కృష్ణ

పూరగుట్ట చుట్టూ మైలవరం రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడు మాసాలకు పైగా ఉన్నప్పటికీ మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల సమయం వచ్చినట్లే ఇక్కడి రాజకీయ నేతల్లో నెలకొంది. ముఖ్యంగా గత మూడు మాసాలుగా అటు అధికార తెలుగుదేశం పార్టీ, ఇటు వైకాపా నేతలు, కార్యకర్తల మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు రోజు రోజుకూ వేడెక్కుతున్నాయి. గతంలో చాపకింద నీరుగా సాగిన నియోజకవర్గ రాజకీయం గత మూడు మాసాల క్రితం మైలవరం రాజకీయ తెరపైకి వైకాపా నేత వసంత వెంకట కృష్ణ ప్రసాద్(కేపీ) రాకతో మరింత వేడెక్కాయి. నిందిగామలో ఇరువురూ పాత ప్రత్యర్థులవటం, ఇరువురూ ఒకరిపై ఒకరు రాజకీయంగా కత్తులు దూసుకుంటుండటంతో మూణ్ణెల్ల ముందుగానే మైలవరంలో ఎన్నికలు వచ్చాయా అనే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా గత పది, పదిహేను రోజులుగా ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ విషయంలో ఇరు పార్టీల మధ్య నెలకొంటున్న ఆసక్తికర సంఘటనలు రాజకీయ నిరుద్యోగులకు మంచి ఉపాధినే అందిస్తున్నాయి. మైలవరంలో నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు అందించాలన్న సమస్య రెండు దశాబ్దాలుగా నెలకొంది. సుమారు పదేళ్ళ క్రితం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో అయ్యప్పనగర్ వైపు వెళ్ళే మార్గంలో తొమ్మిదిన్నర ఎకరాల భూమిని రైతుల నుండి కోటి పాతిక లక్షల రూపాయలతో కొనుగోలు చేశారు. కానీ అప్పటి నుండి ఆ భూమిని పంపిణీ చేయటానికి ఎవరికీ తీరిక దొరకలేదు. ఆభూమిలో సుమారు 372 మందికి మాత్రమే ఇళ్ళ స్థలాలుగా ఇవ్వటానికి లే అవుట్ తయారు చేశారు. కానీ మైలవరం పట్టణంలో ఇళ్ళ స్థలాల కోసం సుమారు 1500 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. వీరిలో 372 మందికి అయ్యప్ప నగర్‌లో ఇస్తే మిగిలిన వారికి ఎక్కడ ఇవ్వాలన్న సమస్య తలెత్తింది. స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దృష్టికి ఇళ్ళ స్థలాల సమస్యను అటు లబ్దిదారులు, అధికారులు పలుమార్లు తీసుకెళ్ళారు. ఇళ్ళ స్థలాల పంపిణీకి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేసైనా సేకరించాలని ఆలోచించిన మంత్రి అది సాధ్యం కాక ప్రభుత్వ భూములు ఖాళీగా గానీ, ఆక్రమణలో గానీ ఉంటే వెంటనే విచారణ జరిపి సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించటంతో మైలవరం పంచాయితీ కార్యదర్శి పిట్టా దేవప్రియుడు రికార్డులను ముందేసుకుని కుస్తీ పట్టారు. తర్వాత రికార్డుల ప్రకారం భూమిపైకి వెళ్ళి ఎట్టకేలకు మైలవరం, పొందుగలకు సమీపంలో 84 ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని ఖాళీగా ఉండటం గుర్తించి మంత్రి ఉమ దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన వెంటనే స్పందించి ఈభూమిని పేదలకు ఇళ్ళ స్థలాలుగా మార్చి పంపిణీ చేస్తే అర్హత కలిగిన అందరికీ సరిపోతుందని భావించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. భూమిలో పేరుకుపోయిన చెట్లు కొట్టి, పుట్టలను సరి చేయించి చదును చేసి అందులో ఒక భాగంలో సుమారు 1070 ప్లాట్లుగా విభజించి రాళ్ళు సైతం వేయించారు. ఈపాట్లను పొజిషన్ సర్ట్ఫికెట్లుగా లబ్దిదారులకు అందించాలని మంత్రి ఉమ అధికారులను ఆదేశించటం చకచకా జరిగిపోయాయి. దీంతో అధికారులు ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇరిగేషన్ భూమిని ఇళ్ళ స్థలాలుగా ఇవ్వటానికి వీల్లేదంటూ సుప్రీం కోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. ఈతీర్పు ననుసరించి ఇరిగేషన్ భూమిని భూ మార్పిడి చేయకుండా ఎలా పట్టాలిస్తారంటూ వైకాపా నేతలు రాజకీయ రచ్చ చేసేందుకు అదను కోసం కాచుకుని కూర్చున్నారు. వాస్తవంగా ఇరిగేషన్ భూమిని ఇళ్ళ స్థలాలుగా ఇవ్వాలంటే ముందు జిల్లా జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో జాయింట్ సర్వే జరగాలి, తర్వాత ఆ భూమి తమకు అవసరం లేదంటూ ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయటం దానిని రాష్ట్ర క్యాబినెట్‌లో అమోదం తెలిపిన తర్వాతనే రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న కలపను అటవీ అధికారుల అనుమతితో నరికించి బహిరంగ వేలం వేసి ఆ సొమ్మును ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంది. అనంతరం ప్రభుత్వ అనుమతితో ఆ స్థలంలో లే అవుట్ వేసి ప్లాట్లుగా విభజించి పేదలకు పంపిణీ చేయాల్సి ఉంది. ఈతతంగం జరగకుండా పేదలకు ఇళ్ళ స్థలాలు ఎలా ఇస్తారంటూ వైకాపా నేతలు అధికారుల చర్యలకోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తుండటం, దానికి ముందుగా వచ్చిన జన్మభూమి-మావూరు కార్యక్రమం రానే వచ్చింది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న తమకు ఈకార్యక్రమం ద్వారానైనా ఇళ్ళ స్థలాలు వస్తున్నాయని సంబరపడి జన్మభూమి సభకు వేలాదిగా తరలివచ్చిన మహిళలకు చుక్కెదురైంది. పట్టాల పంపిణీకి అధికారులు ఏ విధమైన ప్రామాణికతను పాటిస్తారోనని వైకాపా నేతలు ఎదురు చూస్తున్న సమయంలో అధికారులు అది గమనించి అటు మంత్రి ఉమ ఆదేశాలను కాదనలేక ఇటు వైకాపా నేతల నుండి ఎదురయ్యే న్యాయపరమైన చిక్కుల నుండి తప్పించుకునేందుకు ‘జవాబు పత్రం’ పేరుతో ఈనెల 9న అర్థరాత్రి సమయంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద తొమ్మిది మంది మహిళలకు పంపిణీ చేయటం వివాదాస్పదమైంది. దీంతో వైకాపా నేత కేపీ దీనిపై ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి రచ్చరచ్చ చేశారు. ఈవిషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం, సబ్ కలెక్టర్ మిషా సింగ్ స్పందించి తహశీల్దార్‌ను మందలించటంతో జన్మభూమిలో పంపిణీ చేయాల్సిన ఇళ్ళ స్థలాల పట్టాలు(జవాబు పత్రాలు) పంపిణీ నిలిచిపోయింది. నిలిచిపోయిన ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీనీ ఇరు రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. మీకివ్వాలనుకున్న ఇళ్ళ స్థలాల పట్టాలను ప్రతిపక్ష వైకాపా నేతల కుట్రలతో అడ్డుకున్నారని తెలుగు తమ్ముళ్ళు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరో వైపు అధికారులు, అధికార పార్టీ నేతలు మీకిచ్చేది ఇళ్ళ స్థలాల పట్టాలు కాదని, ప్రభుత్వ అనుమతి లేని జవాబు పత్రం అనే చెత్తకాగితాలని, చెత్తకాగితాలిచ్చి నిరుపేదలను మోసం చేయటాన్ని తాము వ్యతిరేకించామని అర్హత కలిగిన లబ్దిదారులకు ఇళ్ళ స్థలాల పట్టాలు ఇవ్వటానికి తామెంత మాత్రం వ్యతిరేకం కాదని వైకాపా నేతలు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. ఈదశలో ఇరు పక్షాలు పూరగుట్టను తరచుగా సందర్శిస్తూ ఈ అంశాన్ని రాజకీయ లబ్దికై తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. ఈదశలో వైకాపా నేతలు మరో అడుగు ముందుకేసి ఆ స్థలంలో తెలుగుతమ్ముళ్ళు అక్రమంగా నరికిన లక్షలాది రూపాయల విలువైన కలపను అమ్ముకుని జేబుల్లో వేసుకున్నారని దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైకాపా నేతల పాదముద్రలతో పూరగుట్ట మలినమైందని పేర్కొంటూ తెలుగుతమ్ముళ్ళు పసుపు నీటితో శుభ్రం చేస్తున్నారు. ఇవి పట్టాలు కావని చెత్త కాగితాలంటూ వైకాపా నేతలు స్వయంగా లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళి వాస్తవాలను చెప్పటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చివరికి ఈసమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందోనని మరి కొందరు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.