కృష్ణ

ఫైళ్లు తొక్కిపెడితే నేరుగా ఇంటికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: షోకాజ్ నోటీసుల జారీతో గాడి తప్పిన కలెక్టరేట్‌ను గాడిన పెట్టేందుకు జిల్లా ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. అవినీతి నిరోధక శాఖాధికారుల దాడితో కలెక్టరేట్‌పై పడిన అవినీతి మరకను పోగొట్టేందుకు నడుం బిగించారు. కలెక్టరేట్‌కే కలకలం సృష్టించిన భూ సంస్కరణల అధీకృత అధికారిణి దాసరి ప్రశాంతిపై ఎసీబీ దాడి నేపథ్యంలో కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ డా. కె మాధవీలత సిబ్బందిలో మార్పు తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కలెక్టరేట్ సిబ్బందికి స్నేహపూరితమైన వాతావరణం కల్పించిన అధికారులు ఇకపై కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. సమర్థవంతంగా పనిచేస్తారని స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుంటే దాన్ని కొంత మంది ఉద్యోగులు అలుసుగా తీసుకుంటుండటాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్షన్ సూపరింటెండెంట్లు, ఆయా సెక్షన్ ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమైన జేసీ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సరిగ్గా గత సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో సహా యావత్తు జిల్లా అధికార యంత్రాంగం అంతా ఉన్న సమయంలోనే జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ పైన ఉన్న భూ సంస్కరణల అధీకృత అధికారిణి ప్రశాంతి సీలింగ్ భూములకు సంబంధించి పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేసే విషయమై ఓ రైతు నుండి రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన వారానికి దిద్దుబాటు చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. సిబ్బందితో ఆమె సమావేశం కావడానికి ప్రధాన కారణం సిబ్బందిపై వస్తున్న అవినీతి ఆరోపణలే అయినప్పటికీ సోమవారం కలెక్టరేట్ సిబ్బందితో సమావేశంలో అవినీతి అనే పదం రాకుండా క్రమశిక్షణారాహిత్యం, సిబ్బంది అలసత్వాన్ని ప్రశ్నిస్తూ జేసీ లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ తీసుకున్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు సిబ్బంది హాజరు పేలవంగా ఉండటాన్ని గమనించిన జేసీ ఈ అంశానే్న ప్రధానంగా తీసుకుని సోమవారం నాటి సమావేశంలో ప్రస్తావించారు. జాతీయ పండుగగా నిర్వహించే ఈ వేడుకలకు గైర్హాజరైన ఉద్యోగులకు అప్పటికప్పుడు షోకాజ్ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరారు. ఈ ఒక్క అంశాన్ని పట్టుకుని గత కొంత కాలంగా సిబ్బందిలో నెలకొన్న అలసత్వం, బాధ్యతారాహిత్యం, క్రమశిక్షణ తదితర అంశాలపై ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె చేసిన ఘాటైన హెచ్చరికలు సిబ్బందికి ముచ్చెమటలు పట్టించాయనే చెప్పాలి. ఇకపై సిబ్బందిపై ఏ చిన్న ఆరోపణ వచ్చినా తర్వాత తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయో జేసీ తెలియజేశారు. మహా అయితే కలెక్టరేట్ నుండి మండలాలకు బదిలీ చేస్తారులే అనుకోవద్దని, నేరుగా ఇంటికే పంపిస్తానని జేసీ హెచ్చరించడం సిబ్బందిని ఒక్కసారిగా ఖంగుతినిపించింది. ఇకపై మీపై నిఘాను కట్టుదిట్టం చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా అణుక్షణం మీ కదలికలను పసిగడతామన్నారు. కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు కలెక్టరేట్‌కు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ జేసీ సంచలనమైన ఆరోపణలు చేశారు. అటువంటి వ్యక్తులతో కొంత మంది కలెక్టరేట్ సిబ్బంది కూడా మసులుతుండటం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడమన్నారు. సెక్షన్లలో సంచరిస్తున్న అపరిచిత వ్యక్తులను కూడా వదలమన్నారు. వారం రోజుల్లో మీమీ సెక్షన్లలో ఉన్న మేజర్ పెండింగ్ ఫైల్స్‌ను క్లియర్ చేయాలని, మిగిలిన పెండింగ్ ఫైల్స్‌ను పది రోజుల్లో క్లియర్ చేయాలన్నారు. పిటీషనర్లను మీ దగ్గరకు రప్పించుకోవడం గొప్ప కాదన్నారు. ఏ ఫైల్‌నైనా తొక్కి పెట్టాలని చూస్తే సహించమన్నారు. ఫైల్స్‌ను తొక్కి పెట్టాల్సిన అవసరం మీకు లేదన్నారు. ఫైల్స్ పరిష్కార విషయంలో ఏమైనా శాఖాపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని తెలియజేస్తూ ఉన్నతాధికారులకు పంపాలే గానీ మీ దగ్గర పెట్టుకోవద్దన్నారు. అటువంటి ఫైల్స్‌పై నిర్ణయాధికారం తీసుకునే హక్కు మీకు లేనప్పుడు మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ పీఆర్ రిజిష్టర్‌ను మెయింటైన్ చేయాలన్నారు. పీఆర్ రిజిష్టర్ మెయింటైన్ చేయని వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. అనుభవజ్ఞులైన వారందరినీ ఏరి కోరి కలెక్టరేట్ స్ట్ఫాగా తీసుకు వస్తే మీరు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం బాధ కలిగిస్తోందన్నారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్ కూడా సిబ్బందిపై చిటపటలాడారు. టీ స్టాల్స్, మీ సేవ కేంద్రాల వద్ద మీకేం పనంటూ సిబ్బందిని నిలదీశారు. ఇకపై ఏ ఒక్కరైనా టీ స్టాల్స్, మీ సేవ కేంద్రాల వద్ద చేరి ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడుతున్నట్టు తెలిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. చివరిగా జాయింట్ కలెక్టర్ మీ అందరికీ ఇవే నా చివరి హెచ్చరికలు, ఇకపై మీ ప్రవర్తనలో, మీ పని తీరులో మార్పు రాకుంటే హెచ్చరికలు ఉండవని నేరుగా ఇళ్లకే పంపించేస్తానని ఘాటైన హెచ్చరికతో సమావేశాన్ని ముగించారు. ఇలావుండగా సమావేశ ప్రారంభంలో సిబ్బందిపై డీఆర్‌ఓ తనదైన శైలిలో మండిపడ్డారు. ఆయన జేసీని తీసుకు వచ్చేందుకు వెళ్లిన నిమిషాల వ్యవధిలో ఓ అధికారి భయపడవద్దంటూ సిబ్బందికి ధైర్యం చెప్పడం కొసమెరుపు. సమావేశం జరిగినంత సేపు జేసీ చేసిన హెచ్చరికలు తాత్కాలికంగా భయపెట్టినా అలవాటుపడి, ఆరితేరిన సిబ్బందిని ఈ హెచ్చరికలు ఏ మేరకు గాడిన పెడతాయో వేచి చూడాల్సిందే.