కృష్ణ

ఉపాధ్యాయ వర్గం మెచ్చేలా బదిలీలు, పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఉపాధ్యాయ వర్గం మెచ్చే విధంగా బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి త్వరలోనే పరిపాలనా ఆమోదాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం జిల్లా స్థాయి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ విద్య, ఉపాధ్యాయ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఏ నిరుపేదా విద్యకు దూరం కాకూడదన్న ముఖ్య ఉద్దేశ్యంతో అమ్మ ఒడి కార్యక్రమానికి జనవరి 26వతేదీ నుండి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటి వరకు ఒక క్రమపద్ధతి లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు జరిగాయన్నారు. రానున్న రోజుల్లో అలా కాకుండా ఉపాధ్యాయ వర్గాలతో చర్చలు జరిపి వారి కోరిక మేరకే బదిలీలు, పదోన్నతులు చేపడతామన్నారు. డీఎస్సీ పరీక్షకు తీవ్రమైన పోటీ నెలకొందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మాటలు కోటలు దాటినా ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోచుకోలేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది సమాజంలో మార్పు తీసుకువచ్చే ఉపాధ్యాయుడే ప్రపంచంలో తొలి ప్రజా సేవకుడన్నారు. గతంలో చాలీ చాలని జీతాలతో ఉపాధ్యాయులు అనేక కష్టాలను అనుభవిస్తూనే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేవారన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనలో ప్రధాన పాత్ర పోషించేది ఉపాధ్యాయులేనన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ విద్యతో పాటు మానవ సంబంధాలు, నైతిక విలువలు పెంపు దిశగా మహిళా కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థి దశ నుండే మానవీయ సంబంధాలు, నైతిక విలువలను విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. శాసనమండలి సభ్యుడు ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ లీడర్‌షిప్‌తో పాటు విద్యా రంగంలోనూ జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి 33వేల కోట్లు కేటాయింపు చారిత్రాత్మకమన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించాలని కోరారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింప చేస్తే విద్యా ప్రమాణాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మరో శాసనమండలి సభ్యుడు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతి ఒక్కరూ బలపర్చాలన్నారు. వంద రోజుల జగన్ పాలనలో విద్యారంగం పరంగా తీసుకున్న నిర్ణయాలు అభినందనీయమన్నారు. అమ్మ ఒడి, 100 శాతం ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు, ప్రైవేట్ విద్యా సంస్థల నియంత్రణకు కమిషన్ల ఏర్పాటు స్వాగతించాల్సిన అంశాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ప్రధాన డిమాండ్ సీపీఎస్‌ను కూడా రద్దు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ సంస్కారం లేని విద్య వ్యర్థమన్నారు. విద్య గొప్పతనం గురించి వివరిస్తూ దొరలు దోచుకోలేని.. దొంగలు ఎత్తుకు పోలేనిదే విద్య అని వేమన శతకాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ ఉదహరించారు. విద్యార్థి జీవితం ఎగురుతున్న గాలిపటం వంటిదన్నారు. సంస్కారం లేని జీవితం తెగిన గాలిపటం వంటిదన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు పరిపూర్ణ విద్యను అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులను ప్రభావితం చేసే వారినే ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. సమావేశానంతరం జిల్లాలో 101 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, 31 మంది ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, డీవైఇఓలు బి సత్యనారాయణమూర్తి, కమల కుమారి, చంద్రకళ, ఎడీలు విజయలక్ష్మి, అవధాని, వెంకట రాజు, జిల్లా కామెన్ ఎగ్జామినేషన్ బోర్డు కార్యదర్శి లలిత మోహన్ తదితరులు పాల్గొన్నారు.