కృష్ణ

కరస్పాండెంట్ కీచకపర్వంపై మహిళా కమిషన్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం : గ్రేస్ నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ సమయం రమేష్ వికృత చేష్టలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కరస్పాండెంట్ రమేష్ ప్రవర్తనపై స్పందించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శనివారం సంబంధిత కళాశాలను సందర్శించారు. కళాశాల విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులంతా మూకుమ్మడిగా సదరు కరస్పాండెంట్ వికృత చేష్టలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. తరుచూ తమను కరస్పాండెంట్ వేధింపులకు గురి చేస్తున్నాడని తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కరస్పాండెంట్ తీరుపై విద్యార్థినుల నుండి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న కరస్పాండెంట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు తగిన భద్రత కల్పించే విధంగా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. గత కొంత కాలంగా కరస్పాండెంట్ ప్రవర్తనతో విసిగిపోయిన విద్యార్థినులు నేడు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. కేవలం ఇంటర్నల్ మార్కులు తమ చేతిలో ఉన్నందు వల్ల కరస్పాండెంట్ ఈ విధంగా ప్రవర్తించడం జరిగిందన్నారు. విద్యార్థినుల చదువుకు ఆటంకం లేకుండా ఇలాంటి యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విద్యార్థుల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు కమిటీ కూడా లేకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థినుల సంఖ్యకు తగిన విధంగా టాయిలెట్స్ లేవని, నిబంధనల మేరకు తగిన సెక్యూరిటీ లేదన్నారు. ఈ సంస్థ నుండి బయటకు వెళ్లాక తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే భయం విద్యార్థినుల్లో వ్యక్తమైందన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న ఈ సంస్థను తనిఖీలు నిర్వహించినందుకు విశ్వ విద్యాలయానికి లేఖ రాస్తామన్నారు. విద్యార్థినులు తమ విచారణలో వెల్లడించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వారు నిర్భయంగా విద్యనభ్యసించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఫిర్యాదు చేసిన వారిపై కళాశాల యాజమాన్యం ఏమైనా చర్యలు తీసుకుంటే సహించబోమని ఆమె హెచ్చరించారు. మహిళా విద్యా సంస్థల్లో వారి భద్రతకు తీసుకోవల్సిన చర్యలు, నిబంధనల అమలు తదితర అంశాలపై త్వరలోనే జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆమె వెంట అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు, బందరు డీఎస్పీ మొహబూబ్ బాషా తదితరులు ఉన్నారు.