ఖమ్మం

వేగంగా ఫిర్యాదుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 28: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. సోమవారం జడ్పీ మీటింగ్ హాలులో ప్రజావాణిని పురస్కరించుకొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రజలు అందించే ప్రతి ఫిర్యాదుకి జవాబుదారితనం అవసరం అన్నారు. ఫిర్యాదులో వినతులు అందిన వెంటనే వాటిని సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ధేశిత సమయాల్లో వాటిని పరిష్కరించాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకపోతే ఆ విషయాన్ని ఫిర్యాదుదారుడికి లిఖితపూర్వకంగా తెలియచేయాలని ఆదేశించారు. ప్రజలకు ప్రజావాణిపై నమ్మకం పెరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. కాగా ప్రజలు కూడా తమ ఫిర్యాదులను తొలుత స్థానిక మండల కార్యాలయాల్లో అధికారులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అక్కడే ఫిర్యాదుల పరిష్కారం అవుతుందని, మండలాధికారులు కూడా ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా సోమవారం ఐద్వా, సిఐటియు, గొర్రెలు,మేకల పెంపకందారుల సంఘం, గృహనిర్మాణ శాఖలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు పలు సమస్యలపై కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో ఆందోళన నిర్వహించి, గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించారు. సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ముషారఫ్ ఫారుక్ అలీ, జడ్పీ సిఈఓ నగేష్, బిసి కార్పొరేషన్ ఈడి ఆంజనేయశర్మ తదితరులు పాల్గొన్నారు.

గడువుకు ముందే సింగరేణి లక్ష్య సాధన
* 60.03మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు
కొత్తగూడెం, మార్చి 28: 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ అంతర్గతంగా నిర్దేశించుకున్న 60.03 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సోమవారం సాధించింది. సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం అర్ధరాత్రివరకు 59.59 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి మరో44వేల టన్నులు సాధిస్తే నిర్దేశిత లక్ష్యాన్ని సాధించే స్థితిలో రాజసంగా ఉంది. ప్రతిరోజు 1.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ లక్ష్యాన్ని సాధించి 60.03 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని ఆర్థిక సంవత్సరం ముగియడానికి మూడురోజుల ముందే రికార్డు స్థాయిలోసాధించి చరిత్ర సృష్టించింది. ఈఘనతను సింగరేణి సంస్థ సాధించిన క్రమంలో సుమారు వెయ్యి కోట్ల పైచిలుకు లాభాలను ఆర్జించనుంది. సోమవారం అర్థ రాత్రివరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న వివిధ ఏరియాలు సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలు ఇలావున్నాయి. కొత్తగూడెం ఏరియా ఉత్పత్తి లక్ష్యం 72లక్షల 48వేల 754 టన్నులకు 80లక్షల 41వేల 261 టన్నులు సాధించి 111శాతం ఉత్పాదక రేటుతో సంస్థలో అగ్రభాగాన నిలిచింది. ఇల్లెందు ఏరియా 51లక్షల 97 వేల 462 టన్నులకు 57లక్షల 8వేల 356 టన్నులు సాధించి 110శాతంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మణుగూరు ఏరియ 83లక్షల 80వేల 769 టన్నులకు 88లక్షల 91వేల 1టన్ను సాధించి 106 శాతం ఉత్పాదక రేటుతోతృతియ స్థానంలో నిలిచింది. అదేవిధంగా మిగిలిన ఏరియాలైన రామగుండం-3 63లక్షల 88వేల 462టన్నులకు 64లక్షల 35వేల 262 టన్నులు సాధించి 101శాతం, ఆడ్రియాల ప్రాజెక్ట్ 29లక్షల 58వేల 477 టన్నులకు 22లక్షల 5వేల 380 టన్నులు సాథించి 75శాతం, రామగుండం-1 ఏరియా 61లక్షల 5వేల 292 టన్నులకు 61లక్షల 30వేల 742 టన్నులు సాథించి 100శాతం, రామగుండం-2 ఏరియా 54లక్షల 88వేల 738 టన్నులకు 54లక్షల 98వేల 592 టన్నులు సాథించి 100శాతం, భూపాల్‌పల్లి ఏరియా 32లక్షల 53వేల 492టన్నులకు 32లక్షల 72వేల 957టన్నులు సాథించి 101 శాతం, బెల్లంపల్లి ఏరియా 61లక్షల 61వేల 523టన్నులకు 64లక్షల 12వేల 964 టన్నులు సాథించి 104 శాతం, మందమర్రి ఏరియా 26లక్షల 62వేల 615 టన్నులకు 16లక్షల 47వేల 798 టన్నులు సాథించి 62శాతం, శ్రీరాంపూర్ ఏరియా 53లక్షల 11వేల 954టన్నులకు 53లక్షల 51వేల 846టన్నులు సాథించి 101శాతం ఉత్పాదక రేటును సాథించాయి. మొత్తంగా 5కోట్ల 91లక్షల 57వేల 538టన్నులకు 5కోట్ల 95లక్షల 96వేల 159టన్నులు సాథించి 101 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. అయితే సంస్థకు ప్రభుత్వం నిర్థేశించిన మైలు రాయిని ఈనెల 5వ తేదీననే సాధించడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో మొదట 55మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్థేశించుకున్న సంస్థ అనేక అవరోధాలు ఎదుర్కొన్న నేపధ్యంలో 52.53 మిలియన్ టన్నులకు కుదించుకొని లక్ష్యాన్ని సాధించి 470కోట్లరూపాయలను ఆర్జించడమేకాకుండా కార్మికులకు 21శాతం లాభాల వాటాను పంపిణీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్థేశించిన 55మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని 26రోజుల ముందుగానే సాథించిన సంస్థ, అంతర్గత ఉత్పత్తి లక్ష్యమైన 60.03 మిలియన్ టన్నులను మూడురోజుల ముందుగానే అవలీలగా సాధించింది.

ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం
ఖానాపురం హవేలి, మార్చి 28: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. పదో తరగతికి మొత్తం 16పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 3,571మంది అభ్యర్థులకు గాను 3210మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా పరీక్షా కేంద్రాలను 7 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సందర్శించాయి. జిల్లాలో మొత్తం మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఆరు కేసులు నమోదు కాగా, ఖమ్మంలో మాత్రం ఒక అభ్యర్థికి బదులుగా మరోక అభ్యర్థి పరీక్ష రాస్తూ దొరకటంతో మొత్తం 7కేసులు నమోదు చేసినట్లు డిఈఓ నాంపల్లి రాజేష్ తెలిపారు.
ఇదిలా ఉండగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో 2593మందికి గాను 2326మంది హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేయగా, జిల్లాలో ముగ్గురు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ దొరికారు. ఇల్లెందులో మాత్రం ఒక అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి పరీక్ష రాస్తూ దొరకటంతో వీరందరిపై మాల్ ప్రాక్టీస్ నమోదు చేసినట్లు డిఈఓ రాజేష్ వెల్లడించారు. కాగా పరీక్షా కేంద్రాలను ఏజెసి బాబురావు, డిఈఓ రాజేష్, జిల్లా అబ్జర్వర్ ఆర్జెడి బాలయ్య తదితరులు సందర్శించారు.

దాహం..దాహం
* భద్రాద్రిలో మంచినీటి సమస్య
* పథకం ఉన్నా...ఉపయోగం సున్నా
భద్రాచలం, మార్చి 28: తలాపునే గోదావరి ఉన్నా తాగునీటికి శ్రీరామదివ్యక్షేత్రం కటకటలాడుతోంది. భద్రాచలం పట్టణంలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. మంచినీటి పథకాలు ఉన్నా ఉపయోగంలో గుండు సున్నా అని చెప్పవచ్చు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి భద్రాద్రి వాసులకు దాహార్తిని మిగిల్చాయి. 70వేల జనాభాలో కనీసం సగం మందికి కూడా ప్రజారోగ్యశాఖ మంచినీటిని సరఫరా చేయలేకపోతోంది. గొంతెండిన జనం ఘోషను పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. భద్రాచలం పట్టణంలో మంచినీటి ఎద్దడిపై ఆంధ్రభూమి కథనం....
40 కాలనీల దాహార్తి
భద్రాచలం పట్టణంలో 40 కాలనీల వరకు ఉన్నాయి. దాదాపుగా 30 కాలనీలకు ప్రజారోగ్యశాఖ తాగునీరు సరఫరా కాదంటే అతిశయోక్తి కాదు. దీంతో గోదావరి జలాల కోసం ఉదయానే్న కాలనీల వాసులు సైకిళ్లు, మోటారు సైకిళ్లపై క్యాన్లు కట్టుకుని అనేక ప్రయాసలు పడుతున్నారు. రంగనాయకుల గుట్టపైకి వెళ్లి నీటిని తీసుకెళ్తుంటారు. వీటి కోసమే ప్రత్యేకంగా పనులు ఆపుకోవాల్సిన దుస్థితి.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమై...
2008లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రూ.9కోట్లతో ప్రజారోగ్యశాఖలో మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు. అధికారుల నిర్లక్ష్యం, సర్వేల పేరిట చేసిన తాత్సారంతో నిధులు ఖర్చు చేసే సరికి పూర్తిగా సరిపోలేదు. దీంతో తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరో రూ.15కోట్లు మంజూరు చేశారు. ట్యాంకులు నిర్మించారు. వాటిని నిరుపయోగంగా వదిలేశారు. ఐటీడీఏ, కొత్తకూరగాయల మార్కెట్, ఏఎంసీ కాలనీల్లో ట్యాంకులు ఖాళీగా దర్శనమిస్తూ అధికారుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నాయి. ఇప్పటి వరకు పట్టణం మొత్తం తాగునీరు అందించేందుకు 60 కి.మీల మేర లైన్లు తవ్వారు. మరో 40 కి.మీలు తవ్వాల్సి ఉంది. కాగా పట్టణానికి 8.1లక్షల గ్యాలన్ల తాగునీరు అందిస్తుండగా, అందులో లక్ష గ్యాలన్లు లీకేజీల పేరిట వృథా అవుతున్నాయి. వాస్తవంగా రోజుకు పట్టణ జనాభాకు ప్రజారోగ్యశాఖ నిబంధనల ప్రకారమే 15లక్షల గ్యాలన్ల నీరు అవసరం. 8 ఏళ్లుగా సాగుతున్న పనులు పూరె్తైతేనే లక్ష్యాన్ని చేరుకుంటామని వారు అధికారులు అంటున్నారు. నిర్లక్ష్యానికి మూల్యంగా ఇపుడు రేట్లు పెరిగి ఇంకా నిధులు అవసరం ఏర్పడింది. దీంతో భద్రాచలం పట్టణ వాసులకు ఈ ఏడాది కూడా తాగునీటి ఎద్దడి తప్పేట్లు లేదు.

ఒంటరి మహిళల బాధ్యత ప్రభుత్వానిదే

ఖమ్మం(కల్చరల్), మార్చి 28: ఒంటరి మహిళల బాధ్యత ప్రభుత్వానిదే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బుగ్గవీటి సరళ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ధర్నాచౌక్‌లో ఒంటరి మహిళల సమస్యపై ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒంటరి మహిళలలో అధిక శాతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే జరిగిందన్నారు. అనేక మంది మహిళలు అతి చిన్న వయస్సులోనే ఒంటరిగా గడపాల్సిన పరిస్ధితులు ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలే కారణం అని ఆవేదన చెందారు. సమాజంలో వస్తున్న మార్పులు, స్ర్తిలలో పెరుగుతున్న వ్యక్తిత్వ వికాసం, ప్రేమ పేరుతో మోసాలు, పేద కుటుంబాలలో వరకట్నం ఇచ్చి వివాహాలు జరిపించలేక ఇలా అనేక కారణాలతో రాష్ట్రంలో, దేశంలో ఒంటరి మహిళల సంఖ్యగణనీయంగా పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా మహిళలు ఒంటరి జీవితాన్ని గడుపుతూ, పిల్లల పోషణ, వృధ్ధులు, ఇతర బాధ్యతలు మోయాల్సిరావడం బాధాకరమన్నారు. ఒంటరి మహిళలల్లో 50 శాతానికి పైగా మద్యం మహారికి బలైనవారి భర్తలేనన్నారు. గతంలో ఐద్వా పోరాట ఫలితంగానే చీప్ లిక్కర్ విధానాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుందన్నారు. ఒంటరి మహిళలందరికి వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వాలని, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, వారి పిల్లలకు విద్యా, వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, చిన్న తరహా పరిశ్రమల ద్వారా వారికి ఉపాధి కల్పించాలని, డబుల్ బెడ్‌రూం సదుపాయాన్ని, అభయహస్తం పెన్షన్‌ను మంజూరి చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ, ఖమ్మం డివిజన్ కార్యదర్శి గట్టు రమాదేవి, బండి పద్మ, వెంకటరమణ, సిరికొండ ఉమామహేశ్వరి, జైమున్నీసాబేగం, అమరావతి, నాగమణి, లక్ష్మీ, సరస్వతి, పద్మ, సులోచన, బీబి, రమ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

ముడుపులు తీసుకున్నట్లు
నిరూపిస్తే రాజీనామా చేస్తా
* డిప్యూటీ డిఇవో బస్వారావు సవాల్
కారేపల్లి, మార్చి28: సార్వత్రిక, పదవతరగతి, ఇంటర్ పరీక్షలలో జిల్లా స్థాయి అధికారులు ముడుపులు తీసుకొని అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను డిప్యూటీ డిఇవో పి బస్వారావు ఖండించారు. ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలతో నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. సోమవారం ప్రారంభమైన సార్వత్రిక పదవతరగతి, ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో విలేఖరులతో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించే పరీక్షలను అవినీతికి తావులేకుండా నిర్వహిస్తామన్నారు. మండల కేంద్రంలో విద్వాన్ హైస్కూల్, విజ్ఞాన్ జూనియర్ కళాశాల, ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. మెత్తం ఈ పరీక్షలలో 995 మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలు రాశారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్ధి కాపీ కొడుతుండగా పట్టుకొని డిబార్ చేసినట్లు తెలిపారు.

రెండు,మూడు రోజుల్లోనే
రిజర్వాయర్‌కు సాగర్ జలాలు
వైరా, మార్చి 28: మరో రెండు, మూడు రోజుల్లో రిజర్వాయర్‌కు సాగర్ జలాలు రానున్నాయని టిఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యాక్షుడు తన్నీరు నాగేశ్వరావు అన్నారు. సోమవారం స్థానిక నీటిపారుదల శాఖ విశ్రాంతి కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల చరిత్ర వైరా రిజర్వాయర్‌ను ఇంతవరకు ఏఒక్కరూ కూడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా గుర్తింపును తీసుకురాలేదని అది కేవలం ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ వల్లనే సాధ్యమైందన్నారు. అటువంటి చరిత్ర కలిగిన వ్యక్తిని కొందరు వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరో రెండు రోజుల్లో తప్పనిసరిగా సాగర్‌జలాలు వస్తున్నాయని అన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే మదన్‌లాల్ చెప్పారని అన్నారు. రాష్ట్ర భారీ మధ్యనీటిపారుదల శాఖామాత్యులు తన్నీరు హరీష్‌రావుతో మాట్లాడి సాగర్‌జలాలు రప్పించడానికి ఒప్పించారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బాణోతు కృష్ణ, శాఖమూరి లోకేశ్వరావు, తాతా రంగారావు, చంద్రశేఖర్, రత్నాకర్ పాల్గొన్నారు

భార్యను హత్య చేసిన భర్త
ఖానాపురం హవేలి, మార్చి 28: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదివారం రాత్రి రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బాణోతు నాగమణి(38) ఖమ్మం నగరంలోని ఓ హోటల్‌లో పని చేస్తోంది. ఇటీవల భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలే ఈ హత్యకు దారితీసినట్లు తెలిపారు. పని ముగించుకొని మరో మహిళతో కలిసి ఇంటికి వస్తుండగా, భర్త కోటేశ్వరరావు దారుణంగా హత్య చేశాడు. ఇది గమనించిన మహిళ భయాందోళనకు స్థానికులకు విషయాన్ని తెలిపింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో డిఎస్పీ సురేష్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించగా, సిఐ శ్రీ్ధర్ వివరాలు సేకరించారు. ఎస్‌ఐ కూడా పాల్గొన్నారు.
రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు
చండ్రుగొండ, మార్చి 28: ఏప్రిల్ నెల నుండి వ్యవసాయానికి నిరంతరాయంగా తొమ్మిది గంటలు విద్యుత్ పంపిణీ చేసేందుకు ఆశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చండ్రుగొండ సబ్‌స్టేషన్‌లో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా 5 ఎంవిఎ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏఇ వెంకన్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చండ్రుగొండ సబ్‌స్టేషన్ ద్యారా చండ్రుగొండ, గుర్రాయిగూడెం, పోకలగూడెం, గానుగపాడు, తుంగారం, తిప్పనపల్లి, రావికంపాడు గ్రామాలలోని రైతుల వ్యవసాయ మోటార్లకు పగలు తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు పూర్తికావచ్చినట్లు ఏఇ తెలిపారు.

ప్రజలకు చేరువలో బ్యాంకు సేవలు

కొత్తగూడెం రూరల్, మార్చి 28: ప్రజలకు మరింత చేరువలో గ్రామీణ వికాస్ బ్యాంకు సేవలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్‌బ్యాంకు ఖమ్మం రీజనల్ మేనేజర్ నర్సింహయ్య అన్నారు. సోమవారం సుజాతనగర్ బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు.అదేవిధంగా బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించి మీరు అభివృద్ది చెందుతూ బ్యాంకు అభివృద్దికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మేనేజర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాడ్లాడుతూ అక్టోబర్ 2014 నే ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ను తెలంగాణ గ్రామీణ వికాస్‌బ్యాంకు గా మార్చాలని కోరినట్లు తెలిపారు. బ్యాంకుల పేర్లు మార్చే విషయంలో చర్చలు జరిపి కమిటీని వేసినట్లు తెలిపారు. ఆంధ్రాలో ఎస్‌బిహెచ్, తెలంగాణాలో ఎస్‌బిఐ అనుబందంగా గ్రామీణ వికాస్‌బ్యాంకులు పనిచేస్తున్నాయన్నారు. ఖమ్మంజిల్లాలో 65 బ్యాంకు ఉన్నాయని ఈ బ్యాంకుల ద్వారా రూ 860 కోట్లు అప్పులిచ్చామని, రూ 676 కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. త్వరలోనే ఎటిఎం సెంటర్లు, ఆన్‌లైన్ బ్యాంకు సేవలు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దిలీప్‌కుమార్, బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీతారాములు, బ్యాంకు మేనేజర్ క్రాంతికుమార్‌మక్కడ్, ఫీల్డ్ ఆఫీసర్ సంగమేశ్వరరావు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

7నిమిషాల 40 సెకన్లలో వేమనశతకం పఠనం

* సిద్ధారం పాఠశాల విద్యార్థి రాహుల్ అద్భుత ప్రతిభ
* తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ స్క్రూటినీలో ఎంపిక

సత్తుపల్లి, మార్చి 28 : సత్తుపల్లి మండలం సిద్ధారం ప్రభుత్వ ప్రాధమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చిలకా రాహుల్ సోమవారం తన అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు కోసం జరిగిన స్క్రూటినీలో వేమనశతకంలో100 పద్యాలను 7 నిమిషాల 40 సెకన్లలో పూర్తిచేసి ఆహుతులను, తెలుగుబుక్ ఆప్ రికార్డ్స్ ప్రతినిధుల ప్రశంసలు పొందాడు. తొలుత 8 నిమిషాల 30 సెకన్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ముందుగానే పూర్తిచేసి రికార్డు గుర్తింపు కోసం తన స్థానం పదిలం చేసుకున్నాడు.
పాత రికార్డును
తిరగరాసిన రాహుల్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయతెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు నమోదైన రికార్డును రాహుల్ సోమవారం తన ప్రదర్శనలో అధిగమించాడు. 2015 అక్టోబర్ 28న తిరుపతిలో 11సంవత్సరాల వయసుగల సింగరాజు మంజునాథ్ 100 వేమన పద్యాలను 11 నిమిషాల 40 సెకన్లలో పూర్తిచేశాడు. అయితే 12 సంవత్సరాల వయసుగల రాహుల్ 7నిమిషాల 40 సెకన్లలో పూర్తిచేసి రికార్డు సృష్టించాడు. తెలుగుబుక్ ఆప్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిధులు సత్తుపల్లి తహశీల్దార్ డి.పుల్లయ్య, ఎండిఓ రవి చేతుల మీదుగా స్క్రూటినీ గుర్తింపు పత్రాన్ని స్వీకరించి త్వరలో ప్రధాన ప్రదర్శన ఇచ్చేందుకు అర్హత సాధించాడు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి సంస్థ గుర్తింపు పత్రాన్ని ఇచ్చి ప్రధాన ప్రదర్శనకు రాహుల్‌ను అనుమతించారు. తహశీల్దార్ పుల్లయ్య, ఎండిఓ రవి, సిద్ధారం సర్పంచ్ మోరంపూడి ప్రమీలారాణి, ప్రసాద్, హెచ్‌ఎం మధుసూధన్‌రాజు, సృజన బాధ్యులు రామకృష్ణ తదితరులు రాహుల్‌కు, బొమ్మారెడ్డికి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, నాగాచారి, మస్తాన్, రజినీదేవిలతో పాటు ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, ఎంఈఓ రాములు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌యం రాజేశ్వరరావు, గురుజ్యోతి నిర్వాహకులు చిత్తలూరి ప్రసాద్, ఎస్‌ఎంసి చైర్మన్ దుర్గాచారి, ఉపసర్పంచ్ శ్రీరాములు తదితరులన్నారు.