కృష్ణ

ప్రజల ఆకాంక్ష మేరకు సుపరిపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 15: ప్రజల ఆకాంక్ష మేరకు సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కృష్ణాజిల్లా అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తోందన్నారు. రెండంకెల వృద్ధి రేటుతో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవడం ఆనందదాయకమన్నారు. 2015-16 సంవత్సరంలో కృష్ణాజిల్లా 12.88 శాతం వృద్ధి రేటు సాధించగా రాష్ట్రం 10.99 శాతం, భారతదేశం 7.57 శాతంగా వృద్ధి రేటు సాధించిందన్నారు. కృష్ణా-గోదావరి నదుల అనుసందానంతో చరిత్ర సృష్టించామన్నారు. గోదావరి జలాలతో డెల్టా భూములను సస్యశ్యామలం చేశామన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సోమవారం జిల్లా పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావుతో కలిసి మంత్రి దేవినేని జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రెండేళ్ళ ప్రభుత్వ పాలనలో జిల్లా సాధించిన ప్రగతిని వివరించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రజారంజకమైన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు వేలాది కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. జిల్లాను పారిశ్రామిక వాడగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో త్వరలోనే ఓడరేవు నిర్మాణాన్ని చేపట్టి అనుబంధ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ)ద్వారా పోర్టు, పరిశ్రమలకు అవసరమైన భూములను సమీకరించడం జరుగుతుందన్నారు. ఏ రైతుకీ నష్టం లేకుండా అమరావతి తరహా ప్యాకేజీని అమలు చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో 19 శాతం వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఈ మేరకు ‘రైతు కోసం’ పథకం కింద వరి, మొక్కజొన్న, ప్రత్తి, మినుము, చెరకు పంటలను అభివృద్ధి ఇంజన్లుగా గుర్తించామన్నారు. 2015-16 సంవత్సరంలో లక్షా 25వేల మంది రైతుల పొలాల నుండి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు నిర్వహించి భూ ఆరోగ్య కార్డులు అందించామన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ-పోస్ విధానంలో 1100 రిటైల్ ఎరువుల షాపుల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగంలో రూ.2924 కోట్లు రుణాలుగా అందించగా ఇందులో రూ.1632కోట్లు పంట రుణాలుగా ఇచ్చామన్నారు. డెల్టా రైతుల పాలిట వరంగా మారిన పట్టిసీమ ద్వారా గత ఏడాది 8.98టియంసిల గోదావరి జలాల ద్వారా 8.5లక్షల ఎకరాల్లో పంటను కాపాడామన్నారు. ఈ ఏడాది 24 పంపుల ద్వారా 6.30టియంసిల నీటిని విడుదల చేశామన్నారు. పచ్చదనాన్ని పెంచేందుకు వనం-మనం ద్వారా ప్రతి జిల్లాలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో డ్వాక్రా సంఘాలకు ఇప్పటి వరకు 38,637 గ్రూపులకు రూ.1205కోట్లు లింకేజీ రుణాలు, 9.19వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. ఉపాధి హామీ పథకం కింద 2016-17 సంవత్సరంలో 107.39కోట్లు ఖర్చు చేసి 63లక్షల 16వేల పని దినాలు కల్పించామన్నారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద జిల్లాలో 15వేల 500 గృహాలు నిర్మించడం జరుగుతుందన్నారు. రూ.348.75కోట్ల ప్రాజెక్ట్‌తో నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రధానమంత్రి అవాస్ యోజన - హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద పట్టణ ప్రాంతాలకు మొత్తం 15,162 గృహాలు మంజూరయ్యాయన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పోస్ విధానం ద్వారా ప్రతి నెలా ఐదు కోట్ల మేర ప్రజాధనం ఆదా అవుతుందన్నారు. మత్స్య రంగంలో 7,989 కోట్లు జివిఎ సాధించి 36.5 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. 8లక్షల 38వేల టన్నుల మత్స్య ఉత్పత్తి సాధించి తద్వారా 11వేల కోట్లు జివిఎ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేంద్ర ప్రనుత్వ సహకారంతో ఆగిరిపల్లి ప్రాంతంలో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవానీద్వీపాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద నాట్యారామంగా కూచిపూడి అభివృద్ధికి రూ.3కోట్లు, గాంధి కొండ అభివృద్ధికి రూ.3కోట్లు కేటాయించామన్నారు. కూచిపూడి నుండి దివిసీమ వరకు 3.40కోట్లతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.