కరీంనగర్

బొగ్గు, మట్టి అక్రమ రవాణాపై.. కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించం
రామగుండం సీపీ సత్యనారాయణ
ఇటుక బట్టీలను సందర్శించిన సీపీ, డీసీపీ
పెద్దపల్లి రూరల్, మార్చి 29: బొగ్గు, మట్టి అక్రమ రవాణాపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందని, బొగ్గు, మట్టి మాఫీయాపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీసు కమీషనర్ వి.సత్యనారాయణ అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేసి చట్టరీత్య తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండలంలోని రాఘవాపూర్, గౌరెడ్డిపేట గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న ఇటుకు బట్టీలను ఆయన శుక్రవారం సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇటుక బట్టీలలో అక్రమంగా నిల్వ ఉన్న బొగ్గు, మట్టితో పాటు పర్మిట్ లేకుండా ఉన్న కలపను పరిశీలించారు. బొగ్గు, మట్టి, కలపను ఎక్కడి నుంచి తీసుకు వస్తున్నారు, ఇందుకు ఎవరు సహకరిస్తున్నారనే అంశంపై సీపీ ఆరా తీశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి వెంటనే తనకు నివేదిక పంపించాలని ఆయన కింది స్థాయి అధికారులను ఆదేశించారు. అలాగే ఇటుక బట్టీలలో పని చేస్తున్న కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రత చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అక్రమంగా బొగ్గు, మట్టి రవాణా చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకు సహకరిస్తున్న వారిని కూడా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. సింగరేణి నుంచి ఎన్ని కంపెనీల నుంచి బొగ్గు రవాణాకు అనుమతి ఉన్నది, ఇక్కడికి అనుమతి లేకుండా బొగ్గు ఏలా వస్తుంది అనే విషయాలపై విచారణ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం హరిత హారం పేరుతో మొక్కలు నాటుతుంటే విచ్చలవిడిగా చెట్లను నరికి వేస్తూ, ఇటుకల తయారీకి వినియోగించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటుక బట్టీలపై ఇక మీదట నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని, అక్రమాలకు పాల్పపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట పెద్దపల్లి పోలీసు డిప్యూటీ కమీషనర్ సుదర్శన్ గౌడ్, ఏసీపీ వెంకటరమణారెడ్డి, పెద్దపల్లి సీఐ గోపతి నరేందర్, టాస్క్ ఫోర్స్ సీఐలు సాగర్, సారిలాల్, ఎస్సై ఉపేందర్ రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నేర చరిత్ర వివరాలు తెలపాలి
-లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థులకు సూచించిన ఎన్నికల అధికారి
పారదర్శకంగా పార్లమెంటు ఎన్నికల నిర్వహణ
ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లను
పర్యవేక్షించిన ఎన్నికల అధికారులు
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు
ఓట్ల కోసం ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలే
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, మార్చి 29: పార్లమెంటు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహణ కోసం పకడ్బంధీ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం తలమునకలైంది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఈవిఎంలను భద్రపర్చే గదులు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, నగర పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకులు టి.కె.షిబు తదితరులు శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించి సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలు శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తూ ఎప్పటికప్పుడు ఎన్నికల నిర్వహణపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన తెరాస, బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో పాటు వివిధ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తులను కేటాయించారు. ఎలక్షన్ కమీషన్ జారీ చేసిన నియమావళికి అనుగుణంగా అన్ని పార్టీల అభ్యర్థులు నడుచుకోవాలని, విరుద్ధంగా వ్యవహరించే వారిపై ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్థులు, కార్యాలయాలపై బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టవద్దని, ప్రైవేటు ఆస్థుల యాజమాన్యాల అనుమతితో ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన వాల్ రైటింగ్ చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రకటనలకు, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్లలో సందేశాలకు విధిగా అనుమతి తీసుకోవాలన్నారు. ధరఖాస్తు చేసుకున్న 24 గంటల లోపు ప్రచారాలకు అనుమతిస్తామన్నారు. ఏప్రిల్ 9వ తేదీ లోగా ఎన్నికల ప్రచారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు కూడా అనుమతి తీసుకోవాలని, ర్యాలీలు, సభలు, సమావేశాలకు, ప్రచార వాహనాలకు, మైకుల్లో మోతలకు సువిధ యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలన్నారు. పోటీ చేసే అభ్యర్థులు నేర చరిత్ర కలిగి ఉంటే (ఎఫ్‌ఐఆర్) తప్పనిసరిగా ఏప్రిల్ 9వ తేదీ లోపు మూడుసార్లు వేర్వేరు దిన పత్రికల్లో అభ్యర్థుల నేర చరిత్ర వివరాలను ప్రకటించుకోవాలన్నారు. ఎన్నికలలో అభ్యర్థులు ఏ పార్టీవారైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపెట్టినట్లు తప్పుడు ప్రచారం చేసేవారిని ఫోటో, వీడియో తీసి సి-వీజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పార్లమెంటు ఎన్నికల పకడ్బంధీగా నిర్వహించేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలీస్ బలగాల పహారాలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నేరచరిత్ర కలిగిన వారిని బైండోవర్ చేస్తామన్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఖర్చులపై నిఘా ఉంటుందని, ఎన్నికల్లో మందు, విందు, నగదు పంపిణీ చేసేవారిపై నిఘా వేసి ఉంటుందన్నారు. ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవిఎంలు భద్రపర్చే, ఓట్ల లెక్కింపు కేంద్రం ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ అండ్ పిజి కళాశాలలో ఏర్పాట్లను పరిశీలించి పోలింగ్ ముగియగానే పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూములను, ఓట్ల లెక్కింపు నిర్వహణ కోసం కళాశాలలోని గ్రంధాలయ భవనం, ఆర్ట్స్ కళాశాల, మొదటి అంతస్థులోని ఆడిటోరియం, ఇండోర్ స్టేడియంలను పరిశీలించారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే ఈవిఎంలను భద్రపర్చేందుకు ఏడు స్ట్రాంగ్ రూములు, ఒక గార్డ్ రూము గదులను తనిఖీ చేశారు. ఆయా భవనాల చిత్రపటాలను ప్రణాళికలతో సహా ఆదివారం లోపు అందజేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల డిగ్రీ, పిజి చదువులు పరీక్షలకు ఆటంకాలు కలుగకుండా కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సమీక్షాసమావేశంలో జెసి జి.వి.శ్యామ్‌ప్రసాద్‌లాల్, ఎసిపి అశోక్, డిఆర్‌ఓ భిక్షానాయక్, ఆర్‌డిఓ ఆనంద్ కుమార్, తహశీల్దార్ కనుకయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకులకు
రేపు సెలవు రద్దు
యథావిధిగా లావాదేవీలు నిర్వహించాలి
ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ
కరీంనగర్ టౌన్, మార్చి 29: ఆర్ధిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆదివారం బ్యాంకుల సెలవును రద్దుచేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం అన్ని బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు ఉత్తర్వులు పంపగా, మిగతా పని దినాల మాదిరిగానే ఆదివారం కూడా యధావిధిగా బ్యాంకుల్లో లావాదేవీలు నిర్వహించాలంటూ ఆయా బ్యాంకులు తమ శాఖలకు లిఖిత పూర్వకంగా సూచించాయి. నూతన ఆర్ధిక సంవత్సరం ప్రారంభం దృష్ట్యా ఏప్రిల్ 1,2 తేదీల్లో బ్యాంకుల్లో గత ఆర్ధిక వివరాలు, లావాదేవీలు లెక్కించే క్రమంలో రెండు రోజుల పాటు లావాదేవీలు నిలిపేస్తారు. ఈతరుణంలోప్రభుత్వ రశీదు, చెల్లింపు లావాదేవీలతో పాటు వినియోగదారులు కూడా ఇబ్బందులెదుర్కొనే అవకాశాలుండగా, వీటిని సులభతరం చేసేందుకు ఈనెల 31న ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాలు నిర్వహించే అన్ని ఏజన్సీ శాఖలు ఆదివారం పనిచేయాలని ఆర్‌బి ఐ సూచించగా, లావాదేవీలు కొనసాగించాలని పలు బ్యాంకుల రీజనల్ మేనేజర్లు తమ కిందిస్థాయి శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

కోడ్ ఉల్లంఘించిన
ఏసీటీఓ సస్పెన్షన్
అతిక్రమిస్తే అధికారులపై వేటు తప్పదు
ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, మార్చి 29: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని హుజూరాబాద్ ఏసీటీఓ ముజాహిద్ హుస్సేన్‌ను ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ శుక్రవారం సస్పెండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలులో ఉన్నప్పటికీ ఈ నెల 20న కరీంనగర్ ముకరంపురలో జరిగిన ఓ రాజకీయ పార్టీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొని ప్రసంగించినట్లు ఫిర్యాదు అందింది. అయితే సమగ్ర విచారణ కొనసాగించి రాజకీయ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించినట్లు విచారణలో వెల్లడి కావడంతో హుజూరాబాద్ ఎసీటీఓ ఎం.డి.ముజాహిద్ హుస్సేన్‌ను క్రమశిక్షణలో భాగంగా సస్పెండ్ చేసినట్లు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు. కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ముకరంపురలో జరిగిన ప్రచార సభలో పాల్గొని ఓ రాజకీయ పార్టీ అభ్యర్థి తరపున ప్రసంగించినట్లు ఫిర్యాదు అందగానే కరీంనగర్ వాణిజ్య పన్నులశాఖ జాయింట్ కమీషనర్‌చే సమగ్ర విచారణ కొనసాగించి ఆ విచారణ నివేదిక ఆధారంగా ఏసీటిఓ ఎం.డి.ముజాహిద్ హుస్సేన్‌ను సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఏ అధికారి అయినా సరే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఫిర్యాదు అందితే చాలు సమగ్ర విచారణ కొనసాగించి విచారణలో రుజువైనట్లయితే వెంటనే వేటు వేస్తామని ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించారు.

పదారు గెలవాలి
-అప్పుడే కేంద్రంలో చక్రం తిప్పుతాం: టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముస్తాబాద్, మార్చి 29: పదారుకు పదారు గెలిస్తేనే కేంద్రంలో చక్రం తిప్పుతామని, పనులు జరుగుతాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ముఖ్య అతిథిగా హజరై, మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సత్తా చాటాల్సిన అవశ్యకత వ్యక్తం చేశారు. 16సీట్లు గెలిచి తీరాలని ఆకాంక్షించారు. ఢిల్లీ ఎర్రకోటలో ఏ ప్రధానమంత్రి జెండా ఎగురవేయాల్లో నిర్ణయించే స్థాయిలో ఉంటామన్నారు. 20లక్షల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యంగా గోదావరినదిపై చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు 90శాతం నిధులు కేంద్రం నుంచే వస్తాయన్నారు. గులాభీ సైనికులు పార్లమెంట్‌లో ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి పనులు తొందర తొందరగా చేసుకొంటామన్నారు. ప్రాజెక్టులకు నిధులు అందుతాయని మన పొలాలకు సాగునీరు వస్తాయన్నారు. కాళేశ్వరం నుంచి మధ్య మానేరు, మలకపేట, సింగసముద్రం మీదుగా నర్మాల ప్రాజెక్టు నింపడంతో నియోజకవర్గంలో ఒక లక్ష ఎకరాలకు సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తామని, ఏడాదిలో సిరిసిల్ల-వేములవాడ మీదుగా హైదరాబాద్‌కు రైలు సాధిస్తామన్నారు. అధికారానికి వచ్చిన ఐదేళ్లలో సీఎం కేసీఆర్ అభివృద్ధి అంటే ఇలా ఉండాలని దేశానికి ఆదర్శం అయ్యారని చెప్పారు. నాయకుడు అంటే ఇలా ఉండాలని దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తున్నారని, రైతుబంధు పథకాన్ని ప్రధానమంత్రి కాఫీ కొట్టి పీఎం కిషాన్ పేరిట అమలు చేస్తున్నారని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు కూడ దీన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ అంటే గిట్టని ప్రాంతీయ పార్టీలు ఎంపీ సీట్లు 170వరకు గెలిచే అవకాశం ఉందని, ప్రాంతీయ పార్టీలే దేశాన్ని పాలించ బోతున్నాయని, ఆయా ప్రాంతీయ పార్టీలతో కలిసి కేసీఆర్ కేంద్ర సర్కార్ ఏర్పాటులో కీలకం కానున్నారని అన్నారు. ఆసరా పెన్షన్‌ను 57ఏళ్లకు కుదించడంతో తాజాగా మరో 8లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని, ఆసరా పెన్షన్ మొత్తాన్ని మేనెల నుంచి 2016రూ.లకు పెంచి ఇవ్వనున్నట్లుగా తెలిపారు.

పెద్దపల్లి సీటును తప్పక గెలువాలి
-మంత్రి కొప్పుల పిలుపు
ధర్మారం, మార్చి 29: వచ్చే నెలలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపి సీటును గెలువడానికి ప్రతీ కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం మండలంలోని బొమ్మారెడ్డిపల్లి గ్రామంలోని మహేశ్వర ఫంక్షన్‌హాలులో ధర్మారం, వెల్గటూరు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరిని మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పురుగుల మందు
తాగి ఒకరి ఆత్మహత్య
ధర్మారం, మార్చి 29: ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన ధనిశెట్టి పోశెట్టి (45) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మారం ఎస్‌ఐ ప్రేం కుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..శుక్రవారం ఉదయం ఎవరు లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకోగా గమనించిన కుటుంబ సభ్యులు చికిత్సకోసం తరలిస్తుండగానే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మాయ మాటలు నమ్మి మోసపోవద్దు
-కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్
చందుర్తి, మార్చి 29: ప్రజలు టిఆర్‌ఎస్ నాయకుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని కరీంనగర్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల, ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి టిఆర్‌ఎస్ నాయకులు మోసం చేసే అవకాశం ఉందని, దేశం, గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్థానికేతరుడైన ఎంపి వినోద్‌కుమార్‌ను ఓడించి తెలంగాణ కోసం పోరాటం చేసిన తనను గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని, ఇందుకోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఎన్నికలు బిజెపి, కాంగ్రెస్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలని, టిఆర్‌ఎస్‌కు ఓటేస్తే మురిగిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి ఆది శ్రీనివాస్, నాయకులు ముస్కు ముకుంద రెడ్డి, అంచ రాంరెడ్డి, పొద్దుపొడుపు లింగారెడ్డి, నాగం కుమార్, తొట్ల అంజయ్య, విష్ణుప్రసాద్ పాల్గొన్నారు.

తెలంగాణ ఇచ్చిన
కాంగ్రెస్‌కే పట్టం
- రాష్టన్రేత కేకే మహేందర్‌రెడ్డి
ముస్తాబాద్, మార్చి 29: ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు, తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్‌కే పట్టం కట్టనున్నారని రాష్టప్రార్టీ నాయకులు కేకే.మహేందర్‌రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలకేంద్రంలో శుక్రవారం మండల కాంగ్రెస్ నాయకులు బుర్ర రామాగౌడ్, ఎల్లా బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆయన మాట్లాడారు. 12మంది టీఆర్‌ఎస్ ఎంపీలు ఉండగా చేయలేనిది 16మంది ఎంపీలను గెలిపిస్తే కేసీఆర్ ఏం సాధిస్తారని సొంత ప్రయోజనాల లబ్ధికే వినియోగిస్తారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికలూ రాహుల్‌గాంధీకి మోడీ మధ్య జరుగుతున్నాయని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజల హక్కుల్ని, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తున్నదని ఆరోపించారు. ప్రశ్నించే గొంతు లేకుండ ఎదుటి పక్షాల ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ పథకాల సొమ్ములు తమ జేబు నుంచి ఇచ్చినట్లుగా సోకు చేస్తున్నారని అన్నారు. మా వారసత్వ భూములకు రైతుబంధు పథకం డబ్బులు రాగా, అవీ తమ జేబు నుంచి ఇచ్చినట్లుగా కేటీఆర్ షో చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అభివృద్ధి జరగాలంటే
టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి
-ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్
చందుర్తి, మార్చి 29: రాష్ట్రంలో మరింత అభివృద్ది జరుగాలంటే ముఖ్యమంత్రి కేసిఆర్ బలపర్చిన టిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కరీంనగర్ ఎంపి అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చందుర్తి మండల కేంద్రం, రుద్రంగి మండల కేంద్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ఢిల్లీని శాసించడం కోసమే 16 ఎంపి స్థానాలను గెలిపించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సారథ్యంలో దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడడం ఖాయమన్నారు. దేశాన్ని పాలించడంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సమగ్రాభివృద్ధి జరుగాలంటే టిఆర్‌ఎస్ పార్టీనే గెలిపించాలన్నారు. రుద్రంగి మండలంలో 30 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. అలాగే గోదావరి జలాల ద్వారా చెరువులను నింపి సస్యశ్యామలం చేస్తామన్నారు.వినోద్ కుమార్‌ను ఐదు లక్షల మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే రమేష్ బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూఢపల్లి గ్రామ సర్పంచ్ అంజిబాబు, సర్పంచ్ కరుణాకర్, కిష్టంపేట సర్పంచ్ కల్పన, చందుర్తి వార్డు సభ్యులు పిట్టల బాబు, విజయ్‌తో పాటు పలువురు వినోద్ కుమార్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మూఢపల్లి నుండి అంజిబాబు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు.

హిందువులను కించపరిచిన వారిపై..
ఓటుతోనే ప్రతీకారం
-బీజేపీ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్
కరీంనగర్ టౌన్, మార్చి 29: మైనార్టీల ఓట్ల కోసం మెజార్టీల మనోభావాలు దెబ్బతీస్తూ,కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఓటుతోనే ప్రతీకారం తీర్చుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారని బీజేపి లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎన్నికల సమయంలో హిందూగాళ్ళు..బొందుగాళ్ళు అంటూ అహంకార పూరిత వ్యాఖ్యలు చేసి, ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారని, హిందూ సమాజం సంఘటితమయ్యే సమయం ఆసన్నమైందని, ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు బ్యాంకు ద్వారా కేసీ ఆర్, కేటీ ఆర్‌లకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. నిస్సిగ్గుగా ఓవైసీల ఎం ఐ ఎం పార్టీకి ఒక లోక్‌సభ స్థానం వదిలి, 16సీట్లపై మాట్లాడుతున్నపుడే కేసీ ఆర్ వైఖరి ప్రజలకు ఆర్ధమైందన్నారు. గత ఐదేళ్ళుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన లక్షల కోట్ల రూపాయల నిధులు దారి మళ్ళించి చేసిన అవినీతి, అక్రమాలతో సంపాదించిన డబ్బును ఈ ఎన్నికల్లో వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీ ఆర్‌ను గద్దెదించిన మాదిరిగానే వైస్రాయ్ ఉదంతం జరిగే అవకాశాలు కనపడుతుండగా, తండ్రి,కొడుకులు అంగ,అర్ధ , అధికార బలాలతోపార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని ద్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీ ఆర్ ఆగడాలకు అంతే లేకుండా పోయిందని, ఇందుకు నెరెళ్ళ ఇసుక మాఫియాను అడ్డుకున్న దళిత యువకులపై తీవ్ర వేధింపుల కేసులు నమోదు చేయటమే నిదర్శనమన్నారు. కోహెడ మండలం వరుకోలు గ్రామానికి చెందిన యువకులు సంజయ్ సమక్షంలోబీజేపిలో చేరారు.
‘బతుకమ్మ’కి నాసిరకం నూలు
ప్రభుత్వ ఆర్డర్లు యాజమానులు రద్దు చేయాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూషం డిమాండ్
సిరిసిల్ల, మార్చి 29: బతుకమ్మ చీరల ఉత్పత్తికి సూచించిన నూలు(యారన్)ను ఉపయోగించకుండా అధిక లాభాలు పొందడం కోసం నాసిరకం(లోకల్) నూలును వాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఉన్న ప్రతిష్టను దబ్బెతీసే విధంగా ప్రయత్నించిన వార్పిన్ యజమానులపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మూషం రమేష్ మాట్లాడుతూ యజమానుల వద్ద ఉన్న మ్యాక్స్ సంఘాలు, ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల వారు ప్రభుత్వ ఆర్డర్ల వస్త్రాలన్నింటినీ ఉత్పత్తి చేయకుండా శాశ్వతంగా వారి నిషేదం విధించాలని, వీరిపై ఇలాంటి చర్యలు తీసుకుంటేనే రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. ఇలాంటి వారిపై స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ తగిన చర్యలు తీసుకుని సిరిసిల్ల బతుకమ్మ చీరల ప్రతిష్టను, ఉత్పత్తి చేస్తున్న కార్మికుల ప్రతిష్టను, కాపాడే విధంగా కృషి చేయాలని, అదే విధంగా చేనేత జౌళి శాఖ అధికారులు బీములను ఇచ్చిన వార్పిన్ యజమానులపై చర్యలు తీసుకోకుండా ఆసాములపై చర్యలు తీసుకోవడం సరైంది పద్దతి కాదన్నారు. నాసిరకం యారన్ ఉపయోగించిన యజమానులకు ప్రభుత్వ ఆర్డర్లను శాశ్వతంగా నిషేధించాలని అన్నారు. అలా చేయని పక్షంలో హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కమీషనర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.

ఫెడరల్
ఫ్రంట్‌తోనే
దేశాభివృద్ధి
ప్రాంతీయ పార్టీలదే కేంద్రంలో కీలకపాత్ర
ప్రజాభీష్టం మేరకే కేసీఆర్‌తో దోస్తీ
ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్
కరీంనగర్ టౌన్, మార్చి 29: రాబోయే రోజుల్లో ఫెడరల్ ఫ్రంట్‌తోనే దేశం అభివృద్ధి పథంలోకి పయనించబోతుందని, కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు కీలకభూమిక పోషించబోతున్నాయని ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ అన్నారు. శుక్రవారం నగరంలోని తన నివాసంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలోమాట్లాడుతూ, నాలుగున్నరేళ్ళ కాలంలోముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని ప్రత్యక్షంగా వీక్షించిన ఓటర్లు మరోసారి ఆయనను ఆశీర్వదించారని, రాబోయే ఐదేళ్ళలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారబోతుందన్నారు. ఇప్పటికే 90శాతం పనులతోరాష్ట్రంలోసాగునీటి ప్రాజెక్టులు ముందువరుసలో ఉన్నాయని, మరికొద్దిరోజుల్లోనే పూరె్తై రైతాంగానికి అందుబాటులోకి రానున్నాయన్నారు. ఒక్కసారి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటే, రాష్ట్రం సశ్యశ్యామలంగా మారుతుందన్నారు. జూన్ మాసం నాటికి కాళేశ్వరం నీరు జిల్లాలో పరుగులు పెడుతుందని, సీఎం కేసీఆర్ చలవతోనే జిల్లా వాటర్ హబ్‌గా మారబోతుందన్నారు. రాష్ట్ధ్రానేతగా ప్రజాసంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి, అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తుండటంతో, ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వారంతా తెరాస వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. ప్రజాభీష్టం మేరకే పార్టీ మారినట్లు ప్రకటించారు.ప్రత్యేక రాష్ట్ర సాధనతో పాటు, విభజన హామీలపై పార్లమెంటులో అవిశ్రాంతంగా పోరాడిన ఎంపి వినోద్ సేవలు జిల్లావాసులకు మరింత అవసరమన్నారు. ఈక్రమంలోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆయన గెలుపుకోసం పనిచేసేందుకు కాంగ్రెస్ నుంచి వలసలు కొనసాగుతున్నాయని అన్నారు. అతి తక్కువ సమయంలో అత్యంత క్లిష్టమైన సమస్యలు కూడా పరిష్కరించిన ఘనత వినోద్‌దేనని, 16 పార్లమెంటు సీట్లు గెలుపొందితే, కేంద్రంలో ఆయన మంత్రి కావటం తథ్యమన్నారు. అనంతరం రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి పనుల కోసం భారీగా నిధులు తెచ్చుకునే అవకాశముంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులు రాచకొండ తిరుపతి గౌడ్, ముద్దసాని కనుకయ్య, బండి ప్రశాంత్, మాదాసు శ్రీనివాస్, విష్ణువర్ధన్‌రెడ్డి, తదితరులు ఆపార్టీకి రాజీనామా చేసి, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరినట్లు స్పష్టం చేశారు. ఈసమావేశంలో తెరాస నాయకులు పాల్గొన్నారు.