కృష్ణ

నాసిరకం ఉల్లి అమ్మకంపై కలెక్టర్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, అక్టోబర్ 16: కూచిపూడి రైతు బజారు నిర్వహణపై జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. రైతు బజారు నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రత్యేక అధికారి సారథిని తక్షణమే బదిలీ చేయాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డీడీని ఫోన్‌లో ఆదేశించారు. మంగళవారం కూచిపూడికి విచ్చేసిన ఆయన ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రైతు బజారును ఆకస్మిక తనిఖీ చేశారు. రైతు బజారులో అమ్ముతున్న ఉల్లిపాయలు నాసిరకంగా ఉండటం, కుళ్లిపోయి ఉండటాన్ని గమనించారు. ధరల పట్టికను ప్రదర్శించకపోవటాన్ని గుర్తించిన ఆయన ఎస్టేట్ ఆఫీసర్ నరసింహారావును వివరణ కోరగా సరైన సమాధానం చెప్పక పోవటంతో ఆగ్రహించిన ఆయన తక్షణమే వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైతు బజారులో విక్రయిస్తున్న దుకాణదారుల వివరాలు, రైతు కార్డులు, తూనికలు, టాయిలెట్ల నిర్వహణ, మంచినీటి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ తనిఖీలో ఆర్డీఓ ఉదయ భాస్కర్, ఎంపీపీ కిలారపు మంగమ్మ, వైస్ ఎంపీపీ నన్నపనేని వీరేంద్ర, తహశీల్దార్ బి రామానాయక్, ఎంపీడీఓ వి ఆనందరావు, ఎడీఎ డా. శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శ్రీ ధనలక్ష్మిగా దేవీ అలంకారాలు
అవనిగడ్డ, అక్టోబర్ 16: శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని స్థానిక శ్రీ రాజశేఖరస్వామి, శ్రీ లంకమ్మ అమ్మవారు, శ్రీ గీతా మందిరం, పులిగడ్డలోని శ్రీ కనకదుర్గ అమ్మవార్లు శ్రీ ధనలక్ష్మీ అలంకారంలో మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. మత్తి శ్రీనివాసరావు దంపతులు అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. లలితా సహస్రనామ కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. అర్చక స్వాములు రాజశేఖర శర్మ, సత్యనారాయ శర్మ, నరసింహమూర్తి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేయగా, పవన్ సంతోష్ కుమార్ బ్రహ్మత్వంలో పూజలు జరిగాయి. ఆలయ ధర్మకర్తలు రామనాధబాబు, శ్రీరాములు, హరిబాబు, ఇఓ మోహనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ప్రజల్లోకి వెళదాం!
* ప్రభుత్వ విజయాలు ప్రచారం చేద్దాం
* టీడీపీ జిల్లా విస్తృత సమావేశంలో మంత్రి ఉమా పిలుపు
విజయవాడ (క్రైం), అక్టోబర్ 16: రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లోకి వెళ్లి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నగరంలో జరిగింది. ఇక నుంచి విస్తృత స్ధాయి సమావేశాలు ప్రతి నెలా ఒక్కో నియోజకవర్గంలో నిర్వహిస్తామని, నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల సంఖ్య పెరిగినందున అందుకు తగిన విధంగా కన్వీనర్ల నియామకం చేపట్టాలని, పార్టీ సభ్యత్వం కలిగిన పట్ట్భద్రులందరినీ కృష్ణా-గుంటూరు పట్ట్భద్రుల నియోజకవర్గంలో ఓటర్లుగా చేర్పించడానికి తగు చర్యలు తదితర అంశాలపై సమావేశం చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ జిల్లా పార్టీ కార్యాలయానికి ఈనెలాఖరులోగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్ధాపన చేయనున్నట్లు తెలిపారు. తన వంతుగా నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల పైనా దృష్టి సారించాలని, విద్యావంతులందరితో, వివిధ సంఘాల నాయకులతో సంప్రదించి వారందరినీ పట్ట్భద్రుల నియోజకవర్గ ఓటర్లుగా నమోదు చేయించేందుకు ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలావుండగా రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు జగన్, విజయసాయిల దర్శకత్వంలో జరుగుతున్నాయని, ఇలాంటి చర్యలకు భయపడేది లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు డబ్బు ఇవ్వాల్సిన కేంద్రాన్ని నిలదీయకుండా నిర్వాసితుల పక్షాన నిలబడతానని పవన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్, పవన్‌లను కలపడానికి బిజెపి నేతృత్వం వహిస్తోందని, అన్ని రాజకీయ పక్షాలు ఏకమై ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావు, శ్రీరాం రాజగోపాల్, గద్దె రామ్మోహన్, బొండా ఉమా, బోడే ప్రసాద్, తంగిరాల సౌమ్య, ఉప్పులేటి కల్పన, పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రతినిధులు హాజరయ్యారు.