క్రీడాభూమి

‘కోట్లా’టలోనూ.. ఉడుంపట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టుల్లో రహానే తొలి శతకం
సఫారీల వెన్ను విరిచిన జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో 121కే ఆలౌట్
213 పరుగుల ఆధిక్యతలో టీమిండియా
ఫాలో-ఆన్ ఆడించరాదని కోహ్లీసేన నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దక్షిణాఫ్రికాతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత జట్టు ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్టులోనూ పూర్తిగా పట్టు బిగించింది. యువ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే చక్కగా రాణించి టెస్టుల్లో తొలి శతకాన్ని నమోదు చేయడం, ఆ తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేడా అద్భుత బౌలింగ్‌లో విజృంభించి ఐదు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించడంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 213 పరుగుల ఆధిక్యత సాధించింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జడేజా కేవలం 30 పరుగులకే 5 వికెట్లు సాధించి పర్యాటక జట్టు వెన్ను విరగ్గొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలు 121 పరుగులకే కుదేలయ్యారు. కనీసం పూర్తిగా రెండు సెషన్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయిన సఫారీలు ఫాలో-ఆన్ గండం నుంచి గట్టెక్కేందుకు 14 పరుగులు వెనుకబడ్డారు. అయితే దక్షిణాఫ్రికాతో ఫాలో-ఆన్ ఇన్నింగ్స్ ఆడించరాదని టీమిండియా నిర్ణయించింది.
అంతకుముందు 7 వికెట్ల నష్టానికి 231 పరుగుల స్కోరుతో శుక్రవారం రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్ క్రీజ్‌లో నిలదొక్కుకుని ఎంతో బాధ్యతాయుతంగా ఆడారు. తొలి రోజు కోహ్లీ (44) మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లంతా విఫలమైనప్పటికీ ఒంటరి పోరాటం సాగించిన రహానేకి అశ్విన్ చక్కటి సహకారాన్ని అందించాడు. దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్న రహానే 180 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు ఎనిమిదో వికెట్‌కు 98 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. మొత్తం మీద 215 బంతుల్లో నాలుగు సిక్సర్లు, మరో 11 ఫోర్ల సహాయంతో 127 పరుగులు సాధించిన రహానే 105వ ఓవర్‌లో ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతిని ఎదుర్కోబోయి డివిలియర్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అశ్విన్ (56), ఇశాంత్ శర్మ (0) కైల్ అబ్బాట్ బౌలింగ్‌లో నిష్క్రమించగా, ఉమేష్ యాదవ్ (10) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కైల్ అబ్బాట్ 5 వికెట్లు, డేన్ పిడిట్ 4 వికెట్లు సాధించగా, ఇమ్రాన్ తాహిర్ ఒక వికెట్ రాబట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు భారత బౌలర్లను ఎదుర్కోవడంలో మరోసారి ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (17)ను పెవిలియన్‌కు చేర్చి సఫారీలను ఉమేష్ యాదవ్ తొలి దెబ్బ తీయగా, ఆ తర్వాత జడేజా విజృంభణకు తట్టుకోలేక తెంబా బవుమా (22), కెప్టెన్ హషీమ్ ఆమ్లా (3), ఫఫ్ డుప్లెసిస్ (0) వరుసగా పెవిలియన్‌కు పరుగు తీయగా, జెపి.డుమినీ (1) ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ తరుణంలో సీనియర్ బ్యాట్స్‌మన్ ఎబి.డివిలియర్స్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ మిగిలిన బ్యాట్స్‌మన్లు ఎవరూ అతనికి సహకరించలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి కీపర్ డేన్ విలాస్ (11), కైల్ అబ్బాట్ (4), డేన్ పిడిట్ (5), డివిలియర్స్ (42), ఇమ్రాన్ తాహిర్ (1) ఒకరి తర్వాత మరొకరు చొప్పున పెవిలియన్‌కు చేరగా, మోర్న్ మోర్కెల్ (9) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 49.3 ఓవర్లలో కేవలం 121 పరుగులకే ఆలౌటైన దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కంటే 213 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు కైవసం చేసుకోగా, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్ రెండేసి వికెట్లు, ఇశాంత్ శర్మ ఒక వికెట్ చొప్పున అందుకున్నారు. (చిత్రం) ఎనిమిదో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన రహానే (127), అశ్విన్ (56)

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) ఆమ్లా (బి) యాదవ్ 12, శిఖర్ ధావన్ ఎల్బీడబ్ల్యు (బి) పిడిట్ 33, చటేశ్వర్ పుజారా (బి) అబ్బాట్ 14, విరాట్ కోహ్లీ (సి) విలాస్ (బి) పిడిట్ 44, అజింక్యా రహానే (సి) డివిలియర్స్ (బి) ఇమ్రాన్ తాహిర్ 127, రోహిత్ శర్మ (సి) ఇమ్రాన్ తాహిర్ (బి) పిడిట్ 1, వృద్ధిమాన్ సాహా (బి) అబ్బాట్ 1, రవీంద్ర జడేజా (సి) ఎల్గర్ (బి) అబ్బాట్ 24, రవిచంద్రన్ అశ్విన్ (సి) డివిలియర్స్ (బి) అబ్బాట్ 56, ఉమేష్ యాదవ్ నాటౌట్ 10, ఇశాంత్ శర్మ ఎల్బీడబ్ల్యు (బి) అబ్బాట్ 0, ఎక్స్‌ట్రాలు: (బైస్ 8, వైడ్ 1, నోబాల్స్ 3) 12, మొత్తం: (117.5 ఓవర్లలో) 334 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-30, 2-62, 3-66, 4-136, 5-138, 6-139, 7-198, 8-296, 9-334, 10-334.
బౌలింగ్: మోర్న్ మోర్కెల్ 24-5-58-0, కైల్ అబ్బాట్ 24.5-7-40-5, డేన్ పిడిట్ 38-6-117-4, ఇమ్రాన్ తాహిర్ 16-2-66-1, డీన్ ఎల్గర్ 11-0-33-0, జెపి.డుమినీ 4-0-12-0.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: డీన్ ఎల్గర్ (సి) సాహా (బి) యాదవ్ 17, తెంబా బవుమా (బి) జడేజా 22, హషీమ్ ఆమ్లా (సి) సాహా (బి) జడేజా 3, ఎబి.డివిలియర్స్ (సి) ఇశాంత్ (బి) జడేజా 42, ఫఫ్ డుప్లెసిస్ (సి) రహానే (బి) జడేజా 0, జెపి.డుమినీ (బి) యాదవ్ 1, డేన్ విలాస్ (బి) ఇశాంత్ 11, కైల్ అబ్బాట్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 4, డేన్ పిడిట్ (సి) రహానే (బి) జడేజా 5, మోర్న్ మోర్కెల్ నాటౌట్ 9, ఇమ్రాన్ తాహిర్ (సి) కెఎల్.రాహుల్ (బి) అశ్విన్ 1, ఎక్స్‌ట్రాలు: (బైస్ 5, నోబాల్ 1) 6, మొత్తం: (49.3 ఓవర్లలో) 121 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-36, 2-40, 3-56, 4-62, 5-65, 6-79, 7-84, 8-103, 9-118, 10-121.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 12-5-28-1, ఉమేష్ యాదవ్ 12-3-32-2, రవిచంద్రన్ అశ్విన్ 13.3-5-26-2, రవీంద్ర జడేజా 12-2-30-5.