కృష్ణ

హోదా ఇచ్చేంత వరకు ఉద్యమం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, ఏప్రిల్ 21: ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రుల సత్తా ఏంటో చూపుతామని, దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కొనకళ్ల నారాయణరావు పేర్కొన్నారు. హోదా సాధనకై టీడీపీ చేపట్టిన సైకిల్ యాత్రను పామర్రులో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. నమ్మకద్రోహి ప్రధాని మోదీకి గుణపాఠం చెబుదామన్నారు. మోదీ పాలనకు చరమగీతం ఆంధ్ర నుంచే ప్రారంభమైందన్నారు. ప్రత్యేక హోదాకై టీడీపీ పట్టుదలతో రాజకీయాల కతీతంగా ఉద్యమిస్తుందన్నారు. వైసీపీ నేత జగన్ అధికారం కోసం హోదా ఉద్యమాన్ని చేపట్టి పార్టీ ఉనికి కోసం పాకులాడుతున్నాడని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కల్పన మాట్లాడుతూ హోదా సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దగ్గుబాటి ఉష, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు ఉదరవల్లి ప్రవీణ్, పెదపూడి నాగేశ్వరరావు, దాడిపర్తి ప్రసాద్, వైస్ ఎంపీపీ లాజరస్, దుర్గ గుడి కమిటీ డైరెక్టర్ పామర్తి విజయశేఖర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. పురవీధుల్లో సైకిల్ యాత్ర నిర్వహించారు.

హిజ్రాలకు పెన్షన్లు
డీఆర్‌డీఎ పీడీ చంద్రశేఖరరాజు వెల్లడి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 21: ప్రభుత్వ వైద్యుల ధృవీకరణ పత్రాల ఆధారంగా హిజ్రాలకు పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి చంద్రశేఖరరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హిజ్రాలకు కూడా పెన్షన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. నిజమైన హిజ్రాలను గుర్తించే బాధ్యతను ప్రభుత్వ ఆస్పత్రులకు అప్పగిస్తూ జివో నెం. 16ను జారీ చేసినట్లు తెలిపారు. ఈ జివో ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు అందించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 23వ తేదీన విజయవాడ కొత్త ఆస్పత్రిలో ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెడికల్ క్యాంప్‌కు హాజరయ్యే హిజ్రాలు రెండు పాస్ పోర్టు సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు. ఆస్పత్రి వైద్యుల ద్వారా పొందిన ధృవ పత్రాలను సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు అందచేయాల్సి ఉంటుందన్నారు.

బాలయ్యబాబుకి సద్బుద్ధి ప్రసాదించండి!
* ఎన్టీఆర్ విగ్రహానికి బీజేపీ వినతిపత్రం
మచిలీపట్నం, ఏప్రిల్ 21: విచక్షణ కోల్పోతున్న హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు సద్భుద్ధిని ప్రసాదించాలని కోరుతూ బీజేపీ నాయకులు శనివారం టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్షలో ప్రధాని నరేంద్ర మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నాయకులు నిరసన తెలియచేశారు. క్రమశిక్షణకు మారుపేరైన నందమూరి కుటుంబంలో బాలకృష్ణ ప్రధాని మోదీని విమర్శించడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ శృతి మించి మోదీని విమర్శిస్తున్నా వౌనంగా ఉన్న సీఎం చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట కొద్దిసేపు ధర్నా చేసిన బీజేపీ నేతలు అనంతరం ర్యాలీగా ఆర్‌పేట పోలీసు స్టేషన్‌కు చేరుకుని టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వాసవికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ సోడిశెట్టి బాలాజీ, బందరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ పంతం వెంకట గజేంద్రరావు, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కూనపరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ విస్తారక్ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు తోట రంగనాధ్, ఎస్టీ మోర్చ జిల్లా అధ్యక్షుడు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.