కృష్ణ

సమస్యల ఏకరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర శాసనసభ కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తమ గళం వినిపించారు. తమ తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను ఏకరువు పెట్టారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన మంగళవారం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరగ్గా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పలు రకాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కార చర్యలకై డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సమస్యలపై వారు స్పందించారు.

పామర్రు అంటే ఆ రెండు గ్రామాలేనా: కైలే
మొన్నటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి పామర్రు నియోజకవర్గం అంటే ఆ రెండు గ్రామాలే కనిపించాయని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కైలే అనీల్ విమర్శించారు. పామర్రు ఎన్టీఆర్ సొంత గడ్డ అయినప్పటికీ ఆయన జన్మించిన నిమ్మకూరు, ఆయనకు పిల్లను ఇచ్చి కొమరవోలు గ్రామాలు తప్ప నాటి ప్రభుత్వానికి ఏ గ్రామం కనిపించలేదు. ఆ రెండు మినహా మిగిలిన అన్ని గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైందన్నారు. రూ.2కోట్లతో నిర్మించతలపెట్టిన ఇండోర్ స్టేడియం కలగానే మిగిలిపోయిందన్నారు. స్టేడియం నిర్మాణంలో ఉన్న ఇబ్బందులను తక్షణమే తొలగించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఎటువంటి అనుమతులు లేకుండా పాములంక వంతెన నిర్మాణానికి గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా రిమోట్ కంట్రోల్‌ను పనులు ప్రారంభించారో అర్థం కావడం లేదన్నారు.

పట్టాలున్నా సాగు చేసుకోనివ్వరా: రక్షణనిధి
ఎ.కొండూరు మండలం గిరిజన ప్రాంతాల్లో సుమారు 1500 మందికి నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టాలు ఇచ్చిన భూముల్లో ఎస్టీలైన రైతుల్ని సాగు చేసుకోనివ్వకుండా అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో అధికారులు గత రెండున్నర యేళ్లుగా అడ్డుకుంటున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఆరోపించారు. దీనిపై తాను విజయవాడలో సైతం రైతులతో కలిసి ధర్నా చేస్తే ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారితో సాగు చేయిస్తామని హామీ ఇచ్చామన్నారు. గత రెండు రోజుల క్రితం కూడా రైతులు సాగు చేసుకునేందుకు ప్రయత్నించగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారన్నారు. ప్రభుత్వం మారినా అధికారుల తీరులో మార్పు రాకపోవడం గర్హనీయమన్నారు. పట్టాలు ఉన్న ప్రతి రైతు ఆ భూముల్లో సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కలెక్టర్ ఇంతియాజ్‌కు విజ్ఞప్తి చేశారు.

మంటలు అదుపు చేసేందుకూ నీరు లేదు: సింహాద్రి
దివిసీమలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందంటే ఆ స్థాయిలో ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు కూడా నీళ్లు లభించని పరిస్థితి తమ నియోజకవర్గంలో ఉందన్నారు. వాడుక నీటినే పలు రకాల అవసరాలకు వినియోగించుకుంటూ నియోజకవర్గ ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల నుండి దివిసీమ ప్రజలకు మోక్షం కలిగించాలని, మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వేదిక మీద ఉన్న మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలను ఆయన కోరారు.

అటవీ భూముల్లో మట్టి తవ్వకాలా: మొండితోక
కొంత మంది అక్రమార్కులు రిజర్వు ఫారెస్ట్ భూముల్లో సైతం మట్టి తవ్వకాలు జరుపుతున్నా అధికారులకు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఆరోపించారు. పర్యావరణానికి విఘాతం కలుగకుండా మట్టి తవ్వకాలు జరపాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. విచ్చలవిడి మట్టి తవ్వకాల వల్ల గ్రామాల్లో రహదారులు మరమ్మతులకు గురై ప్రయాణాలు నరకయాతనగా మారాయన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ జిల్లాలో రెండు మూడు రోజుల్లో ఇసుక రీచ్‌లపై స్పష్టత వస్తుందని తెలిపారు.

దిక్కు లేని కైకలూరు పట్టించుకోండి: దూలం
ఏ దిక్కు లేని కైకలూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కోరారు. కైకలూరు నియోజకవర్గానికి ఒక దిక్కు కొల్లేరు, మరో దిక్కున ఉప్పుటేరు, మరొక దిక్కున ఏలూరు ఉందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా తాగునీటి అవసరాలను తీర్చటంతో పాటు ఆక్వా పరిశ్రమలకు సమృద్ధిగా సాగునీటిని విడుదల చేయాలని కోరారు. ఆక్వా పరిశ్రమకు సాగునీటి విడుదల విషయమై గతంలో ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ మేరకు ఆక్వా పరిశ్రమలకు సాగునీరు విడుదల చేసి ఆ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.