కృష్ణ

నిరంతరం నాణ్యమైన విద్యుత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. 46 కోట్ల రూపాయలతో మైలవరంలో 132/33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్, కోటిన్నర రూపాయలతో మండలంలోని చంద్రాలలో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌లకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి ఉమ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. గతంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదని, కానీ ప్రస్తుతం తమ హయాంలో 24 గంటలూ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులకు చింతలేకుండా విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. దీని వల్ల తమ పంటకు ఢోకా లేదనే భరోసాను రైతులకు కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా మైలవరంలో సైతం ఎల్‌ఈడి కాంతులను అందించనున్నట్లు తెలిపారు. మరో వైపు వ్యవసాయ రంగానికి సోలార్ విద్యుత్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో దేశంలోనే రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు 100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని లోఓల్టేజిని అధిగమించి, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు గానూ అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్‌లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మైలవరంలో, చంద్రాలలో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 186 కోట్ల రూపాయలతో ఇంటింటికీ మంచినీటి కుళాయిలను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 11న ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద 1.40 లక్షల మందికి సుమారు 7,500 కోట్ల రూపాయల విలువ చేసే ఇళ్ళ స్థలాల పట్టాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ్ధ్యాయమన్నారు. మైలవరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 11వేల మంది నిరుపేదలకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలలో అన్ని రోడ్లను సిసి రోడ్లుగా మారుస్తున్నామని, డ్రైన్లు, విద్యుత్, వైద్యం, విద్య, పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్ళ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం వంటి అన్ని వౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తెచ్చి కోట్లాది రూపాయల విలువైన పంటలను కాపాడామని, దీని వల్ల జిల్లాలో తలసరి ఆదాయం 1.89 లక్షలుగా పెరిగిందని రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రధమ స్థానం కాగా దేశంలో హర్యానా తర్వాత రెండో స్థానాన్ని సాధించినట్లు తెలిపారు. నవంబర్ 15 తర్వాత ఈ ప్రాంతానికి వస్తాయో రావో తెలియని నాగార్జున సాగర్ జలాలను నెల రోజుల ముందే ఈ ప్రాంతానికి రప్పించి ఆరుతడి పంటలకు ప్రాణం పోశామన్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తీరిక లేకుండా చేస్తుంటే కొందరు దొంగలు గ్రామాల్లోకి వచ్చి కులాలను, మతాలను రెచ్చగొట్టి, అక్రమంగా సంపాదించిన సొమ్మును ఎరగా చూపి అశాంతి సృష్టిస్తున్నారని, వారికి తగిన బుద్ధి చెప్పాలని వైసీపీ నేతలనుద్దేశించి పిలుపునిచ్చారు. మైలవరం నియోజకవర్గంలో రైతుల సంక్షేమం, పంటలను కాపాడే ఉద్దేశంతో 22 ఎత్తిపోతల పధకాలను మంజూరు చేయించానని, ఇవన్నీ పనికొచ్చే పధకాలే తప్ప దండగమారి పధకాలు కావని స్పష్టం చేశారు. సమావేశంలో ట్రాన్స్‌కో డైరెక్టర్లు ఆదాం, రావు, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఏఎంసి చైర్మన్ ఉయ్యూరు వెంకట నరసింహారావు, ఎంపిపి లక్ష్మి, జడ్పీటిసి రాము, పార్టీనేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విభేదాలు వద్దు... పార్టీ పటిష్ఠతే ముఖ్యం
మచిలీపట్నం, నవంబర్ 8: విభేదాలను పక్కన పెట్టి పార్టీ పటిష్ఠత కోసం కృషి చేయాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కార్యకర్తలకు సూచించారు. గురువారం తన కార్యాలయంలో 2, 3, 7, 8, 11 వార్డులకు సంబంధించిన టీడీపీ నేతలతో మంత్రి రవీంద్ర సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రానున్న ఆరు నెలలే చాలా కీలకమైనవన్నారు. వ్యక్తిగత విభేదాలతో పార్టీని నష్టపర్చవద్దన్నారు. కలిసి కట్టుగా పని చేయాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బందరు నియోజకవర్గాన్ని జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బందరు నియోజకవర్గంలో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. నాలుగున్నర యేళ్లల్లో మనం చేసిన ప్రతి పనిని ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం (తాతయ్య) తదితరులు పాల్గొన్నారు.