కృష్ణ

మాస్టర్ ప్లాన్‌పై ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: రాజధాని మాస్టర్ ప్లాన్‌పై సిఆర్‌డిఎ ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరపాలని, వ్యవసాయ పరిరక్షణ జోన్‌లను సమూలంగా మార్చాలని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌ను తెలుగులో ప్రచురించి అందించాలని కోరింది. ఈ నెల 21న అన్ని ప్రజా సంఘాల, రాజకీయ నాయకులు కలిసి సిఆర్‌డిఎ కమిషనర్‌కు వినతిపత్రం అందజేయాలని సమావేశం తీర్మానించింది. మాస్టర్ ప్లాన్‌పై మార్చి చివరి వరకు చర్చ జరపాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లపై స్పందించకపోతే ఈ నెల 25న సిఆర్‌డిఎ కార్యాలయం ముట్టడించాలని సమావేశం పిలుపునిచ్చింది. సిఆర్‌డిఎ మాస్టర్ ప్లాన్‌లోనూ, వ్యవసాయ పరిరక్షణ జోన్‌లోనూ నిబంధనలు మార్చాలనే డిమాండ్‌తో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం హనుమంతరాయ గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శి రఘు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా ఆ పార్టీ రాజధాని కమిటీ కన్వీనర్ సిహెచ్ బాబురావు మాట్లాడుతూ సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలకు ఉరితాడని పేర్కొన్నారు. రానున్న కాలంలో సొంత భూమిలో ఇళ్లు, భవన నిర్మాణాలు నిర్మించుకోడానికి అనుమతులు లభించవని, అభివృద్ధి నిలిచిపోతుందని వెల్లడించారు. రెండు జిల్లాల ప్రయోజనాలను దెబ్బతీస్తే అది ప్రజా రాజధాని ఎలా అవుతుందని ప్రశ్నించారు. సింగపూర్ తయారుచేసిన మాస్టర్ ప్లాన్ సింగపూర్‌కే అనుకూలంగా ఉందన్నారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, వైఎస్సార్సీపి నాయకులు మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్‌పై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో సహా ఎవరికీ అవగాహన లేదని తెలిపారు. సింగపూర్‌తోనూ, స్థానిక నిపుణులతోనూ ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని సూచించారు. వీటిపై ప్రజాభిప్రాయాలు సేకరించి మెరుగైన మాస్టర్‌ప్లాన్ ఎంపిక చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది తాకట్టు మనస్థత్వం అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయుకుడు, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్‌కు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఇప్పుడు సింగపూర్‌కి తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రైతుల మెడ మీద కత్తిపెట్టి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. గ్రీన్‌బెల్ట్ పేరుతో వ్యవసాయంపై ఆంక్షలు విధించడం రైతులపై ప్రభుత్వపరంగా చేస్తున్న దాడి అని ఆయన అన్నారు. విశాఖలో జరిగిన ఒప్పందాల్లో పెట్టుబడిదారులు ఎంత భూమి అడిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు హరినాథ్, సిపిఐ (ఎంఎల్) నాయకులు రామారావు, రైతు సంఘం నాయకులు కేశవరావు, సిఐటియు కృష్ణాజిల్లా కార్యదర్శి డివి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

25లోపు ఇసుక రీచ్‌లపై
క్షేత్రస్థాయి పరిశీలన
* జెసి గంథం చంద్రుడు ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 19: జిల్లాలో ఇసుక రీచ్‌ల యథార్థ స్థితిగతులు, నూతన రీచ్‌లపై పరిశీలనకు జాయింట్ తనిఖీ బృందం ఈ నెల 25 నాటికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్, డిఎల్‌ఎస్‌సి చైర్మన్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. స్థానిక జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం, సమన్వయ శాఖల అధికారులతో ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్షలో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న నూతనంగా 12 రీచ్‌ల నుండి 11 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అందుబాటులోకి రానున్నట్లు ఒక అంచనాకు రావడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో జిల్లా స్థాయి బృందంతో కూడిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా మరిన్ని రీచ్‌లను గుర్తించి నివేదిక అందివ్వాలని చంద్రుడు పేర్కొన్నారు. ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ప్రభుత్వ ఉత్తర్వులు 2015, అక్టోబర్, 15న జీవో 19, 20లలోని మార్గదర్శకాలకు లోబడి చర్యలు చేపట్టాలని జెసి సూచించారు. లీజు సందర్భంలో ఆచరణలో జారీ చేసిన లభ్యమయ్యే ఇసుకపైనే నివేదికను అందించాల్సి ఉందన్నారు. జిల్లాలో రిజర్వాయర్లు, చెరువల సమీపంలో డి - సిల్‌టేషన్ (డిమృతికా నిక్షేపాలు) విధానంలో ఇసుక నిలవలపై నోటిఫికేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఇసుక రీచ్‌ల గుర్తింపు అనంతరం మండల, డివిజన్, గ్రామ స్థాయిల్లో, ఇసుక మోసే ప్రాంతాలలో పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని, వాటిపై ఉత్తర్వులు రూపొందించాలని జాయింట్ కలెక్టర్ చంద్రుడు ఆదేశించారు. జిల్లా స్థాయి ఆధ్వర్యంలో గుర్తించిన ఇసుక రీచ్‌లకు చెందిన ఇ - టెండర్ కమ్ వేలం ప్రక్రియను నిర్వహించాల్సి ఉందన్నారు. జిల్లా స్థాయి కమిటీలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా పరిషత్ సిఇవో ఉప చైర్మన్‌గా, మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ల కన్వీనర్‌గాను, డ్వామా పిడి సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారి, ఉప సంచాలకులు, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, భూగర్భ జలశాఖ, జిల్లా పంచాయతీ అధికారి సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ జి సృజన, ఆర్‌డివోలు చక్రపాణి, సాయిబాబు, కన్వీనర్ ఎడి మైన్ కె సుబ్రహ్మమణ్యం, డ్వామా, పంచాయతీరాజ్, జిల్లా పంచాయతీ అధికారి రిజర్వ్ కన్వీనరేటర్, భూగర్భజలాల తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిందితులకు బెయిల్ మంజూరుపై
కమిషనరేట్ మల్లగుల్లాలు

విజయవాడ (క్రైం), జనవరి 19: సంచలన కేసుల్లో నిందితులను గుర్తించడం, పరారీలో ఉన్నవారిని అరెస్టు చేయడం పోలీసులకు ఓ ప్రహసనంలా మారుతోంది. నిందితులు లొంగిపోతేనో, లేక పట్టుకుని అరెస్టు చేసి రిమాండుకు పంపడం వెనక తమ శ్రమ అంతా ఇంతా కాదని పోలీసులు భావిస్తున్నారు. అయితే అరెస్టయి రిమాండుకు వెళ్లిన నిందితులు ఒక్కొక్కరిగా బెయిల్‌పై బయటకు రావడాన్ని కమిషనరేట్ జీర్ణించుకోలేకపోతోంది. సంచలన కేసుల్లో నిందితులు ఇలా లోనికి వెళ్లి అలా బయటకు రావడంతో వారిని తిరిగి ఎలా పట్టి లోపలకి పంపాలోనని పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అంతకన్నా ప్రధానంగా ఆయా కేసుల్లో ఫిర్యాదులైన బాధితులు, సాక్షులకు రక్షణ లేకుండా పోతుందని, విచారణపై ప్రభావం పడుతుందని భావిస్తున్న పోలీసులు ఇదే వాదనను బెయిల్ ఆర్గ్యుమెంట్స్ సమయంలో కోర్టులో గట్టిగా వాదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో తాజాగా ప్రధాన నిందితుడు యలమంచిలి రాము, భవానీశంకర్, దూడల రాజేష్‌కు బెయిల్ లభించడంతో ఒక్కసారిగా కమిషనరేట్ అధికారులు అవాక్కయ్యారు. ఈ కేసులో నాలుగో నిందితుడైన ఎలక్ట్రికల్ డిఇ ఎం సత్యానందం పరారీలో ఉండి హైకోర్టు నుంచి బెయిల్ పొంది డిసెంబర్ 31న నగరంలో ప్రత్యక్షమయ్యాడు. దీన్ని జీర్ణించుకోలేని పోలీసులు అవమానంగా భావించి అతనిపై నమోదైన మరో కేసులో అదే రోజు రాత్రి అరెస్టు చేసి తృప్తి చెందారు. అంతటితో ఆగక.. పిటి వారెంట్‌పై మరో కేసులో అరెస్టు చూపించారు. దీంతో సత్యానందం మరికొంతకాలం జైలుకే పరిమితమని భావిస్తున్నారు. అదే విధంగా కల్తీ నెయ్యి కేసులో ప్రధాన నిందితుడు ఆవుల ఫణికి ఇటీవల హైకోర్టు నుంచి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే అతని బావ అనిల్ కూడా హైకోర్టు నుంచి అంతకుముందే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ రెండు ఉదంతాలు కూడా పోలీసులకు మింగుడు పడలేదు. వీరి బెయిల్ రద్దుకు పైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే డిఇ సత్యానందం కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులో ముందస్తు బెయిల్ రద్దు కోరేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించేలా ప్రభుత్వ జీఓ కూడా జారీ అయింది. ఈ దిశగా ఇప్పటికే కమిషనరేట్ పోలీసులు కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజా ఉదంతంలో ఒకే కేసులో ముగ్గురికి బెయిల్ రావడం పట్ల అసంతృప్తితో ఉన్న పోలీసులు రద్దు కోరుతూ హైకోర్టును ఆశ్రయించవచ్చని వినికిడి. మరోవైపు నిందితులపై నమోదైన ఉన్న ఇతర కేసుల్లో అరెస్టు చేయవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన నిందితుడు రాము, దూడల రాజేష్ పటమట కేసుల్లో పిటి వారెంట్‌పై అరెస్టయి ఉన్నారు. వీరికి బెయిల్ రావడం వల్ల మిగిలిన వారికి కూడా త్వరలో బెయిల్ వచ్చే అవకాశం లేకపోలేదనే న్యాయవాద వర్గాల వాదనను పోలీసులు పరిగణనలోకి తీసుకుని న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక కల్తీ మద్యం కేసులో తొలుత అరెస్టయిన తొమ్మిది మందికి ఇప్పటికే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ కేసులో మల్లాది విష్ణుకు కూడా బెయిల్ రాకుండా ప్రాసిక్యూషన్ తరఫున జాగ్రత్తలు పాటించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

బినామీల భరతం పట్టనున్న ఎసిబి
విజయవాడ (క్రైం), జనవరి 19: లంచం తీసుకోడం, ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టడం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపైనే ఇప్పటివరకు అవినీతి నిరోధక శాఖాధికారులు దృష్టి సారించడం జరుగుతోందనుకుంటే పొరపాటే. అట్టి అక్రమార్కుల పప్పులేవీ ఉడకవ్ అన్నట్లు ఇప్పుడు బినామీలపై కూడా ఎసిబి కనే్నసింది. చాలామంది అధికారులు, ఉద్యోగులు తమ అవినీతి సంపాదనకు, ఆస్తులకు తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పని మనుషులు, డ్రైవర్లు, ఇతర వ్యక్తులను బినామీలుగా చూపడం జగమెరిగిన సత్యం. బినామీ పేర్లతో కోట్ల రూపాయల ఆస్తులున్నా పట్టుకోలేరన్న అపోహలో ఉంటే అది పొరబాటేనని తాజా ఉదంతంతో ఎసిబి సంకేతాలు ఇచ్చింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సూపరింటెండెంట్ కోట్ల రూపాయల అక్రమాస్తులకు తన సోదరి, బావ బినామీలుగా ఉన్నట్లు అధికారులు నిగ్గు తేల్చారు. ఇప్పుడు దాడుల్లో గుర్తించిన ఆస్తులు తమవి కావని బినామీలు ఎదురు తిరిగితే.. పట్టుబడిన అధికారి మెడకు చుట్టుకుంటుంది. కాదు మావేనని ఒప్పుకుంటే అంత ఆస్తులు ఎలా వచ్చాయన్న ఆరా వారిపై మొదలవుతుంది. ఇలా ఇప్పుడు బినామీల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్న చందంగా మారిపోయింది. ఈ పరిస్థితి ఈ ఒక్క కేసులోనే కాదు.. అక్రమాస్తులకు ఒడిగట్టిన అక్రమార్కులకు చెందిన బినామీలు ఎవరైనా ఇదే పరిస్థితి ఎదుర్కోక తప్పదంటున్నారు ఎసిబి అధికారులు. ప్రభుత్వ ఉద్యోగిగా తండ్రి మరణానంతరం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నాలుగో తరగతి ఉద్యోగిగా చేరిన పోతంగి వీర వెంకట దుర్గాప్రసాద్ (45) అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తడం వెనుక అక్రమ సంపాదన ఉన్నట్లు తెలుస్తోంది. 1984లో డిపార్ట్‌మెంట్‌లో చేరిన ఈయన 1990లో సబ్ రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందిన తర్వాత అక్రమార్జనకు తెర తీసినట్లు ఎసిబి అధికారుల దాడుల్లో వెల్లడైంది. కృష్ణా జిల్లాతోపాటు గోదావరి జిల్లాల్లో పనిచేసిన ఈయన నగరంలో ఏడు సంవత్సరాలు గుణదల సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన కాలంలో అక్రమార్జనకు పట్టు పట్టినట్లు తెలుస్తోంది. 2007 నుంచి 2014 వరకు ఇక్కడ పనిచేశారు. ప్రస్తుతం నివాసముంటున్న శ్రీనివాస్‌నగర్ బ్యాంక్ కాలనీలోని అపార్ట్‌మెంటు బ్యాంకు లోనుపై కొనుగోలు చేశానని చెప్పుకొస్తున్నా, ప్రభుత్వ లెక్చరర్ అయిన తన భార్య రాజ్యలక్ష్మి పేరుతో ఉన్న ఈ ఆస్తి విలువ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం కోటికి పైగానే ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఏలూరులోని ఏలూరు రేంజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు డిఐజి కార్యాలయం సూపరింటెండెంట్‌గా ఉన్న వీర వెంకట దుర్గాప్రసాద్ అక్రమాస్తులకు రక్షణగా తన సోదరి అడిగొప్పల వెంకటలక్ష్మి, బావ బాల వెంకట సత్యరాంప్రసాద్‌ను ఎన్నుకున్నాడు. 2008లో ప్రభుత్వం నుంచి తెల్లరేషన్ కార్డు పొందిన ఈ దంపతుల పేరుతో అన్ని కోట్ల రూపాయల ఆస్తులు బినామీలుగా పెట్టడం వీర వెంకట దుర్గాప్రసాద్ తప్పులో కాలేసినట్లేనని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. 2008 నుంచి 2013 వరకు వరుసగా ఏలూరు, విజయవాడల్లో కొనుగోలు చేసిన కోట్ల ఆస్తులన్నీటికీ వీరే బినామీలు. ఎసిబి తాజా దాడుల్లో సదరు ప్రభుత్వ అధికారి బినామీ ఆస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు కోట్లకు పైగా నిగ్గు తేలిస్తే, వీటి విలువ మార్కెట్‌లో 30 కోట్లకు పైమాటేనని అంచనా. కేసు నమోదు చేసిన సదరు అధికారిని అరెస్టు చేశామని, తదుపరి దర్యాప్తులో బినామీల పాత్రపై విచారణ ఉంటుందని, అక్రమ ఆస్తులకు బినామీలు పెట్టుకుంటే తప్పించుకోవచ్చనే అపోహ పడితే పప్పులే కాలేసినట్లేనని, ఇక నుంచి ఈ తరహా కేసులను కూడా ప్రాధాన్యతగా తీసుకుని దాడులు నిర్వహిస్తామని ఎసిబి డిఎస్పీ వి గోపాలకృష్ణ హెచ్చరించారు.

రోహిత్ ఆత్మకు శాంతి చేకురాలని
కొవ్వొత్తుల ప్రదర్శన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 19: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో రోహిత్ ఆత్మకు శాంతి చేకురాలని స్థానిక దాసరి నాగభూషణరావు భవన్ నుండి లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కె కరీముల్లా మాట్లాడుతూ గత సంవత్సరం ఆగస్టులో ఒక చిన్న కారణంతో రోహిత్ అంబేద్కర్ సంఘం, ఎబివిపికి జరిగిన గొడవ కారణంగా ఎబివిపి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయని ఆశ్రయించి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానికి ఫోన్ చేయించి, వారితో యూనివర్శిటీ విసి ఫోన్ చేసి దళిత సంఘానికి చెందిన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేయించారన్నారు. దీంతో రోహిత్ మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఎఐఎస్‌ఎఫ్ నగర కార్యదర్శి చలువాది రఘువీర్ మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్యకు కారణమైన బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరాని, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఉపకులపతి పొదిలె అప్పారావులను బర్తరఫ్ చేసి కఠినంగా శిక్షించాలని అదే విధంగా ఎబివిపి, బిజెవైఎం నాయకులు సుశీల్‌కుమార్, రామకృష్ణలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ నగర నాయకులు మాగం వెంకట దుర్గా, భువన్, చరణ్, తరుణ్, భరత్, విజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
పోలీసు స్టేషన్ భవనం
పైనుండి దూకేసిన నిందితుడు
పాతబస్తీ, జనవరి 19: విజయవాడ సర్కిల్ వన్ సిసిఎస్ పోలీసులు రాజమండ్రికి చెందిన ముగ్గురు అనుమానితులను మంగళవారం ఉదయం నగరానికి తీసుకు వచ్చారు. బంగారం రికవరీ కేసులో ఆ ముగ్గురిని విచారిస్తున్న సమయంలో వారిలో వినోద్ కదంబి అనే వ్యక్తి రెండో అంతస్తులోని సిసిఎస్ భవనం నుండి కిందకి దూకేశాడు. ఈ హఠాత్పరిమాణానికి షాక్ అయిన పోలీసులు బాధితుడిని వెంటనే నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై మీడియా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినా పోలీసులు పెదవి విప్పలేదు. నగరంలో పలు చోట్ల నేరాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు విచారిస్తున్న తరుణంలో రాజమండ్రిలో బంగారం వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యాపారులకు తాము బంగారం అమ్మినట్లు నిందితుడు పేర్కొన్నాడు. దాంతో బంగారం రికవరీ కోసం రాజమండ్రి వెళ్లిన పోలీసులు వినోద్ కదంబి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ భవనం నుండి దూకేసిన వినోద్ కదంబికి రహస్య స్థావరంలో చికిత్స చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఇదే పోలీసు స్టేషన్ పై నుండి ఓ దొంగ దూకిన సంఘటనతో పోలీసులు మేల్కొని పోలీసు స్టేషన్‌పై భాగానికి ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల వైపు, గట్ల వైపు గ్రిల్స్ లేనందున వినోద్ కదంబి టాయిలెంట్ వంక చెప్పి అక్కడి నుండి దూకినట్లు సమాచారం. ఈ విషయంపై సిసిఎస్ పోలీసులకు నోరుమెదపవద్దని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారని తెలిసింది.

ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తా
పటమట, జనవరి 19: ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడానికి కృషి చేస్తున్నానని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ అన్నారు. మంగళవారం ఉదయం 2వ డివిజన్‌లో గద్దె రామ్మోహన్ పర్యటించారు. కరెన్సీ నగర్‌లోని ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి గద్దె పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని డివిజన్ల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించడానికి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. రామవరప్పాడు రింగు సెంటర్ నుంచి కరెన్సీ నగర్, కనకదుర్గ కాలనీ మీదుగా ఆటోనగర్ వెళ్లే రోడ్డును సెంట్రల్ లైటింగ్, డివైడర్‌తో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రస్తుతం ఈ రోడ్డు అభివృద్ధికి కోటీ 80 లక్షలు మంజూరు చేశామని, త్వరలో పనులు మొదలుపెడతామని తెలిపారు. రెండు సంవత్సరాల్లో ఈ రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. విఘ్నేశ్వరరావు రోడ్డు నుంచి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో కలపడానికి ఉన్న సమస్యపై కార్పొరేషన్ అధికారులతో మాట్లాడతానని గద్దె హామీ ఇచ్చారు. కరెన్సీనగర్, కనకదుర్గ కాలనీ వాసులకు సమస్యగా ఉన్న గుంటతిప్ప డ్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. కనకదుర్గ కాలనీ దగ్గర డ్రెయిన్‌లో పూడిక తొలగించి నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపడతామని వివరించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేరుస్తానన్నారు.

రోహిత్ ఆత్మహత్యకు కారకులను
వెంటనే అరెస్టు చేయాలి
అవనిగడ్డ, జనవరి 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ నెల 17న వేముల రోహిత్ అనే పిహెచ్‌డి విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌ను, కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, బండారు దత్తాత్రేయలను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ దళిత నేతలు మంగళవారం తహశీల్దార్ వెనె్నల శ్రీనుకు వినతిపత్రం అందజేశారు. సీతాయలంకలోని అంబేద్కర్ విగ్రహం నుండి అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం వరకు దివిసీమ దళిత ప్రజా సంఘాల సభ్యులు నిరసన ర్యాలీగా చేరుకున్నారు. ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేయటంతో పాటు దళిత, బహుజనులు ప్రశాంత వాతావరణంలో చదువుకునే అవకాశం కల్పించాలని, దళిత విద్యార్థులు వేరుగా ఉండటానికి నిరాకరించిన అగ్రవర్ణ ప్రొఫెసర్లపై వెంటనే కేసులు నమోదు చేయాలని, రోహిత్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ.50లక్షల ఆర్థిక సహాయం అందించాలని, విద్యార్థులపై సస్పెన్షన్ వెంటనే రద్దుచేయాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పి శ్రీనివాసరావు, ఎన్ రమేష్, శంకరరావు, జి సురేష్, దోవా గోవర్ధన్, దాసి దేవదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

మతోన్మాదులను కఠినంగా శిక్షించాలి
గుడ్లవల్లేరు, జనవరి 19: హైదరాబాద్‌కు చెందిన పిహెచ్‌డి దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన మతోన్మాదులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఎఐసిసి నేషనల్ డైరెక్టర్ రెవ. లింగం జాన్‌బెన్నీ, ఫాదర్స్ జయరాజు, శేఖర్‌బాబు మంగళవారం తహశీల్దార్ ఆత్మకూరి మధుసూదనరావుకు వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా జాన్‌బెన్నీ మాట్లాడుతూ ప్రభుత్వాలు కూడా ఒక మతానికి మాత్రమే కొమ్ము కాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకనే క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాలు అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పాల్గొన్నారు.

గిరిజనుల అభివృద్ధి కాగితాలకే పరిమితమా?
* వసతిగృహాల్లో కనిపించని విద్యార్థుల హాజరు
* నేటికీ పూర్తికాని రుణ లబ్ధిదారుల ఎంపిక
* చోద్యం చూస్తున్న సంక్షేమ శాఖాధికారులు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జనవరి 19: జిల్లాలో గిరిజనుల సంక్షేమం కాగితాలకే పరిమితమవుతోంది. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వారి దరికి చేరడం లేదు. ఫలితంగా గిరిజనుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుచేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గిరిజనుల సంక్షేమానికి ప్రతి యేటా కోట్లాది రూపాయల కేటాయింపులు జరుగుతున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో సుమారు లక్షా 30వేల మంది గిరిజనులు ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీ కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రతి యేటా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కోట్లాది రూపాయలు రుణాలు పంపిణీ చేస్తారు. ఈ రుణాల పంపిణీ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 858 మందికి గాను 329 మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేశారు. రూ.6.48కోట్ల గాను రూ.4కోట్లు మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక నేటికీ పూర్తికాలేదు. 1558 మందిని ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం 42 మందిని మాత్రమే ఎంపిక చేశారు. గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతిగృహాలు వెలవెలబోతున్నాయి. విద్యార్థులను వసతిగృహాల్లో చేర్పించే విషయంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. ఫలితంగా విద్యార్థులు లేక వసతిగృహాలు వెలవెలబోతుండగా వారి విద్యాభివృద్ధి కూడా కుంటుపడుతోంది. వసతిగృహాల్లో సౌకర్యాల కల్పన విషయంలో కూడా అధికారుల వైఫల్యం కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం 18 వసతిగృహాలు గిరిజనుల కోసం ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఆశ్రమ పాఠశాల ఉంది. వీటిల్లో 2,225 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా కేవలం 1,104 మంది మాత్రమే ఉండటం గమనార్హం. నాలుగు కళాశాలల హాస్టళ్లు ఉండగా ఇందులోనూ విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. పూర్తిస్థాయిలో సీట్లు భర్తీకాలేదు. జగ్గయ్యపేటలోని ప్రభుత్వ కళాశాల బాలుర వసతిగృహంలో 50మంది విద్యార్థులకు గాను ఆరుగురికి మాత్రమే ప్రవేశం కల్పించారు. నూజివీడులో 35మంది, విజయవాడలో 30మంది, విజయవాడ బాలికల వసతిగృహంలో 45మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఏదిఏమైనా జిల్లాలో గిరిజనుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది.

సాగునీటి కోసం తహతహ!
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 19: జిల్లాలో మినుము పైర్లు నీటి కోసం తహతహలాడుతున్నాయి. పైర్లు వేసిన భూములు నెర్రలిచ్చి నీటికోసం ఎదురుచూస్తున్నాయి. తాగునీటికే కటకటలాడుతున్న ఈ తరుణంలో పొలాలకు నీరు అందే అవకాశం లేదు. గత ఏడాది దాళ్వాకు అనుమతి ఇచ్చారు. దీంతో పంట కాలువల్లో నీరు ఉండటంతో పైర్లను తడుపుకున్నారు. ఫలితంగా దిగుబడులు గణనీయంగా వచ్చాయి. కానీ ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుండే సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈనేపథ్యంలో పైర్లకు తడి పెట్టటానికి అవకాశం లేకపోవటంతో పైర్ల ఎదుగుదల లోపించింది. ఈ ఏడాది అపరాల దిగుబడులు సగానికి సగం పైగా తగ్గే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సాగునీటి కోసం వదిలిన నీటిని పైర్లను తడుపుకునేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా అధికారులు మాత్రం నీరు పెట్టుకునే అవకాశం వారికి ఇవ్వటం లేదు. ముందుగా చెరువులను నీటితో నింపుతున్నారు. అన్ని ప్రాంతాలలో పైర్లకు మందులు పిచికారీ చేసేందుకు కూడా నీరు అందకపోవటంతో నానాతంటాలు పడుతున్నారు. ఏదిఏమైనా ఈ ఏడాది ఖరీఫ్‌తో పాటు అపరాల పైర్లను తడుపుకునే అవకాశం కూడా రైతులకు లేదు. నీరు వస్తుందనే ఆశ కూడా రైతుల్లో లేదు. రాత్రి 9 నుండి ఉదయం 9గంటల వరకు కురుస్తున్న మంచు పైర్లకు జీవం పోస్తోందని రైతులు కొంతమేర సంతృప్తి చెందుతున్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
బంటుమిల్లి, జనవరి 19: విద్యార్థులు విద్యతో పాటు వ్యాయామంలో కూడా ఆసక్తి కనబర్చాలని మండల విద్యాశాఖాధికారి వైవి సుబ్బారావు అన్నారు. మంగళవారం బంటుమిల్లి మార్గదర్శి హైస్కూల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బందరు డివిజన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా జరిగిన సభలో ఎంఇఓ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలన్నారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధి కొమ్మారెడ్డి కిషోర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో నిర్దేశిత లక్ష్యంతో విద్యాభ్యాసం చేయాలన్నారు. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లోని 22 పాఠశాలల నుండి 1010 మంది విద్యార్థులు క్రీడ పోటీల్లో పాల్గొన్నారు. ఖోఖో, కబాడీ, వాలీబాల్, షటిల్, రన్నింగ్, గన్నీ బ్యాగ్, లెమన్ అండ్ స్పూన్, తదితర అంశాల్లో పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ కలీంబేగ్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు కుమార్ బాబు, నాగ ప్రవీణ్, అజ్మతుల్లా, కూనసాని సుగుణ కుమార్, యిల్లూరి వెంకట సుబ్బారాయుడు, సాబుజాన్, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
* నలుగురికి గాయాలు
నందిగామ, జనవరి 19: కారు, మోపెడ్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురు గాయపడిన సంఘటన మండలంలోని అడవిరావులపాడు - కోనాయపాలెం గ్రామాల మధ్య మంగళవారం జరిగింది. గుడిమెట్లకు చెందిన గోనెగుంట్ల పెద్ద బిక్షమయ్య (40) స్వగ్రామం నుండి నందిగామ వైపుకు మోపెడ్‌పై వస్తుండగా నందిగామ వైపు నుండి వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోపెడ్ రోడ్డు పక్కన పొలాల్లో పడిపోగా, కారు పల్టీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడిన బిక్షమయ్య అక్కడికక్కడే మృతి చెందగా కారు డ్రైవర్‌తో సహా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. వీరిని విజయవాడ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అవినీతి రహితంగా బాధ్యతగా పనిచేయండి
తోట్లవల్లూరు, జనవరి 19: తహశీల్దార్ కార్యాలయానికి సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరికీ సంయమనంతో సమాధానం చెపాల్సిన భాధ్యత రెవెన్యూ అధికారులదేనని సబ్ కలెక్టర్ డి సృజన అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి మంగళవారం తొలిసారి వచ్చారు. తహశీల్దార్ జి భద్రు, విఆర్‌ఓలు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారు నిర్వహించాల్సిన విధులను వివరించారు. ఇటీవల జిల్లాలో ఒకచోట జరిగిన జన్మభూమి గ్రామసభల్లో రెవెన్యూ సిబ్బంది పనితీరుపై విమర్శలు వచ్చినప్పుడు ప్రజలు విజిల్స్ వేశారని, మనపై ఉన్న గౌరవం ఎలా వుందో ఈ పరిణామం తెలుపుతోందన్నారు. ప్రజలకు ఉచిత సేవ చేసి మెప్పు పొందేందుకు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన డివిజన్‌లో ఎక్కాడా అవినీతి, అలసత్వం కనిపించినా బాధ్యులైన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. తోట్లవల్లూరు మండలంలో ఒక విఆర్‌ఓపై ఆరోపణలు వచ్చాయని, మరోసారి ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించేదిలేదన్నారు. గతంలో మీరు ఎలా ప్రవర్తించారో తనకు తెలియదని, ఇప్పటి నుంచి క్రమశిక్షణతో మెలుగుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తున్నారని, పని పట్ల అలసత్వం వహిస్తున్నారని వార్తలు వస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. తప్పు చేసిన వారిని ఎవరూ కాపాడలేరన్నారు. రాజధాని మన ప్రాంతంలో ఉండటంతో అందరూ పారదర్శకంగా పనిచేయాలన్నారు. తన డివిజన్‌లో తహశీల్దార్ భద్రుకి మంచి వర్కర్‌గా పేరుందని, ఆయన ఆదేశాలను అందరూ పాటించాలని, ఏదైనా సలహా అవసరమైతే తమను సంప్రదించవచ్చని సృజన తెలిపారు. తాను మళ్లీ వచ్చేసరికి అందరి పనితీరు మెరుగుపడాలని ఆమె సూచించారు.

పాన్‌కార్డ్ నిబంధన తొలగించాలని
బంగారం వ్యాపారుల ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 19: ఆదాయపు పన్ను చట్టంలో బంగారం వ్యాపారంపై విధించిన నిబంధనల సవరణ కోరుతూ పట్టణానికి చెందిన బంగారు వ్యాపారులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. రూ.2లక్షలకు పైబడి కొనుగోలు చేసే ప్రతి కొనుగోలుదారుడు తప్పనిసరిగా కొనుగోలు బిల్లుకు పాన్‌కార్డు జతచేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిబంధన వల్ల రైతులు, కార్మికులు, పనివారు, చిన్నచిన్న వ్యాపారులకు కలిగే ఇబ్బందుల దృష్ట్యా వారి సౌకర్యార్థం సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ది మచిలీపట్నం బులియన్ జ్యూయలరీ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో అధ్యక్షులు మద్దుల గిరీష్ కుమార్, కార్యదర్శి ఉడత్తు కిషోర్, వ్యాపారులు పాల్గొన్నారు.

ఆశాజనకంగా అపరాల సాగు
చల్లపల్లి, జనవరి 19: మండలంలో అపరాల సాగు ఆశాజనకంగా ఉంది. అష్టకష్టాలతో చేపట్టిన ఖరీఫ్ రైతులకు ఆర్థిక భారాన్ని, రెక్కల కష్టాన్ని మిగల్చగా రబీలో చేపట్టిన అపరాల పైరు రైతుల్లో ఆశలు చిగురింప చేస్తోంది. ఆరుతడి పంటలైన మినుము, పెసర పంటలను రబీలో సాగు చేపట్టిన రైతులు మినుముకు మార్కెట్‌లో క్వింటా రూ.10వేలు ధర పలుకుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ నష్టాన్ని అపరాల దిగుబడితో అధిగమించవచ్చన్న భరోసాతో రైతులు ఉన్నారు. ఖరీఫ్‌లో వరి సాగు చేపట్టని పొలాల్లో చేపట్టిన అపరాల సాగు ప్రస్తుతం తొలిదశ కాపు వచ్చింది. పూత, పిందెలను సంరక్షించుకునేందుకు ఖర్చుకు వెనుకాడకుండా రైతులు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు.

24, 25న స్పోర్ట్స్ మీట్
పెడన, జనవరి 19: ఎపిజె అబ్దుల్ కలాం మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నూజివీడులో నిర్వహించనున్నట్లు ఎపి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి గౌరీప్రసాద్ తెలిపారు. కబాడీ, ఖోఖో, టెన్నికాయిట్, 100, 200, 400 మీటర్ల పరుగు పందెం, షటిల్, చెస్, వాలీబాల్, బాస్కెట్ బాల్, లాంగ్ జంప్, షాట్‌పుట్ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ బాల బాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు. డివిజన్ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థుల వివరాలను జిల్లా స్థాయికి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22లోపు ఎంట్రీలు పంపాలని సూచించారు.

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో
విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభం
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 19: స్థానిక సర్కిల్‌పేట సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గరుడ, ద్వారపాలక, విష్వక్సేన, విఖనస, గణేష, నాగరాజ విగ్రహాలను ఈ నెల 27న ప్రతిష్ఠించనున్నారు. ఈసందర్భంగా మంగళవారం ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, గోపూజ, నవగ్రహ యజ్ఞం నిర్వహించారు. రాత్రి గురుధ్యానం, ప్రార్థనా సూక్త పఠనం, ఋత్విగరణ, దీక్షా స్వీకరణ, బింబశుద్ధి, వాస్తుపూజ, వాస్తుహోమ కార్యక్రమాలు జరిగాయి. ముత్తేవి శ్రీనివాస శశికాంత్ బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు ఎం శేషభట్టార్ - చంద్రిక, జయకృష్ణ - హిరణ్మయి దంపతులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు.

దిష్టిబొమ్మల్లా ప్రభుత్వ నిర్మాణాలు!
అవనిగడ్డ, జనవరి 19: అవనిగడ్డలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సమావేశ మందిరం, దివి మెయిన్ కెనాల్‌పై వంతెన నిర్మాణాలు పూర్తికాక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. 2014 ఫిబ్రవరిలోనే తాలూకా కార్యాలయం ఆవరణలో నియోజకవర్గ స్థాయిలో ఒక సమావేశ మందిరం ఉండాలని అప్పటి అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ ఆలోచన మేరకు రూ.81లక్షల వ్యయంతో నిర్మాణాన్ని ప్రారంభించారు.