కృష్ణ

గుడివాడలో అవిశ్వాస రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జూలై 18: గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుపై అవిశ్వాసానికి రంగం సిద్ధమయింది. మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు బుధవారం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాసం నోటీసును అందజేశారు. కౌన్సిల్‌లో సైకిల్ గుర్తుపై గెల్చిన 16మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేశారు. వీరితో పాటు చైర్మన్ యలవర్తితో కలిసి టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు పెనుమూడి రమేష్‌తో పాటు మరో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు రావులకొల్లు హైమావతి, జ్యోతుల సత్యవేణి, మాదాసు వెంకటలక్ష్మి, అల్లం సూర్యప్రభలు కూడా సంతకాలు పెట్టారు. నోటీసు ఇచ్చేందుకు 19మంది సభ్యుల సంతకాలు అవసరం కాగా 21మంది సంతకాలు చేశారు. ఒకవైపు ఈ నెల 28న మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జిపై ఇచ్చిన అవిశ్వాసం నోటీసుకు సంబంధించి కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ యలవర్తిపై కూడా కౌన్సిల్ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇవ్వడంతో మున్సిపల్ రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ నుండి టీడీపీలో చేరిన చైర్మన్ యలవర్తిపై అవిశ్వాసం ఇచ్చేందుకు కౌన్సిల్ టీడీపీ ఫ్లోర్‌లీడర్ లింగం ప్రసాద్‌ను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్ఠానం తీసుకుంటున్న చర్యలు ఫలితాలివ్వడం లేదు. ఇప్పటికే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఒక రోజంతా అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లతో సమావేశమయ్యేందుకు వచ్చి ఎవరినీ కలవకుండానే వెనుదిరిగారు. బుధవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా పట్టణానికి వచ్చి జడ్పీ అతిథి గృహంలో కొద్దిసేపు గడిపారు. టీడీపీ కౌన్సిలర్లను సంప్రదించేందుకు ఎంతగా ప్రయత్నించినా ఎవరూ అందుబాటులోకి రాలేదు. ఇంకా మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ళ నారాయణ కూడా ఒకటి, రెండు రోజుల్లో వచ్చి కౌన్సిలర్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవైపు వైస్‌చైర్మన్ అడపా బాబ్జిపై టీడీపీ ఇచ్చిన అవిశ్వాసం, మరోవైపు టీడీపీలోకి వచ్చిన చైర్మన్ యలవర్తిపై అవిశ్వాసం నోటీసు తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంకోవైపు వైసీపీ కూడా అవిశ్వాసం వ్యవహారంలో ఇబ్బందులు పడుతోంది. వైసీపీకి చెందిన వైస్‌చైర్మన్‌పై ఇచ్చిన అవిశ్వాసంపై అవలంబించాల్సిన వ్యూహంపై తర్జనభర్జనలు సాగుతుండగా, అదే పార్టీకి చెందిన మరో నలుగురు కౌన్సిలర్లు చైర్మన్ యలవర్తిపై ఇచ్చిన అవిశ్వాసం నోటీసులో సంతకాలు చేయడం ఇబ్బందికరంగా మారింది. కౌన్సిల్‌లో ఫ్యాన్ గుర్తుపై గెల్చిన 20మంది కౌన్సిలర్లలో 12మంది చైర్మన్ యలవర్తి నాయకత్వంలో టీడీపీలో చేరగా, మరో నలుగురు తాజాగా కౌన్సిల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్‌తో కలిసి చైర్మన్ అవిశ్వాసం వ్యవహారంలో సంతకాలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం కౌన్సిల్‌లో వైసీపీ బలం ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా ఉన్న ఎమ్మెల్యే కొడాలి నానితో కలిపి ఐదుకు పరిమితమైంది. వైస్‌చైర్మన్, చైర్మన్ అవిశ్వాసం వ్యవహారాల్లో కౌన్సిల్ సభ్యులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది గందరగోళంగా మారింది.