కృష్ణ

లక్ష్యానికి ఆమడ దూరంలో పంటకుంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఏప్రిల్ 6: పంట సంజీవిని కింద పొలాల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకం కింద పంటకుంటల తవ్వకం చేపట్టాలని ప్రభుత్వం రైతులను కోరగా వారి నుంచి అందుకు తగ్గ స్పందన కానరావటంలేదు. మండలంలో 50 పంటకుంటలు తవ్వాలని ప్రభుత్వం సూచించగా 84 పంటకుంటలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని ఉపాధిహామి టెక్నికల్ అసిస్టెంట్ దుర్గ్భావాని గురువారం తెలిపారు. అయితే ఇప్పటికి కేవలం ఆరు పంటకుంటలను మాత్రమే పూర్తయ్యాయన్నారు. మరో 20 ప్రోగ్రెస్‌లో ఉన్నాయని తెలిపారు. అయితే పంటకుంటలను పొలాల్లో తవ్వేందుకు రైతులు ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొనటంతో దేవాదాయశాఖ భూముల్లో తవ్వకాలకు చర్యలు తీసుకున్నామని దుర్గ్భావాని చెప్పారు. మండలంలో కాలువలు, బోర్లు పుష్కలంగా ఉండటంతో రైతులకు నీటి ఎద్దడి సమస్య తెలియక పంటకుంటల విలువ తెలియకుండా ఉందని అధికారులు అంటున్నారు.

ఎసిబి వలలోఎడిఎ
* రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎడిఎ
పామర్రు, ఏప్రిల్ 6: పామర్రు, గుడ్లవల్లేరు మండలాల సబ్ డివిజన్ వ్యవసాయాధికారిణి జె శశిబిందు పామర్రులో ఓ ఎరువుల దుకాణం లైసెన్సు రెన్యువల్ చేయడానికి రూ.5వేలు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖాధికారులకు పట్టుబడ్డారు. వివరాలలోకి వెళితే పామర్రు వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడిఎగా విధులు నిర్వహిస్తున్న జె శశిబిందుకు ఇటీవల పామర్రులోని శ్రీకృష్ణవేణి సీడ్స్ అండ్ ఆగ్రో దుకాణం వారు లైసెన్సు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కింది స్థాయి అధికారులు దర్యాప్తు జరిపి ఏడిఎకు ఫైల్ పంపారు. సదరు ఏడిఎ లైసెన్సు రెన్యువల్ సిఫార్సు చేస్తూ జెడిఎకు పంపాల్సి ఉండగా రూ.5వేలు లంచం అడిగినట్లు ఏసిబి విజయవాడ డిఎస్పీ వి గోపాలకృష్ణ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువారం వలపన్ని కృష్ణవేణి దుకాణం యజమాని తమ్మన జగదీష్ నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా శశిబిందును పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసి ఏసిబి కోర్టుకు పంపుతున్నట్లు తెలిపారు. డిఎస్పీ గోపాలకృష్ణతో పాటు సిఐలు పి శ్రీనివాస్, కె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఆక్రమణల తొలగింపును అడ్డుకుంటున్న అధికార పార్టీ నేతలు
ఉయ్యూరు, ఏప్రిల్ 6: పట్టణంలోని ప్రధాన వీధిలోట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తున్న ఆక్రమణలు తొలగించేందుకు పోలీసులు ముందుకురాగా, అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రధాన కూడలి, శివాలయం రోడ్డు, రావిచెట్టు బజార్‌లలో రోడ్డు పక్కలను ఆక్రమించుకొని చిరువ్యాపారులు గత కొంత కాలంగా వ్యాపారాలు చేస్తున్నారు. వీటివల్ల నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులను స్ధానికులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మించిన డ్రైన్‌ను దాటి మరీ వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకొని వాహన రాకపోకలకు అవరోధంగా మారారు. ఈ నేపథ్యంలోప్రజల విజ్ఞప్తి మేరకు స్థానిక పోలీసుశాఖ, హైవే ట్రాఫిక్ పోలీసు విభాగంతో కలసి డ్రైన్ బయటకు వచ్చిన ఆక్రమణలు తొలగించేందుక పూనుకున్నారు. వ్యాపారులలో అధికారపార్టీ నాయకులు కూడా ఉండటంతో సమస్య జఠిలమైందని తెలిసింది. బుధ, గురువారాలలో పోలీసులు చేపట్టిన చర్యలకు ప్రజలు ప్రశంసలు కురిపించగా, గురువారం సాయంత్రం అధికార పార్టీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఎటువంటి అభ్యంతరాలు తలెత్తకుండా వ్యూహాత్మకంగా ఆక్రమణదారులతో సిఐ జివివి సత్యన్నారాయణ చర్చలు జరిపి మరీ ఆక్రమణలు తొలగింపునకు పూనుకున్నారు. ప్రజాప్రతినిధుల జోక్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను పనిచేయనిస్తే పట్టణం సుందరంగా తయారవుతుందని, పార్కింగ్ స్థలం కూడ చూపించలేని నాయకులు ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తున్నా వారికి వత్తాసు పలకడం పట్ల సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.
ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధనేకుల మురళి

నందిగామ, ఏప్రిల్ 6: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలం అయ్యిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధనేకుల మురళి విమర్శించారు. ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ప్రదర్శన, గాంధీ సెంటర్ వద్ద ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వేల్పుల పరమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రజా బ్యాలెట్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు సరైన విధంగా గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, బోడపాటి బాబూరావు, తలమాల డేవిడ్‌రాజు, వెలగలేటి రామయ్య, గింజుపల్లి అనిల్, యండ్రపల్లి నారాయణరావు, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

దిగుబడులపై తప్పుడు నివేదికలు ఇస్తున్న అధికారులు
జి.కొండూరు, ఏప్రిల్ 6: గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణాజిల్లాలో వ్యవసాయ వృద్ధిరేటు 20 శాతంగా చూపుతూ వ్యవసాయ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు రేగళ్ళ రఘునాథరెడ్డి, మండల అధ్యక్షుడు వేములకొండ రామారావులు పేర్కొన్నారు. జి.కొండూరులో గురువారం విలేఖరులతో మాట్లాడుతూ రైతులకు మేలురకం విత్తనాలను సరఫరా చేయాలన్నారు. మిర్చి ధర పడిపోయినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. మేలురకం విత్తనాలు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. మేలురకపు విత్తనాలు ఇవ్వక పోవడం వల్ల దిగుబడి తగ్గుతుందన్నారు. వ్యవసాయ శాఖ నుంచి సరైన మార్గదర్శకాలు లేక రైతులు తమకున్న పరిజ్ఞానంతో వ్యవసాయం చేసి నష్టపోతున్నారన్నారు. వ్యవసాయాధికారులు మండలానికే పరిమితమై గ్రామాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇకనైనా వ్యవసాయ శాఖలో లోపాయికారీ తనాన్ని ప్రభుత్వం నివారించాలన్నారు.

పేట ప్రభుత్వ వైద్యశాలకు అధునిక అంబులెన్స్ బహూకరణ
జగ్గయ్యపేట, ఏప్రిల్ 6: పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు అత్యాధునిక సౌకర్యాల గల అంబులెన్స్‌ను రాకిన్ ఫార్మా కంపెనీ వారు అందజేశారు. గురువారం ఉదయం వైద్యశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఈ అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునికమైన ఐసియులో ఉన్న సౌకర్యాలతో మూడు బెడ్లు గల ఈ అంబులెన్స్ రూ. 15 లక్షలతో రాకిన్ ఫార్మా వారు అందజేయటం అభినందనీయమన్నారు. అంబులెన్స్ డ్రైవర్‌తో సహా నిర్వహణ కూడా కంపెనీ వారే భరించేందుకు ముందుకు రావటం అభినందనీయమని ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్య ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎండి శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ రవికుమార్, సురేష్‌కుమార్, ఫ్లోర్ లీడర్ యలమంచిలి రాఘవ, వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ వై వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుండి శ్రీ లక్ష్మీపతిస్వామి కల్యాణోత్సవాలు
కూచిపూడి, ఏప్రిల్ 6: శ్రీమన్నారాయణుడు మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో శ్రీ లక్ష్మీపతి స్వామిగా స్వయంభూవుగా వెలవటంతో పంచలక్ష్మీ నారాయణ క్షేత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో శుక్రవారం నుండి 17వ తేదీ వరకు శ్రీ లక్ష్మీపతి స్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ముముక్షుజన మహాపీఠాధిపతి ముత్తీవి సీతారాం గురుదేవులు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం స్వామివారిని, అమ్మవారిని పెండ్లి కుమారులుగా అలంకరించటం, విష్వక్సేన పూజతో అంకురార్పణ జరుగుతుందని, రాత్రి ధ్వజారోహణతో కల్యాణోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ సందర్భంగా నిత్యం భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ పర్యవేక్షకుడు తుర్లపాటి ఆనందసాగర్ పాల్గొన్నారు.