాంగణంలోనే వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. కొంతమంది మహిళా సర్పంచ్‌ల భర్తలు సమావేశానికి రాగా వారిని సమావేశ మందిరం బయటనే ఉంచారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరెడ్డి, మహిళా ప్రాంగణం మేనేజర్ విజేత, నేలకొండపల్లి, కూసుమంచి, కొణిజర్ల మండలాల సర్పంచ్‌లు, మండల పరిషత్ అభివృద్ది అధికారులు, మండల విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

పార్టీ ఒక్కటే...మూడు గ్రూపులు
* టిఆర్‌ఎస్‌లో నేతలు ఎడమొఖం..పెడమొఖం * ఆధిపత్యం కోసం ఎవరి దారి వారిదే

జూలూరుపాడు, ఫిబ్రవరి 18: అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం కొత్తగా పాలక మండలిలు ఏర్పాటయినా ఇంకా నేతలు ఎన్నికల వాతావరణంలోనే మునిగి తేలుతున్నారు. ఎన్నికల అనంతరం రాజకీయాలకతీతంగా ప్రజా ప్రతినిధులు, అధికార టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించాల్సి ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ప్రశాంత పల్లెల్లో రాజుకున్న రాజకీయ వేడిని నేతలు తగ్గించటం లేదు. ఎన్నికల ఫలితాల్లో గెలుపు, ఓటములపై ఆయా పార్టీలకు చెందిన నాయకులు అంచనా వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా అదికార టిఆర్‌ఎస్ పార్టీలో ఆధిపత్యం కోసం జరుగుతున్న వర్గపోరును మరింత బలపరిచే విధంగా వాతావరణం మారుతుందని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్‌లాల్‌కు టిక్కెట్ ఇవ్వగా పార్టీలోని ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్‌ను ఎన్నికల రంగంలోకి దించి గెలుపుకు బాటలు వేశారు. ఎమ్మెల్యే రాములు నాయక్ సైతం ఎంపి ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవటంతో మండలంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఆ తర్వాత కొద్ది రోజులకే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ పంచాయతీలను కైవసం చేసుకోవటంతోపాటు ఆధిపత్యం కోసం మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు నువ్వా..నేనా అన్నట్లు వచ్చాయి. అనంతరం మరో ప్రక్రియకు నేతలు తెరదీశారు. గెలిపించిన సర్పంచ్‌లను సన్మానించటంలో కూడా మండల నాయకులు పోటీ పడటంతో కొందరు సర్పంచ్‌లు ఎటు వైపువెళ్లాలో అర్ధంకాక అయోమయానికి గురయ్యారనే విషయం చర్చనీయాంశం. నూతన సర్పంచ్‌లను ఎంపి పొంగులేటి వద్దకు తీసుకెళ్లి సన్మానించటంలో సైతం వర్గపోరు సాగింది. అధికార టిఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటూ నాయకులు మూడు గ్రూపులుగా రాజకీయాలను రంగరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతే కాకుండా కొందరు ఆధిపత్య పోరులో ఎడమొఖం..పెడమొఖంగా వ్యవహరిస్తుండటంతో ఇబ్బందికరంగా మారిందని ఆ ఆపార్టీ కార్యకర్తలు స్వయంగా వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఎమ్మెల్యే రాములు నాయక్ ఇటీవల మండలంలో పర్యిటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండగా నాయకులు ఐక్యంగా పాల్గొన్న సందర్భాలు లేవనే చెప్పవచ్చు. అధికార టిఆర్‌ఎస్ నాయకుల వర్గపోరు ఎమ్మెల్యే రాములు నాయక్‌కు సైతం సమస్యగా మారిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.