కృష్ణ

హడలెత్తిస్తున్న ‘ఫెథాయ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫెథాయ్’ తుఫాన్ రైతాంగాన్ని కలవర పెడుతుండగా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఫెథాయ్ తుఫాన్ ఏ రూపంలో దూసుకు వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధులయ్యారు. జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్ అనునిత్యం వాతావరణ శాఖ ద్వారా వెలువడుతున్న హెచ్చరికలపై అధికారులతో సమీక్షిస్తున్నారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. తుఫాన్ ప్రభావం జిల్లాపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్న యంత్రాంగం అందుకు తగ్గట్టుగా ముందస్తు సహాయక చర్యలను చేపడుతోంది. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైనా క్షణాల్లో వాటిని ఎదుర్కొనేలా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం అంతటినీ అప్రమత్తం చేశారు. ఇప్పటికే అధికారులకు ముందస్తు సెలవులను రద్దు చేసి కలెక్టర్ తుఫాన్ ప్రభావిత మండలాలు, గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రత్యేక అధికారులంతా శుక్రవారం ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ముందస్తు నివారణ చర్యలను ముమ్మరం చేశారు. ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు అధికారులు తీర ప్రాంత గ్రామాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. నాగాయలంక, కోడూరు, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, పెడన, గూడూరు మండలాలను తుఫాన్ ప్రభావిత మండలాలుగా గుర్తించారు. అలాగే ఆయా మండలాల్లో 181 గ్రామాలను నిస్సహాయత గ్రామాలుగా గుర్తించారు. ఈ నిస్సహాయత గ్రామాల్లో 46వేల 469 కుటుంబాలు ఉండగా లక్షా 78వేల 655 మంది ప్రజలు నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. పరిస్థితులను బట్టి నిస్సహాయత గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలను కూడా పూర్తి చేశారు. గ్రామాల్లోని మంచినీటి పథకాల్లో మంచినీటిని క్లోరినేషన్ చేశారు. చెరువులన్నింటినీ పూర్తి స్థాయిలో మంచినీటితో నింపుతున్నారు. 15 రోజులకు సరిపడా మంచినీటి సదుపాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈదురు గాలుల ప్రభావం వల్ల రోడ్ల మీద చెట్లు పడిపోయిన పక్షంలో వాటిని తక్షణమే తొలగించేందుకు ఆధునాతన కట్టర్స్‌ను సిద్ధం చేశారు. గ్రామాల్లో వర్షపునీరు నిలువ కుండా ఉండేందుకు గాను అవసరం మేర ఆయిల్ ఇంజన్లు, జనరేటర్లను సిద్ధం చేశారు. అలాగే విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన పక్షంలో వాటి స్థానంలో అప్పటికప్పుడు కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు విద్యుత్ స్థంభాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇలా తుఫాన్ వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సంసిద్ధులై ఉన్నారు.

‘ఫెథాయ్’పై భయమొద్దు

విలేఖర్ల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీకాంతం

మచిలీపట్నం, : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వల్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లో జెసీ విజయకృష్ణన్‌తో కలిసి తుఫాన్ కదలికపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ జారీ చేసే తుఫాన్ హెచ్చరికలనే ప్రజలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి మచిలీపట్నంకు 1100కిలో మీటర్ల మేర కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపారు. శనివారం ఉదయం 5.30ని.లకు తుఫాన్‌గా మారే అవకాశం ఉందన్నారు. 16వతేదీ సాయంత్రానికి ఇది పెను తుఫానుగా మారి తిరిగి 17వ తేదీ సాయంత్రానికి బలహీన పడుతుందన్నారు. శుక్రవారం నాటికి తీరం దాటే ప్రాంతంపై స్పష్టత వస్తుందని తెలిపారు. తుఫాన్ వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన అన్ని సహాయ చర్యలను చేపట్టామన్నారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయాలు, తీర ప్రాంత మండల తహశీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖాధికారులను అప్రమత్తం చేయటంతో పాటు 250 విద్యుత్ స్థంభాలను అందుబాటులో ఉంచామన్నారు. అలాగే మంచినీరు కూడా కలుషితం కాకుండా రక్షిత మంచినీటి చెరువులన్నింటినీ క్లోరినేషన్ చేయిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో లక్షా 90వేల హెక్టార్లలో వరి కోతలు పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన 40 వేల హెక్టార్లలో శనివారం సాయంత్రం నాటికి వరి కోతలు పూర్తి చేస్తామన్నారు. పనల మీద, కుప్పల మీద ఉన్న పంటను రక్షించేందుకు 5వేల టార్ఫాలిన్‌లను సిద్ధం చేసినట్లు తెలిపారు. చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలను వెలుగు ద్వారా పంపిణీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.

విపత్తు ఎదుర్కోడానికి సిద్ధం అధికారులతో సమీక్షలో ఎస్పీ త్రిపాఠి

మచిలీపట్నం, : తుఫాన్ సహాయక చర్యలకు పోలీసు యంత్రాంగం కూడా సంసిద్ధులు కావాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం ఆయన తన ఛాంబర్‌లో పోలీసు అధికారులతో సమీక్షించారు. వాతావరణ శాఖ జారీ చేస్తున్న తుఫాన్ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకు తగిన విధంగా పోలీసులు కూడా సేవలు అందించాలన్నారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరం మేరకు వాహన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఇప్పటికే తీర ప్రాంత గ్రామాల్లో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ (సీపీఓ)ల సేవలను వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.