కృష్ణ

తొలి ఏకాదశి సందర్భంగా పుణ్యక్షేత్రాలు కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు వేదాద్రి కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీయోగానందలక్ష్మినరసింహస్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు తెనాలి వాస్తవ్యులు మునగాల సాంబయ్య దేవస్ధానానికి వచ్చిన భక్తులందరికి అన్నసమారాధన నిర్వహించారు. గుంటూరు వాస్తవ్యులు ఆర్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఉదయం అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి నామ సంకీర్తన, ఏకాహ భజనలను భక్తులు నిర్వహించారు. తిరుమలగిరి క్షేత్రంలోను భక్తుల రద్దీ కొనసాగింది. ఉదయం నుండి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు క్యూలైనుల్లో బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా కార్యనిర్వాహాణాధికారి, సహాయకమిషనర్ డి సాయిబాబా ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వేదాద్రిలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు
వేదాద్రి శ్రీయోగానందలక్ష్మినరసింహస్వామివారి దేవస్థానంలో తలపెట్టిన పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విశే్వక్షణ పూజ, అగ్నిమధనం, అగ్ని ప్రతిష్టాపన, పవిత్ర శుద్ది, నవగ్రహ యజ్ఞ కార్యక్రమాలు తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రొపెసర్ అగ్నిహోత్రం, శ్రీనివాసాచార్యుల నిర్వహణలో దేవస్ధానం అర్చకులు వేదాంతం శేషాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త వెలగపూడి ఇందిరాదత్ తరుపునా కేసీపీ ఏజీఎం ఫణికుమార్, ఆలయ ఇఓ గెల్లి హరిగోపినాధ్‌బాబులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు ఈదైవ కార్యక్రమాలను తిలకించారు.

శాకంబరీ దేవిగా తిరుపతమ్మ అమ్మవారు

పెనుగంచిప్రోలు, జూలై 12: కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారు శుక్రవారం శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో అమ్మవారిని, సహదేవతలను శాకంబరులుగా అలంకరించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా భక్తుల వద్ద నుండి పెద్ద ఎత్తున కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సేకరించి వాటిని దండలుగా కూర్చి అమ్మవారితో పాటు సహదేవతలను, మరియు ఆలయాన్ని అందంగా అలంకరించారు. ఉదయం 5గంటల నుండి శాకంబరీగా దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు క్యూలైన్‌లో నిలబడి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని వేదపండితుల ఆధ్వర్యంలో చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ హోమం వద్ద కార్యనిర్వహణ అధికారిణి కె శోభారాణి, ఆలయ పాలకమండలి చైర్మన్ అత్తులూరి అచ్యుతరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి రధోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రధాన అర్చకులు మర్రెబోయిన వెంకట రమణ, పురోహితులు, వేదపండితులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకువచ్చి రంగురంగుల విద్యుత్ దీపాలు, పలు రకాలు కూరగాయలతో అలంకరించిన రథంపై ఉంచారు. అనంతరం స్థానిక శాలివాహనులు, రజకులు ప్రత్యేక క్రతువులు నిర్వహించగా పాలకమండలి చైర్మన్ అచ్యుతరావు లాంఛనంగా రథోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుర వీధుల్లో రధోత్సవం నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా అడుగడుగునా మహిళలు రథం ముందు వార్లు పోస్తూ కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు గింజుపల్లి గోపీచంద్, వసంతరావు, పెనుగొండ గోపాలరావు, కుటుంబరావు, నాగార్జున, దేవస్థానం మాజీ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, సహకార సంఘ అధ్యక్షుడు నల్లపునేని వెంకట నారాయణ, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు బిక్కి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.