ఖమ్మం

ముగిసిన ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 9: ఖమ్మం పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సాయంత్రం ఐదుగంటలకు ప్రచారం ముగియడంతో ఇన్నిరోజులు మోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. గ్రూపు సమావేశాలు, సభలు నిర్వహించేందుకు అనుమతి లేకపోవడంతో అభ్యర్థులు, వారి తరపున నేతలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేస్తుండటంతో అనేక చోట్ల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తమకు ఓటు వేయాలంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు అభ్యర్థులు తమ మద్దతుదారులను పంపిస్తుండగా ఇంకొందరు మాత్రం ప్రత్యర్థుల్లోని తమ అనుకూల వ్యక్తులను ఉపయోగించుకొని ఓటర్లను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థుల పోలింగ్‌బూత్‌ల వారిగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు వారికి శిక్షణను కూడా ఇచ్చుకున్నాయి. మరోవైపు పోలింగ్‌బూత్‌ల వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఖచ్చితంగా వందమీటర్ల దూరంలోనే సెక్యూరిటిని ఏర్పాటు చేసి ఇతరులు లోనికి రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటర్లకు అందుబాటులో ఉంచుతున్నారు.
ఇదిలా ఉండగా తమ భవితవ్యాన్ని నిర్దేశించుకునేందుకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ప్రత్యర్థుల ఆలోచనలను తెలుసుకుంటూ ఎత్తులు వేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతున్నారు. తమకు మద్దతుగా ప్రచారం చేసిన నేతల గురించి, తమ పార్టీ విధానాల గురించి మరోసారి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తమ మద్దతుదారుల కుటుంబీకులు ఇతర ప్రాంతాల్లో ఉంటే వారిని స్వస్థలానికి రప్పించేందుకు ప్రత్యేకంగా వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం సమయం ముగిసినప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం లోపాయికారి ఒప్పందాలు, రహస్య సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

పార్టీలు మారిన వారికే పెద్దపీట
* ఖమ్మంలో వినూత్న తీర్పు
* 11న తేలనున్న నామా, రేణుక భవితవ్యం

ఖమ్మం, ఏప్రిల్ 9: ఉద్యమాలు, పోరాటాలకు పురిటిగడ్డగా పేరుగాంచిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లు పార్టీలు మారిన వారికే పెద్దపీట వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పువ్వాడ అజయ్‌కుమార్‌ను నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరావుపై కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ 6వేల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో ఖమ్మం నియోజకవర్గం నుండి ఓడిన తుమ్మల నాగేశ్వరరావు ఆరునెలలకే టిఆర్‌ఎస్‌లో చేరగా, గెలిచిన రెండు సంవత్సరాలకే పువ్వాడ అజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి నుండి తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు నామా నాగేశ్వరావు, టిఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌లు పోటీ పడ్డారు. కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జన సమితి (ప్రజాకూటమి)అభ్యర్థి నామా నాగేశ్వరావు సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ చేతిలో ఓటమిచెందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 1,94,529 ఓట్లు పోల్ కాగా పువ్వాడ అజయ్‌కుమార్, 1,02,760 ఓట్లు దక్కించుకోగా ప్రత్యర్థి నామా నాగేశ్వరావు 91, 769 ఓట్లు దక్కించుకొని ఓటమి చెందారు. పువ్వాడ అజయ్‌కుమార్‌కు 10,991 ఓట్ల మెజార్టీ లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీకి టిడిపి నుండి పోటీ చేసి ఓటమి పాలై టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న నామా నాగేశ్వరరావు తిరిగి ఖమ్మం పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్నారు. 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన రేణుకాచౌదరిపై నామా నాగేశ్వరావు లక్షకు పైగా మెజార్టీ సాధించి గెలుపొందారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన నామా నాగేశ్వరావు 10వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో ఒకరి చేతిలో ఒకరు ఓడిపోయిన ఇద్దరు ప్రత్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వినూత్న తీర్పు నిస్తున్న ఖమ్మం నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న రేణుకాచౌదరి, పార్టీ మారి టిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరావులలో ఎవరిపై మొగ్గు చూపనున్నారో ఈ నెల 11న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తేలనున్నది.

సంచలనాల సత్తుపల్లి
పెనుబల్లి, ఏప్రిల్ 9: సత్తుపల్లి నియోజకవర్గం సంచలనాలకు నిలయంగా మారుతుంటుంది. ఇక్కడి ఓటర్లు ప్రతి సారి విలక్షణమైన తీర్పిస్తుంటారు. రాష్ట్ర రాజకీయాలు సైతం ఈ నియోజకవర్గంలోనే ఊపిరి పోసుకుంటాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుండి ఆయన వారసుడు జలగం ప్రసాదరావు, జలగం వెంకట్రావ్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయాలలో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. వీరంతా ఈ నియోజకవర్గ నేతలే కావటం విశేషం. ఇక్కడ జరిగే ప్రతి ఎన్నికలోనూ ఓటర్ల నాడి అంతుబట్టని విధంగా ఉంటుంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తుపల్లి ఓటర్ల తీరుపై సర్వత్ర చర్చ సాగుతుంది. చైతన్యవంతమైన నియోజకవర్గంగా పేరున్న ఇక్కడ కొద్ది నెలలుగా రాజకీయ పెనుమార్పులు జరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులు హోరాహొరిగా తలబడ్డారు. పంచాయతీ ఎన్నికలలో సైతం ఇదే విధంగా పోటీ పడ్డారు. పై ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైనప్పటికిని ఎవరికి వారు తామే అభ్యర్థులుగా పనిచేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో తలబడ్డ నేతలందరూ ఒక్కటయ్యారు. అసెంబ్లీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు మరవకముందే తలపడ్డ చేతులు కలిశాయి. ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలన్నీ అభినందనలుగా మారాయి. తిట్లన్నీ పొగడ్తలయ్యాయి. దీంతో ఇక్కడ ఓటర్ల మనోభావాలు ప్రశ్నార్థకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నాయకత్వ లోటు ఉన్నవారికే ఓటర్లు పట్టం కట్టారు. అగ్రనేతలైన తుమ్మల, జలగం, పొంగులేటి అందరూ ఒక్కటే ప్రచారం చేసినా వారి వర్గీయులు అధికార పార్టీ విజయం కోసం పరితపించినప్పటికి ఇక్కడ ఓటర్లు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అగ్రనేతలందరినీ కాదని సండ్రను గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి అంతా ఏకమయ్యారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో నాయకులందరూ కలిసిమెలిసి ప్రచారం సాగిస్తున్నప్పటికి ఇక్కడ ఓటర్ల తీరు నేతలలో కలవరపెడుతూనే ఉంది. దీనికి తోడు కష్టపడి పనిచేసి సండ్రను గెలిపిస్తే ఆయన కాస్తా అధికారపార్టీకి దగ్గరవ్వటం, పొంగులేటిని కాదని నిన్నటి వరకు పార్టీకి వ్యతిరేఖంగా ఉన్న నామకు టిక్కట్ ఇవ్వటంపై వారివారి వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. నేతలందరూ కలిసి ప్రచారం చేస్తున్నప్పటికి ఓటర్లు ఏ మేరకు ప్రభావితం అవుతారో వేచి చూడాల్సిందే. సత్తుపల్లి నియోజకవర్గం ఏర్పడకముందు వేంసూరు నియోజకవర్గంగా ఉండేది. 1952లో జలగం వెంగళరావు, 1957లో జలగం కొండలరావు, 1962, 1967. 1972, 1978 సంవత్సరాలలో జరిగిన ఎన్నికలలో వరుసగా జలగం వెంగళరావు శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు. 1978లోనే వేంసూరు కేంద్రంగా ఉన్న నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 1983లో జలగం ప్రసాదరావు, 1985లో తుమ్మల నాగేశ్వరరావు, 1989లో జలగం ప్రసాదరావు,1994, 1999లలో తుమ్మల నాగేశ్వరరావు, 2004లో జలగం వెంకట్రావు, 2009, 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సండ్ర వెంకటవీరయ్యలను ఇక్కడి ఓటర్లు గెలిపించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలలోనూ ఓటర్లు ఎప్పటికప్పుడు వినూత్నంగానే తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో నేతలంతా విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఓటర్ల మనోగతాన్ని మాత్రం పసిగట్టలేకపోతున్నారు.