ఖమ్మం

కారెక్కనున్న కందాళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 14: పాలేరు నియోజకవర్గ శాసనసభ్యుడు కందాళ ఉపేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుసగా ఐదవ శాసనసభ్యుడు టిఆర్‌ఎస్‌లో చేరనుండటం విశేషం. టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావును గురువారం హైదరాబాద్‌లో కలిసిన ఉపేందర్‌రెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలియజెప్పడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఓడించిన కందాళ అప్పట్లోనే టిఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఆలస్యమైనట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానంలో మాత్రమే గెలిచిన టిఆర్‌ఎస్‌లోకి వైరాలో గెలిచిన స్వతంత్ర అభ్యర్ధి రాములునాయక్ ఎన్నికలు అవగానే చేరిపోయారు. ఆతరువాత పినపాకలో గెలిచిన కాంగ్రెస్ నేత రేగా కాంతారావు, సత్తుపల్లిలో గెలిచిన టిడిపి నేత సండ్ర వెంకటవీరయ్య, ఇల్లందులో గెలిచిన కాంగ్రెస్ నేత హరిప్రియా నాయక్ టిఆర్‌ఎస్‌లో చేరతామని ప్రకటించారు. తాజాగా కందాళ ఉపేందర్‌రెడ్డి కూడా టిఆర్‌ఎస్‌లో చేరనుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టిఆర్‌ఎస్‌కు ఆరుగురు శాసనసభ్యులు ఉన్నట్లయింది. మరో నెలరోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనుండగా మూడు నెలల క్రితం గెలిచిన శాసనసభ్యులు ఒక్కొక్కరుగా టిఆర్‌ఎస్ వైపు వెళ్తుండడం విశేషం. ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఎవరిని పోటీకి దింపాలని టిఆర్‌ఎస్ అధినేత ఆలోచిస్తున్న నేపధ్యంలో ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులు వరుసగా ఒక్కొక్కరుగా టిఆర్‌ఎస్ గూటికి చేరుతుండడం విశేషం. ఇదిలావుండగా ఇప్పటికే టిఆర్‌ఎస్‌లో చేరతామని చెప్పిన ప్రజాప్రతినిధులు పోను ఇంకా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు ముగ్గురు, తెలుగుదేశంకు ఒకరు ఉన్నారు. వీరిలో కూడా మరో ఇద్దరు త్వరలోనే టిఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

కష్టపడి గెలిపిస్తే కారేక్కుతున్నారు
* కామేపల్లి కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన * పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి
కామేపల్లి, మార్చి 14: అధికార పార్టీకి ఎదురొడ్డి అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గెలిచిన వారు తమ స్వార్థచింతనతో అధికార పార్టీ కారేక్కుతున్నారని మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ముచ్చర్ల, కొత్తలింగాల గ్రామాల్లో గత రెండు రోజులుగా నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశాల్లో వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోరం కనకయ్యను స్వర్గీయ మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సారధ్యంలో కార్యకర్తలంతా కష్టపడి గెలిపిస్తే ఆయన స్వలాభం కోసం టీఆర్‌ఎస్‌లో చేరారని, ఈ సారి ఎన్నికల్లో సహితం సంఘటన పునరావృత్తం కాకుండ రాంరెడ్డి వెంకటరెడ్డి ఆశయాలకు అనుగుణంగా కలిసి పనిచేసి అధిష్టానం సూచించిన అభ్యర్థి బానోతు హరిప్రియను గెలిపించాలని శపథం చేసి అధిక మెజార్టీతో గెలిపించుకున్నామన్నారు. అధికార పార్టీకి ధీటుగా కార్యకర్తలంతా లంబాడి గిరిజన మహిళను గెలిపించుకోవాలనే పట్టుదలతో పనిచేసి గెలిపించుకున్నామన్నారు. ప్రచార సభల్లో ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ అభ్యర్థి కనకయ్య తన సొంతలాభం కోసం పార్టీ మారారని, తాను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చిన కాంగ్రెస్ పార్టీని వీడిపోనని, గెలిచినా, ఓడినా ఈ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ మారటమంటే చచ్చినదానితో సమానమని కార్యకర్తలకు వాగ్దానమిచ్చి గెలిచిందన్నారు. ఆమె మాటలు నమ్మి కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి గెలిపించుకోగా మూడునెలల్లోనే ముచ్చటగా పార్టీ మారి తమను అభాసుపాలు చేసిందన్నారు. అవకాశవాదంతో పార్టీని మోసం చేసిన వారి గతి ఏమైందో అదే గతి హరిప్రియ చవిచూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచాక పార్టీలు మారే వారు తమ పదవికి రాజీనామా చేసి తిరిగి ఆ పార్టీ బీఫారంపై ప్రజాక్షేత్రంలో గెలవాలని వారు డిమాండ్ చేశారు. నాయకులు మారినంత మారితే కార్యకర్తలు పార్టీని వీడేది లేదని, రానున్న ఎన్నికల్లో పార్టీ ప్రతిష్టను నిలుపుతామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు ఆంతోటి అచ్చయ్య, జిల్లా నాయకులు ఏపూరి మహేందర్‌కుమార్, లక్ష్మణ్‌నాయక్, నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి, సత్యనారాయణ, పుండరీ, సోనాకృపాకర్, భాషానాయక్, లక్ష్మణ్‌చౌదరి తదితరలు పాల్గొన్నారు.