కృష్ణ

రంగు మారిన ధాన్యం కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పెథాయ్ తుపాన్‌కు తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ హాఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నిబంధనలు అడ్డంకిగా ఉన్నప్పటికీ రైతులను ఆదుకోవాలన్న సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.500కోట్ల ఆర్థిక భారాన్ని భరించి రంగు మారిన ధాన్యం కొనుగోలుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర భారీ నీటిపారుదల, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. రంగు మారిన ధాన్యాన్ని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రల సమక్షంలో కలెక్టర్ లక్ష్మీకాంతంకు చూపించి వినతిపత్రం అందచేశారు. దీనిపై స్పందించిన మంత్రి దేవినేని మాట్లాడుతూ పెథాయ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటకు ప్రభుత్వం పరిహారం చెల్లించిందన్నారు. తడిసి రంగు మారిన ధాన్యాన్ని సైతం కొనుగోలుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. కొనుగోలుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో జీవో జారీ కానున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.200లు ఉన్న పెన్షన్‌ను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో ముందడుగు వేసి పెన్షన్ మొత్తాన్ని పది రెట్లకు పెంచారన్నారు. 12 రకాల పెన్షన్‌లను ప్రభుత్వం అందిస్తోందని, రూ.2వేలు నుండి రూ.3500 వరకు పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 2014 జూన్‌కు ముందు 3.14లక్షల మంది పెన్షన్లకు రూ.8.4కోట్లు చెల్లించగా నేడు 4.34లక్షల మందికి రూ.90కోట్ల మేర ఇవ్వడం జరుగుతుందన్నారు. పది రెట్లు పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఫిబ్రవరి 1, 2, 3తేదీల్లో పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలని అధికారులను మంత్రి దేవినేని ఆదేశించారు. పెన్షన్ ఇవ్వటంతో పాటు మధ్యాహ్నం కడుపు నిండా భోజనం పెట్టి పంపాలన్నారు. జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆదరణ పథకం కింద మత్స్యకారులకు ఇచ్చే వలలో నాణ్యత లోపిస్తోందన్నారు. ఈ కారణంగా వాటిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారన్నారు. వలలకు బదులుగా ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల మత్స్యకారులకు ఇతోదికంగా లబ్ధి చేకూరుతుందని, ఈ విషయమై జెడ్పీలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని చైర్‌పర్సన్ అనూరాధకు సూచించారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ చేతి వృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరికీ తమ కార్పొరేషన్ ద్వారా ఆదరణ- పథకం కింద సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పని ముట్లు అందిస్తున్నట్లు తెలిపారు. వీటిని చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 29వతేదీ నుండి మండల స్థాయిలో గ్రౌండింగ్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ మాట్లాడుతూ కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామంలో ఇప్పటి వరకు పెథాయ్ తుఫాన్ బాధితులకు రేషన్ ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో కలెక్టర్ దృష్టిసారించి రేషన్ అందేలా చూడాలన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటింటి కుళాయి కనక్షన్ పథకానికి తొలి విడతగా జిల్లాకు రూ.994కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలోని 13 నియోజకవర్గాల నుండి ఒక్కొక్క గ్రామాన్ని గుర్తించి ఇంటింటి కుళాయి కనక్షన్ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పనులు జనవరి మాసాంతానికి లేదా మార్చి మొదటి వారానికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. రెండవ విడత పనులను కూడా ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామన్నారు. రాజ్యసభ సభ్యుల నిధుల వినియోగంలో అధికారులు తాత్సారం చేస్తుండటాన్ని మంత్రి కొల్లు రవీంద్ర తప్పుబట్టారు. గత ఆరు నెలలుగా మాజీ రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి ఇచ్చిన రూ.10లక్షలతో బందరు మండలంలో రెండు వాటర్ ట్యాంకర్ల ఏర్పాటు చేయడంలో అధికారులు నిమ్మకునీరెత్తిన చందాన వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ తక్షణమే ట్యాంకర్లను కొనుగోలు చేయాలని డీపీఓను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని వైఎస్‌ఆర్ సీపీకి చెందిన నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మీద ఓడిపోయిన వ్యక్తులకు ఇస్తున్న ప్రాధాన్యత మాకు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అనేక సమస్యలపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, రామకృష్ణారావు, కెడీసీసీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, జెడ్పీ ప్రతిపక్ష నాయకురాలు తాతినేని పద్మావతి, సీఇఓ షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు.