కరీంనగర్

పుట్టగొడుగుల్లా బియ్యం దుకాణాలు...!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 10: బియ్యం దుకాణాలు జిల్లాలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒక్కో గల్లీలో ఐదు నుంచి పది దుకాణాల దాకా వెలుస్తున్నాయి. అనుమతులు లేకుండా దుకాణాలను తెరవడంతోపాటు అడ్డగోలు ధరలతో విచ్చలవిడిగా బియ్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఆకర్షణీయమైన బ్యాగుల్లో ఓ వైపు నాసిరకం, మరోవైపు తూకంలో తక్కువగా నింపుతూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. అటు రేషన్ బియ్యం సైతం వ్యాపారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికైనా బియ్యం దుకాణాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విచ్చలవిడిగా అక్రమాలు
బియ్యం అమ్మకాల్లో దుకాణాదారులు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొలతల్లో మోసాలకు ఉపక్రమిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించే నాథుడు లేకపోవడంతో నిత్యం వేలాది రూపాయలు అమాయక ప్రజల నుంచి దోచుకుంటూ దర్జాగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. తనిఖీలు నిర్వహించాల్సిన సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. దుకాణానికి వెళ్లి 25 కిలోల బ్యాగు తీసుకుంటే అందులో 23కిలోలే ఉంటాయి. ధర మాత్రం 25 కిలోలకు తీసుకుంటారు. ఇదేమని అడిగితే ఇదింతే మాకు లాభం ఉండాలిగా అంటూ బుకాయిస్తారు. ఈ మోసాలపై ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో జనం కూడా ఇదే పరిస్థితికి అలవాటు పడిపోయారు. జిల్లాలో బియ్యం దుకాణాలు అనుమతులు లేకుండా వెలుస్తున్నా.. అడిగే వారే లేరు. కల్తీ చేస్తే చర్యలు తీసుకునే దిక్కులేదు. దీంతో బియ్యం వ్యాపారం ‘మూడు బస్తాలు.. ఆరు వందలు’గా విలసిల్లుతోంది. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో బియ్యం దుకాణాలు నడుస్తున్నాయి. ఇందులో సగానికి సగం అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. పల్లె ప్రజల అమాయకత్వమే ఆలంబనంగా బియ్యం వ్యాపారులు చల్లగా తమ పని కానిచ్చేస్తున్నారు. బిపిటి, బాసుపతి, సురేఖ, హంస, హెచ్‌ఎంటి తదితర రకాలున్న బియ్యం వ్యాపారంలో ఆకర్షణీయమైన ప్యాక్‌లతో ప్రజలను ఆకర్శిస్తూ మోసం చేస్తున్నారు. ధరల్లో కూడా భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయి. ధరల మాట అలా ఉంటే బియ్యంలో రాళ్లు, ఇసుక, మట్టి కలుపుతున్నారు. ఒక్కోసారి బియ్యం మొత్తం కల్తీమయం అయిన సందర్భాలున్నాయి. మరోవైపు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఒక్క రూపాయికి కిలో బియ్యం సైతం వ్యాపారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. డీలర్లు, వ్యాపారులు కుమ్మక్కై ప్రజలకు అందించాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రూపాయికి కిలో బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కిలోకు 8 నుంచి 12రూపాయల వరకు విక్రయిస్తున్నారు. స్పందించాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో ఈ తతంగాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేసినప్పుడల్లా అక్రమ రేషన్ బియ్యం వెలుగుచూస్తున్న సంఘటనలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బియ్యం దుకాణాలపై నిఘా పెంచి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.