కర్నూల్

గ్రామీణులకు వైద్య సేవలందించేందుకే స్వాస్థ్య విద్యావాహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 24:గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అవసరమైన వైద్య సేవలందించేందుకు ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమం చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. వైద్య నర్సింగ్ కళాశాలల విద్యార్థులు గ్రామాలకు వెళ్లి ఆరోగ్య విద్యపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. కర్నూలు వైద్య కళాశాల ఆడిటోరియంలో శనివారం ఏర్పాటుచేసిన స్వాస్థ్య విద్యావాహని కార్యక్రమానికి డిప్యూటీ సిఎం కెఇ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ మనం ఎవ రూ దేవుడిని చూడలేదని గ్రామాల్లోని పేద ప్రజలకు వైద్య సేవలందిస్తే వారు వైద్యుడినే దేవుడిగా ఆరాధిస్తారన్నారు. కావున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వాస్థ్య విద్యావాహిని ద్వారా అంటువ్యాధులు, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, రక్తహీనత, పునరుత్పత్తి, ఆరోగ్యం, సమీకృత ఆహారం, వ్యాయా మం, అక్షరాస్యత, దీర్ఘకాలిక వ్యాధు లు, వ్యసనాలు తదితర 10 అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఇందుకోసం 16 సంచార వైద్య వాహనాలు ఏర్పాటు చేశామని వైద్య, నర్సింగ్, డెంటల్ విద్యార్థులు వైద్యులతో కలిసి కేటాయించిన గ్రామాలకు వెళ్లి వైద్య సేవలందించాలన్నారు. ఉత్తమ వైద్య సేవలందించిన విద్యార్థులకు అవార్డులు ప్రకటిస్తామన్నారు. ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా పేద ప్రజలందరికీ 320 వ్యాధులకు చికిత్స నిర్వహించడంతో పాటు మెడికల్ కిట్లు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే కర్నూలు వైద్య కళాశాలకు మంచి పేరు వుందని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. ఇటీవల ప్రారంభించిన తొరాసిక్ సర్జన్ ద్వారా 36 ఓపెన్ హార్ట్ సర్జరీలు విజయవంతంగా చేశారని మం త్రి గుర్తుచేశారు. రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడుతూ ప్రభు త్వం పేద ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వినూత్నకార్యక్రమం చేపట్టిందన్నారు. ప్రజలకు చెప్పేముందు మనం కూడా పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్య జాగ్రత్తలు వివరించాలన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలు, పరిశుభ్రత పాటించడంలో మనం వెనుకబడి ఉన్నామని, కావున ప్రతిఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ వ్యాధి రాకముందే ప్రజల ఆరోగ్య జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. గ్రామాలకు వెళ్లి మొక్కుబడి రీతిలో వ్యవహరించకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం అమలులో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే స్వాస్థ్య విద్యావాహిని ద్వారా గ్రామాల్లోకి వెళ్లి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందుకనుగుణంగా ఆరోగ్య జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రామ్‌ప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వీరస్వామి, అడిషనల్ డిఎంహెచ్‌ఓ డా. రాజాసుబ్బారావు, వైద్యులు, నర్సింగ్, డెంటల్ కాలేజీల విద్యార్థులు, ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేసినప్పుడే
ప్రజల్లో గౌరవం..
* న్యాయ స్థానాల కుదింపుపై సిఎంతో చర్చిస్తా..
* డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
కర్నూలు సిటీ, డిసెంబర్ 24:ప్రపంచంలోనే అత్యున్నతమైన న్యాయస్థానాల్లో భారతీయ న్యాయ వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉందని, కక్షిదారులకు సరైన సమయంలో న్యాయం చేసినప్పుడే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో గౌరవం పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నగరంలోని వౌర్య ఇన్‌లో శనివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సిఎం కెఇ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో అత్యున్నత పదవులు చేపట్టిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, తదితర ఉన్నత పదవుల్లో రాణించే వారు అందరూ లా పట్టాపొంది న్యాయవాద వృత్తిలో ఖ్యాతి గడించిన వారున్నారని వెల్లడించారు. అయితే ఇటీవల అప్పిలేట్ అథారిటీని ఒక్కో నగరంలో ఒక్కో కోర్టు ను, ఒక రకమైన వ్యాజ్యాలకు సంబంధించి కోర్టులను ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. వాటిలో భాగంగా భూసేకరణ కేసులు, ఏపి బిల్డింగ్ రెంట్(అద్దె) కంట్రోల్ కేసులు, రెవెన్యూ అప్పీల్ కేసులు, వక్ఫ్ కేసుల కోసం రాష్ట్రంలోని వివిధ నగరాల్లో కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తుందన్నారు. కాగా ఈ విధంగా కోర్టులను ఏర్పాటు చేసి న్యాయస్థానాలను కుదించినట్లయితే న్యాయం పొందే వారు సరైన సమయంలో న్యాయం పొందటానికి అవకాశం లేకుండా పోతుందన్నారు. దీని వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని బార్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారని వెల్లడించారు. ఎందుకంటే ఐపి కేసులకు సంబంధించిన కోర్టును విశాఖపట్టణంలో, రెంట్ కంట్రోల్‌కు సంబంధించిన కేసులను జాయింట్ కలెక్టర్ ఆధీనంలో పెట్టడమేకాకుండా కోర్టును తిరుపతిలో, భూసేకరణ కేసులకు సంబంధించి మరొక పట్టణంలో కోర్టు ఏర్పాటు చేయటం వల్ల ప్రజలు అంత దూరం వెళ్లలేక అనేక అవస్థలు పడాల్సి వస్తుందని బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారని వీటిపై ముఖ్యమంత్రితో చర్చించి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో 1600మంది న్యాయవాదులు ఉన్నారని, వారికి సంపూర్ణ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ మాట్లాడుతూ శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సమతుల్యాన్ని కాపాడారన్నారు. అయితే విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధానిని హైదారాబాద్‌కు తరలించారని, ఆ సమయంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారని వెల్లడించారు. కానీ శ్రీబాగ్ ఒడంబడికలో ఆంధ్ర ప్రాంతం వాళ్లే సంతకాలు చేశారని, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వాళ్లు ఐక్యతతో లేకపోవటం వల్ల ఏదీ సాధ్యం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 4 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు చెందిన నాయకుడు ఒకవిధంగా ఉండటం వల్ల సీమ హక్కులు సాధ్యం కావటం లేదని వెల్లడించారు. జిల్లాకు హైకోర్టు బెంచ్ సాధన కోసం కృషి చేస్తామని, అందుకు అందరి సహకారం అవసరం అన్నారు. సమావేశంలో బార్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యులు పాలూరి రవిగువేరా, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చాంద్‌బాషా, సివి.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి సహకారం
* తానా బృందం
దేవనకొండ, డిసెంబర్ 24: తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఉత్తర అమెరిక తెలుగు సంఘం అధ్యక్షులు జంపాల చౌదరి, జాయింట్ సెక్రటరీ, పొట్లురూ రవి, ఉపాధ్యక్షులు వేమణ, సతీష్, ఎపి అధికార ప్రతినిధి కోమటి జయరామ్‌లు పేర్కొన్నారు. ముంపా ఫౌండేషన్ ప్రొగ్రామ్ కన్వీనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో శనివారం ఎస్పీ రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పట్రాళ్ళలో తానా రైతు కోసం సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ తాము తెలుగు రాష్ట్రాల్లోనే గ్రామీ ణ ప్రాంతాల్లో జన్మించామని, కష్టపడి ఉన్నతమైన చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డామన్నారు. తమ సంస్థ గత 40 ఏళ్ల నుంచి విద్య, వైద్య వంటి ప్రధాన అంశాలను, వౌళిక సదుపాయాల కల్పనకు ఇప్పటి వరకు రూ. 300 కోట్ల ఖర్చుచేసి సేవా కార్యక్రమా లు నిర్వహించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, అందులో భాగంగా కప్పట్రాళ్ళ హైస్కూల్ డిజిటల్ తరగతులు లైబ్రేరిని శనివారం ప్రారంభించామన్నారు. విద్యతోనే దేనినైనా సాధించవచ్చునని, ఉన్నత స్థాయి ఎదగవచ్చుని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చి దిద్దాలన్నారు. గ్రామస్థులు కూడా తమ పిల్లలను కప్పట్రాళ్ళ శ్రీమంతుడు ఎస్పీ రవికృష్ణ స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ భవనంలో శ్మశాన వాటిక ప్రహరీ గోడల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు సరైన అవగాహన లేక అధిక మందులు వాడడం, పిచికారి మందులను పొలాల్లో వేయినప్పుడు తగు జాగ్రతలు తీసుకోవడం లేదన్నారు. ప్రకృతి వైఫరిత్యాల వల్ల దెబ్బతినే సమయంలో పంటల మార్పిడి వంటి చర్యలు తీసుకుంటే నష్టలు తగ్గుతాయన్నారు. రైతులు మందులు వేసే సమయంలో రక్షణ చర్యలు తీసుకోవాలనిన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కన్నతల్లిని, జన్మభూమిని మరిచిపోకుండా తానా సంస్థ సభ్యులు కప్పట్రాళ్ల వంటి గ్రామాలకు వచ్చి అభివృద్ధికి సహకరించడం హర్షనీయమన్నారు. వారందరికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కప్పట్రాళ్లలో తానా స్ర్తి శక్తి భవనం నిర్మించాలని ఎస్పీ వారిని కోరగా వారు అందుకు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో తానా బృందం సభ్యులు శ్రీనివాసులు, ఆంజయ్యచౌదరి, ప్రసాద్, ద్యానయ్య, లోకేష్‌నాయుడు, గోవర్థన్‌రెడ్డి, జెడిఎ ఉమామహేశ్వరమ్మ, డిఎస్‌పి బాబా ఫకృద్దీన్, సిఐలు విక్రమ సింహ, డేగల ప్రభాకర్, ఎంపిపి రామచంద్రనాయుడు, ఆస్పరి జడ్పీటీసీ బొజ్జమ్మ, ఎంపిటిసి హైమావతి, కోడుమూరు ఎఓ అక్బర్‌బాషా, గ్రామ జ్యోతి ఆర్గనైజర్ నారాయణ, ఎస్‌ఐ గంగయ్యయాదవ్, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
కొన్న ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలి
* జాతీయ వినియోగదారుల దినోత్సవంలో ఇన్‌చార్జి కలెక్టర్ హరికిరణ్
కర్నూలు, డిసెంబర్ 24:ప్రతిఒక్కరూ ఏ వస్తువు కొనుగోలు చేసినా దానికి తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ హరికిరణ్ సూచించారు. వినియోగదారులకు ఆన్‌లైన్ ద్వారా మరింత రక్షణ కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని, త్వరలోనే ఈ సిస్టం రాబోతుందని తెలిపారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శనివారం జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం నుంచి రాత్రి వరకూ ఎలాంటి వస్తువు కొనుగోలు చేసినా వాటికి బిల్లు తీసుకోవాలని, తద్వారా ఆ వస్తువు విషయంలో మోసపోతే వినియోగదారులకు షాపు యజమానిని ప్రశ్నించే హక్కు వస్తుందన్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వినియోగదారుల ఫోరం బాగా పని చేస్తుందన్నారు. మన హక్కులకు భంగం కలిగితే అందుకు తగ్గ నష్టహరిహారం రాబట్టుకునే అవకాశం త్వరలోనే ఏడిఆర్ ద్వారా మనదేశంలో కూడా రాబోతుందన్నారు.
జిల్లా వినియోగదారుల పరిరక్షణ అధ్యక్షుడు నజారున్నీసా మాట్లాడుతూ వినియోగదారులు వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ వస్తువు తయారు చేసిన తేదీని గమనించాలన్నారు. ముఖ్యంగా వస్తువు క్వాలిటీ, క్వాంటిటీ, నాణ్యతను చూసి బిల్లు పొందాలన్నారు. జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శశిదేవి మాట్లాడుతూ జిల్లాలో 150 హైస్కూళ్లలో, 10 రెసిడెన్సీ హాస్టళ్లలో, 10 డిగ్రీ కాలేజీల్లో వినియోగదారుల క్లబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 10.77లక్షల మందికి పాస్ బయోమెట్రిక్ సిస్టం ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామని, అలాగే నగదు రహిత లావాదేవీలపై ఎవరూ మోసపోకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు ఇన్‌చార్జి కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డా. మోక్షేశ్వరుడు, వినియోగదారుల ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యుడు శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి అధికారులు సహకరించాలి
* ఎస్‌ఆర్‌బిసికి జనవరి ఆఖరి వరకూ సాగునీరు
* ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి
బనగానపల్లె, డిసెంబర్ 24:మండల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి కోరారు. ఎస్‌ఆర్‌బిసి కాలువకు జనవరి చివరి వరకూ సాగునీరు వస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శనివారం ఎంపిపి సాలమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిసి మాట్లాడుతూ అధికారులు ప్రణాళికబద్దంగా వారి కార్యకలాపాలు నిర్వహించాలని, ముఖ్యంగా అంకితభావంతో పని చేయాలని సూచించారు. నాయకులు, అధికారుల అంతిమ లక్ష్యం అభివృద్ధేనని గుర్తుచేశారు. మండలంలో రూ. 11.5 కోట్ల వ్యయంతో వివిధ రోడ్లు ఏర్పాటు చేయనున్నామని, బనగానపల్లె పట్టణ బైపాస్ రోడ్డుకు రూ. 6 కోట్లు మంజూరయ్యాయని, ఆ పనులు జనవరిలో ప్రారంభమవుతాయన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామని ఇప్పటికి 14 పంచాయతీలకు భవనాలు మంజూరయ్యాయని అవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఎస్‌ఆర్‌బిసి కాలువ ద్వారా బనగానపల్లె ప్రాంతం పరిధిలో లక్ష ఎకరాల వరకూ నీరు అందుతోందన్నారు. అయితే కాలువలో కంపచెట్ల తొలగింపు, అవసరమైనచోట్ల చిన్నపాటి మరమ్మతులు చేయాల్సి వుంటుందని, అందుకోసం ఆయకట్టు రైతులు అధికారుల సూచనల మేరకు ఏటా ఎకరానికి రూ. 100 చెల్లించాలని సూచించారు. ఈ మొత్తాన్ని రైతులు చెల్లించేలా గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు వారికి అవగాహన కల్పించాలన్నారు. మండల రైతులకు ఇప్పటికే వివిధ రకాల విత్తనాలు 4,200 క్వింటాళ్ల వరకూ పంపిణీ చేశామన్నారు. రానున్న వేసవిని దృష్టిలో వుంచుకుని అధికారులు మందస్తు చర్యలు తీసుకుని, నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. రూ. 2 కోట్లతో ఫిల్టర్‌బెడ్స్, అవసరమైన చోట్ల నీటి ట్యాంకుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. మండలంలో 9 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజూరు కాగా అందులో పలుకూరులో 3, నందివర్గంలో 1 పూర్తయ్యాయని తెలిపారు. పట్టణంలో 42 కి.మీ మేరకు భూగర్భ డ్రైనేజీ పనులకు అనుమతులు లభించగా అందులో తొలుత 16 కి.మీ వరకూ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు శివలింగారెడ్డి, తహశీల్దార్ అనూరాధ, ఎంపిడిఓ పి.బాలకృష్ణారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు బషీర్‌అహ్మద్, జడ్పీటిసి రాజగోపాల్, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విధులు జాగ్రత్తగా నిర్వర్తించండి
* ఆర్‌డిఎంఎ విజయలక్ష్మి
ఆత్మకూరు, డిసెంబర్ 24:ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంలో చాలా పారదర్శకత పాటించాలని లేకపోతే ఇబ్బందులు తప్పవని అనంతపురం ఆర్‌డిఎంఎ విజయలక్ష్మి ఆత్మకూరు నగర పంచాయతీ సిబ్బందిని హెచ్చరించారు. అలాగే విధులు జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు. ఆమె శనివారం ఆత్మకూరు నగ ర పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్వక్తం చేశారు. నగర పంచాయతీలో 13,14వ ఫైనాన్స్, మరి కొన్ని ఖాతాల్లో దాదాపు రూ. 7 కోట్లు ఉన్నాయని వాటిని పట్టణ అభివృద్ధి పనులకు ఉపయోగించాలన్నారు. పన్నుల వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయారని మండిపడ్డారు. పట్టణంలో దాదాపు 12 వేల మొక్కలు నా టామని అధికారులు తెలిపారు. 344 ఇంకుడు గుంతలు తీయాలని ప్రభు త్వం లక్ష్యం నిర్ధేశించగా సిబ్బంది కేవ లం 34 ఇంకుడు గుంతలు తీశారన్నా రు. పట్టణంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయడంలో అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా కొందరు ప్రజలు వేసిన రోడ్డుపైనే మరొకసారి రోడ్డును వేసి ప్రజాధనం వృథా చేశారని ఆమె దృష్టికి తీసుకురాగా నగర పంచాయతీలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఈపుర సేవా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. ఆన్‌లైన్‌లో ఆత్మకూరు నగర పంచాయతీపై 35 ఫిర్యాదులు రాగా కేవలం 9 వాటికి సమాధానం ఇవ్వడం పట్ల కమిషనర్‌పై ఆమె ఆగ్రహం వ్వక్తం చేశారు. మరొక సారి ఇలా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుందన్నారు. పట్టణంలో నిర్మించిన నీటి పైపులైన్ నిర్మాణంలో నాణ్యత పాటించలేదని ఆమెకు ఫిర్యాదు అందడంతో దానిపై విచారణకు ఆదేశిస్తామని, త్వరలో ఇంజినీర్ విభాగానికి చెందిన అధికారి వస్తాడని తెలిపారు. ఆమె వెంట కమిషనర్ ప్రహ్లాద, మేనేజర్, సిబ్బంది ఉన్నారు.
హమాలీల సమ్మెతో
అర్ధాకలితో కూలీలు
ఆదోనిటౌన్, డిసెంబర్ 24: పట్టణంలోని జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమల హమాలీలు గత ఐదు రోజులుగా సమ్మెలో ఉండడంతో మార్కెట్‌యార్డులోని కూలీలు, హామాలీలు, పత్తి అమ్మకానికి వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని ఎఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ అధ్యక్షులు అజయ్‌బాబు డిమాండ్ చేశారు. శనివారం ఈమేరకు మార్కెట్‌యార్డు చైర్మన్ భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిన్నింగ్ పరిశ్రమల హమాలీల సమ్మె వల్ల మార్కెట్‌యార్డులో పూర్తి వరకు లావాదేవీలు నిలిచిపోయాయని దీని వల్ల యార్డులో పత్తి అమ్మకానికి వచ్చే రైతులు ఎమ్మిగనూరు, బళ్ళారి, రాయచూరు ప్రాంతాలకు తీసుకుపోతున్నారన్నారు. దీని వల్ల రైతులపై భారం పడిందన్నారు. ఇప్పటికైనా మార్కెట్‌యార్డు పాలక వర్గం, అధికారులు, జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకుని హామాలీల న్యాయమైన సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, కార్యదర్శి ప్రకాష్, షేక్షావలి, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులు ఎన్‌టిఆర్ గృహాలు
నిర్మించుకోండి:హౌసింగ్ ఏఇ
ఆత్మకూరు, డిసెంబర్ 24:మండల పరిధిలో 180 గృహాలు నిర్మించుకోవడానికి అర్హలకు ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ శాఖ అనుమతులు ఇచ్చిందని, వెంటనే పనులు ప్రారంభించాలని హౌసింగ్ శాఖ ఏఇ ఎం.రామయ్య సూచించారు. స్థానిక కార్యాలయం వద్ద శనివారం ఏఇ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మండల పరిధిలోని అమలాపురం గ్రామానికి 14, బ్రహ్మనంతపురం-31, కురుకుంద-22, వడ్లరామాపురం-5, సిద్దపల్లె-5, ఇందిరేశ్వరం-6, శ్రీపతిరావుపేట-9, పిన్నాపురం-9, నల్లకాలువ-20, కరివేన-37, ముట్టపల్లె గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 9 గృహలు మంజూరయ్యాయన్నారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ. 1.5 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. స్థలం ఉన్నవారికి బేస్ లెవల్‌కు రూ. 15 వేలు, రూఫ్ లెవల్‌కు రూ. 25వేలు, ఆర్‌సి లెవల్‌కు రూ. 40 వేలు ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద రూ. 70 వేలు ఇస్తామన్నారు. అందరికీ డిసెంబర్ మెదటి వారం శాంక్షన్ ప్రోసీడింగ్ ఇచ్చామని 3 నెలల లోపు లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోకపోతే రద్దు అవుతాయని ఏఇ సూచించారు.
వైభవంగా స్వాతి వేడుకలు
ఆళ్లగడ్డ, డిసెంబర్ 24: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో శనివారం వారం స్వాతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఎగువలో స్వయంభువుగా కొలువు దీరిన నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను, దిగువలో వెలసిన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమృతవల్లి అమ్మవార్లను ప్రత్యేక పూలమాలతో అలంకరించి పూజలు చేశారు. ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఎగువ అహోబిలం ఆలయంలో ఉత్సవమూర్తులను కొలువుంచి ప్రధానార్చకులు, అర్చక బృందం తదితరులు వేద మంత్రాల నడుమ హోమం చేశారు. హోమం నుండి వెలువడే కాటుకను భక్తులకు అందజేశారు, ఈ సందర్భంగా ప్రధానార్చకులు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా వుండి పాడిపంటలతో రైతులు కళకళ లాడాలని కోరుతూ హోమం నిర్వహించామన్నారు. స్వాతి సందర్భంగా భక్తులు వేకువ ఝాము నుండే కాలినడకన వెళ్లి నవనారసింహులను దర్శించుకున్నారు. పావన, మాలోల, అహోబిల, కారంజ, యోగానంద ఆలరుూల వద్ద కాలినడకన స్వాతికి వెళ్లే భక్తులకు అన్నదాన వసతి ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.
అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు: స్వాతి నక్షత్రం శనివారం రావడంతో వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎగువ అహోబిల ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు.
వైభవంగా విళక్కి పూజలు
దేవనకొండ, డిసెంబర్ 24: దేవనకొండలో మరక విళక్కి పూజ శనివారం ఘనంగా జరిగింది. స్థానిక అయ్యప్పస్వామి దేవాలయం నుండి వందలాది మంది చిన్నారులు, మహిళలు గ్రామ పురవీధుల్లో పెద్ద ఎత్తున కలశాలను ప్రదర్శించారు. ప్రజలను ఎంతగానో కలశాల ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం అయ్యప్పస్వామి దేవాలయంలో స్వామికి మెట్ల పూజ చేశారు. ఈసందర్భంగా భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో అయ్యప్పస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు వేణుమహారాజు, రామకృష్ణ, శ్రీనివాసులు, వీరేష్‌రెడ్డి, ఓబులేష్‌తోపాటు, అయ్యప్పస్వామి భక్తులు పాల్గొన్నారు.
దళిత క్రైస్తవుల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి
ఎమ్మిగనూరు, డిసెంబర్ 24: దళిత క్రైస్తవుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎంబి చర్చిలో క్రిస్మస్ పండుగను పురష్కరించుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్ని, చర్చి ఫాస్టర్ ఆశీర్వాదం తీసుకుని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశంలోని మత సామరస్యత సహుదుబద్వాని నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీనేన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో మెలగాలని ఏసుక్రిస్తును వేడుకోవాలని వారు ఆంకాంక్షించారు. ఈ మేరకు ఎంబి చర్చి సంఘం పెద్దలు భాగ్యరాజు, అబ్రహం, హిజికియ, కదిరికోట ఆదెన్న తదితరులు కోట్లను దుశాలవతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్‌చార్జి లక్ష్మినారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పార్థసారధి రెడ్డి, లక్ష్మికాంత్ రెడ్డి, ఖాసీం వలి, ఎంఇఓ.నాగభూషణం, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు వీరేష్ యాదవు, ఉసేని తదితరులు పాల్గొన్నారు.
విశ్వ జనీన పర్వం క్రిస్మస్
కర్నూలు సిటీ, డిసెంబర్ 24:క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. ఏసు జన్మదినంగా ప్రతి ఏటా డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండగను జరుపుకొంటారు. పాపపంకిలమైన జగతిని పునీతం చేసి భువిపై ప్రేమ బీజాలు అంకురింపజేసిన కరుణామూర్తి ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినమే క్రిస్మస్. సుమారు 2వేల సంవత్సరాలకు పూర్వం ఆసియా ఖండంలోని పాలస్తీనా ప్రజలు పరాయి పాలకుల కబంధ హస్తాల్లో నలిగిపోతూ తమను ఉద్దరించే మహానీయుని ఆవిర్భావం ఎదురుచూస్తున్న రోజుల్లో డిసెంబర్ 25వ తేదీ బెత్లహెంలోని ఒక పశువుల పాకలో మేరీ, జోసెఫ్ దంపతులకు నోముల పంటగా క్రీస్తు జన్మించారు. క్రీస్తు జన్మించిన విషయాన్ని దివ్య తారక ద్వారా గ్రహించిన ముగ్గురు ప్రాచ్చ దేశ జ్ఞానులు కరుణామయుని పుట్టుక వర్థమానాన్ని అవగతం చేసుకుని శిశు క్రీస్తును దర్శించి కానుకలర్పిస్తారు. ఆ మహానీయుని పునీత జననాన్ని స్ఫురణకు తెచ్చి విశ్వ జనీన మత ప్రవక్త అయిన క్రీస్తుకు ప్రణవిల్లి శ్రద్ధాంజలి ఘటింపజేసే పర్వదినమే ఈ క్రిస్మస్.
క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ ట్రీని ఆరాధించడం ప్రభు సన్నుతి గీతాల(కెరోల్స్)నాలపించడం, క్రిస్మస్ స్టార్స్‌ను అలంకరించడం, క్యాండిల్స్ వెలగించడం సంప్రదాయంగా వస్తున్నాయి. హిందువుల ధ్వజస్థాపన(పతాక ప్రతిష్ఠ) కలశ స్థాపన ఆచారంతో దగ్గర సంబంధం ఉన్న ఈ క్రిస్మస్ ట్రీ ఆచారం మాత్రం పాశ్చాత్య దేశాల నుంచి మన దేశానికి సంక్రమించినట్లుగా స్పష్టమవుతోంది. క్రీస్తు ప్రభువు ఆత్మీయ విశ్రాంతినిచ్చే చెట్టు వంటి వాడని, ఆయన చల్లని నీడలో పునీతులం కావాలనే సదుద్దేశంతో ఈ క్రిస్మస్ ట్రీ ఆచారం రూపొందించబడిందని చెప్పబడుతోంది. జెరుసలేంలో క్రీస్తు వాడు దేవదారు చెట్టుకొమ్మను చేత బూని దర్శనమిస్తాడని ప్రగాఢ విశ్వాసం ఉండేది. అందువల్ల దేవదారు చెట్టుకొమ్మను క్రిస్మస్ ట్రీగా ఆరాధించే ఆచారం వచ్చిందని చెబుతారు. వర్షం కురిపించే దేవుడు థోరస్ ఓక్‌చెట్టులో ఉంటాడని నమ్మిన జర్మన్లు ఆ దేవుడికి ఆ చెట్టు చెంత ఓ బాలుని బలి ఇవ్వబోగా సెయింట్ భోనిఫేస్ అనే మత ప్రవక్త ఆ చెట్టును నరికి అందులో దేవుడు లేడని నిరూపిస్తాడు. ఆ చెట్టు ఉన్న చోటే క్రిస్మస్ నాడు ఓ దేవదారు మొక్క మొలిచిందని కాలగమనంలో ఆ చెట్టు క్రిస్మస్ ట్రీగా రూపంలో ఆరాధనీయమైందని కూడా చెబుతుంటారు. ఏసును శిలువ వేయడానికి ఆయన చేత శిలువను మోయిస్తూ తీసుకెళ్తున్న తరుణంలో ఆయన శరరం నుంచి స్రవించిన రక్తపు బొట్లు మార్గమధ్యమున ఓహాల్లీ పొదపై పడటంతో హాల్లీ మొక్క చలించి పోయి ముకుళించుకోగా జీసస్ దానిని స్పృశించి స్వాంతనను కలిగించాడని ఆ సంఘటనను గుర్తుకు తెస్తూ క్రిస్మస్ నాడు హాల్లీ మొక్కను పూజించే వారని క్రమేణా హాల్లీ మొక్క స్థానంలో వివిధ రకాల మొక్కలు క్రిస్మస్ ట్రీలుగా పూజల అందుకుంటాయని చెబుతుంటారు. అదేవిధంగా క్రిస్మస్ బహుమతుల పండుగ అని కూడా చెప్పవచ్చు.ఈ పండుగ సందర్భంగా ప్రతివారు తమ తమ ఆత్మీయులకు కానుక ఇవ్వటం పరిపాటి. తిరిగి వారు కానుకలిచ్చిన మిత్రులకు బహుమానాలివ్వడం కూడా జరుగుతుంటుంది. అందుకే ఇది కానుకల పండుగ. పాశ్చాత్య దేశాల్లో పిల్లలకు పెద్దలే శాంతాక్లాస్(క్రిస్మస్ తాత) పేరిట కానుకలు రహస్యంగా అందించే సంప్రదాయం కూడా ఉంది. స్నేహితులకు, సేవలకు కానుకలు ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ పెట్టెల్లో పెట్టి వాటికి రంగు కాగితాలు చుట్టి రిబ్బన్లతో ప్యాక్ చేసి బాక్స్ రూపంలో ఇవ్వటం పరిపాటి. బాక్సులు ఇచ్చుకునే ఈ దినాన్ని బాక్సింగ్ డే అని వ్యవహరించడం జరుగుతుందని చెబుతారు. విక్టోరియా రాణి కాలంలో ఈ సంప్రదాయం వాడుకలోకి వచ్చిందట. ఏసు జీవితాన్ని గ్రహించి ఆచరణలో ఆయన సిద్ధాంతాలు శిరోధార్యం కావాలన్నదే క్రిస్మస్ ప్రధాన ప్రబోధం.
అన్నదానానికి విరాళం
మహానంది, డిసెంబర్ 24: మహానంది పుణ్యక్షేత్రంలో ప్రతి నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి నంద్యాలకు చెందిన ఆర్ సి పుల్లయ్య అనే భక్తుడు రూ.15,030 విరాళంగా అందించినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం ఆయన విరాళం కేంద్రంలో ఈ నగదును అందించగా ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు, బాండును అందజేశారు. అన్నదానానికి విరివిగా విరాళాలు ఇవ్వాలని దేవాలయ అధికారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మురళి తదితరులు పాల్గొన్నారు.
తెలుగుభాషాభివృద్ధికి కృషి
ఆదోనిటౌన్, డిసెంబర్ 24: తెలుగుభాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని, అనేక రచనలు రచించాలని అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద కోరారు. శనివారం పట్టణంలోని కిడ్డీస్ ఉన్నత పాఠశాలల్లో మల్లికార్జున రాసిన తెలుగువాడి శతకం పుస్తకం ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆర్డ్స్ కళాశాల అధ్యాపకులు సంజన్న మాట్లాడుతూ సామాజిక విలువలను పెంపొందించుకోవడం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కిడ్డిస్ పాఠశాల హెచ్‌ఎం చిన్నప్పరెడ్డి, సాహిత్య వేదిక ఉపాధ్యక్షులు అంజినేయులు, మోహన్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, రామయ్య, ఈరన్నగౌడ్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు ఉపయోగపడని
ఎస్‌ఎస్ ట్యాంకు!
చాగలమర్రి, డిసెంబర్ 24: మండలంలోని మల్లెవేముల గ్రామం వద్ద ప్రభుత్వం నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు గ్రామీణ తాగునీటి పథకం కింద సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణనాకి లక్షలు కేటాయించారు. దీని ద్వారా మండలంలోని చాగలమర్రితోపాటు ముత్యాలపాడు, చక్రవర్తులపల్లె, తోడేండ్లపల్లె, నేలంపాడు, పెద్దబోదనం తదితర గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. కాని ఎన్నడూ ఈ పథకం సక్రమంగా పనిచేయలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఒకవేళ పనిచేసినా మురికి నీరు రావడం జరుగుతుందన్నారు. ఈనీరు తాగడానికి ఉపయోగ పడడమేలేదన్నారు. ఈ నీటిని వాడుకుంటే గ్రామ పంచాయతీలు 40శాతం నిధులు చెల్లించాలని ప్రభుత్వం నిబందన పెట్టింది. దీంతో గ్రామ పంచాయతీలు ఈ నీటిని వాడుకోవడానికి స్వస్తి పలికాయి. కేవలం కాంట్రాక్టర్లకు కల్పతరువుగా మారిందేకాని దీని ద్వారా తమకు తాగునీటి సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకం సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆదోనిటౌన్, డిసెంబర్ 24: మండలంలోని నాగలాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎమ్మిగనూరుకు చెందిన చాకలి ఈరన్న(40) మృతి చెందిన నట్లు తాలూకా ఎస్‌ఐ నీలకంఠేశ్వర్ తెలిపారు. శనివారం ఎమ్మిగనూరు నుంచి ఆదోనికి ద్విచక్ర వాహనంలో మృతుడు చాకలి ఈరన్న, వెంకటేషులు వస్తుండగా ఎమ్మిగనూరు రోడ్డులోని నాగలాపురం సమీపం వద్ద మృతుడు చాకలి ఈరన్న వాహనం నుంచి ప్రమాద వశాత్తు కింద పడిపోయి తీవ్రగాయాలకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్ గడ్డి దగ్ధం
అవుకు, డిసెంబర్ 24:ట్రాక్టర్‌లో గడ్డి తీసుకెళ్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మంటలు వ్యాపించిన సంఘటన శనివారం మండల పరిధిలోని రామవరం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా యాడికి మండలం చింతలాయపల్లె గ్రామానికి చెందిన రైతు చెక్క లక్ష్మయ్య పశుగ్రాసం కొనుగోలు చేశాడు. ఆ గడ్డిని ట్రాక్టర్‌లో తరలిస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి నిప్పులు వెలుడి మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్‌లో ఉన్న గడ్డిని అన్‌లోడ్ చేయగా గడ్డి పూర్తిగా కాలిపోయింది. దీంతో సుమారు రూ. 20 వేలు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు.
మద్యం విక్రేత అరెస్టు
నందికొట్కూరు, డిసెంబర్ 24:పట్టణ శివారులోని వైఎస్‌ఆర్ సర్కిల్ వద్ద శనివారం ఓ వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా అరెస్టు చేశామని ఎస్‌ఐ లక్ష్మినారాయణ తెలిపారు. బొల్లవరం గ్రామానికి చెందిన కురుమన్న మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అరెస్టు చేసి, 74 బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మహానందిలో తప్పిపోయిన బాలుడు
మహానంది, డిసెంబర్ 24: మహానంది గ్రామంలో ఐదు సంవత్సరాల బాలుడు తప్పిపోయి నరసింహులు ఇంట్లో ఆవాసం పొందుతున్నాడు. తెలిసిన వివరాల మేరకు ఈ నెల 21న ఈ బాలుడు తప్పిపోయి పోలీసు స్టేషన్ ఆవరణలో తిరుగుతుండగా పోలీసు స్టేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న నరసింహులు బాలున్ని చేరదీశాడు. బాలుడు వివరాలు తెలుపలేక పోతున్నాడని, ఎవరితో మాట్లాడడం లేదని, చామనచాయ రంగులో ఉండి ఐదు సంవత్సరాల వయస్సు కలిగి ఉందని వారు తెలిపారు. ఆచూకి ఎవరికైనా తెలిస్తే మహానంది పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.