కృష్ణ

క్షణం.. క్షణం.. భయం.. భయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : కృష్ణానదికి రోజు రోజుకీ పెరుగుతున్న వరద ఉధృతితో లంక గ్రామాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. క్షణం క్షణం భయం భయంగా లంక వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. జగ్గయ్యపేట మొదలుకుని కృష్ణమ్మ సముద్రుడి చెంత కలిసే కోడూరు మండలం హంసలదీవి వరకు నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో కొంత మేర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకాశం బ్యారేజీ నుండి సుమారు 9లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని దిగువకు విడుదల చేయటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కృష్ణానదికి అత్యంత చేరువగా ఉన్న పలు లంక గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. పమిడిముక్కల మండలం లంకపల్లి, ఐనవూరుతో పాటు అవనిగడ్డ మండలం ఎడ్లలంక, దక్షిణచిరువోలులంక, చల్లపల్లి మండలం ఆముదార్లంక, మోపిదేవి మండలం బొబ్బర్లంక, కె.కొత్తపాలెం, మోపిదేవి వార్పు గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకు వచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి ముంపుకు గురైన గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తం 12 గ్రామాలు వరద ముంపుకు గురైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో మొత్తం 41 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా 8వేల 100 మందికి ఆశ్రయం కల్పించారు. 35 మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 18 మండలాల్లోని 24 గ్రామాలను వరద ప్రభావిత గ్రామాలుగా గుర్తించిన అధికారులు ఆయా గ్రామాల్లో సహాయక చర్యలను ప్రారంభించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభిస్తున్నాయి. 160 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు వరద ప్రభావానికి పెద్ద ఎత్తున వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. వరితో పాటు వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం 4100 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. 2వేల 839 హెక్టార్లలో వరి పంట దెబ్బతినగా 1398 హెక్టార్లలో అరటి, పసుపు, చేమ దుంప వంటి ఉద్యానవన పంటలు, 20 హెక్టార్లలో శెరికల్చర్ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక తయారు చేశారు. 160 గృహాలు వరద ప్రభావానికి దెబ్బతినగా 315 గృహాలు వరద ముంపుకు గురయ్యాయి. సుమారు రూ.36లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. సరిగ్గా పదేళ్ల క్రితం కృష్ణానదికి 11లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 9లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు సహాయక చర్యలను పటిష్ఠవంతంగా నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు వరద ప్రభావిత గ్రామాల్లోనే మకాం వేసి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. వరద ఉధృతిపై ప్రజలకు మైక్ ద్వారా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. దివిసీమలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు, ఆర్డీవో జె ఉదయ భాస్కర్ విస్తృతంగా పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కల్పించారు. చిన్నారులు, వృద్ధుల కోసం పాలు, రొట్టెలు పంపిణీ చేస్తున్నారు. రానున్న మూడు రోజుల పాటు వరద ఉధృతి ఇదే విధంగా ఉంటుందని ఉన్నతాధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు క్షణం తీరిక లేకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.