కర్నూల్

భూమాతో అమీ.. తుమీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 30:వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో అమీ తుమీ తేల్చుకోవడానికి మాజీ మంత్రి శిల్పా మోహన రెడ్డి సిద్ధపడ్డారు. భూమా వ్యవహార శైలిపై వరుసగా రెండవ రోజు బుధవారం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలిసి కట్టడి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భూమా నాగిరెడ్డి తనపై కక్ష సాధించేలా వ్యవహరిస్తున్నారని, తనను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు తన వర్గీయుడైన న్యాయవాది తులసిరెడ్డిపై దాడి చేయించారని ఆరోపిస్తున్నారు. తన వర్గీయులను భయబ్రాంతులను చేయడానికి తులసిరెడ్డిపై దాడి జరిగిందని ఆయన అంటున్నారు. ఒకే పార్టీలో ఉంటూ సామరస్యంగా ముందుకు పోవాల్సి ఉండగా తనపై కాలు దువ్వుతున్నారని మండిపడుతున్నారు. భూమా నాగిరెడ్డిపై చర్యలు తీసుకోవాలసి ముఖ్యమంత్రిపై ఆయన ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత 12 ఏళ్లుగా ఇరువర్గాల మధ్య ఉన్న విభేదాలు ఇప్పుడు సమసి పోతాయనుకుంటే భ్రమేనని విశే్లషకులు పేర్కొంటున్నారు. నంద్యాల రాజకీయాలపై ఊహించిన విధంగానే పరిణామాలు సాగుతున్నాయని వెల్లడిస్తున్నారు. కాగా తులసిరెడ్డి దాడి ఘటనలో చంద్రబాబు చర్యలు తీసుకోని పక్షంలో శిల్పా మోహనరెడ్డి పార్టీలో ఉండబోరన్న చర్చ ప్రారంభమైంది. కాగా ఈ ఘటనకు తనకెలాంటి సంబంధం లేదని భూమా నాగిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. న్యాయవాది తులసిరెడ్డికి రాజకీయంగానే కాకుండా ఇతరులతో కూడా శత్రుత్వం ఉందని భూమా పేర్కొంటున్నారు. ఆయన దాడి వెనుక కారణాలేంటో పోలీసు విచారణలో తేలుతుందని అంత వరకూ ఆగకుండా తనపై ఆరోపణలు చేయడం శిల్పా మోహనరెడ్డికి తగదని ఆయనంటున్నారు. నంద్యాలలో రహదారుల విస్తరణకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో తనపై లేనిపోని ఆరోపణలు చేయడం ద్వారా విస్తరణను ఆపేసి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేలా చేయడం కోసమే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను టిడిపిలోకి రావడం ఇష్టం లేకపోవడంతో ప్రతి చిన్న సంఘటనకు తనపై బాధ్యుడనని ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తులసిరెడ్డి వ్యవహారంపైనా విచారణ
నంద్యాలలో దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాది, శిల్పా మోహనరెడ్డి ప్రధాన అనుచరుడు తులసిరెడ్డి వ్యవహార శైలిపైనా విచారణ చేస్తున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలను పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం నుంచి అందిన ఆదేశాలతో పోలీసులు సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాడి ఘటనలో 9 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణ కారణంగానే దాడి జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని వారంటున్నారు. అధికార పార్టీలోనే రాజకీయ దుమారం రేపుతున్న ఈ ఘటనపై పోలీసులు ఆచితూచి అడుగు వేస్తున్నారు.
ఆర్‌యూ పరిధిలోని కళాశాలల్లో బయోమెట్రిక్
* వచ్చే ఏడాది నుంచి రెండు కొత్త కోర్సులు
* మే లో రిసెట్ నోటిఫికేషన్
* ఉప కులపతి నరసింహులు
కర్నూలు అర్బన్, మార్చి 30:రాయలసీమ యూనివర్శిటీ పరిధిలో వచ్చే ఏడాది నుంచి అన్ని కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్ హాజరును అమలుచేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆర్‌యూ ఉప కులపతి నరసింహులు తెలిపారు. వర్శిటీలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం విసి విలేఖరుల సమావేశం మాట్లాడారు. సంస్కరణల్లో భాగంగా విద్యాభివృద్ధి, పనిలో జవాబుదారీతనం కల్పించే ఉద్దేశ్యంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కళాశాలలు ఏప్రిల్ 30వ తేదీలోగా బయోమెట్రిక్‌ను ఏర్పాటు చేసుకోవాలని లేనిపక్షంలో వారికి అఫిలియేషన్‌కు అంతరాయం కలుగుతోందన్నారు. మారుతున్న సాంకేతిక, ఐటి రంగం అవసరాలను దృష్టిలో వుంచుకుని బిగ్ డేటా, అనలైటిక్స్‌కు సంబంధించి ఎంఎస్సీ డేటా సైన్స్‌కోర్సును ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. కోర్సులోని నాల్గవ సెమిస్టర్ పూర్తిగా ప్రాక్టికల్ ఆధారితంగా వుంటుందని విద్యార్థులకు ఇన్‌ట్న్రేషిప్‌కు ఐబిఎం, హెచ్‌సిఎల్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలతో ఒప్పందం చేయనున్నట్లు తెలిపారు. ఇటీవలే లండన్ పర్యటనలో యూకెలోని లండన్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లీయా, యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బర్రోలతో ఆన్‌లైన్‌లో విద్యాబోధన సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యారంగంలో నాణ్యత, నిర్వహణ, నాయకత్వం, సేవ తదితర వాటి దృష్యా ఎంఎ ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సును ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ఆర్థిక స్తోమత కలిగి వుండి ఆసక్తి కలిగిన విద్యార్థులు నాల్గవ సెమిస్టర్‌కు లండన్‌లో ఇన్‌ట్న్రేషిప్ చేసుకునే అవకాశం వుందన్నారు. వీటితో పాటు పరిశోధనలను ప్రోత్సహించే దిశగా ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సును ప్రవేశపెట్టడంతో పాటు బాటనీ, జూవాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీలతో స్కూల్ ఆఫ్ సైన్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నూతన కోర్సుల ప్రవేశాలు ఆర్‌యూ పిజి సెట్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. రిసెట్ నోటిఫికేషన్‌ను మే నెలలో ఇచ్చే ఆస్కారం వుందని, జిల్లాలోని అనుబంధ కళాశాలలో యుజిసి ప్రాజెక్టు చేసి అనుభవం వున్న సీనియర్ అధ్యాపకుల ఆధ్వర్యంలో రీసెర్చ్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యుజిసి ఆదేశాల మేరకు ఆల్ ఇండియా స్టాటస్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ సర్వేలో భాగంగా ఆర్‌యూ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలు తమ కళాశాల విద్యార్థులు, కోర్సులు, ఫీజులు, సిబ్బంది విద్యార్హతలు, వనరులు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో ఏప్రిల్ చివరి నాటికి నమోదు చేయాలన్నారు. ఆర్‌యూ పిజి సెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశామని విద్యార్థులు ఏప్రిల్ 25 తేదీలోగా అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వర్శిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉగాది కానుకగా వారి వేతనాలను 10 శాతం పెంచేందుకు పాలకమండలి ఆమోదం పలకడంతో ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. వీరికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి వేతనాల పెంపు అమలులో వుంటుందన్నారు. మొత్తం మీద నూతన సంస్కరణలు, కోర్సులతో ఆర్‌యూలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ అభివృద్ధికి కృషి చేస్తామని విసి నరసింహులు స్పష్టం చేశారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య బి.అమర్‌నాథ్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ స్టడీస్ డా. రవిశంకర్ పాల్గొన్నారు.
400 చెరువుల్లో పూడికతీత పనులు
* ఈ ఏడాది 4 కోట్ల క్యుబిక్ మీటర్ల తవ్వకం లక్ష్యం
కర్నూలు, మార్చి 30:సకాలంలో వర్షాలు లేకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం జిల్లాలో రూ. 2 కోట్ల నిధులతో చెరువుల పూడికతీత పనులు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 చెరువుల్లో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టారు. కలెక్టర్ విజయమోహన్ గత వారం రోజుల నుండి చెరువుల పూడికతీత పనులు జరిగే ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు తాగునీటి సమస్య రాకుండ ముందు జాగ్రత్త చర్యగా సమస్య ఉన్న గ్రామాల్లో ఆర్‌డబ్ల్యుఎస్‌శాఖ ద్వారా ట్రాక్టర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది 4 కోట్ల క్యూబిక్ మీటర్లు తవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. చెరవుల నుండి ఫీడల్ ఛానల్‌లో ఉన్న పూడికతీత మట్టిని కూడ తొలగిస్తున్నారు. చెరవుల్లో ఒక మీటరు పూడిక మట్టిని తొలగించడంతోపాటు వాగులు, వంకలు వెంట ఉన్న చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో నీటిపారుదల కింద ఉన్న 400 చెరవుల్లో 127 చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించారు. రోజు లక్ష క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తీసే కార్యక్రమంలో భాగంగా మరో వారంలో 4 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించేందుకు తగిన యంత్రాలు ఏర్పాటు చేసుకుని వచ్చే 100 రోజుల్లో 4 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. గత సంతవ్సరం 54 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వారు. ఈ ఏడాది 4 కోట్ల క్యూబిక్ మీటర్లు తవ్వంచి దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేసి నీటి ఎద్దడిని తీర్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అదే విధంగా పశువులకు సిమెంటు తొట్టెలు ఏర్పాటు చేసి పశువులకు నీటి దాహార్తిని తీరుస్తున్నారు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండ అధికారులు ముందస్తూ యుద్దప్రతిపాదికన చర్యలు చేపట్టారు.
సీమకు అన్యాయం జరిగితే
సహించేది లేదు
* ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
గడివేముల, మార్చి 30: రాయలసీమకు అన్యాయం జరిగితే సహించేది లేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొరటమద్ది గ్రామంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ సిఎం చంద్రబాబు నాయుడు కల్లబొల్లి మాటలు చెప్పి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమలో ఎన్నో జలవనరులు ఉన్నా 365 రోజు కు కోస్తాకు నీరు అందిచేందుకు సిఎం కృషి చేస్తున్నారన్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాయలసీమలో తాను చేపట్టిన బస్సు యాత్రను ఆలూరు మండలం మూసానిపల్లె గ్రామంలో మొదలు పెట్టి నేటికి 44 రోజులు పూరె్తైందన్నారు. కర్నూలు పార్లమెంటును పూర్తి చేసుకొని నం ద్యాల పార్లమెంటులో నాలుగు రోజుల నుంచి బస్సు యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సు యాత్రకు బడుగు, బలహీన వర్గాలు, రైతులు, యువత నుంచి మంచి స్పందన లభిస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు బస్సుయాత్రను భగ్నం చేసేందుకు ప్రజలను మరోవైపు దారిమల్లించుటకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం శివరామ కృష్ణ కమిటీ నివేదికను చదువకుండ చెత్తబుట్ట దాఖలు చేసిందని ఆరోపించారు. రాజధానిపై రాయలసీమ వాసులకు ఇష్టం లేకున్నా సిఎం తన ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేస్తున్నారన్నారు. రాయలసీమకు నిఖర జలాలు ఎన్ని ఇస్తారని ప్రశ్నించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండ పనులన్ని పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారన్నారు. సీమ గురించి పట్టించుకోకపోతే మున్ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసైనా సీమ హక్కులను కాపాడుకొని రాయలసీమను రతనాల సీమగా మార్చాలని ప్రజలకు హితవు పలికారు. మండలంలోని దుర్వేశి, కరిమద్దెల, పెసరవాయి గ్రామాల్లో బస్సు యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబుల్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహానందీశ్వరుడి
హుండీ ఆదాయం రూ. 22 లక్షలు
మహానంది, మార్చి 30: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు రూ. 22,00,369 వచ్చినట్లు ఇఓ డాక్టర్ శంకరవరప్రసాద్ తెలిపారు. భక్తులు మహానందీశ్వరుడికి 26 రోజుల్లో సమర్పించిన కానుకలను బుధవారం అభిషేక మండపంలో ఇఓ పర్యవేక్షణలో లెక్కించారు. అందులో ఆలయంలోని హుండీల ద్వారా రూ. 21,95,523, అన్నదానం హుండీ ద్వారా రూ. 4,846 వచ్చినట్లు ఇఓ తెలిపారు. కార్యక్రమంలో గ్రూప్ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ హనుమంతప్ప, రమేష్, ఏఇఓ మధు, పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, ఈశ్వర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు, ఇన్‌స్పెక్టర్ నాగమల్లయ్య, నాగభూషణం, శశిధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
హుండీలో రూ. 500 దొంగనోటు
మహానంది పుణ్యక్షేత్రంలోని హుండీలో రూ. 500 దొంగనోటు వచ్చినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. హుండీలలోవేసిన దొంగ నోటును బట్టి చూస్తే మహానంది పరిసర ప్రాంతాల్లో దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు ప్రజలు తెలిపారు.
పూడికతీత పనులు
వేగవంతం చేయాలి
* కలెక్టర్ విజయమోహన్
జూపాడుబంగ్లా, మార్చి 30:చెరువుల్లో పూడికతతీత పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయమోహన్ మండల అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని పారుమంచాల చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నీరు చెట్టు పథకం కింద జిల్లాలో 400 చెరువుల్లో పూడిక తీత పనులకు రూ.200 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. అలాగే రోజు కు 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. వంద రోజుల పాటు చేపట్టి 4కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించ నున్నట్లు తెలిపారు. ప్రధానంగా పంట కాల్వల్లో పూడిక తీత, చెరువుల్లో పూడిక తీత, వాగుల్లో జంగిల్ క్లియరెన్స్, చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో తాగు నీటి సమస్య పరిష్కారానికి రూ.67 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే మండలాల్లో 14వ ఆర్థిక సంఘం నిధులతో, మండల అభివృద్ధి నిధులను వాడుకుని తాగునీటి సమస్య పరిష్కారం కోసం వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసరావ్, ఈఈ శ్రీనివాసులు, డిఈ రవికుమార్, ఆర్‌డబ్యుఎస్ డిఈ రమేష్‌రెడ్డి, తహసీల్దార్ జాకీర్‌ఉసేన్, ఎంపిడిఓ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
5 నుంచి కర్నూలులో
పాస్‌పోర్టు క్యాంపు
కర్నూలు అర్బన్, మార్చి 30: సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా ప్రజలకు ఏప్రిల్ 5, 6 తేదీల్లో పాస్‌పోర్టు సేవా క్యాంపును నిర్వహిస్తున్నట్లు డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్ తెలిపారు. ఆసక్తి గల వారు పాస్‌పోర్టు వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 2, 3 తేదీల్లో ఆన్‌లైన్‌లో తమ స్లాట్‌ను బుక్ చేసుకోవాలని రోజుకు 200 చొప్పున దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవా క్యాంపులో వాక్‌ఇన్, హోల్డ్, పిపిసి, తత్కాల్ సేవలు నిర్వహిస్తారన్నారు.
ఎలుగుబంటి మృతి..
చాగలమర్రి, మార్చి 30: మంలడలోని చిన్నవంగలి గ్రామం వద్ద ఎండిపోయిన చెరువులో చనిపోయిన ఎలుగుబంటిన అటవీశాఖాధికారులు బుధవారం గుర్తించారు. ఈ ఎలుగుబంటి సుమారు 10 రోజుల క్రితం చనిపోయి ఉంటుందని అటవీ అధికారిణి విజయలక్ష్మి తెలిపారు. సబ్ డిఎఫ్‌ఓ ఆశాకిరణ్, రుద్రవరం రేంజర్ రామ్‌సింగ్‌లు చనిపోయిన ఎలుగుబంటిని పరిశీలించి శవపరీక్ష జరిపించారు.

పన్నులు చెల్లించాల్సిందే..
* చెల్లించని దుకాణాల సీజ్.. * మున్సిపల్ అధికారులు..
నందికొట్కూరు, మార్చి 30:మున్సిపాలిటీ పరిధిలో వున్న నివాస, వ్యాపార సముదాయాలకు సంబంధించి తప్పనిసరిగా పన్నులు చెల్లించాల్సిందేనని మున్సిపల్ కమిషనర్ లక్ష్మినారాయణరెడ్డి తెలిపారు. గృహాలకు సంబంధించి ప్రజలు పన్నులు బాగానే చెల్లిస్తున్నప్పటికీ ప్రధాన రహదారి వెంట వున్న దుకాణాదారులు పన్ను చెల్లింపులో జాప్యం చేస్తుండడంతో మున్సిపల్ అధికారులు తమదైనశైలిలో పన్ను వసూలు కార్యక్రమం చేపట్టారు. మున్సిపాలిటీలో పని చేసే ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు మూకుమ్మడిగా పన్నులు చెల్లించని దుకాణాల వద్దకు వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారు. అప్పటికి కూడా పన్ను చెల్లించకపోతే ఆ దుకాణాలను నిబంధనల ప్రకారం సీజ్ చేస్తున్నారు. పట్టణాభివృద్ధి కోసం తాము మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం పెంచిన పన్నులను దాదాపు అధిక శాతం మంది ప్రజలు ఆమోదం తెలిపి పన్నులు కడుతుండగా కొందరు మాత్రమే మొండికేస్తున్నారన్నారు. దుకాణాలను సీజ్ చేయాలనేది తమ ఉద్ధేశం కాదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పన్ను చెల్లించని దుకాణాలను సీజ్ చేయాల్సి వచ్చిందన్నారు. దుకాణాల సీజ్ నచ్చని కొందరు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా తమపని తాము చేసుకుంటూ వెళ్తామన్నారు. బుధవారం పట్టణంలోని కొత్తబస్టాండ్ ప్రాంతం లో ఒక దుకాణా సముదాయం వారు దుకాణాన్ని సీజ్ చేసే సమయంలో తమకు సహకరించకపోవడంతో పోలీసుల సహాయంతో దుకాణాన్ని సీజ్ చేశామన్నారు. పన్ను చెల్లింపులో జాప్యం చేస్తే వారికి మరింత అపరాధ రుసుం పడుతుందన్నారు. తాము దుకాణాలు సీజ్ చేసే పరిస్థితులు తేకుండా ఇప్పటికైనా వ్యాపారులు ముందుకు వచ్చి పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ లక్ష్మినారాయణరెడ్డి కోరారు. కార్యక్రమంలో డిఇ నాగభూషణంరెడ్డి, ఆర్‌ఓ శివప్రసాద్, శానిటరీ ఇన్స్‌స్పెక్టర్ ప్రహ్లాద, టౌన్‌ప్లానింగ్ అధికారి శాస్ర్తీతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
వెలుగోడు రిజర్వాయర్‌లో
పూర్తిస్థాయిలో నీటి నిల్వ
* ఎమ్మెల్సీ శిల్పా
కర్నూలు సిటీ, మార్చి 30:వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వెలుగోడు బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్, సిద్దాపురం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల గురించి శాసన మండలిలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావును ప్రశ్నించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్ వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 16టియంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారని, అయితే ప్రస్తుతం ఆ రిజర్వాయర్‌లో కేవలం 13 టియంసీల నీటిని మాత్ర మే నిల్వ ఉంచుతారన్నారు. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం రిజర్వాయర్ కట్ట పెంచితే 16.90టియంసీల నీటిని నిల్వ చేస్తే రాయలసీమలో వెనకబడిన రైతాంగాన్ని ఆదుకునేందుకు వీలుంటుందని మంత్రికి వివరించగా అందుకు నీటి పారుదల శాఖ మంత్రి స్పందిస్తూ వాటి నిర్మాణం కోసం రూ.21కోట్లతో పనులు చేపట్టి త్వరిత గతిన పూర్తి చేయనున్నామన్నారు. అలాగే సిద్దాపురం ఎత్తిపోతల పథకం, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి 2టియంసీల నీటిని ప్రతి రోజు 200 క్యూసెక్కుల చొప్పున 4నెలల పాటు సిద్దాపురం చెరువును (0.645 టిఎంసి) మూడు పిల్లింగ్‌లతో నింపితే ఆత్మకూర్ మండలంలో దాదాపు 12 గ్రామాలకు 21,300 ఎకరాలకు నీరందించేందుకు వీలుంటుందన్నారు. వీటి నిర్మాణం కోసం రూ.25కోట్లను కేటాయించాలని తెలిపారు. రాబోయే రబీ సీజన్‌కు నీరు అందివ్వటమే లక్ష్యంగా పెట్టకుని పని చేస్తున్నట్లు ఆయన వివరించారు.
11 నుంచి చౌడేశ్వరీమాత తిరుణాల
బనగానపల్లె, మార్చి 30:బనగానపల్లె మండలంలోని నందవరం శ్రీ చౌడేశ్వరీమాత తిరుణాల మహోత్సవాలు ఏప్రిల్ 8 నుండి ప్రారంభమవుతాయని అమ్మవారి జ్యోతి మహోత్సవం 11వ తేదీ జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి విఎల్‌ఎన్ రామానుజన్ బుధవారం విలేఖరులకు తెలిపారు. 8వ తేదీ ఉగాది రోజు ఉదయం అంకురార్పణ, పంచాంగ శ్రవణం, సాయంకాలం పనే్నరపుబండ్లు రైతు సంఘం వారు ఆలయం చుట్టూ తిప్పడం తదితర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 9న ఉదయం అమ్మవారికి వివిధ అర్చనలు, అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. రాత్రి 8 గంటల నుండి శ్రీ చెన్నకేశ్వస్వామి వారికి అక్షతారోపణ, రాత్రి 10 గంటలకు శ్రీదేవి, భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవస్వామివారికి కల్యాణోత్సవం కన్నుల పండువుగా జరుగుతుందని తెలిపారు. అదేరోజు రాత్రి 10 గంటలకు ఆర్కెస్ట్రా కార్యక్రమం వుంటుందన్నారు. 10అమ్మవారికి ఉదయం కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు జరగుతాయన్నారు. సాయంత్రం 4 గంటలకు అమ్మవారి రాయభార మహోత్సవం జరుగుతుందని తెలిపారు. రాత్రికి రాయలసీమ ప్రముఖ కళాకారులచే చింతామణి నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. 11వ తేదీ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం జ్యోతి మహోత్సవం తెల్లవారుజామున జరుగుతుందని తెలిపారు. 11వ తేదీ సోమవారం ఉదయం తోగటవీట క్షత్రీయ సంఘం వారు అమ్మవారికి పసుపు-కుంకుమలు-పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. తెల్లవారుజామున విశ్వబ్రాహ్మణ భాస్కరయ్య ఆచారి ఆధ్వర్యంలో అమ్మవారికి దృష్టి చుక్క పెట్టడంతో జ్యోతి మహోత్సవ ఘట్టం మొదలవుతుందని తెలిపారు. 12 అమ్మవారి రథోత్సవం ముందుకు పోవడం, 13న రథాన్ని వెనుకకు లాగడం చేస్తారని ఇఓ తెలిపారు.