కృష్ణ

జిల్లాలో నీటి సంరక్షణకు నిర్మాణాలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 8: జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండల తహశీల్దార్లు, ఎంపిడిఓలు, వివిధ శాఖల అధికారులతో సోమవారం నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న వర్షాకాలం నాటికి ఇప్పటి నుండే నీటి సంరక్షణ, నీటి నిల్వ నిర్మాణాలలో భాగంగా నీరు - చెట్టు కార్యక్రమాల్లో చేపట్టే పనులు, నీటి కుంట, చెరువుల్లో పూడికతీత, చెక్ డ్యాంలు, ఫారమ్ ఫాండ్స్, ఊటకుంటల మరమ్మతులు వంటి పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. నీరు - చెట్టు కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జన్మభూమి కమిటీ సభ్యులు, సాగునీటి సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, వర్ష పాతం తక్కువ నమోదు అయ్యే ప్రాంతాలలో నీటి నిల్వ, సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత మండల తహశీల్దార్లు, ఎంపిడిఓలను మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున ప్రజలను, ప్రజా ప్రతినిధులు భాగస్వాములను చేసినప్పుడే అనుకున్న సత్ఫలితాలు సాధించవచ్చునని మంత్రి సూచించారు. పట్టిసీమ, పోలవరం కుడి ప్రధాన కాలువ నిర్మాణ పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వారా ప్రశంసలు అందుకున్న జిల్లా అధికారులు రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణకు చేపట్టే పనులను సమన్వయంతో చేపట్టాలని మంత్రి కోరారు. జిల్లా, మండల స్థాయిలో చేపట్టవలసిన ప్రధాన పనులను వర్కుషాప్ నిర్వహించి అధికారులకు బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టాలని మంత్రి జిల్లా కలెక్టర్ బాబు ఎను కోరారు. జిల్లా స్థాయిలో చేపట్టవలసిన ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ పెండింగ్ రహదారి నిర్మాణాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకనూ చేపట్టవలసిన పనులు ఆరు మాసాల్లో ప్రణాళికబద్ధంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఎంపిడిఓలు తహశీల్దార్లు రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నామనే భావన, అదృష్టంతో పనులు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అప్ ల్యాండ్ మండలాలైన రెడ్డిగూడెం, చాట్రాయి, జగ్గయ్యపేట, కంచికచర్ల, ఎ కొండూరు, తదితర మండలాల్లో ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టి ప్రతి కూలీకి పని కల్పించాలని మంత్రి దేవినేని సంబంధిత మండల అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రితోపాటు సబ్ కలెక్టర్ డా జి సృజన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రోజుకు లక్షమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 8: ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న నేపథ్యంలో జిల్లాలో రానున్న పది రోజుల్లో రోజుకు లక్ష మంది పైగా ఉపాధి హామీ పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి జిల్లాలోని ఎంపిడివోలు, తహశీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 23వేల మంది కూలీలు పనులు చేస్తున్నారని రానున్న నాలుగు రోజుల్లో ఈ సంఖ్యను 65 వేలకు తీసుకువెళ్ళాలని ఆదేశించారు. ఈ విషయమై ఎంపిడివోలు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్నారు. గ్రామాల్లో పంట సంజీవని, ఎన్టీఆర్ జలసిరి, నీరు-చెట్టు కింద పనులు కల్పించటంతో పాటు మెటీరియల్ పేమెంట్ పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో ఖాళీగా ఉన్న పోస్టులను మండల స్థాయి కమిటీలు నియమించుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని చోట్ల సీనియర్ మేట్స్‌ను నియమించుకోవాలని లేని పక్షంలో కొత్త వారిని నియమించుకోవాలని ఎంపిడివోలకు సూచించారు. గృహ నిర్మాణ రంగంలో అర్బన్‌లో 15వేలు, రూరల్‌లో 15వేల 500 గృహాలు జిల్లాకు మంజూరయ్యాయని తెలిపారు. వీటి నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖాధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు సమన్వయంగా వ్యవహరించి లబ్ధిదారుల ఎంపికతో పాటు భూసేకరణ విషయాల్లో లోటుపాట్లు లేకుండా వ్యవహరించాలన్నారు. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడలో లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న జాప్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి మాసాంతానికి గ్రామాల్లో 300కిలో మీటర్ల మేర సిసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు. 2016-17 సంవత్సరానికి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విద్యా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి కిలో మీటరు పరిధిలో ఒక ప్రాధమిక పాఠశాల, మూడు కిలో మీటర్ల పరిధిలో యుపి పాఠశాల ఉండాలన్నారు. నూరు శాతం ఎన్‌రోల్‌మెంట్ ఉండాలని, డ్రాపౌట్స్ లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ రంగయ్య, డిపిఓ రత్నాకర బాబు, జడ్‌పి సిఇఓ నాగార్జున సాగర్, హౌసింగ్ పిడి శరత్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు
ఉపకారవేతనాలు ఇవ్వాలి
* కలెక్టరేట్ ఎదుట ధర్నాలో డిమాండ్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 8: భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టం-1996 ప్రకారం భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, పనిముట్లు కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించాలని, గృహ నిర్మాణాలకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు కెవి గోపాలరావు డిమాండ్ చేశారు. పలు డిమాండ్ల సాధనకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు రూ.2వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుని భార్యకు వితంతు పెన్షన్, ప్రమాదాల్లో గాయపడి వికలాంగుడైన కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. ఇసుక విధానంలో పలు మార్పులు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్యూబిక్ మీటరును రూ.100లకు విక్రయించాలన్నారు. అలాగే అన్ని ఇసుక రీచ్‌లను ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. కార్మికుల పిల్లల చదువులకు సంవత్సరానికి రూ.20వేలు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కలెక్టర్ బాబు.ఎను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పి నరసింహారావు, సిఐటియు నాయకుడు బూర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.