కృష్ణ

విఎంసి ఉద్యోగి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 25: జాతీయ రహదారి మైనేని జంక్షన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి ఓ మున్సిపల్ ఉద్యోగిపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో అతను దుర్మరణం పాలవ్వగా.. ట్రాక్టర్, ఆర్టీసి బస్సు ధ్వంసమయ్యాయి. సంచలనం రేపిన ఈఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వన్‌టౌన్ వించిపేటకు చెందిన మట్టా రవీంద్రనాధ్ ఠాగూర్ నగర పాలక సంస్థలో కాంట్రాక్టు మేస్ర్తిగా పని చేస్తున్నాడు. రాత్రి వేళ డ్వాక్రా సిబ్బందితో రహదారులు క్లీనింగ్ చేయిస్తుంటాడు. ఉదయం వరకు విధులు నిర్వహించడం పరిపాటి. క్లీనింగ్ సిబ్బందిపై సూపర్‌వైజర్‌గా వ్యవహరించే రవీంద్రనాధ్ ఠాగూర్ ఎప్పటిలాగే.. మంగళవారం రాత్రి విధులకు హాజరయ్యాడు. ఎన్టీఆర్ సర్కిల్ వైపు నుంచి నిర్మలా కానె్వంట్ రోడ్డులో పనులు చేయిస్తూ బుధవారం ఉదయం మైనేని సిగ్నల్ జంక్షన్ వద్ద పనులు ముగించారు. ఠాగూర్ మోటారు సైకిల్‌పై నిర్మలా వైపు నుంచి మైనేని వైపు జాతీయ రహదారి దాటుతుండగా ఇదే సమయంలో బెంజిసర్కిల్ వైపు నుంచి రామవరప్పాడు రింగ్ వైపు వస్తున్న ఓ లారీ వేగంగా దూసుకువచ్చింది. ఇక్కడకు వచ్చేసరికి అదుపు తప్పి ఠాగూర్ బైక్‌ను ఢీకొట్టి అతని మీదుగా వెళ్లిపోయింది. ఈఘటనలో మేస్ర్తి లారీ టైర్ల కింద పడి నుజ్జుయి దుర్మరణం పాలయ్యాడు. అంతటితో ఆగని లారీ వేగం నియంత్రించుకోలేక అటుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో అదుపు తప్పి ట్రాక్టర్ అప్పుడు అటుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. ఈఘటనలో ట్రాక్టర్, ఆర్టీసి బస్సు దెబ్బ తిన్నాయి. కాగా ఈఘటన ఉదయమే మైనేని జంక్షన్‌లో కలకలం రేపింది. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు సంఘటనాస్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నాగేశ్వరరావు హత్య దారుణం
* స.హ. చట్టం కమిషనర్ తాంతియాకుమారి
తిరువూరు, మే 25: సమాచార హక్కు చట్టం కార్యకర్తగా అవినీతి కార్యక్రమాలను వెలికితీస్తున్న అక్కపాలెంకు చెందిన దోమతోటి నాగేశ్వరరావు హత్య దారుణమని సమాచారహక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ లాం తాంతియాకుమారి అన్నారు. బుధవారం ఆమె స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేఖరులతో మాట్లాడుతూ స.హ చట్టం ద్వారా అవినీతి అక్రమాలను వెలికితీసే క్రమంలో ప్రాణాలు కొల్పోయిన నాగేశ్వరరావు హత్య కేసులో ముద్దాయిలు ఎంతటి వారైనా ఇదే చట్టం ద్వారా దోషులను గుర్తించి ఈ చట్టం ద్వారానే వారిని శిక్షించేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు. నాగేశ్వరరావు కుటుంబానికి అన్ని విధాలుగా అండంగా నిలుస్తానన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హత్య రాజకీయాలకు తావులేదన్నారు. గ్రామంలో అవినీతిని వెలికితీస్తున్నాడని, చెరువుల ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నించడం స.హచట్టం ద్వారా కొందరి అవినీతిని వెలికితీస్తున్నందునే పథకం ప్రకారం నాగేశ్వరరావును హత్య చేయించారని, కాంగ్రెస్ పార్టీ, దళిత సంఘాల నాయకులు ఆమెకు వివరించారు. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. అక్కపాలెంలో చెరువుల ఆక్రమణల తొలగింపుకు వెంటనే సర్వే కొనసాగించాలని తాంతియాకుమారి తహశీల్దార్ బాలకృష్ణారెడ్డిని ఆదేశించారు. తనకు ప్రాణహానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి వారు పట్టించుకోనందునే ఈ దారుణం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, మాజీ ఉపముఖ్యమంత్రి కోనేరు రంగారావుతో పాటు తనకు సన్నిహితుడు, సోదర సమానుడైన నాగేశ్వరరావు హత్య తనకు తీరని లోటని, ఈ ఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. అక్కపాలెం వెళ్ళి నాగేశ్వరరావు భార్య అక్కపాలెం సర్పంచ్ దోమతోటి వెంకటరమణ, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి తగు రీతిలో ఆదుకుంటానని చెప్పారు. మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు, టి పూర్ణచంద్రరావు, దళిత సంఘాలు, కాంగ్రెస్ నాయకులు బుడుపుల రాము, చాపలమడుగు కనకరాజు, మరకాల ఆనందరావు, మోదుగు నాని, పెండెం శ్రీనివాసమల్లయ్య, యు లక్ష్మిదాసు, చింతలవెంకటరెడ్డి, ఊయ్యూరు అనసూయ, మోదుగు నాని, తదితరులు పాల్గొన్నారు.

ప్రజల గుండె సవ్వడే ప్రజానాట్య మండలి
కూచిపూడి, మే 25: ప్రజల గుండె సవ్వడి నుండి ఆవిర్భవించిందే ప్రజానాట్య మండలి అని మండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఉత్తేజపర్చాయి. ప్రజానాట్య మండలి 72వ వార్షికోత్సవాన్ని బుధవారం మొవ్వ మండలం పెదపూడి గ్రామంలోని కాంచనరావు భవనంలో ఘనంగా నిర్వహించారు. ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు చిత్రపటానికి కళాకారులు పూలమాలలు వేసి లాల్ సలామ్ చేశారు. ఈసందర్భంగా మండలి దివి ఏరియా కార్యదర్శి అడ్డాడ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ, అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్, సీనియర్ నాయకులు అడ్డాడ నాగేశ్వరరావులను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి చంద్రానాయక్, సిపిఎం మొవ్వ మండల కార్యదర్శి దగాని సంగీతరావు, శివనాగలక్ష్మి, నందం గంటయ్య, కోదాటి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది
అభివృద్ధి సంఘానికి సహకరించాలి
అవనిగడ్డ, మే 25: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని సిబ్బంది అభివృద్ధి సలహా సంఘానికి సహకరిస్తే వైద్యశాలలను మరింత అభివృద్ధి చేయవచ్చని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుద్ధప్రసాద్ షష్ఠిపూర్తి వేడుకలను పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు రూ.34వేల విలువైన వాటర్ కూలర్‌ను విజయకృష్ణ గ్యాస్ ఏజెన్సీ వారు బహూకరించగా బుద్ధప్రసాద్ ప్రారంభించారు. అలాగే గాంధీజీ చిత్రపటాన్ని కూడా ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి నిజాయతీతో పనిచేసే సలహా సంఘ సభ్యులు ప్రస్తుతం ఉన్నారని, వారికి ఎలాంటి ఆశలు లేవని, కేవలం వైద్యశాల అభివృద్ధికే వారు పనిచేస్తారన్నారు. అలాంటి వారికి సహకరించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ఎలాంటి అక్రమాలు, ఫిర్యాదులకు తావులేని విధంగా సిబ్బంది వ్యవహరించాలన్నారు. అంతకుముందు వైద్యశాలలో బ్లడ్ బ్యాంక్‌లో ఉన్న లోపాలను సరిచేసుకోవాలని, పేదలకు రక్తం ఉచితంగా అందేలా సహకరించాలన్నారు. ఈసందర్భంగా వైద్యశాల సిబ్బంది ఏర్పాటు చేసిన కేక్‌ను కూడా ఆయన కట్ చేశారు. అనంతరం వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు బుద్ధప్రసాద్‌ను సన్మానించారు.
కార్యక్రమంలో మత్తి శ్రీనివాసరావు, జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, డా. నారాయణ, లక్ష్మీ అన్నపూర్ణ, జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

వడదెబ్బకు ఇద్దరి మృతి
నాగాయలంక/ చల్లపల్లి, మే 25: నాగాయ లంక, చల్లపల్లి మండలం రామానగరంలో బుధవారం వీచిన వడగాడ్పులకు ఇద్దరు మృతి చెందారు. నాగాయలంక సాలిపేట వీధికి చెందిన గోరెంట్ల వెంకటేశ్వరరావు(61) మంగళవారం కూలి పనులకు వెళ్లగా తీవ్రమైన వడదెబ్బకు గురయ్యాడు. గుండెలో నొప్పిగా ఉందంటూ మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందాడు. వెంకటేశ్వరరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై బుధవారం నాగాయలంక పోలీసులకు సమాచారం అందింది. కాగా, చల్లపల్లి మండల పరిధిలోని రామానగరానికి చెందిన జాలాది సత్యనారాయణ(60) బుధవారం మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం వడదెబ్బకు గురికాగా ఆసుపత్రిలో చికిత్స పొందు తూ రాత్రి మృతి చెందాడు. సమాచారాన్ని అధికారులకు తెలియజేయగా వివరాలు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
శతాధిక వృద్ధురాలి మృతి
చల్లపల్లి, మే 25: స్థానిక పడవమర వీధికి చెందిన శతాధిక వృద్ధురాలు మీసాల నాంచారమ్మ(106) బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. తన పనులు తానే స్వయంగా చేసుకుంటున్న నాంచారమ్మ కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురై ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఉత్సాహంగా ఎడ్ల
బండలాగుడు పోటీలు
నందిగామ, మే 25: మండలంలోని లింగాలపాడు శ్రీలక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి పశుప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి పోటీలను జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం (నానయ్య)లు ప్రారంభించారు. ఫ్లడ్ లైట్ కాంతుల్లో ఉత్సాహభరితంగా సాగిన ఎడ్ల బండలాగుడు ప్రదర్శన పోటీలను వేలాది మంది రైతులు తిలకించారు. కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్, గరికపాటి భాస్కరంలకు నిర్వహణ కమిటీ ప్రతినిధులు జ్ఞాపికలను అందజేశారు. బుధవారం ఉదయం వివిధ విభాగాల్లో బండలాగుడు పోటీలు ఆసక్తిగా జరిగాయి. విజేతలకు నిర్వహణ కమిటీ ప్రతినిధులు నగదు బహుమతులు అందజేశారు.

మాదిగ చర్మకారుల
డిమాండ్లు ఆమోదించాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 25: ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని, మాదిగ చర్మకారుల డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నాయకులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని, లిడ్‌క్యాప్ సంస్థకు మాదిగలను చైర్మన్‌గా నియమించాలన్నారు. మాదిగ చర్మకారులు, డప్పు కళాకారులకు నెలకు రూ.3వేలు పెన్షన్, రూ.2లక్షలు పూచీకత్తు లేని బ్యాంకు రుణం, రూ.2లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కంచర్ల సుధాకర్, జుజ్జవరపు ప్రశాంతి, గంధం సైమాన్ బాబు, పి సూరయ్య, తదితరులు పాల్గొన్నారు.