కృష్ణ

భూసేకరణ దిశగా ‘ఓడరేవు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: భూసేకరణ దిశగా బందరు ఓడరేవు అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు భూసమీకరణ ద్వారా ఓడరేవుకు అవసరమైన భూములు తీసుకునే ప్రక్రియ కొనసాగింది. ఇకపై భూసేకరణ ద్వారా భూములు తీసుకునేందుకు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) అధికారులు చర్యలు చేపడుతున్నారు. గడిచిన రెండేళ్లుగా పోర్టు భూముల వ్యవహారం ఒక కొలిక్కి రాకుండా ఉంది. తొలుత భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత భూసమీకరణను తెర మీదకు తీసుకు వచ్చి ఆ దిశగా భూములు తీసుకున్నారు. అయితే భూ సమీకరణకు రైతులు ఆసక్తి కనబర్చలేదు. 5వేల 300 ఎకరాల భూముల సమీకరణకు గాను కేవలం 3వేల 800 ఎకరాల భూమిని మాత్రమే సమీకరించగలిగారు. ఇందులో అత్యధికంగా 3వేల 100 ఎకరాల భూమి ప్రభుత్వ, అసైన్డ్ భూములు కావడం విశేషం. అంటే రైతుల నుండి కేవలం 700 ఎకరాలు మాత్రమే సమీకరించగలిగారు. మిగిలిన భూములను సమీకరించేందుకు పాలకులు తీవ్రంగా కృషి చేశారు. కానీ ఫలితం కనిపించకపోవటంతో భూసేకరణను తెర మీదకు తీసుకువచ్చారు. భూసేకరణ దిశగా భూములు తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఒప్పించేందుకు గాను ఈ ప్రాంత రైతులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమం కూడా నిర్వహించారు. రైతుల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు కూడా భూసేకరణకు కొద్దిమేర మొగ్గు చూపారు. భూసేకరణ చేపడితే రూ.1200కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వ ఒప్పందంతో బ్యాంక్ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ చర్యలు నేడు కార్యరూపం దాల్చాయి. రుణ మంజూరుకు విజయ బ్యాంక్ ముందుకొచ్చింది. రూ.1200కోట్లు అవసరం కాగా 7.8శాతం వడ్డీతో రూ.1060కోట్ల మేర రుణం ఇచ్చేందుకు సంబంధిత విజయ బ్యాంక్ అంగీకారం తెలిపింది. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నెల రోజుల్లో నిధుల సమీకరణ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత భూసేకరణకు అధికారులు ముందుకు వెళ్లనున్నారు. త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రభుత్వ ఒప్పందంతో రుణం తీసుకునే అంశానికి ఆమోద ముద్ర వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం భూసేకరణ చట్టం 2013 అమలు, ఆర్‌అండ్‌ఆర్ యాక్ట్ అమలుపై రిటైర్డు ఐఎఎస్ అధికారి బి రామయ్య ముడ, రెవెన్యూ అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముడ వీసీ విల్సన్ బాబు నేతృత్వంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఒక రోజు శిక్షణ తరగతికి ముడ డెప్యూటీ కలెక్టర్లు, ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. భూసేకరణ చట్టం అమలులో తీసుకోవల్సిన చర్యలపై విశ్రాంత ఐఎఎస్ అధికారి రామయ్య సువివరంగా శిక్షణ ఇచ్చారు. దీనిబట్టి చూస్తే త్వరలోనే ముడ అధికారులు భూసేకరణ చట్టాన్ని అమలు చేసి భూములను తీసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా భావించవచ్చు.

చేతులు ఊపితే ఓట్లు రాలవ్!
* వైఎస్ జగన్‌ను విమర్శించిన మంత్రి ఉమ

జి.కొండూరు, ఏప్రిల్ 22: గాల్లో చేతులు ఊపినంత మాత్రాన ఓట్లు రాలవని వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర భాగంగా మైలవరంలో చేసిన ప్రసంగాన్ని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మండల పరిధిలోని గుర్రాజుపాలెంలో ఆదివారం జరిగిన సైకిల్‌యాత్రలో పాల్గొన్న మంత్రి ఉమ మాట్లాడుతూ వెంకటాపురంలో కనీసం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి దండ కూడా వేయకుండా వెళ్ళి పోయి సొంత పార్టీలోని వారి ఆగ్రహానికి గురైన వ్యక్తి తనను, సిఎం చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదేపదే తండ్రి పేరునే జపిస్తూ, అధికారం కోసం అర్రుచాస్తున్న జగన్ ఎత్తుగడలను జనం బాగా అర్థం చేసుకుంటున్నారని విమర్శించారు. ‘తిరోగమనంలో రాష్ట్భ్రావృద్ధి’ అని విమర్శలు గుప్పించే జగన్ వాస్తవాలు గమనించాలని, ఆయన నడచిన జాతీయ రహదారి సిఎం చంద్రబాబు వేసినదేనని మరువకూడదన్నారు. చింతలపూడి, తారకరామ ఎత్తిపోతల పథకాల గురించి తెలుసా? అంటూ జగన్‌ను మంత్రి ఉమ ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేయకుండా, అన్యాయం చేస్తున్న ప్రధాని మోదీతో స్నేహం చేస్తూ, మరో పక్క ప్రత్యేక హోదా కోసం తానే పోరాడుతున్నట్లు జగన్ ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు. మైలవరం నియోజకవర్గ ఓటర్లు ఎంతో చైతన్యవంతులని, వైసీపీ కుట్రలకు మోసపోరన్నారు. మైలవరం వైసీపీ సీటు కోసం ఇద్దరు నాయకులు పోటీ పడి పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టుకున్నారన్నారు. ఇంతకు మించి జగన్ పాదయాత్రలో చెప్పుకోదగిన విషయం ఏమీ లేదన్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీకి విశేష సేవలందిస్తున్న వుయ్యూరు నరసింహారావుకు సిఎం చంద్రబాబునాయుడు మైలవరం ఎఎంసి చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించారన్నారు. వచ్చే నెలలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో వుయ్యూరు నరసింహారావు, పటాపంచల నరసింహారావు, వరికూటి శ్రీనివాసరావు, లంకా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.