కృష్ణ

విజి‘లెన్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు కొరడా ఝళిపించారు. జి.కొండూరు మండలంతో పాటు ఇతర ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 33 వాహనాలను సీజ్ చేశారు. రోజూ దాడులు చేసినా ఇలాగే దొరుకుతాయని ప్రజలు పేర్కొంటున్నారు. విజిలెన్స్ విభాగం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధనరాజు ఆదేశాల మేరకు చేసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు శివాజీరావు, పి.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎం.వెంకటేశ్వరరావు తనిఖీలు నిర్వహించారు. జి.కొండూరు మండల పరిధిలోని కందులపాడు క్రాస్‌రోడ్ వద్ద, ఇబ్రహీంపట్నం, విజయవాడ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో గ్రానైట్ మెటల్‌ను రవాణా చేస్తున్న 17 భారీ టిప్పర్లను, రెడీమిక్స్ రవాణా చేస్తున్న 8 లారీలను, ఇటుకలు రవాణా చేస్తున్న భారీ లారీని, 7 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. వీటిని ఆయా పోలీసుస్టేషన్లకు తరలించారు. మైనింగ్ బిల్లులు లేకుండా సహజసిద్ధమైన ఖనిజసంపదను దర్జాగా అక్రమ రవాణా చేస్తున్న వైనం భారీ స్థాయిలో వెలుగు చూసింది. వీటిని తదుపరి చర్యల నిమిత్తం మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖ, మరియు రవాణా శాఖాధికారులకు అప్పగించినట్లు తెలిసింది.

బహిరంగ రహస్యమే
ప్రతిరోజూ ఇలా అక్రమ రవాణాకు జాతీయ రహదారులే వేదికగా నిలుస్తున్నాయి. ఏదో ఒకటి అర తప్ప మైనింగ్ బిల్లులు లేకుండానే ఇక్కడ బడాబాబులు కంకరను, గ్రావెల్‌ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. క్వారీలు, క్రషర్లు, ఇటుకల బట్టీలు కోట్లకు పడగలు ఎత్తిన వారి చేతుల్లోనే ఉంటున్నాయి. ఎవరైనా కింది స్థాయి అధికారులు అక్రమ రవాణా గురించి మాట్లాడితే వారి నోరును కొంతమంది నొక్కేస్తున్నారు. మరికొందరిని వీరు డబ్బుతో కొనేస్తున్నారు. వీరికి రాజకీయ అండదండలు కూడా ఎక్కువే. అధికారం, ప్రతిపక్షం రెండింటిలో కూడా అక్రమార్కులకు కొమ్ముకాసే వారికి కొదవేలేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. దీన్ని నివారించాలంటే ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి అన్ని శాఖల అనుమతులపై సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, బార్ కోడ్ తరహాలో నూతన పద్ధతులు అవలంబించి అక్రమ రవాణాకు చెక్ చెప్పాలి.