కరీంనగర్

విశ్వగురు స్థానానికి భారత్ చేరుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, నవంబర్ 18: మహా రుషుల పరంపరను ఆచరిస్తున్న హిందూ దేశం అలనాటి సంస్కతీ పునర్వైభవం పొంది, విశ్వగురు స్థానానికి చేరుకోవాలని హిమాలయ మహా మండలేశ్వర్ స్వామి ఉమాకాంత నందన్ సరస్వతీ మహరాజ్ ఉద్భోదించారు. ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో గోదావరికి మహాహారతి సమర్పించిన విశేష కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, నదీ తీరాన నిర్మిత వేదికపైనుండి వేలాదిమందిని ఉద్దేశించి చేసిన ధార్మిక ప్రసంగంలో స్వామీజీ ఉద్ఘాటిస్తూ, భారత దేశ చరిత్ర క్రీ.పూ.5వేల నాటిదని చెపుతారని, వాస్తవానికి 2లక్షల 13వేల నాటి చరిత్ర ఉందని, సనాతన ధర్మం, వైదిక సంస్కృతులకు అనాదిగా దేశం నిలయమన్నారు. మహారుషుల విరచిత గ్రంథాలు, చేసిన ఉపదేశాలను, దేశ చరిత్రను గౌరవించిన నాడే దేశ పునర్వైభవం సాధ్యమన్నారు. ధర్మాన్ని, సత్యాన్ని రక్షించాలన్నారు. ప్రాపంచిక వ్యాపితం చేసే సంప్రదాయ కార్యక్రమాలకు అనాదిగా ధర్మపురి తీర్థ క్షేత్రం నిలయమని, 20ఏళ్ళ క్రితం దీని గురించి చదివానని, అలాంటి క్షేత్ర, గోదావరి మాత దర్శనం సుకృతమన్నారు. ఇక్కడి యమదర్మరాజ దర్శనం సకల పాపహారిణి యని కీర్తించారు. నేడు థర్మం విద్వంసం జరుగుతున్నదని, స్వభావ ప్రకృతి మారుతున్నదని, నదులు, జీవుల, సంస్కృతి పరిరక్షణ తక్షణ కర్తవ్యమన్నారు. వైదిక సనాతన ధర్మం వివాద, విరోధ రహితమని, అన్ని ప్రాణులూ, పదార్థాలూ బ్రహ్మ మయాలేనని, సనాతన ధర్మం పూజించే సంస్కృతిని నేర్పుతుందని, దాని మూలం తెలిస్తే వివాదాలే ఉండవన్నారు. చండీ ఉపాసకులు, పండితులు పాలెం మనోహర శర్మ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీదర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపారావు, హారతి రాష్ట్ర కన్వీనర్ వీర గోపాల్, కోకన్వీనర్ రాంసుధాకర్, వెంకట రమణ, పిల్లి శ్రీనివాస్, కన్నం అంజయ్య, గిరిధర్, లక్ష్మణ్, అశోక్‌రెడ్డి, శ్యాంసుందర్, శ్రీనివాస్ రెడ్డి, శంకర్, నర్సయ్య, అశోక్, గంగారాంతో పాటు పలువురు వివిధ స్థాయిల నాయకులు వేదికపై ఉండగా, వేలాదిమంది పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.
పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఘనంగా గోదావరి హారతి
ధర్మపురి: కార్తీక మాస ఆదివారం పవిత్ర దినాన రాత్రి ధర్మపురి క్షేత్రంలో గోదావరి నదికి హిమాలయ మహా మండలేశ్వర్ శ్రీశ్రీశ్రీ ఉమాకాంత నందన్ సరస్వతీ మహరాజ్ స్వామీజీ, చండీ ఉపాసకులు పాలెం మనోహర శర్మ సమక్షంలో, గోదావరి మహా హారతి ఉత్సవ సమితి వ్యవస్థాపక చైర్మన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆధ్వర్యంలో, మహా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది మంది సమక్షంలో మునుముందుగా రాజమండ్రి నిత్య హారతి పండితులు ఆదిత్య శర్మ, భాస్కరశర్మ, జగదీశ శర్మ, గణేశ శర్మ, కిరణ్ శర్మ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నదీ పూజాదికాలలో స్వామీజీలు పాల్గొన్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో హారతి సమర్పించారు. వీహెచ్‌పీ, ఆరెస్సెస్, స్వచ్చం సంస్థల బాధ్యులు, గోదావరి హారతి నిర్వాహకులు వీరగోపాల్, రాంసుధాకర్, పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ జీవనధార, దక్షిణగంగానది గోదావరిని పరిరక్షించడానికి శపథం చేయాలని మురళీధర్‌రావు కోరారు.