కర్నూల్

జీవన భద్రతకు భరోసా ఇవ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, మే 13:పేదల జీవన భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అధికారులు భరో సా కల్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్ సత్యనారాయణ, జెసి ప్రసన్నవెంకటేష్‌తో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పక్కాగృహాలు, పింఛన్లు అర్హులందరికీ అందించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు అవసరమైన చేయూతనందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నంద్యాల పట్టణంలో భూమా నాగిరెడ్డి ఆదేశాల మేరకు 13వేల గృహాలు నిర్మించాలని, ముస్లిం మైనార్టీల కోసం నూనెపల్లి సమీపంలో ఉన్న వక్ఫ్‌బోర్డుకు సంబంధించి 43 ఎకరాలు ఉందని, అందులో నిరుపేద ముస్లింలకు పక్కాగృహాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో 9ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేయాలని, ట్రాఫిక్ సమస్యపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు విస్తరణ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయలన్నారు. మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో 30 సెంట్ల స్థలంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. నంద్యాలలో మహిళా సమాఖ్య గ్రూపుల్లో 15మంది ఆర్పీలు బినామీ పేర్లతో ఉన్నారని వారిని వెంటనే తొలగించాలన్నారు. పట్టణం లో వరద నివారణ చర్యలకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, 2009లో వచ్చిన వరదల కారణంగా పట్టణంలోకి నీళ్లు రావడంతో ఆర్థికంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. కావున శ్యామ్‌కాల్వ, కుందూ, మద్దులేని వాగులకు ఇరువైపులా రక్షణగోడలు నిర్మించాలన్నారు. రక్షణ గోడల కోసం రూ. 63.57 కోట్లు మంజూరయ్యాయని కెసి కెనాల్ ఇఇ తెలిపారు. అందులో కుందూకు రూ. 33.3కోట్లు మంజూరు కాగా 2009లో పనులు ప్రారంభించారన్నారు. అయి తే ఆ రెండు కాల్వలపై అక్రమ కట్టడా లు ఏర్పాటు చేసుకున్న ప్రజలు భూసేకరణకు సహకరించకపోవడం వల్ల పనులు జరగలేదన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ భూసేకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేయాలన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆళ్లగడ్డ, రుద్రవరం, దొర్నిపాడు, చాగలమర్రి, శిరివెళ్ల, ఉయ్యాలవాడ మండలాల్లో గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె అధికారులను ఆదేశించారు. అలాగే మండలాల వారీగా ప్రభుత్వ భూమికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణ శివారులో ఉన్న చిత్తకుంట గ్రామంలో భూమికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ మండలంలో 57 ఎకరాల భూమి ఉందని, ఆ భూమి వివరాలను వాటిని ప్రత్యేకంగా సేకరించి అర్హులందరికీ పట్టాలు మంజూరు చేసి గృహ నిర్మాణలు చేపట్టాలని సూచించారు. ఉయ్యాలవాడ మండలంలో ప్రభుత్వ భూమి లేదని తహశీల్దార్ సమాధానం ఇవ్వగా ఆ మండలంలో 23 ఎకరాలు ఉందని నిర్లక్ష్యం చేయకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. చాగలమర్రి మండలంలో 38.3 ఎకరాల భూమి ఉందని, అందులో జాతీయ రహదారికి 8 ఎకరాలు పోయిందని మిగిలిన భూమిలో 2004లో పట్టాలు ఇచ్చినా ఇప్పటి వరకూ గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో కొందరు కోర్టుకెళ్లారని అది కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ అందుకు సంబంధించి న్యాయవాదిని సంప్రదించి వివరాలు అందించి ముందుకు సాగాలని సూచించారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూమి ఉండి, అర్హులైన వారికి పట్టాలు ఇచ్చి గృహ నిర్మాణాలు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాల కోసం కోట్లాది రూపాయలు మంజూరుచేస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలాలు అందడం లేదన్నారు. తహశీల్దార్లు భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించి గృహనిర్మాణాలు చేపట్టాలన్నారు. సమావేశంలో జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ చంద్రశేఖరరావు, డిఆర్‌డిఓ, డ్వామా పిడిలు రామకృష్ణ, డా. పుల్లారెడ్డి, ఆర్డీఓలు రామసుందర్‌రెడ్డి, హుసేన్‌సాహెబ్, జడ్పీ సిఇఓ ఈశ్వర్, నంద్యాల ఇన్‌చార్జి కమిషనర్ సత్యనారాయణ, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, హౌసింగ్ ఇఇ సుధాకర్‌రెడ్డి, పంచాయతీ ఇఇ సుబ్బారెడ్డి, నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గాల మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నంద్యాలకు రూ. 500కోట్లు మంజూరు
భూమా నాగిరెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు సిఎం చంద్రబాబు నంద్యాల నియోజకవర్గానికి రూ. 500 కోట్లు మంజూరు చేయడంతో పాటు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారని మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. ఈ సమావేశానికి తనతో పాటు ఇద్దరు రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కావాల్సి ఉందని, అయితే ఇతర పనుల వల్ల మంత్రులువ నారాయణ, కాలవ శ్రీనివాసులు హాజరుకాలేదన్నారు. నెల రోజుల్లోగా సిఎం ఆశయాలను నెరవేర్చకపోతే సిఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. 15 రోజులకు ఒకసారి సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పనులపై కూడా సమీక్షలు ఉంటాయన్నారు. రెండు నియోజక వర్గాల్లో వందశాతం కట్టెల పొయ్యిలేని గృహాలుగా తీర్చిదిద్దాలన్నదే తన ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించి, రెండు నియోజకవర్గాల్లోని గ్రామాలను ఓడిఎఫ్‌గా గుర్తించాలన్నదే తన ప్రధాన ఆశమన్నారు. 8 మండలాల్లో అర్హులందరికీ పింఛను మంజూరు చేయాలని, మహిళలకు ఆర్థికంగా బలపడేందుకు మెప్మా, వెలుగు శాఖల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలన్నారు.
స్కూల్ బస్సు బోల్తా..
* 18 మంది సిబ్బందికి గాయాలు
ఆదోని, మే 13: ఆదోని డివిజన్‌లోని బొమ్మనహాల్- చింతకుంట గ్రామాల మధ్య ఆలూరుకు చెందిన సెయింట్‌జోషఫ్ స్కూల్ బస్సు బోల్తా పడిన సంఘటనలో ఉపాధ్యాయులు, సిబ్బంది 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం స్కూల్ బస్సులో ఆలూరు నుంచి చింతకుంట గ్రామానికి స్కూల్ యొక్క ప్రచారాన్ని నిర్వహించడానికి వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను తప్పించ బోయి బస్సు బోల్తా పడినట్లు గాయపడిన స్కూల్ పిఇటి హనుమంతు తెలిపారు. బస్సు బోల్తా పడిన సంఘటనలో 18 మందికి గాయాలు కాగా అందులో 13 మంది హేమలత, సునంద, లక్ష్మీ, లక్ష్మీదేవి, జయరాజు, శ్రీదేవి, హనుమంతు, జగదీష్, రామతులసి, ఉలిగప్ప, వెంకటేష్, శే్వత, బాలకిసాన్‌లకు తీవ్రగాయాలు కాగా ఆలూరు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పంపారు. వీరంతా ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాదిలింగప్ప, సునంద, చిన్న లక్ష్మీ, పెద్ద లక్ష్మీలకు ఆలూరు ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు. బస్సు బోల్తా పడడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైనట్లు క్షతగ్రాతులు తెలిపారు. వెంటనే పక్కన ఉన్న గ్రామస్థులు అందరిని బయటకు తీశారన్నారు. ఇందులో హనుమంతరెడ్డి, జయరాజు, గాదిలింగప్ప తీవ్రంగా గాపడ్డారు. గాయాలు తగిలిన వారంత ఆలూరు వాసులు కావడంతో సమాచారం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి రావడంతో వారి రోదనలతో ఆసుపత్రి ఆవరణం నిండిపోయింది. హాలహర్వి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారంతా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది. సమాచారం తెలిసిన వెంటనే స్కూల్ యజమాన్యం వచ్చి బాధితులకు సహాయం అందించారు.
మంత్రాలయం మఠం ఆలయ గోపురంపై నూతన కలశ ప్రతిష్ఠ
మంత్రాలయం, మే 13: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠం ఆలయ గోపరానికి మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు శనివారం కలశ ప్రతిష్ఠాపన చేశారు. గత వారం రోజుల క్రితం అధక ఈదుర గాలులు వీచడంతో ఆలయ గోపరం కలశం పడిపోయింది. కలశ ప్రతిష్ఠాపనలో భాగంగా ముందుగా అర్చకులతో హోమం చేశారు. అనంతరం పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేసి కలశ ప్రతిష్ఠాపన చేశారు. ఈ కార్యక్రమంలో మఠం ఎఎఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాస్‌రావు, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, జోనల్ మేననేజర్ శ్రీపతాచార్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి
గరుడోత్సవం
కొలిమిగుండ్ల, మే 13: కొలిమిగుండ్ల కొండపై వెలసివున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు స్వామివార్ల గరుడోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్, ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, ధర్మకర్తల మండలి అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, సత్యనారాయణరెడ్డి, ప్రముఖులు పూజలు చేసి ప్రారంభించారు. ఆలూరు రాఘవేంద్ర ప్రసాద్, రాఘవయ్య ఆచార్యుల ఆధ్వర్యంలో 9 మంది వేద పండితులు గరుడవాహనంపై ఆశీనులైన లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక అలంకరణలు చేసిన అనంతరం పూజలు సంప్రదాయానుసారంగా నిర్వహించారు. కోలాటాల మధ్య బ్యాండుమేళాలతో భజనలతో గరుడోత్సవం కొలిమిగుండ్లలోని వీధుల వెంట భక్తుల ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. గరుడోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
పెరిగిన సాగు.. తగ్గిన దిగుబడులు!
* ఈ ఏడాది పత్తి సాగు పెరిగే అవకాశం
కర్నూలు సిటీ, మే 13 : జిల్లా వ్యాప్తంగా రైతులు సాధారణంగా 6,21,155 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. అయితే గత ఏడాది వ్యవసాయ శాఖ అధికారుల అంచానకు మించి దాదాపు 6,56,214 హెక్టార్లలో ప్రధాన పంటలైన వరి, పత్తి, కంది, వేరుశెనగ, జొన్న, ఆముదం, సన్‌ఫ్లవర్, ఉల్లి, కొర్ర, తదితర పంటలు సాగు చేశారు. జిల్లాలో గత కొనే్నళ్లుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆశాజనకంగా కురిసి ఆ తర్వాత పంటలు పూత దశకు చేరుకునే సమయానికి వరుణుడు ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. 2015-16లో 5,59,046 హెక్టార్లలో రైతులు పంటలు సాగుచేయగా, 2016-17లో వ్యవసాయ శాఖ అధికారుల అంచనాకు మించి పంటలు సాగు చేశారు. ఖరీఫ్ ప్రారంభంలో మంచి వర్షాలు కురవడంతో గత ఏడాది వచ్చిన వర్షాభావ పరిస్థితులను మరచిపోయి ఉత్సాహవంతంగా రైతులు పంటలను సాగు చేశారు. జూన్ మధ్యలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో సాధారణం కంటే ఎక్కువ మోతాదులో వర్షపాతం నమోదైంది. జూలైలో కూడా వర్షాలు ఆశాజనకంగానే కురిసిశాయి. ఆగస్టు నెల కీలకమైనది పంటలు పూత దశకు చేరుకుంటాయి. అయితే ఈ నెల మొదటి వారం నుంచి చివరి వారం వరకూ చినుకు జాడ లేదు. చివరి వారంలో సాధారణం కంటే ఎక్కువ మోతాదులో వర్షం కురిసింది. అయినా ప్రయోజనం లేదు. ఎందుకంటే అప్పటికే సగానికి పైగా పంటలు ఎండిపోయాయి. కొన్ని చోట్ల రైతులు ఎండిపోయిన పంటలను దునే్నశారు. పంటల సాగు పెరిగినా వర్షాభావ పరిస్థితుల వల్ల సాగుకోసం పెట్టిన ఖర్చులు కూడా అందలేదు. 2015లో కందులకు మంచి గిట్టుబాటు ధర ఉండటంతో ఎక్కువ శాతం రైతులు కంది పంట సాగు చేశారు. సాగు ఖర్చు కూడా తక్కువగా ఉండటంతో రైతులు కంది పంట సాగుపై మక్కు చూపించారు. జిల్లాలోని రైతులు వేరుశెనగ, పత్తి, సన్‌ఫ్లవర్ పంటలను ఎక్కువగా సాగు చేసేవారు. అయితే కంది పంటకు మంచి గిట్టుబాటు ధర ఉండటంతో గత ఏడాది వ్యవసాయ శాఖ అధికారుల అంచనా కంటే అధిక శాతం సాగు చేశారు. గత కొనే్నళ్లుగా ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పత్తి పంట సాగు చేయటానికి ఇష్టపడుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురిసి మంచి పంట దిగుబడులు రావాలని రైతులు కోరుకుంటున్నారు.
జగన్ ఆర్థిక నేరస్థుడు
* నేరాల నుంచి బయటపడటానికే మోదీతో భేటీ
* టిడిపి నేత సోమిశెట్టి
కర్నూలు సిటీ, మే 13:ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు జగన్ ఒక ఆర్థిక నేరస్థుడని, ఆయన నేరాలను కప్పి పుచ్చుకోవడానికి, రాజకీయంగా ఉనికిని కాపాడుకోవటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసారని టిడిపి జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని దీక్షలు చేస్తున్నారు కానీ ప్రధాని మోదీ దగ్గర మాత్రం ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. నగరంలోని టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి ప్రధానమంత్రిని కలిసినప్పుడు వాటి గురించి మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. అలాగే జూన్ నాటికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీకి చెందిన ఎంపిల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తానని ప్రకటించారని, ఎంపిలు రాజీనామా చేస్తే రాష్టప్రతి ఎన్నికకు ఓట్లు వేయటానికి ఏవిధంగా అర్హత ఉంటుందన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసం సిఎం చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తుంటే ఆయనకు సహకరించాల్సింది పోయి సిఎంపై ప్రధానికి ఫిర్యాదు చేయటం సిగ్గుచేటన్నారు. రాష్ట్భ్రావృద్ధి కోసం వచ్చే నిధులను కూడా అడ్డుకుంటూ అభివృద్ధి నిరోధకుడిగా మారుతున్నారని విమర్శించారు. ఇకనైనా జగన్ తన తీరును మార్చుకుని రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని, లేనిపక్షంలో రాష్ట్రం నుంచి ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు. సమావేశంలో టిడిపి నాయకులు అయ్యల బాబురాజ్, హనుమంతరాయచౌదరి, నాగేంద్ర, మహేష్‌గౌడ్, అల్లబకాష్, తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి పరిష్కారానికి కృషి
* ఎంపి బుట్టా రేణుక
కోడుమూరు, మే 13:కోడుమూరు ప్రజల తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపి బుట్టారేణుక హామీ ఇచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఇక్కడి వైకాపా శ్రేణులు అఖిలపక్ష పార్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతులకు కరవు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అంతేగాక హంద్రీనది తీర ప్రాంతాల్లో మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో తాగునీటి సమస్యలు తలెత్తిందని విచారం వ్యక్తం చేశారు. తాగునీటి కోసం ప్రజలు పలు అవస్థలకు గురయ్యారన్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తాను ఇది వరకే కోడుమూరు మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 65 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయానని గుర్తుచేశారు. తన పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం ప్రతి పాదనలతో సరి చేయనని వాటిని పరిష్కరించేంత వరకూ పోరాడుతానన్నారు. తాను ప్రతిపక్ష పార్టీలో ఉన్నానని అందుకే అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తానన్నారు. తన కృషి వల్లే కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు, కొత్తకోట గ్రామాల రహదారులను ఆర్‌అండ్‌బి రహదారులగా మార్చామని తెలిపారు. కోడుమూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసే మంచి నీటి పథకం సాధనకు అవసరమైతే కోడుమూరు అఖిల పక్ష పార్టీలతో కలిసి సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, కోట్ల వంశీధరరెడ్డి, కృష్ణారెడ్డి, సిబి అజయ్‌కుమార్, వామపక్షాల నాయకులు సోమన్న, కృష్ణ, మాధవస్వామి, రాజు, మాజీ సర్పంచ్ కెఇ రాంబాబు, లాయర్ ప్రభాకర్, మండల ఉపాధ్యక్షుడు కె.నాగిరెడ్డి, సలీం, తదితరులు పాల్గొన్నారు.
నకిలీ కేర్ ఆఫ్ కర్నూలు!
* నల్లబజార్‌లో నకిలీ విత్తనాల జోరు
* మోసపోతున్న కర్షకులు
కర్నూలుటౌన్, మే 13: ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్న రైతులను నకిలీ విత్తనాలు భయపెడుతున్నాయి. ఇప్పటికే నల్లబజారులో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు. జిల్లాలో పత్తివిత్తనాలకు మంచి డిమాండ్ ఉండడంతో, ఇదే అదనుగా భావించిన కొందరు అక్రమ వ్యాపారరులు నాసిరకం నకిలీ లూజు విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ప్రముఖ సంస్థలలో నకిలీ విత్తనాలను తయారుఅవుతున్న వ్యవసాయశాఖ అధికారులు దృష్టిపెట్టక పోవడంతో రంగురంగుల ప్యాకేట్లలో విత్తనాలను ప్యాక్‌చేసి విక్రయించేందుకు సిద్వవౌతున్నట్లు సమాచారం.గత ఏడాదిలో పత్తిసాగు అధికంగా రావడంతో ఆ ఏడాది రైతులు అదనంగా పత్తిని సాగుచేస్తారని వ్యాపారస్తులు గమనించి నకిలీ విత్తనాలను అంట కటేందుకు సిద్దవౌతున్నట్లు సమాచారం.గత ఏడాది ఖరీష్‌సాగుచేసిన పంటలన్ని అనుకున్న రీతిలో రాలేదు. పత్తి సాగు విస్తీరణంలో కొంత మందిరైతులు సకాలంలో ప్రత్యేక చర్యలు చేపట్టడం వలన లాబం లేకున్న పెట్టిన్నపెట్టుబడి రావడంతో ఈ ఏడాది కూడ పత్తిసాగుకు సిద్దవౌతున్నారు.గత ఏడాదికన్న ఈ ఏడాది 2.10లక్షల హెక్టార్లతో పత్తిసాగుచేసుకునేందుకు సిద్దం అయినట్లు వ్యవసాయశాఖ అధికారులు లెక్కలేస్తున్నారు.కర్నూలు, కల్లూరు అర్భన్ ప్రాంతాలలో నకిలీ విత్తనాలు తయారుచేస్తునట్లు సమాచారం.కర్నూలు నుండి ఆదోని వెళ్లు మార్గంలోని ఏ ప్రాంతంలోవ్యవసాయశాఖలో పనిచేసిన ఓ విశ్రాంతి అధికారి ఈ నకిలీ విత్తనాలను తయారుచేయిస్తునట్లు సమాచారం. ఆవిత్తనాలను జిల్లాలోని నలుమూలకు తరలించినట్లు సమాచారం ఈవిశ్రాంత అధికారికి వ్యవసాయశాఖ యంత్రాంగంలో పరిచయాలు,అండదండలు ఉండటంతో అడిగిన వారికి మామూళ్లు ఇస్తునట్లు సమాచారం. వ్యవసాయఅధికారులు తనిఖీలకు వెళ్తే కలెక్టరేట్‌లోపనిచేసే ఓ ఉద్యోగి ఆగమేఘాలపైన ఆవిశ్రాంత అధికారికి సమాచారం అందిస్తుండటంతో గతంలోకూడ తనిఖీ వెళ్లిన్న అధికారులకు నకిలీ విత్తనాలు దొరకలేదు. ఈ నకిలీ విత్తనాలను కర్నూలు జిల్లాలోనే కాకుండ కర్ణాటక రాష్ట్రానికి కూడ సరఫరాచేస్తునట్లు సమాచారం.వ్యవసాయశాఖలో 7 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ ఉద్యోగియే నకిలీ విత్తనాలకు సూత్రదారిఅని వారికుటుంభ సభ్యులే ఒకనకిలీ విత్తన కేంద్రాన్ని ఏర్పాటుచేశారని సమాచారం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు అందిన్నవారిపైన చర్యలుతీసుకోక పోవడం గమనార్హం. ఇటీవల ఎమ్మిగనూరు, ఆదోని, నంద్యాల, బనగానపల్లి, కర్నూలు నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున్న దాడులు చేయగా దాదాపు 150 ప్యాకేట్లు నకిలీ విత్తనాలుగా గుర్తించారు. అయితే పట్టుబడిన వారిపైన మాత్రమే చర్యలుతీసుకొని కీలక సూత్రదారులను వదిలేశారన్న ఆరోపనలు బలంగా వినపడుతున్నాయి. ఇప్పటికైన ఖరీఫ్ సీజన్‌లో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ యంత్రాంగం బృందాలను ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించాలని కర్షలు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకేసారి దాడులు చేస్తే తప్పా నకిలీ విత్తనాలు వెలుగు లోకి వస్తాయని ఆదర్శరైతులు, కౌలురైతులు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. ఈ నకిలీ విత్తనాలపై చర్యలుతీసుకోవాలని రైతు సంఘం, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించారు.
వాటర్‌షెడ్ పనుల్లో అక్రమాలు!
* అర్హులకు మొండిచేయి..
కల్లూరు, మే 13 : గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న వాటర్‌షెడ్ పనుల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లకు చేయి తడిపిన వారి పొలాలకు మాత్రమే కత్వలు కడుతూ నిధులు కాజేస్తున్నారు. దీంతో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ నిధులు పేద రైతులకు అందని ద్రాక్షలా మారాయి. వర్షం కురిసినప్పుడు పొలాలు కోతకు గురికాకుండా వుండేందుకు రైతులు కత్వలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం వాటర్‌షెడ్ నిధులు అందజేస్తుంది. అలాగే వాగులు, వంకల్లోని నీరు వృథాగా పోకుండా భూగర్భజాలాలు పెంపొందించేందుకు డ్యాంలు ఏర్పాటుచేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు వారికి సంబంధించిన పొలాల్లో మాత్రమే కత్వలు కట్టేందుకు వెళ్తున్నారు. రికార్డుల్లో వారికి సంబంధించిన వ్యక్తుల పేర్లు నమోదు చేసుకుని వారికి కొంత మొత్తాన్ని ఇచ్చి మిగిలిన మొత్తాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు కాజేస్తున్నారు. మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామం రెవెన్యూ పరిధిలో పెద్దటేకూరుకు చెందిన ఒక రైతుకు చెందిన 1.25 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి కోతకు గురవుతుందని కత్వ కట్టాలని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్‌కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో ఆ రైతు చేసేదేమీ లేక తన సొంత నిధులు రూ. 10 వేలు ఖర్చు చేసి కత్వ ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో రైతులు అవసరం లేని చోట వాటర్ షెడ్ నిధులు ఖర్చు చేయడం కంటే అవసరమైన చోట పనులు చేపట్టి వాటర్ షెడ్ నిధులు సద్వినియోగం చేయాలని రైతులు కోరుతున్నారు.
తెలుగుభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలి
చాగలమర్రి, మే 13: తెలుగుభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ కోరారు. చాగలమర్రిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి రచించిన తెలుగు పద్యాలకు సంబంధించిన మెమొంటోను శనివారం అఖిలప్రియకు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుభాష ఎంతో మధురమైందని ఉపాధ్యాయుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి చక్కగా పద్యాలు రచించారని ప్రశంసించారు. ఈయనను ఆదర్శంగా తీసుకుని తెలుగుభాష అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలుగుభాష అభివృద్ధికి తనవంతు సహకారం అందజేస్తామని హామీనిచ్చారు. ఈకార్యక్రమంలో చాగలమర్రి మండల తెలుగుదేశం నాయకులు జగదీశ్వరరెడ్డి, నాగరాజు, ముల్లాఖాదర్‌బాషాలు పాల్గొన్నారు.
అలరించిన జాతీయ కవి సమ్మేళనం
కొలిమిగుండ్ల, మే 13: కొలిమిగుండ్లలోని షిరిడీసాయి ఆడిటోరియంలో శనివారం జాతీయ కవితా సమ్మేళనం అందరినీ అలరించింది. స్థానిక కళాస్రవంతి సాహితీ సాంస్కృతిక సంస్థ మూడవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీషిరిడీసాయి సేవా ట్రస్టు, శ్రీసాయినాథ్ మినరల్స్, దీక్షిత విద్యాసంస్థలు, స్వధర్మ పరిరక్షణ సమితిల ఆధ్వర్యంలో వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి రాష్ట్రాల గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్, హైదరాబాద్ దూరదర్శన్ మాజీ డైరెక్టర్ ప్రముఖ సాహితీవేత్త పార్వతీశం, ఆంధ్రసారస్వత పరిషత్ సంపాదకులు తెలుగు రచన వేదిక అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ, బనగానపల్లె వైయస్ ఆర్‌సీపీ నాయకులు యరబోతుల వెంకటరెడ్డి, దీక్షిత విద్యాసంస్థల అధినేత చంద్రశేఖర్‌నాయుడు, సాయినాథ్ మినరల్స్ యజమాని బయ్యపురెడ్డి, కవి మోహన్, కర్నాటక తెలుగు రచయిత సమాఖ్య అధ్యక్షులు మాల్యాద్రి, ప్రముఖులు హాజరయ్యారు. ఈ కవితా సమ్మేళనంలో ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, తదితర ప్రాంతాల నుంచి 125మంది కవులు కవితా సమ్మేళనానికి తమ రచనలు పంపారు. వీటిలో న్యాయనిర్ణేతల కమిటీ మొదటి బహుమతి అమూల్యచంద్ కప్పగంతుల, రెండో బహుమతి ప్రసన్నకుమార్ ఆచారి(సంగారెడ్డి), మూడో బహుమతి ప్రసాద్(కాకినాడ), నాలుగో బహుమతి పార్వతీదేవి(కర్నూలు), ఐదో బహుమతి భ్రమరాంబ(తిరుపతి), ఆరో బహుమతి వైష్ణవి(విశాఖపట్నం), ఏడో బహుమతి అమృతవల్లి(ప్రొద్దుటూరు), ఎనిమిదో బహుమతి శ్రీనివాసులు(రాయదుర్గం) వీరిని కళాస్రవంతి సాహితీ గ్రహీతలుగా కమిటీ ఎంపిక చేసి బహుమతులు అందజేయడంతో పాటు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈసమావేశంలో పలువురు మాట్లాడుతూ కొలిమిగుండ్లలో కళాస్రవంతి సాహితీ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందించదగ్గ విషయమన్నారు. మారుమూల ప్రాంతంలో కళాస్రవంతి సంస్థ ఏర్పాటు చేసి గత మూడేళ్లుగా జాతీయ కవితా సమ్మేళనం నిర్వహిస్తున్న వ్యవస్థాపకులు శేఖర్‌బాబును ప్రముఖులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు పండితులు నారాయణరెడ్డి, ప్రసాదశర్మ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
నంద్యాలలో పోటాపోటీగా అభివృద్ధి కార్యక్రమాలు
నంద్యాల, మే 13: నంద్యాల పట్టణంలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, పురపాలక చైర్‌పర్సన్ దేశం సులోచనలు శనివారం పోటాపోటీగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణ శివారులోని పివి నగర్‌లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తారని మంత్రి భూమా అఖిలప్రియ హామీనిచ్చారు. పివి నగర్ సమీపంలో పందుల పునరావాసానికి చేయతలపెట్టిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. అదే విధంగా చైర్‌పర్సన్ దేశం సులోచన 19వ వార్డులో సిసి రోడ్డు, మురికికాల్వల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అలాగే నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్‌లో పాఠశాల మైదానం అభివృద్ధి కోసం భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి, చైర్‌పర్సన్‌లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధులు అందిస్తున్నారని, ఆ నిధులతో నంద్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఇళ్లు లేని నిరుపేదలు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుతో దరఖాస్తు చేసుకుంటే, వారి దరఖాస్తులను పరిశీలించి అర్హతలున్న వారి జాబితాను హౌసింగ్ కార్యాలయానికి పంపడం జరుగుతుందని చైర్‌పర్సన్ అన్నారు. ఈకార్యక్రమంలో పురపాలక సంఘం డిఇ షాకీర్‌హుశేన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన పావన క్షేత్రం
ఆళ్లగడ్డ, మే 13: నల్లమల అరణ్యంలో వెలసిన నవనారసింహులలో ఒకరైన పావన (పాములేటయ్య) నరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో కిటకిట లాడింది. శుక్రవారం రాత్రి నుండే భక్తులు తమ అవకాశాన్ని బట్టి లారీలు, జీపులు, ట్రాక్టర్లలలో, కొందరు ఎగువ అహోబిలం నుండి మెట్ల దారి గుండా కాలినడకన నడిచి వెళ్లి స్వామికి తమ మొక్కుబడులను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.
ఎమ్మెల్సీ గంగుల పూజలు : పుణ్య క్షేత్రమైన అహోబిలంలో వైకాపా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి శనివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఆయన రాకతో ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆయన వెంట నాసారి వెంకటేశ్వర్లు తదితరులు వున్నారు
పశుగ్రాసం లేక మూగజీవాల విలవిల!
దేవనకొండ, మే 13: వరుసగా ఏర్పడిన వర్షాబావం, మూగజీవాల పాలిట శాపంగా మారింది. తీవ్రమైన పశుగ్రాసం కొరత వల్ల మూగజీవులైన గొర్రెలు, మేకలు, పశువులు, బర్రెలు విల విలాడుతున్నాయి. పశుగ్రాసం, తాగునీటి కొరత వల్ల వందలాది మూగజీవాలు కబేళాలకు తరలిపోతున్నాయి. గతంలో దేవనకొండ మండలంలో 40వేలకు పైగా గొర్రెలు, మేకలు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 24 వేలకు పడిపోయినట్లు యజమానులు తెలుపుతున్నారు. గతంలో బంజరు భూములు అధికంగా ఉన్నందున గొర్రెలు, పశువులకు పశుగ్రాసం బాగా ఉండేదన్నారు. ప్రస్తుతం ఆయా గ్రామాలలోని బంజరు భూములను ప్రజలు ఆక్రమించుకోవడమే కాక మైనింగ్ మాఫీయా, యంత్రాల ద్వారా కొండలు గుట్టలను తవ్వి వేయడం వల్ల బీడు భూములు కొరవడ్డాయన్నారు. అంతేగాక ఇటీవల 200 ఎకరాలపైగా పరంబోకు భూముల్లో పవన్ విద్యుత్ తయారు దారులు తీసుకోవడం వల్ల గొర్రెలు, మేకలు మేపుకోవటానికి తీవ్రమైన ఇబ్బందులు నెలకొన్నాయని వాటి యజమానులు తెలుపుతున్నారు. కొండలు గొట్టులు అక్రమాలకు గురి కావడం వల్ల తమకు పశుగ్రాసం కొరత తీవ్రమైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ మూగజీవాలకు పశుగ్రాసంతోపాటు తగిన సౌకర్యలు కల్పించాలన్నారు. కోరుతున్నారు. దేవనకొండ, పశువైద్య కేంద్రానికి ఏడాది నుంచి పశువైద్యాధికారి లేనందున తమ మూగ జీవాలకు వ్యాధులు ప్రబలి మృతి చెందినప్పటికి పట్టించుకునే నాధుడు లేదని విచారం వ్యక్తం చేశారు. వెంటనే పశువైద్యాధికారిని నియమించాలని కోరారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
బండిఆత్మకూరు, మే 13: మండలంలోని ఈర్నపాడు గ్రామానికి చెందిన చాకలి నాగేంద్ర(20) విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్‌ఐ విష్ణు నారాయణ తెలిపారు. శనివారం ఉదయం నాగేంద్ర బట్టలు ఉతికేందుకు వాగు వద్దకు వెళ్లి బట్టలు ఆరేస్తుండగా కరెంటు వైరుకు తగలడంతో చీర తడిగా ఉండడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి నిరసన
మంత్రాలయం, మే 13: పెళ్లి చేసుకుని మోసగించాడని ప్రియుని ఇంటిముందు ఓ ప్రియురాలు రెండురోజులుగా బైటాయించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. బొంబాయికు చెందిన ఆర్తీ శ్రీనివాస్‌తురై మంత్రాలయంలోని రాఘవేంద్ర నగర్‌కు చెందిన ఈరన్నగౌడ్ 5 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, అయితే తల్లిదండ్రులు నిరాకరించి మరొక వ్యక్తితో వివాహం చేసినట్లు సమాచారం. బాధితురాలు ఆర్తీశ్రీనివాస్ తురై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె తల్లి దండ్రులు సుశీలతురై, శ్రీనివాస్‌లు గత అయిదు సంవత్సరాల క్రితం బొంబాయి నుండి బ్రతుకు దెరువుకోసం మంత్రాలయం వచ్చి రాఘవేంద్ర నగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని తాపీ పని చేసుకుంటూ జీవనం సాగించేవరని తెలిపింది. అయితే తల్లి దండ్రులు మంత్రాలయం గ్రామానికి చెందన తెలుగు రాఘన్న కుమారుడు లక్ష్మన్నతో వివాహం జరిపించి మళ్లీ వారు బొంబాయి చేరుకున్నారని అంది. వారికి రెండు సంవత్సరాల వంశీ అనే బాబు ఉన్నాడని తెలిపింది. అదే కాలనీలో ఉంటున్న మల్లన్నగౌడ్ కుమారుడు ఈరన్నగౌడ్ తనను పెళ్లి చేసుకోమని లేకుంటే ఆత్మహత్యకు చేసుకుంటానని వేధించేవాడని, రెండు సార్లు పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పల్పడి నట్లు తెలిపింది. కొద్దిరోజులుగా అనుమానంతో గమనిస్తున్న భర్త లక్ష్మన్న తనకు ఈరన్నగౌడ్‌తో అక్రమ సంబంధం ఉందని పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి విడాకులు ఇవ్వడం జరిగిందని, తాను తల్లిదండ్రులతోపాటు బొంబాయిలో ఉన్నా అక్కడికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని లేకుంటే చస్తానని బెదిరించేవాడని తెలిపింది. రెండు నెలల క్రితం తిరుపతిలో ఈరన్నగౌడ్ వివాహం చేసుకున్నాడని, దాదాపు 20 రోజులు పాటు బెంగళూరులో ఉన్నామని, ఈరన్న తన తల్లిదండ్రులను ఒప్పించి ఇంటికి తీసుకువెళ్తానని నమ్మించి బొంబాయిలో ఉన్న తన తల్లిదండ్రుల దగ్గర వదిలి వెల్లాడని వాపోయింది. ఎన్ని సార్లు పోన్ చేసిన ప్రయోజనలేక పోయిందని, తీరా తాను మోసపోయానని వేదనతో మంత్రాలయం చేరుకుని ఇంటి ముందు బైటాయించానని, న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లనంది.

చాగలమర్రిలో సైకో వీరంగం!
చాగలమర్రి, మే 13: చాగలమర్రిలో శనివారం తెల్లవారుజామున సైకో వీరంగం సృష్టించాడు. కనిపించే వ్యక్తులపై రాళ్లు విసరడం ప్రారంభించారు. పోలీసులు, ప్రజలు అతనిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించగా మురికికాల్వలో దూకాడు. పోలీసులు అతి కష్టంపై అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఒరిస్సాకు చెందిన మతిస్థిమితం లేనివాడిగా గుర్తించారు.