కృష్ణ

కెనరా బ్యాంక్‌లో ‘గోల్డ్’ గోల్‌మాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 28: జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కెనరా బ్యాంక్‌లో బంగారు నగలు తారుమారయ్యాయి. కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను సంబంధిత బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ రామ సుబ్రహ్మణ్యం తారుమారు చేసి పరారైనట్లు అధికారులు గుర్తించారు. గత 12 సంవత్సరాలుగా గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న రామ సుబ్రహ్మణ్యం నమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్నాడు. ఈక్రమంలో గత వారం రోజులుగా అతను బ్యాంక్‌కు రావడం లేదు. అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు వాకబు చేయగా స్ట్రాంగ్ రూమ్‌లో సుమారు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను తస్కరించి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు పెట్టి సుబ్రహ్మణ్యం పరారైనట్లు గుర్తించారు. దీనిపై బ్యాంక్ ఉన్నతాధికారులకు మేనేజర్ జయరాజ ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంక్ డిజిఎం సుశీల బుధవారం హుటాహుటిన మచిలీపట్నం చేరుకుని విచారణ నిర్వహించారు. దర్యాప్తులో బంగారు నగలు తారుమారైనట్లు గుర్తించారు. అయితే ఈ ఘటనపై ఇంకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదు. ఈసందర్భంగా మేనేజర్ జయరాజ విలేఖర్లతో మాట్లాడుతూ గోల్‌మాల్ జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. విచారణ నిర్వహిస్తున్నామని, రెండు మూడురోజుల్లో ఏమేర గోల్‌మాల్ జరిగిందీ తెలిసే అవకాశం ఉందని ఆయన వివరించారు.

ఆగని నిరసనలు
* సాగని గ్రామసభలు
* ప్లకార్డులతో నినాదాలు
* కరగ్రహారంలో వాగ్వాదం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, సెప్టెంబర్ 28: రెండో రోజూ నిరసనల పర్వం కొనసాగింది. బందరు పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల సమీకరణ కోసం ‘మడ’ అధికారులు నిర్వహిస్తున్న గ్రామసభలు బుధవారం కూడా రసాభాసగా మారాయి. ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బుధవారం మండల పరిధిలోని పోతేపల్లి, బొర్రపోతుపాలెం, కరగ్రహారం, మంగినపూడి, బందరు వెస్ట్, పెడన మండలం కాకర్లమూడిలో గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామాల డెప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలకు రైతులు ప్లకార్డులు, నల్ల రిబ్బన్‌లతో హాజరై ల్యాండ్ పూలింగ్‌కు నిరసనగా నినాదాలు చేశారు. గత ఏడాది జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌తో పాటు ల్యాండ్ పూలింగ్ కోసం జారీ చేసిన జీవో నెం.185ను రద్దుచేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పారిశ్రామికవేత్తల కోసం భూములను త్యాగం చేసేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చే ప్యాకేజీ తమకు అవసరం లేదని, తమ భూములు తమకుంటే చాలని స్పష్టం చేశారు. పరిశ్రమల కోసం సెంటు భూమి కూడా ఇవ్వబోమని తెగేసి చెప్పారు. మూకుమ్మడిగా గ్రామ పంచాయతీ తీర్మానాలను అందజేసి గ్రామసభలను బహిష్కరించారు. పోతేపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద నిర్వహించిన గ్రామసభకు డెప్యూటీ కలెక్టర్ ధర్మారావు అధ్యక్షత వహించగా ఎంపిటిసి పిప్పళ్ళ నాగబాబు, గ్రామ మాజీ సర్పంచ్ కాటం మధుసూదనరావు, భూపరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కొడాలి శర్మ నాయకత్వంలో వందలాది మంది రైతులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేసుకుంటూ సభ వద్దకు వచ్చారు. భూములిచ్చేది లేదంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. బందరు వెస్ట్ రెవెన్యూకు సంబంధించి శివగంగ పిఎసిఎస్‌లో డెప్యూటీ కలెక్టర్ పద్మావతి అధ్యక్షతన గ్రామసభ జరిగింది. సభ ప్రారంభంలో పద్మావతి భూములిచ్చే రైతులు చేతులు ఎత్తాలని కోరారు. ఈ సమయంలో గరాలదిబ్బకు చెందిన ఓ భూయజమాని చేతులు ఎత్తటంతో రైతులంతా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసి దాడికి యత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మంగినపూడిలో డెప్యూటీ కలెక్టర్ సమజ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో కూడా రైతులు నిరసన తెలిపి ఫారం-2లను అధికంగా తీసుకున్నారు. కరగ్రహారం గ్రామంలో డెప్యూటీ కలెక్టర్ సీతారామ్మూర్తి ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన టిడిపి నాయకులు నాగుల్‌మీరా, ఏడుకొండలు నాయకత్వంలో క్యాంబెల్‌పేటకు చెందిన సుమారు 100 మంది పోర్టుకు తమ భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. వీరంతా మడ అధికారుల నుండి అంగీకార పత్రాలు తీసుకుంటుండగా ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కరగ్రహారం, పెదకరగ్రహారం గ్రామాల సర్పంచ్ శొంఠి ఫరీద్, నడకుదిటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రైతులంతా ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకోగా చివరికి పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. అనంతరం రెండు గ్రామాల సర్పంచ్‌లు రైతుల పక్షాన గ్రామసభను బహిష్కరిస్తున్నట్లు తీర్మానాలను మడ అధికారులకు అందజేశారు. మంగినపూడి గ్రామంలో డెప్యూటీ కలెక్టర్ సమజ ఆధ్వర్యంలో జరిగిన సభలో రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్యాకేజీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పెడన మండలం కాకర్లమూడి గ్రామంలో డెప్యూటీ తహశీల్దార్ సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో కూడా అదే తీరును తలపించారు. ల్యాండ్ పూలింగ్‌ను రైతులంతా వ్యతిరేకించి తీర్మానాన్ని అందజేశారు. ఇలా ప్రతి గ్రామసభలోనూ రైతులు ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకించడం కనిపించింది. భూములిచ్చేందుకు ముందుకొచ్చిన కొందరు రైతులపై ముప్పేట దాడికి యత్నించారు. దీంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.

నాలుగు నెలల్లో కోతకొచ్చే వరి సాగు చేయాలి
* డిడి నాయక్ సూచన
కూచిపూడి, సెప్టెంబర్ 28: ఖరీఫ్ వరి సాగులో అదును దాటిందన్న ఆలోచనకు స్వస్తిచెప్పి నాలుగు నెలల్లో కోతకు వచ్చే ఎంపిటియు 1010, ఎంటియు 1001 రకాలతో ఖరీఫ్ వరి సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎన్‌సిహెచ్ బాలునాయక్ రైతులకు సూచించారు. మొవ్వ మండలంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా యద్దనపూడిలో రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ముందుగా బోర్ల కింద సాగు చేసిన వరి పంటకు చీడపీడలు లేకుండా కనువిందు చేస్తోందన్నారు. ఈ నెల మొదటి వారం నుండి వర్షాలు, విస్తారంగా కృష్ణా జలాలు విడుదల కావటంతో జిల్లాలోని 2లక్షల 90 హెక్టార్లలోని వ్యవసాయ భూముల్లో 90శాతం నాట్లు పడ్డాయన్నారు. ఈ ఏడాది మెట్ట ప్రాంతాలలో, ఎగువ ప్రాంతాలలో ఖరీఫ్ సాగుగా అపరాలు, మిర్చిపై రైతులు ఆసక్తి కనపర్చారన్నారు. పత్తి సాగు తగ్గిందన్నారు. డిసెంబరులో వరి కోతలు ఆలస్యమైనా రెండో పంటగా జిబిజి 1, టిబిజి 104, ఎన్‌ఆర్‌ఐ సిరి, పియు 31 మినుము విత్తనాలు పల్లాకు తెగుళ్లను తట్టుకుంటాయన్నారు. ఎలుకల నివారణకు బ్రోమోడయోలిన్ మందుకన్నా బొప్పాయి పాలు, లేక ముక్కలలో సిమెంటు, మైదా కలిపి ఎరగా వేయాలన్నారు. దీంతో ఎలుకలు రోగాల బారినపడి పారిపోతాయన్నారు. మినుము పంటను ఆశించే బంగారు తీగను తొలిదశలోనే గుర్తించి పీకివేయాలన్నారు. జిల్లాలో నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, కలిదిండి, కైకలూరు, మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాల్లో 50శాతం పైగా వరినాట్లు వేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఆధార్ అనుసంధానం ఇప్పటివరకు 3లక్షల 60వేలకు చేరిందన్నారు. ఇంకా లక్షా 25వేల మంది రైతుల ఆధార్ కార్డులు సేకరించి నమోదు చేయాల్సి ఉందని బాలునాయక్ వివరించారు. కార్యక్రమంలో మొవ్వ ఎడిఎ ముప్పా శ్రీనివాసరావు, ఎఓ బోలెం అనంతలక్ష్మి, సర్పంచులు యద్దనపూడి రాఘశేఖర్, కూచిపూడి సర్పంచ్ కందుల జయరాం, ఎఇఓ నృపేన్ చక్రవర్తి, రైతులు పాల్గొన్నారు.
ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి!
* టిడిపి ఎంపిపి అభ్యర్థిగా సూర్యకుమారి
* కౌన్సిలర్ నాగరాజుకు ఫ్లోర్ లీడర్ పదవి ఎర
పెడన, సెప్టెంబర్ 28: రాజకీయంగా కీలకమైన రెండు పదవులకు గురువారం జరగనున్న ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫలితాలు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ అనేక సందేహాలు, అనుమానాలు రేకెత్తుతున్నాయి. మున్సిపల్ ఛైర్మన్, ఎంపిపి పదవులకు జరగనున్న ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. మున్సిపాలిటీలో టిడిపికి, మండలంలో వైకాపాకు బలం ఉంది. ఎన్నిక ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగితే రెండు పార్టీలకూ చెరో పదవి దక్కటం ఖాయం. అయితే రెండు పార్టీలు కూడా వేసిన ఎత్తులకు పైఎత్తుల వల్ల పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఛైర్మన్ అభ్యర్థిగా భూసం ఆనందరావును టిడిపి ప్రకటించగా, బండారు ఆనందప్రసాద్‌ను వైకాపా బరిలో నిలిపింది. ఇద్దరి బలం సమానంగా ఉండగా టిడిపికి ఎక్స్‌అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే ఓటు అదనంగా ఉంది. టిడిపిలో ఇద్దరు కౌన్సిలర్లు బెజవాడ నాగరాజు, శానపతి భిక్షం ఛైర్మన్ పదవిని ఆశించగా పెద్ద నాయకులు జోక్యం చేసుకుని వారిద్దరినీ బుజ్జగించారు. నాగరాజుకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పదవిని ఇచ్చేందుకు పార్టీ పెద్దలు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ పదవిలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు ఉంటున్నారు. మండల పరిషత్‌లో వైకాపా నుంచి రాజులపాటి అచ్యుతరావు అభ్యర్థి కాగా టిడిపి నుంచి చెన్నూరు ఎంపిటిసి చెన్నూరి సూర్యకుమారిని బలం లేకపోయినా బరిలో నిలుపుతున్నారు. దీంతో గతంలో మాదిరిగానే టిడిపి ఎంపిపి పదవిని కైవసం చేసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రాహ్మణుల సంక్షేమానికి టిడిపి పెద్దపీట
* పార్టీ జిల్లా కార్యదర్శి ఫణికుమార్
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 28: తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్ అన్నారు. స్థానిక రామానాయుడుపేటలో బుధవారం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జిల్లా కన్వీనర్ మోపర్తి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా ఫణికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్రాహ్మణ విద్యార్థుల ఉపకార వేతనాల పథకం అక్టోబరు 31వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. పేద బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు అందించే చాణక్య పథకం అక్టోబరు 15వ తేదీతో ముగుస్తుందన్నారు. రాష్ట్రీయ బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, మేనేజింగ్ డైరెక్టర్ సంగపల్లి వెంకట్ రూపకల్పన చేసిన పథకాలను బ్రాహ్మణులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈసందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ వలంటీర్ చోడవరపు ప్రసాద్, ప్రసూన దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కరగ్రహారం ఎంపిటిసి బోలెం అయోధ్యరామయ్య, టిడిపి మహిళా జిల్లా కార్యదర్శి కె నాగలక్ష్మి, తాళ్ళపాలెం ఉప సర్పంచ్ కుందా బాలాజీ శివరామకృష్ణ, అంబటిపూడి ప్రసాద్, హనుమాన్, వివిధ ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పోర్టు, అనుబంధ పరిశ్రమలకు
సెంటు భూమి కూడా ఇవ్వం!
* అధికార్లకు తెగేసి చెప్పిన రైతులు
పెడన, సెప్టెంబర్ 28: బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు తాము సెంటు భూమిని కూడా ఇవ్వబోమని కాకర్లమూడి రైతులు ఢంకా భజాయించి చెప్పారు. ముందు పోర్టు నిర్మించండి, ఆ తరువాత అవసరమైతే సహకరిస్తామని అన్నారు. పోర్టుకు భూసమీకరణ కోసం బుధవారం గ్రామసభ నిర్వహించారు. మడ డెప్యూటీ కలెక్టర్ ఎం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభలో రైతులు పాల్గొని భూములు ఇవ్వబోమని విస్పష్టంగా చెప్పారు. గ్రామ సర్పంచ్ మద్దంశెట్టి వాకాలరావు ఆధ్వర్యంలో తాము భూములు ఇచ్చేది లేదని పంచాయతీ పరంగా కూడా తీర్మానించామన్నారు. ఆ తీర్మాన పత్రాన్ని అధికారులకు అందచేశారు. ఈ గ్రామం నుంచి 875 ఎకరాల భూమిని తీసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భూసమీకరణకు సహకరించాలని అధికారులు కోరిన మీదట రైతులు తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు సజ్జా మూర్తిరాజు, పంచల నరసింహారావు, వాసా గంగాధరం, తదితరులు రైతులకు మద్దతుగా గ్రామసభలో అధికారులను నిలదీశారు. ఎస్‌ఐ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల సర్వేయర్ బి శ్రీనివాసరావు, పెడన ఆర్‌ఐ కూనపరెడ్డి అనిల్, విఆర్‌ఓ యోదా, రైతులు జన్యావుల మారేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

బెంగళూరు ఎన్‌ఐతో ఎల్బీఆర్సీఇ ఒప్పందం
మైలవరం, సెప్టెంబర్ 28: బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్ సంస్థతో బుధవారం ఎల్బీఆర్సీఇ కళాశాలలోని ఈసీఈ, ఈఐఈ, ఈఈఈ విభాగాలకు ఒప్పందం కుదిరింది. సుమారు 50లక్షల విలువైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేసి ఎన్‌ఐ లాబ్‌వ్యూ అకాడమీతో అనుసంధానమై కాంపిటెన్సీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఆరు మాడ్యుల్స్‌గా విద్యార్థులకు శిక్షణ ఇస్తారని డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. దానిద్వారా విద్యార్థులకు క్లాడ్ అనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన సర్ట్ఫికెట్ లభిస్తుందన్నారు. ఈ సర్ట్ఫికెట్ పొందిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్‌లు చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఈ గ్రాఫికల్ సిస్టం డిజైన్ ద్వారా విద్యార్థులు డిజైన్ చేసి నమూనాను తయారు చేయటానికి ఉపయోగిస్తారన్నారు. ఈ శిక్షణ పూర్తిచేసిన ఈసీఈ, ఈఐఈ, ఈఈఈ విద్యార్థులకు కోర్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈసందర్భంగా ఎన్‌ఐ ల్యాబ్ వ్యూ కోఆర్డినేటర్, ఎన్‌ఐ దక్షిణ భారతదేశ అధిపతి విశే్వశ్వరన్ జగదీషన్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు రమేష్ రెడ్డి, ఉమావాణి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో వామపక్షాలదే కీలకపాత్ర
* సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ
కూచిపూడి, సెప్టెంబర్ 28: రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కీలకపాత్ర పోషించనున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపి పరిపాలన పట్ల ప్రజలు విరక్తి చెందారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా వామపక్షాల వైపే ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సిపిఐ నిర్వహిస్తున్న ప్రజాబ్యాలెట్ కార్యక్రమంలో భాగంగా మొవ్వ సిపిఐ ఆధ్వర్యంలో కాజ గ్రామంలో బుధవారం ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. చేనేత కార్మిక నాయకుడు కోదాటి నారాయణరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వనజ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కార్యకర్తలు సంఘటితంగా ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. ఈసందర్భంగా గడపగడపకూ సిపిఐ కార్యక్రమం ద్వారా సేకరించిన రూ.23,870 విరాళాలను నారాయణరావు వనజకు అందజేశారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర కోశాధికారి కెవి అప్పారావు, పామర్రు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి దగాని సంగీతరావు, మొవ్వ మండల కార్యదర్శి చెరకు శ్రీనివాసరావు, వేములపల్లి మోహన్‌దాస్, కొండా నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.