కృష్ణ

కుళ్లుతున్న టమాటా రైతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 25: ప్రకృతి కరుణించక, పాలకులు కనికరించక పోయినా ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతు నిరంతరం దగాపడుతూనే ఉన్నాడు. సాగు ఖర్చు ఏడాదికేడాదికి రెట్టింపవుతున్నా నమ్ముకున్న పుడమి తల్లిపైనే కొండంత భారం వేసి కోటి ఆశలతో హరితవిప్లవాన్ని సాధించాలన్న తపనతో ముందుకు సాగుతున్న రైతుల పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. నిన్న పత్తి, నేడు టమాటా, రేపు మామిడి ఇలా ఒకదాని తర్వాత మరొకటి ఆరుగాలం రైతు పండించిన పంట గిట్టుబాటు కాక అయనకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. పర్యవసానంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయ. ప్రస్తుతం టమాటా రైతుల వంతు వచ్చింది. మైలవరం ప్రాంతంలో విస్తారంగా పండించే టమాటా పంటకు ప్రస్తుతం గిట్టుబాటు ధరలేక రైతులు విలవిల్లాడుతున్నారు. టమాటా పేరు వినగానే పసందైన రుచులు జ్ఞ్ఞప్తికి వస్తాయి. శాకాహారమైనా, మాంసాహారమైనా టమాటా లేకుండా కూర వండరంటే అతిశయోక్తికాదు. ఏ కూరకైనా టమాటా పడితేనే విందు... పసందు. టమాటా పడిన కూర రుచే వేరబ్బా అని జనసామాన్యం లొట్టలేసుకోవడం కద్దు. అటువంటి టమాటాకు కష్టకాలం దాపురించింది. అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన కూరగాయల్లో టమాటా ఒకటిగా సుస్థిర స్థానం పొందింది. ఇంతటి ప్రాశత్యం కలిగిన టమాటా సాగు చేసే రైతు నష్టాలతో చతికిలపడ్డాడు. ఏన్నో ఆశలతో మరెన్నో లక్ష్యాలతో టమాటా సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర శాపమై వెంటాడుతోంది. వేలాది రూపాయల అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పండిస్తే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. ఎకరాకు 40 నుండి 60వేల రూపాయల వరకూ పెట్టుబడులు పెట్టి పండించి మార్కెట్‌కు తెస్తే తీరా అక్కడ కిలో టమాటాలు కేవలం రెండు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇవే టమాటాలు వినియోగదారులు మార్కెట్‌లో కొనుగోలు చేయాలంటే పది రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. మండలంలోని చండ్రగూడెం, పుల్లూరు, వెల్వడం, తోలుకోడు, మొర్సుమిల్లి, పొందుగల గ్రామాలతోపాటు రెడ్డిగూడెం, జి కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాలలో టమాటా పంటను రైతులు విస్తారంగా పండిస్తారు. మిగిలిన ఏ పంటలలోనైనా అప్పులపాలై నష్టాలను చవి చూసినా టమాటా పంట తమను గట్టెక్కిస్తుందనే నమ్మకం రైతులలో నెలకొంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో టమాటా రైతు రోడ్డున పడ్డాడు. మండలంలోని పొందుల శివారు అనంతవరం గ్రామానికి చెందిన రైతు ఒకరు స్థానిక రైతుబజారులో అమ్ముకునే అవకాశం లేక దానికెదురుగానే రోడ్డుపక్కన పరదావేసుకుని దుకాణం పెట్టి రెండు కిలోల టమాటాలను ఒక కవరులో పోసి కేవలం పది రూపాయలకే విక్రయంచడం మొదలెట్టాడు. విషయం తెలుసుకున్న రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ పుష్పవల్లి రైతులు పిలిచి రైతుబజార్‌లో కార్డు ఇస్తానని ఇక్కడే అమ్ముకోమని కోరగా రైతు బజార్‌లో రైతులు లేరని, అందరూ వ్యాపారులే ఉన్నారని వారి మధ్య తాను తట్టుకోలేనని స్పష్టం చేశాడు. టమాటా సాగు చేస్తున్న ప్రతి రైతు పరిస్థితి ఇలానే ఉంది. మైలవరం, జి కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాలలో దాదాపు 5వేల ఎకరాలలో రైతులు టమాటా సాగు చేస్తున్నారు. సాగుకు ఉపక్రమించినది మొదలు చీడపీడల నివారణకు పురుగుమందుల పిచికారి, ఎరువు యాజమాన్యం తదితరాలకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. దిగుబడి వచ్చినప్పుడు వాటిని కోసి గ్రేడింగ్ చేసి బుట్ట కట్టి మార్కెట్‌కు తరలిస్తే అక్కడ ధర లేక కూలి ఖర్చు కూడా రావటం లేదని వాపోతున్నారు. ఇటువంటి స్థితిలో కొందరు రైతులు కాయ కోయకుండానే తోటల్లోనే వదిలి వేస్తున్నారు. మరి కొందరు కోసిన కాయలు కొనేనాధుడు లేక రోడ్లవెంట పారబోస్తున్నారు. టమాటా మార్కెట్‌ను, జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను రైతులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉద్యానవన శాఖాధికారి ఎన్ అశోక్ మాట్లాడుతూ సాంకేతిక మెళకువలు పాటిస్తే పంటల సాగుకు అత్యధిక పెట్టుబడులు అవసరం లేదన్నారు. అధికారుల సూచనలు సలహాలను పాటించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను సాధించవచ్చన్నారు.