కరీంనగర్

పాఠశాలల్లో ‘ఖేల్’ ఖతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 17: క్రీడలు విద్యార్థుల శారీరక ఎదుగుదలకు, వారిలో పోటీతత్వం, పట్టుదలను పెంచేందుకు దోహదపడుతాయి. ప్రాథమిక స్థాయి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంబంధిత ఉపాధ్యాయులను నియమిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి గతేడాది తన నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సందర్భంలో చేసిన వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలు చేసి ఏడాది గడిచి, రెండో ఏడాదిలోకి అడుగిడినా ఇప్పటివరకు సిఎం మాటలు ఆచరణకు నోచుకోలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పిఈటీల కొరత వెంటాడుతూనే ఉంది. దీనికితోడు మైదానం కూడా సక్రమంగా లేకపోగా, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంలో మాత్రమే నామ్‌కేవాస్తేగా పాఠశాలల్లో ఆటల పోటీలు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో కూడా ఆటలపై ఆసక్తి తగ్గి, పాఠ్యాంశాలపైనే దృష్టి సారిస్తున్నారు. గత నాలుగేళ్ళుగా అత్యధిక శాతం పాఠశాలల్లో ఆటల పోటీలు కూడా నిర్వహించకపోగా, వారానికోరోజు ఆటల పీరియడ్ కూడా ఎత్తేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 618 ఉన్నత పాఠశాలలు, 1326 ప్రాథమికోన్నత పాఠశాలలుండగా, ఇందులో కేవలం 814ప్రాథమికోన్నత, 315 ఉన్నత పాఠశాలల్లో పిఈటి, పిడి పోస్టుల్లో ఉపాధ్యాయులున్నారు. మిగతాచోట్ల ఆయా పాఠశాలలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులే ఆటలాడించే దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి.
విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో వ్యాయామ విద్యను ఖచ్చితంగా అమలు చేయాలంటూ అప్పటి ప్రభుత్వం జీవోనెం. 63ని విడుదల చేసింది. అయితే, ఇందుకనుగుణంగా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పిఈటీలను కూడా భర్తీ చేసేందుకు వివరాలు సేకరించినా, అప్పట్లో డిఎస్సీ నిర్వహించేందుకు అటంకాలు ఎదురవటంతో వ్యాయామ ఉపాధ్యాయుల భర్తీ అటకెక్కింది. 6నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు వ్యాయామ విద్య బోధన తప్పనిసరనే ఆదేశాలు జారీచేసినా, పిఈటీల ఖాళీతో ఇది కాగితాలకే పరిమితమైంది. క్రీడల నిర్వహణ కోసం మరోవైపు నిధుల కొరత కూడా వేధిస్తోంది. పాఠశాలల్లో క్రీడల అభివృద్ది కోసం అవసరమైన నిధులు కేటాయించి, మైదానం కూడా అందుబాటులోకి తెస్తేనే తప్ప లేనిపక్షంలో పాఠశాలల్లో క్రీడలు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే అవకాశాలున్నాయని వ్యాయామ ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అయితే, ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం క్రీడాభివృద్ధి కోసం అత్యధికంగా నిధులు కేటాయించనున్నట్లు సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి ఇటీవలే స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే మరి.

ప్రభుత్వాల వైఫల్యాలపై పోరుబాట
* 19నుంచి ‘జన ఆవేదన సమ్మేళన్’ * ప్రజల ఆశలు అడియాశలయ్యాయి
* ఎన్నికల హమీల్లో ఒక్కటి నెరవేర్చలేదు * డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం

కరీంనగర్, ఫిబ్రవరి 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం చేపట్టి ముప్పై మాసాలు గడుస్తున్న ప్రజలకు ఒరగబెట్టిందేమిలేదని, వారి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, ఈ తరుణంలో ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు ఏఐసిసి పిలుపు మేరకు జిల్లాలో ‘జన ఆవేదన సమ్మేళన్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. శుక్రవారం నగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి వారం రోజుల పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జన ఆవేదన సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ప్రధానికి ఒక కుర్చీ, సిఎం ఒక కుర్చీ వేసి వారు ఆ సీట్లలో ఉన్నట్లుగా భావించి ప్రజల బాధలు, కష్టాలను వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ప్రజల సంక్షేమం ఉందని దుయ్యబట్టారు. ప్రధానంగా డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ అటకెక్కిందని, ఉద్యోగుల క్రమబద్దీకరణ అమలు కాలేదని విమర్శించారు. ఆందోళనలు లేని తెలంగాణగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన సిఎం కెసిఆర్ ఆ దిశగా ఎందుకు చర్యలు చేపట్టలేదని, నిత్యం కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. వాస్తవాలు మాట్లాడితే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయంటూ ఎదురుదాడి చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ఇక మంత్రి కెటిఆర్ అయితే ప్రతిపక్షాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేవిధంగా వ్యవహరిస్తున్నాయని, ఫైరింగ్ కావాలని అనుకుంటున్నాయని అనడం ఆయనలోని అంతర్లీనమైన ఆలోచన బయటపడిందని, ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజాసంక్షేమానికి పనిచేయాలని మృత్యుంజయం హితవు పలికారు.

‘మేడిగడ్డ’ బాధితులకు కాంగ్రెస్ అండ
మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు
గోదావరిఖని, ఫిబ్రవరి 17: భూములు కొల్పోతున్న రైతులకు మేలు చేసేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1994 చట్టాన్ని మార్పు చేసి 2013 చట్టాన్ని తీసుకువస్తే... ఆ చట్టాన్ని అమలు చేయకుండా... దాంతో అన్యాయం జరుగుతుందని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసిత హక్కులను కాలరాస్తుందని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు సంబంధించి గోలివాడ పంప్ హౌస్ పనుల సందర్భంగా చేపట్టిన బ్లాస్టింగ్‌లతో సమీప పంట పొలాలలో గాయపడి చికిత్స పొందుతున్న రైతులు సుధాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డిని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం అంతర్గాం మండలం గోలివాడ శివారులో కొద్ది రోజులుగా న్యాయం కోసం నిరసన చేపడుతున్న పంప్ హౌస్ నిర్వాసిత రైతు కుటుంబాలతో శ్రీ్ధర్‌బాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భూములు కొల్పోతున్న రైతుల పట్ల కెసి ఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును రైతులు మొర పెట్టుకున్నారు. రైతుల పట్ల పోలీసులు, రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న సంఘటనలు శ్రీ్ధర్‌బాబుకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 చట్టాన్ని అమలు చేసే శక్తి టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేదని, పోలీసులు, రెవెన్యూ అధికారులు చట్ట పరిధిలో పని చేయడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌లు జరుపుతున్న పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి రిడిజైన్ వద్ద మొత్తుకున్న టి ఆర్ ఎస్ ప్రభుత్వం వినలేదని, కోటి ఎకరాలకు నీరు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం భూములను దారదత్తం చేస్తున్న నిర్వాసిత రైతు కుటుంబాలకు అన్యాయం చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, బాధిత కుటుంబాలకు ఎప్పటి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కాశిపేట లింగయ్య మాట్లాడుతూ పోలీసులు కెసి ఆర్ పాలేర్లుగా మారిపోయారని ధ్వజమెత్తారు. గజ్వేల్‌లో ఇచ్చిన మాదిరిగా ఇక్కడ కూడా నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల్లో న్యాయం జరిగితే గొడవ ఉండదని పేర్కొంటూ మేడిగడ్డ గోలివాడ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు.

స్ర్తి నిధి రుణాలను ద్వినియోగం చేసుకోవాలి
* మహిళ సాధికారత కోసంమే వడ్డీ లేని రుణాలు * స్ర్తి నిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డి
పెద్దపల్లి రూరల్, ఫిబ్రవరి 17: మహిళలక ఉపాధి అవకాశాలు కల్పించి, మహిళ సాధికారత కోసమే ప్రభుత్వం స్ర్తి నిధి ద్వారా వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుందని, ఈ అవకాశాన్ని స్వశక్తి సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని స్ర్తి నిధి మేనేజింగ్ డైరెక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి సూచించారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఐకెపి ఎపిఎంలు, సిసిలతో స్ర్తి నిధి రుణాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళలు ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థిక పరిపుష్టత సాధించాలన్నారు. ఇందు కోసం స్ర్తి నిధి రుణాలను వినియోగించుకోవాలన్నారు. మహిళ సంఘాలలో స్ర్తి నిధి రుణాలపై అవగాహన కల్పించేందుకు ఐకెపి సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పెద్దపల్లి జిల్లా పరిధిలో 52.32 కోట్ల స్ర్తి నిధి రుణాలు ఇవ్వడానికి అవకాశం కల్పించగా, ఇందులో 45 శాతం మాత్రమే వినియోగించుకోవడం బాధకరంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన 24 కోట్ల రూపాయల రుణాలలో 92.98 శాతం రికవరి జరగడం అభినందనీయమన్నారు. మార్చి 31 లోగా మిగితా రుణాలు పూర్తి చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రుణాలు ఇవ్వడానికి ఉన్న ఉన్న కొన్ని నిబంధనలు సడలించనున్నట్టు ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి సంఘ సభ్యురాలుకు రుణం ఇచ్చి వారికి ఉపాధి కల్పించేందుకు, ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన ఇబ్బందుల గురించి పలువురు ఎకరువు పెట్టగా, ఇప్పుడు ఉన్న పరస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. తీసుకున్న రుణాలు చెల్లించే పరస్థితి ఉన్న సంఘ సభ్యులకు నిర్ధేశిత రుణం కంటే అదనంగా ఇవ్వాలని, ఇందుకు ఆ సంఘం, వివో తీర్మాణం విధిగా తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కందుకూరి అంజయ్య, శ్రీ నిధి జోనల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి, జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీనివాస్, ఎపిఎంలు, సిసిలు పాల్గొన్నారు.

రైతులకు లబ్ధి చేసేందుకే ప్రధానమంత్రి ఫసల్ బీమా
జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి వెళ్లడి
భీమదేవరపల్లి, ఫిబ్రవరి 17: వ్యవసాయ రైతులను అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి ఫసల్ భీమా పథకం ప్రవేశపెట్టినట్లు వరంగల్ అర్భన్ ముఖ్య ప్రణాళికాధికారి రాంచందర్ రావు వెళ్లడించారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం రెవెన్యూ కార్యాలయంలో భూ కమతాల సేకరణ జరిపించాలని విఆర్‌ఓ, విఎఓ, వ్యవసాయ శాఖ అధికారులతో జరిపిన సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ వరంగల్ అర్భన్ జిల్లాలోని 125 గ్రామాల్లో మొక్కజొన్న ఏ ఏ రైతులు పండిస్తున్నారో వాటి వివరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం అన్ని గ్రామాలు కలిపి 48 యూనిట్ల కింద తీసుకున్నట్లు, ఒక్కో యూనిట్ కింద వంద హెక్టార్లు ఉన్నాయన్నారు. భీమదేవరపల్లి మండలంలో అన్ని గ్రామాలకు కలిపి పది యూనిట్లు తీసుకున్నట్లు, 40 ప్రయోగాలు తీసుకున్నట్లు వెళ్లడించారు. ప్రధాన మంత్రి ఫసల్ భీమాయోజన పథకం క్రింద రైతులు పండించిన పంటలు తక్కువ దిగుబడి వచ్చినా, వర్షాలు సక్రమంగా కురియపోయినా వివిధ రకాలుగా వ్యవసాయ రైతులకు పంట నష్టం వస్తే వారికి లాభం చేకూర్చేందుకు తాము ఈ సమగ్ర సర్వే చేస్తున్నట్లు వెళ్లడించారు. గతంలో రైతులకు 11 శాతం వడ్డీ తీసుకునే వారమని, నేడు కేవలం రెండు శాతం మాత్రమే స్వల్ప వడ్డీపై రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా మొత్తం కేవలం ఒక మొక్కజొన్న పంటకు మాత్రమే రైతుల వద్ద ప్రీమియం తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వాసుపత్రుల్లో వంద శాతం ప్రసవాలు జరపాలి
జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా
సిరిసిల్ల, ఫిబ్రవరి 17: ప్రభుత్వ ఆసుపత్రులలో వందకు వంద శాతం ప్రసవాలు జరుపాలని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. జాతీయ హెల్త్ మిషన్ స్కీం కింద గైనకాలజిస్టు, అనిస్తిషియన్ నియామక ఉత్తర్వులను తన కార్యాలయంలో శుక్రవారం అందచేశారు. గైనకాలజిస్టుగా డా.దాస్యం రమ్యకృష్ణ, అనిస్తిషియన్‌గా పి.తిరుపతిలను జాతీయ హెల్త్ మిషన్ ప్రోగ్రాం కింద నియామకం చేపట్టామని, జిల్లా కేంద్రంలో ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చే ప్రసవాలను నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 40 నుండి 50 శాతం వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వంద శాతం కాన్పులు జరుపాలని ముఖ్య మంత్రి ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలు ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు వౌళిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. సిజేరియన్ కాన్పులు ఎక్కువగా అవుతున్నాయని, వాటి వలన మహిళల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందన్నారు. ఎక్కువ శాతం నార్మల్ ప్రసవాలు జరిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ‘ఈ’ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలుగా మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య వైద్య అధికారి ఆర్.రమేశ్, వైద్యశాఖ సిబ్బంది మహేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

కేసిఆర్ పన్నాగాలను
తిప్పికొడతాం
* బిసిల కోటాలో 31మంది మైనార్టీ కార్పొరేటర్లు
* బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 17: రాజధాని తరహాలో బిసిల కోటాలో రాష్టవ్య్రాప్తంగా మైనార్టీలకు ప్రాధాన్యతనిచ్చేందుకు ముఖ్యమంత్రి కెసి ఆర్ చేసున్న పన్నాగాలను తిప్పికొడుతామని బిజెవై ఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ అన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ అమలుచేసే యత్నాన్ని అడ్డుకునే క్రమంలో బిజెపి ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలోభాగంగా శుక్రవారం నగరంలోని అశోక్‌నగర్‌లో ఇంటింటికి తిరుగుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాన్ని వివరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, జిహెచ్ ఎంసి ఎన్నికల్లో31మంది మైనార్టీలు బిసిల కోటాలోగెలిచారని, దీంతో బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ రంగంలో బలహీన వర్గాలను దెబ్బతీసే కుట్రకు సి ఎం తెరలేపారని, బడుగులంతా దీనిని గ్రహించి ఐకమత్యంగా పోరాడేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వై ఎస్సార్ చేపట్టిన మైనార్టీ రిజర్వేషన్ విధానాన్ని నేడు కె సి ఆర్ మూడింతలు ఎక్కువ చేసి అమలుచేసేయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. మైనార్టీ రిజర్వేషన్లను ప్రతిఘటిస్తే తీవ్రస్థాయిలో అణిచివేసేందుకు బిసి సంఘాలను, కులవృత్తుల సంఘాలను బెదిరింపులకు గురిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. బలహీనవర్గాలకు చెందినవారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికకాకుండా, పోటీ చేసేందుకే వెనుకంజ వేసేలా ముస్లీం రిజర్వేషన్లు అమలుచేసేందుకు మజ్లిస్‌పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, పక్కా ప్రణాళికతో అమలుచేసేందుకు పావులు కదుపుతున్నాడని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగ విరుద్దంగా 12శాతం రిజర్వేషన్‌లు అన్ని రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో ఉద్యమాలు చేసేందుకు ఉద్యుక్తులు కావాలన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీలంతా ఏకమై న్యాయపోరాటం చేసేందుకు సమాయత్తం కావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. బిజెపి సీనియర్‌నేత దుబాల శ్రీనివాస్ నేతృత్వంలో చేపట్టిన ఈసంతకాల సేకరణలో నగరశాఖ అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, నాయకులు కటకంలోకేష్, కచ్చురవి, బోయినపల్లి ప్రవీన్‌రావు, పొన్నం మొండయ్యగౌడ్, దుర్శేటి సంపత్, కందుకూరి వసంత్, రవితేజ, శివకుమార్, వినోద్, శ్రీనివాస్, వరుణ్, గడ్డం శ్రీనివాస్, కుమార్‌లతో పాటు 50మంది కార్యకర్తలు పాల్గొన్నారు.