కృష్ణ

‘పోర్టు’ పనులు మళ్లీ వాయిదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బందరు ఓడరేవు నిర్మాణ పనుల ప్రారంభంలో సందిగ్ధం కొనసాగుతోంది. ఒక పక్క ఎన్నికల కోడ్ తరుముకొస్తున్నా పోర్టు పనుల ప్రారంభ తేదీ ఖరారులో స్పష్టత కొరవడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభిస్తామని స్థానిక ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు ఆచరణలోకి రావడం లేదు. అదిగో ఇదిగో సీఎం వచ్చేస్తున్నారు... అంటూన్నారే తప్ప సీఎం వచ్చిన పాపాన పోలేదు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామన్న అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పనుల ప్రారంభానికి అవరోధంగా మారిన భూ సేకరణ ప్రక్రియ నేడు ఒక కొలిక్కి వచ్చింది. దాదాపు 80 శాతం భూసేకరణ పూర్తయ్యింది. భూసేకరణ, భూ సమీకరణ పద్దతుల్లో గతంలో భూ సేకరణకు ప్రయత్నాలు చేయగా ఆశించిన ప్రయోజనం కనిపించలేదు. పోర్టుకు కావల్సిన 5వేల 300 ఎకరాలకు గాను 3వేల 100 ప్రభుత్వ, అసైన్డ్ భూముల సేకరణను గతంలోనే పూర్తి చేశారు. మిగిలిన భూముల్లో 700 ఎకరాలను భూసమీకరణ ద్వారా సేకరించారు. ఆ తర్వాత భూమి కొనుగోలు పథకం కింద మరో 400 ఎకరాలు సేకరించారు. ఇంకా 900 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. ఫిబ్రవరి 9వతేదీన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రానున్న నేపథ్యంలో పోర్టు పనుల ప్రారంభంపై అధికార పక్షం దృష్టి సారించింది. గడిచిన రెండు నెలలుగా పనుల ప్రారంభ తేదీలను ప్రకటించిన స్థానిక ప్రజా ప్రతినిధులు సీఎం బిజీ షెడ్యూల్ వల్ల ఆ తేదీల్లో పనులు ప్రారంభం కాలేదు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ నెల 31వ తేదీన పనుల ప్రారంభోత్సవానికి వస్తానని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని స్థానిక నాయకత్వానికి సూచించారు. ఇదే విషయాన్ని మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ సైతం అధికారికంగా వెల్లడించారు. మరుసటి రోజే ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడింది. ఈ నెల 31వ తేదీన సీఎం చంద్రబాబు తిరుపతిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా ఆ రోజు బందరు పర్యటన ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని స్థానిక నాయకత్వం వ్యక్తం చేస్తోంది. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో హైకోర్టు ప్రారంభోత్సవాలకు సీఎం హాజరు కానున్నారు. ఆ తర్వాత 4వ తేదీ అమావాస్య కావటంతో ఆ రోజు కూడా సీఎం పర్యటన ఉండకపోవచ్చు. 7వ తేదీన పోర్టు పనుల ప్రారంభానికి గడియలు మంచిగా ఉండటంతో ఆ తేదీ దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. 7వ తేదీన పనులు ప్రారంభం కాని పక్షంలో ఇక పోర్టు అటకెక్కినట్టేనని ప్రజలు భావిస్తున్నారు. ఫిబ్రవరి 9, 10 తేదీల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇందుకు ముందుగానే 7వ తేదీన పోర్టు పనులు ప్రారంభమవుతాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదంతా ఇలా ఉండగా పోర్టు పనుల ప్రారంభ సమయంలో అధికార తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా పొడు చూపుతున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా తెలుగుదేశం పార్టీలో బహునాయకత్వం కొనసాగుతోంది. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ సభలు, సమావేశాల్లో ఒకటిగా ఉంటూనే తమ తమ అధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన సీఎం చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభిస్తారని ముడ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బూరగడ్డ వేదవ్యాస్ అధికారికంగా వెల్లడించారు. తమతో ఏ మాత్రం సంప్రదించకుండా సీఎం పర్యటన తేదీని ఎలా బహిర్గతం చేస్తారన్న అంశం ఇతర నాయకుల ఆగ్రహానికి గురి చేసినట్టు తెలిసింది. ఇదే విషయమై బుధవారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నాయకుల మధ్య రసవత్తరమైన చర్చ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం.