కర్నూల్

కొత్తగా మరో 2 రెవెన్యూ డివిజన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, ఫిబ్రవరి 3:పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో అదనంగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో కొత్తగా 2 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు ఉండగా కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో 20, నంద్యాల, ఆదోని డివిజన్ పరిధిల్లో 17 మండలాలు చొప్పున ఉన్నాయి. ఒక్కో రెవెన్యూ డివిజన్ పరిధిలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధి 6,993 చదరపు కిలోమీటర్లు ఉంది. ప్రభుత్వం నూతనంగా ఒక్కొ డివిజన్‌ను 2,350 చదరపు కిలోమీటర్లు తీసుకుని ఏర్పాటుచేస్తోంది. జిల్లాలో నూతనంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌గా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు, శ్రీశైలం, వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది. నందికొట్కూరు నియోజకవర్గంలోని పాములపాడు, జూపాడుబంగ్లా, కొత్తపల్లి, మిడుతూరు మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేస్తోంది. ప్రస్తుతం బండి ఆత్మకూరు, మహానంది మండలాలు నంద్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఇక పత్తికొండ రెవెన్యూ డివిజలో పత్తికొండ, ఆలూరు నియోజక వర్గాలకు సంబంధించిన మండలాలను కలుపుతున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి, మద్దికెర, పత్తికొండ, క్రిష్టగిరి, వెల్దుర్తి మండలాలు, ఆలూరు నియోజకవర్గంలోని హొలగుంద, హాలహర్వి, చిప్పగిరి, ఆస్పరి, దేవనకొండ మండలాలను పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో కలుపుతున్నారు. ఈ రెండు డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు నివేదికలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన రెవెన్యూ విభాగాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు డివిజన్ పునర్విభజన తక్షణ అవసరమని రెవెన్యూ అధికారులకు నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ విజయ్‌మోహన్, జెసి హరికిరణ్ ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక రెవెన్యూ డివిజన్ పరిధి వుండేలా ఈ రెండు డివిజన్లను ఎంపిక చేశారు. ప్రస్తుతం సగటున 11 మండలాలకు ఒక ఆర్డీఓను నియమించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీంతో కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆత్మకూరు, నందికొట్కూరు నిమోజకవర్గాలు కొత్త రెవెన్యూ డివిజన్ ఆత్మకూరు డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆదోని డివిజన్ పరిధిలోని పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలకు సంబంధించి మండలాలను పత్తికొండ డివిజన్ కేంద్రంగా ఏర్పాటుచేస్తున్నారు.
మంత్రాలయం-కర్నూలు
రైల్వేలైన్ సర్వేకు గ్రీన్‌సిగ్నల్
* ఫలించిన 65 ఏళ్ల కల..
ఆదోని, ఫిబ్రవరి 3: రాఘవేంద్రస్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం మంత్రాలయం నుంచి జిల్లా కేంద్రమైన కర్నూలుకు కొత్తగా వేసే రైల్వే మార్గం ప్రతిపాదనలో ప్రతిపాదనలు అంచనాలు దాటి సర్వేకు రైల్వే బడ్జెట్‌లో ఆమోదం తెలిపారు. దీంతో 65 సంవత్సరాల ఈ ప్రాంత ప్రజల కల ఫలించింది. 1952 ఆనాటి లోకసభ సభ్యులు గాదిలింగన్నగౌడ్ కర్నూలు- మంత్రాలయం రైల్వే లైన్‌ను నిర్మాణం చేయాలని లోకసభలో ప్రస్తావించారు. అయితే 2004 సంవత్సరం వరకు ఈ రైల్వేలైన్ నిర్మాణం గురించి నేతలు మరిచిపోయారు. 2004లో ఎన్నికల సందర్భంగా ఈ రైల్వే నిర్మాణం గురించి టిడిపి నాయకులు, దివంగత మాజీ ఎమ్మెల్యే బివి.మోహన్‌రెడ్డి తెరమీదకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో టిడిపి కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టిడిపి ఎంపిలు ఎర్రమనాయుడు, కెయి.కృష్ణమూర్తిలు కలసి ఆనాటి రైల్వే మంత్రి నితీష్‌కుమార్ దృష్టికి ఈ రైల్వే నిర్మాణం గురించి వివరించారు. అయినా ప్రతిపాదనలు ముందుకు కదలలేదు. 2009లో కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాషరెడ్డి ఈ రైల్వేలైన్ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మంత్రాలయం పీఠాధిపతులు దక్షిమధ్య రైల్వే జిఎం దృష్టికి తీసుకొచ్చారు. అదే సంవత్సరం లోకసభలో రైల్వే బడ్జెట్‌పై మంత్రాలయం-కర్నూలు రైల్యే నిర్మాణానికి పరిశీలించేందుకు అంగీకరించారు. అయినా ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత ఎంపి బుట్టారేణుక కూడా దీనిపై రైల్వేమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం ఇప్పుడు కేంద్ర ఆర్థిక బడ్జెట్‌తోపాటు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన 2017 బడ్జెట్‌లో ఈ రైల్వే లైన్ సర్వేకు ఎట్టకేలాకు మోక్షం లభించింది. ప్రాథమిక అంచానా ప్రకారం రూ. 200కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. 110.70 కిలో మీటర్ల గల రైల్వేలైన్ నిర్మించాల్సి ఉంటుంది. 22 మలుపులు, 14 రైల్వేషన్లు ఉంటాయని ప్రాథమిక అంచనా. మంత్రాలయం నుంచి మాధవరం, ఎమ్మిగనూరు, ఇబ్రహింపురం గుండా జూపాడుమీదుగా కర్నూలుకు లైను వేయాల్సి ఉంది. 65 సంవత్సరాలు తరువాత సర్వేకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రజలు హర్షిస్తున్నారు.
మార్చిలోగా ఆదోని-రాయచూరు రైల్వే విద్యుద్దీకరణ పూర్తి
ఆదోని టౌన్ : ఆదోని నుంచి రాయచూరు వరకు రైల్వే విద్యుద్ధీకరణ పనులు ఈ ఏడాది మార్చి 31వ తేదిలోగా పూర్తి చేస్తామని రైల్వే ఇంజినీరింగ్ అధికారి సంజీవ్‌రావు, పిఎంసి ఎల్‌విరావులు తెలిపారు. శుక్రవారం ఆదోనిలో గుంతకల్లు నుండి ఆదోని వరకు రైల్వే విద్యుద్ధీకరణను పూర్తి చేసిన పనులను ట్రయిలర్ రన్ ఇంజిన్‌ను ప్రారంభించి పరిశీలించారు. గుంతకల్లు నుంచి ఆదోని వరకు రైల్వే విద్యుద్ధీకరణ పనులు పూర్తి అయ్యాయని, మార్చి 31వ తేదీలోగా ఆదోని- రాయచూరు పనులు పూర్తి చేస్తామని అధికారి విజేంద్రకుమార్, తదితరులు పేర్కొన్నారు.
సామాన్యుడికి ఉపయోగపడని బడ్జెట్
* కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య
తుగ్గలి, ఫిబ్రవరి 3: కేంద్ర, ఆర్థిక మంత్రి అరున్‌జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య మానవుడికి ఉపయోగ పడే విధంగా లేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బొందిమడుగుల గ్రామంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌ను ప్రవేశపట్టే సమయంలో అన్ని వర్గాల వారి శ్రేయస్సును ఆలోచించి రూప కల్పన చేయాలన్నారు. అలా కాకుండా ధనవంతులకు ఉపయోగ పడే విధంగా ఉందన్నారు. ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రైతులు బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీఠ వేశామని చెప్పుకున్నప్పటికీ వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులు బయట పడే మార్గాలు ఏమి లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వరస కరవుల అనంతరం కేంద్రం బుధవారం ప్రవేశ పెట్టిన ఈబడ్జెట్‌లో రైతు అనుకూల అంశాలు ఏమీ లేవన్నారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు వైవిప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తిమ్మయ్య, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
లక్కీడిప్ ముఠా అరెస్టు
* రూ. 6.48 లక్షల నగదు,
విలువైన వస్తువులు స్వాధీనం:ఎస్పీ
కర్నూలు, ఫిబ్రవరి 3: లక్కీడిప్ పేరుతో ప్రజలను మోసం చేసే ముగ్గు రు సభ్యుల ముఠాను శుక్రవారం మంత్రాలయం పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 6.48 లక్షల నగదు, రూ. 6.28 లక్షల విలువ చేసే విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం సాయంత్రం ఎస్పీ ఆకే రవికృష్ణ జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రత్న య్య, రాఘవేంద్ర, చంద్రశేఖర్, రాజశేఖర్ ఒక గ్రూపుగా ఏర్పడి ఎలాంటి ప్రభుత్వ లైసెన్సు లేకుండా 6 నెలల క్రితం కోసిగి గ్రామంలో శ్రీశ్రీలక్ష్మీనరసింహా ఎంటర్‌ప్రైజెస్ లక్కీడిప్ స్కీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఒకొక్కరి నుంచి రూ. 1300 చొప్పున దాదాపు 3,500 మంది నుంచి దాదాపు రూ. 6.28లక్షల నగదు వసూలు చేశా రు. వీరు ఎలాంటి ప్రభుత్వ లైసెన్సు లేకుండా విలువైన బహుమతులు ఇస్తామని బ్రోచర్స్ ప్రింటింగ్ వేయిం చి వివిధ మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజల నుంచి రూ. 13 లక్షల దాకా వసూలు చేసి లక్కీ డిప్ తీయకుండా ప్రైజ్‌లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారు. దీంతో మాధవారం గ్రామానికి చెందిన వగరూరు ఆరోని ఫిర్యాదు చేయడంతో మంత్రాలయం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంత్రాలయం సిఐ నాగేశ్వరరావు, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం మంత్రాలయం మండలం సుగూరు మలుపు రోడ్డు వద్ద రత్నయ్య, రాఘవేంద్ర, చంద్రశేఖర్‌లను అరెస్టు చేయగా రాజశేఖర్ పరారయ్యాడన్నారు. వారి నుంచి రూ. 6.48 లక్షల నగదు, రూ. 6.28 విలువ చేసే వెయ్యి జతల ప్యాంట్లు, చొక్కాలు, 360 ఎల్‌ఇడి ఎమర్జెన్సీ లైట్లు, 100 స్టీల్ క్యారియర్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ యూనిస్, కానిస్టేబుళ్లు చంద్ర, ఖాద్రీ, రామకృష్ణనాయక్‌లను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, మంత్రాలయం సిఐ నాగేశ్వరరావు ఉన్నారు.
మంత్రాలయంలో
వైభవంగా రథసప్తమి
మంత్రాలయం, ఫిబ్రవరి 3: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం బృందావన ప్రతిమను స్వర్ణ పల్లకిలో ఉంచి ప్రాకారంలో ఊరేగించారు. రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని పంచ రథోత్సవాల్లో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వామి వెండి ప్రతిమలను గజ, కొయ్య, వెండి, స్వర్ణ, నవరత్న పంచ రథాలపై అధిష్ఠించి పీఠాధిపతి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య అశేష భక్తుల నడుమ అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగించారు. ఈశుభ దినం సందర్భంగా స్వామి దర్శనార్థం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పంచ రథోత్సవాల్లో ఊరేగుతున్న శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో పండిత కేసరి, రాష్టప్రతి అవార్డు గ్రహీత రాజా ఎస్ గిరియాచార్యులు, ఎఎఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాస్‌రావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, ఇంజినీరు సురేష్‌కోణాపూర్, రాఘవేంద్రరావు, ద్వారపాలక అనంతస్వామి, ప్రిన్సిపల్ వాదిరాజాచార్, దార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ్భద్రావతి
భావనారాయణ కల్యాణోత్సవం
నంద్యాలటౌన్, ఫిబ్రవరి 3: మాఘశుద్ధ సప్తమి అత్యంత పవిత్ర దినం కావడంతో శ్రీ్భద్రావతి భావనారాయణ స్వామి వార్ల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా వేద మంత్రోచ్చారణల మధ్య జరిగింది. శుక్రవారం ఉదయం ప్రాతఃకాల పూజ, కలశ ఉద్వాసన, కుంభాభిషేకం, మహాజల సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం శ్రీ్భద్రావతి భావనారుషి దేవాలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో నంద్యాల పట్టణ పద్మశాలీయ సంఘం ఆధ్వర్యంలో శ్రీ్భద్రావతి భావనారాయణ స్వామి వార్ల కల్యాణంను వేద పండితులు మంచి సుమూహుర్తంలో కల్యాణాన్ని ప్రారంభించారు. పెళ్లితంతు తిలకించడానికి పద్మశాలీయ సంఘీయులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని భక్తిపారవశ్యంతో తిలకించారు. పండితులు, అర్చకులు వేద మంత్రాలు పఠిస్తూ వాటి అర్థాలను వివరిస్తూ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని ఎంతో వైభవంగా చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి పద్మనాభరావులు మాట్లాడుతూ ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు శుక్రవారం నాటితో ముగిశాయన్నారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు ఎంతో వైభవంగా పూజాదికాలు చేసినట్లు చెప్పారు. సాయంత్రం ధ్వజా అవరోహణం, శ్రీ్భద్రావతి భావనారుషి ఉత్సవమూర్తుల గ్రామోత్సవం పట్టణంలోని పురవీధుల గుండా తరలివెళ్లి స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు.
డోన్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం!
* టీచర్స్ కాలనీలో ఆయుర్వేద మందుల పంపిణీ
డోన్, ఫిబ్రవరి 3:స్థానిక సుందర్‌సింగ్ కాలనీకి చెందిన ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు వార్తలు రావడంతో డోన్ పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో పని చేసే వ్యక్తి కుటుంబంతో కలిసి కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఈ వ్యాధి సోకినట్లు తెలిసింది. అయితే వ్యాధి నిర్ధారణ కావడంతో హైదరాబాద్‌లోనే చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. పట్టణానికి చెందిన మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు ప్రచారం జరగడంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు స్పందించి ముందు జాగ్రత్తగా సుందర్‌సింగ్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ఆయుర్వేద గుళికలు పంపిణీ చేశారు. అలాగే మున్సిపల్ కమిషనర్ రమేష్‌బాబు ఆదేశాలతో హోమియో వైద్యురాలు మాధవి, ఆయుర్వేద వైద్యులు ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి మందులు పంపిణీ చేశారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, పడిశం, గొంతు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా వుంటే వెంటనే స్థానిక వైద్యశాలలో చికిత్స పొందాలని వారు సూచించారు. తుమ్ములు వచ్చినపుడు చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలని, చేతులు కలిపి మాట్లాడకూడదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఇఓ కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా సూర్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవం
నందికొట్కూరు, ఫిబ్రవరి 3:రథసప్తమి సందర్భంగా పట్టణంలోని కోటవీధిలో వెలసిన సూర్యనారాయణస్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీఛాయాఉషాసమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. దేవాలయం ముందు ప్రత్యేక అలంకరణతో సిద్ధం చేసిన మండపంపై స్వామివార్ల విగ్రహాలను కూర్చుండబెట్టి పురోహితులు శాస్త్రోక్తంగా స్వామివార్ల కల్యాణం నిర్వహించారు. రాష్ట్రంలోనే రెండవ సూర్యనారాయణస్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బైరెడ్డి యువసేన అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థరెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డితో పాటు జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి ప్రముఖులు, భక్తులు తరలివచ్చారు. సా యంత్రం స్వామి వారి ఉత్సవమూర్తుల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది.

రచ్చకెక్కిన తెలుగుతమ్ముళ్లు!
* పింఛన్ల జాబితాపై వాగ్వివాదం..
* కొత్త పింఛన్ల పంపిణీకి తాత్కాలిక బ్రేక్..
ఆత్మకూరు, ఫిబ్రవరి 3:అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గాల కుమ్ములాటలకు శుక్రవారం ఎంపిడిఓ కార్యాలయం వేదికైంది. టిడిపి నాయకులు లాయర్ గోవిందరెడ్డి, అజ్‌ఘర్, కేశవరెడ్డి ఎంపిడిఓ కార్యాలయం చేరుకుని పింఛన్ల జాబితాలో జన్మభూమి కమిటీ ఆమోదించిన పేర్లను ఎందుకు తొలగించినారని కార్యాలయం అధికారి సలీం ప్రశ్నించారు. దీంతో సలీం మాట్లాడుతూ పేర్ల తొలగింపులో తనకు సంబంధం లేదని, వడ్డరామాపురం జన్మభూమి కమిటీ ఆమోదించిన పేర్లును ఎక్కించానన్నారు. ఇంతలో ఎంపిడిఓ కార్యాలయానికి ఎమ్మెల్యే అనుచరుడు నాగార్జునరెడ్డి రావడంతో ఘరణ ప్రారంభమైంది. వడ్డ రామాపురం గ్రామానికి 21 పింఛన్లు కేటాయించారు. అందులో ఎమ్మెల్యే వర్గానికి 11, శిల్పా వర్గానికి చెందిన కేశవరెడ్డికి 10 కేటాయిస్తూ జాబితా తయారు చేసి పంపించారు. అయితే కేశవరెడ్డి వర్గానికి చెందిన జాబితా నుంచి సుబ్బయ్యను తొలగించండతో ఆయన ప్రత్యర్థి వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మెల్యేపై కూడా విమర్శలు చేశారు. దీంతో వడ్డరామాపురం పింఛన్ల పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని టిడిపి నేతలు అధికారి సలీమ్‌ను కోరారు. దీనికి తోడు పట్టణంలోని 8వ వార్డుకు చెందిన జన్మభూమి కమిటీ సభ్యుడు సంపత్‌బాబు తాను పెట్టిన పేరుకు బదులు మరొకరి పేరు వచ్చిందని అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వార్డు పింఛన్లను నిలిపివేశారు.
ప్రత్యేక హోదాకై
న్యాయవాదుల బైక్ ర్యాలీ
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 3:ఏపికి ప్రత్యేక హోదా, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి రాజ్‌విహార్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చాంద్‌బాషా, శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రం వెంటనే ఏపికి హోదా, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయసీమకు న్యాయం చేయాలని కోరారు.

లక్ష్మమ్మ అవ్వ కాంస్య విగ్రహాల ఏర్పాటు
ఆదోని, ఫిబ్రవరి 3: ఆదోనిలో కొలువై ఉన్న శ్రీ తిక్కలక్ష్మమ్మ అవ్వ కాంస్య విగ్రహాలను శుక్రవారం ఆలూరు రోడ్డులో ఏర్పాటు చేసిన స్వాగత ముఖ ద్వారంపై కూర్చోబెట్టారు.
ఈ విగ్రహాలను పశ్చిమ గోదావిరి జిల్లా సమశ్రీ గూడెం గ్రామంలో తయారు చేయించారు. ఉదయం 6 గంటలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశ పారం పర్య ధర్మకర్త రాచోటి రామయ్య, రాచోటి వీరన్న, రాచోటి సుబ్బయ్య కుటుంబ సభ్యులతోపాటు నారాయణరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సాయినాథ్‌రెడ్డి, నసీరుద్దీన్‌పటేల్, గట్టుమురళీకుమార్, శిల్పిరాజులు పాల్గొన్నారు. రాచోటి రామయ్య మాట్లాడుతూ మహాయోగి లక్ష్మమ్మ రాతి ముఖ ద్వారంను త్రిదిండి చిన్నజీయార్‌స్వామిచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలే మాకు కొండంత బలం
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 3: నియోజకవర్గంలోని ప్రజందరూ మాకు కొండంత బలమని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఏవి ఫంక్షన్‌హాలు నందు ఏర్పాటు చేసిన ఆత్మీయవిందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమా మాట్లడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లోనే కొత్తగా వచ్చిన పెన్షన్లు ఇవ్వాలను కున్నాం గానీ, అందరం కలిసి ఆత్మీయంగా పలుకరించుకొని ఆళ్లగడ్డలో కలవాలనే సంకల్పంతో ఆత్మీయ విందును ఏర్పాటు చేశామన్నారు. వేలాది మంది ఇక్కడకు రావడంతో మాకు ఎంతో ఆనందకరంగా వుందన్నారు. మనందరం ఒకే కుటుంబససభ్యులుగా వుండి ఆత్మీయభావాన్ని పంచుకోవడం మాకెంతో తృప్తినిచ్చిందన్నారు. మీ అందరి ఆశీస్సుల బలంతో ఎమ్మెల్యే అఖిలప్రియ దాదాపు 3 వేల పెన్షన్లను తీసుకొచ్చారన్నారు. శోభానాగిరెడ్డి మనకు దూరం కావడం వల్ల ఆ లోటును అఖిలప్రియ ఇంత వేగవంతంగా ప్రజల్లోకి చొచ్చుకొనిపోయి శోభా ఆశయాలను నెరవుర్చడంలో ఇంతో ముందుందన్నారు. అభివృద్ది విషయంలో పోటీపడి నాకంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రతి గ్రామంలో ఇళ్లులేని నిరుపేదలంటూ ఉండకూడదని, స్ధలాలు లేని వారికి స్ధలాలు ఇప్పించిచ ఆ స్ధానంలో ఇళ్లు నిర్మించడానికి కృషిచేస్తోందన్నారు. వాటిని తప్పకుండా సాధిస్తుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వుంటే మా అమ్మ ఆశయం నెరవేరుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. వైకాపాలో వున్న సమయంలో నియోజకవర్గంలోని ప్రజలకు ఏ పనులు చేయలేనేమోనని అనుకున్నానని, టిడిపిలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి ఆళ్లగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చేసే దిశలో సహకరిస్తున్నారన్నారు. జనచైతన్య యాత్రలో ప్రజలు చేసుకున్న విన్నపాలను సహృదయంతో ఆలకించి మనం పంపిన పెన్షన్‌లు అన్నింటిని మంజూరు చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుదుందన్నారు. ఇప్పుడు వచ్చిన 2887 పిన్షన్లు కాకుండా ఇంకా అర్హత వుండి దరఖాస్తు చేసుకోలేని వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం వృద్ధులు, వికలాంగుల నుండి వినతులును స్వీకరించి పెన్షన్లను పంపిణీ చేశారు. ఆత్మీయవిందులో తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపంచాయితీ చైర్‌పర్సన్ ఎద్దుల ఉషారాణి, కమిషనర్ మాలిక్, నాయకులు బివి రామిరెడ్డి, కూడాల నారాయణరెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అన్వర్‌బాషా, రామూ యాదవ్, సూర్యనారాయణరెడ్డి, అనంత రామసుబ్బారెడ్డి, రంగనాయకులు, ఆరు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా రథసప్తమి వేడుకలు
మహానంది, ఫిబ్రవరి 3: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. శుక్రవారం మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరిదేవి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు అభిషేకార్చన పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్‌లు, ఇఓ డా.శంకర వర ప్రసాద్ ధర్మకర్తలచే రథశాల వద్ద గణపతి పూజ, పుణ్యాహవాచనం, సూర్యారాధన, ద్వాదశ ఆదిత్య పూజలు, రథ అధి దేవత అయిన చతుర్ముఖ బ్రహ్మకు అభిషేకం, పూర్ణ్భాషేకం, రథ హవనం పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని బయటకు తెచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామి వార్ల ఉత్సవ పూజలను నిర్వహించేందుకు పూజా కార్యక్రమాలు ప్రారంభ సూచకంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు మాట్లాడుతూ సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజు కావున ఆయనకు రథసప్తమి రోజున పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ఈ రోజు సూర్య భగవానుడు ఉత్తరాయణం వైపు పయనించే రోజు అని రథ సప్తమి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు పరశురామశాస్ర్తి, ఈశ్వర్‌రెడ్డి, ధర్మకర్త బాలరాజుయాదవ్, బండి శ్రీనివాసులు, చంద్రవౌళీశ్వర్‌రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో శ్రీ శ్రీనివాసుని
కల్యాణోత్సవం
ఆదోని, ఫిబ్రవరి 3: భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగగా శ్రీ శ్రీనివాసుని కల్యాణమహోత్సవం తిరుమల నగర్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం శుక్రవారం నిర్వహించారు. హనుమాన్ నగర్ నుంచి చేనేతలు శ్రీపద్మావతికి, శ్రీ వేంకటేశ్వరస్వామికి చీరెసారేను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారిని, శ్రీనివాసుని ఉత్సవ విగ్రహాలను ఉంచి పురోహితులు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆనందపరవసులైన్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మహాశివరాత్రికి
ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ సేవలు
మహానంది, ఫిబ్రవరి 3 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వారి సేవలు అందిస్తామని రామకృష్ణా విద్యాసంస్థల అధినేత డా.జి.రామకృష్ణారెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమం ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా ఇఓ డా.శంకర వర ప్రసాద్, డా.జి.రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు వారి సేవలు అందించారని, వారి సేవలు అభినందనీయమన్నారు. క్షేత్ర పరిసర ప్రాంతాల్లో జంగిల్ క్లీన్ చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారన్నారు. సమాజంలో మంచి భవిష్యత్తు ఉండాలంటే మా కోసం కాకుండ ప్రజల కోసం అందించే సేవాభావాన్ని అలవర్చుకోవాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలతో పాటు యోగాను కూడా అలవర్చుకోవాలని, దీని వల్ల మేధాశక్తి, ఆరోగ్యం, శరీర దారుఢ్యం పెరుగుతుందన్నారు. మహానంది క్షేత్రానికి ఎప్పుడు కావాలన్న ఎనలేని సేవలు అందిస్తామని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈకార్యక్రమాల్లో ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌చార్జి సుబ్బయ్య, సుదర్శనం, తాంబిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నదానానికి రూ.20 వేలు విరాళం
మహానందిలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి చెన్నైకి చెందిన సురేష్ సంజయ్ రూ.20,232లు విరాళంగా అందించినట్లు పర్యవేక్షకులు ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అన్నదాన మండపంలో అధికారులకు ఈ విరాళాన్ని అందించారు. దాతను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
ఎద్దుల పందెం పోటీలకు కోర్టు సిద్ధం
మహానంది, ఫిబ్రవరి 3 : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో నిర్వహించే ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శనకు కోర్టును సిద్ధం చేస్తున్నారు. మండల రైతుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలకు కోర్టును సుందరంగా తీర్చిదిద్దుతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. వారం రోజులుగా సాగుతున్న ఈ పనులను కోర్టును శుభ్రపరచి, కోర్టులో పిచ్చి మొక్కలు తొలగించి గ్రావెల్ పరచి పోటీలకు అనుగుణంగా ఉండేలా రంగులు వేసి సర్వం సిద్ధం చేస్తున్నారు.

రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి : ఆర్డీఓ
నంద్యాల రూరల్, ఫిబ్రవరి 3: గ్రామీణ సమస్యలను అప్రమత్తతో ఉండి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను, విఆర్‌ఓలను ఆర్డీఓ రామసుందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన గోస్పాడులో తహశీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బందితో, విఆర్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రెవెన్యూ పరిధిలోని అంశాల గురించి వివరించారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ అంశాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అడంగల్, వన్‌బి, ఇ-పాస్, క్రాప్‌బుక్కింగ్ తదితర వాటి గురించి చర్చించారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని విఆర్‌ఓలను ఆదేశించారు. సమస్యలు రాకుండ చూడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉందన్నారు. కొత్తగా వచ్చిన ఆర్డీఓను తహశీల్దార్ నాగ కళ్యాణి, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పూలమాలలతో అభినందించారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస గౌడు, గురు ప్రసాద్, ఎఎస్‌ఓ ప్రసాద్ రెడ్డి, విఆర్‌ఓలు ఉమా మహేశ్వర్‌రావు, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.
కూలీల వలస బాట...
పెద్దకడబూరు, ఫిబ్రవరి 3: మండల పరిధిలోని పీకలబెట్ట గ్రామానికి చెందిన 100 మంది కూలీలు శుక్రవారం గుంటూరు సమీపంలోని నర్సరావుపేటకు వలస బాట పట్టారు. పీకలబెట్ట గ్రామంలో పనులు లేకపోవడంతో జీవనోపాధి కరువైందని కూలీలు వాపోయారు. పొట్టకూటి కోసం నర్సరావుపేట పొలంలో మిరప పంట తీయడానికి పిల్లలతో వలసబాట పట్టామన్నారు. అధికారులు మాత్రం వలసపోవద్దని ఉపాధి పనులు చేపడుతున్నామని చేస్తున్న ప్రకటనలు కాగితాలకు పరిమితమైయ్యాయని పనులు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు ఉపాధి పనులు అమలు చేయకపోతే వలసలతో గ్రామాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
నారసింహునికి పూజలు
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 3: పారువేట ఉత్సవాలలో భాగంగా ఆళ్లగడ్డకు చేరుకున్న అహోబిలేసుని పారువేట ఉత్సవ పల్లకి నిత్యం ప్రజల నుండి ప్రత్యేక పూజలు అందుకుంటోంది. అందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని అమ్మవారిశాలలో ఆర్యవైశ్యుల నుండి పూజలందుకుంది. పల్లకిలో కొలువు దీరిన శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరదస్వామిలను దర్శించుకొని పూజలు చేశారు. అమ్మవారిశాలకు అహోబిలేసుడు వచ్చిన రోజు పట్టణంలోని ఆర్యవైశ్యులకు పండుగ. పట్టణంలోని పాతబస్టాండ్ నుండి అమ్మవారిశాల బజారు వరకు తారుణాల వాతావరణం నెలకొంది.
ఘనంగా రథసప్తమి వేడుకలు
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 3: పట్టణంలో సమరసతా పౌండేషన్ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మండల ధర్మప్రచారక్ నాగ ఇంద్ర, ధర్మప్రచారక్ లక్ష్మినారయణలు పాఠశాలలో విద్యార్థులకు సూర్య నమస్కారాలు చేయించి ప్రత్యక్ష దైవం సూర్యుని విశిష్టతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
అవుకులో...
అవుకు: మండల పరిధిలోని శివవరం గ్రామంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించార. గ్రామంలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయానే్న సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకడంతో భక్తులు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. భక్తులకు ఆలయ నిర్వాహక బృందం, గ్రామపెద్దలు తీర్థప్రసాదాలు అందజేశారు.

రాలయసీమకు అన్యాయం తగదు
* మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 3: రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో రాయలసీమకు అన్యాయం చేయడం మంచిది కాదని మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి అన్నారు. పట్టణంలోని సంవగృహంలో ఆయన శుక్రవారం విలేఖర్లతో మాట్లాడుతూ రాయలసీమలో వనరులు కల్పించి పరిశ్రమలు ఏర్పాటు చేసే పరిస్థితులను ప్రభుత్వం కల్పించాలన్నారు. అభివృద్ధి అంతటా జరిగినప్పుడు అన్ని ప్రాంతాలు బాగుంటాయన్నారు. ఒక ప్రాంతం వైపు దృష్టి పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆళ్లగడ్డలో రాజకీయ శూన్యత లోపించిందన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ రాజకీయాలు ఎన్నికల సమయంలో మాట్లడాలన్నారు. ముఖ్యంగా ప్రజలకు ఏమి కావాలో వాటిపై దృష్టి వుంచాలన్నారు. తాను ఎక్కడా, ఏ స్థాయిలో ఉన్నా ఆళ్లగడ్డ ప్రాంత అభివృద్ధిపై దృష్టి వుంచడం జరిగిందన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని లేకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజుల దగ్గరలో వున్నాయన్నారు. ఈ సమావేశంలో నాయకులు సి పి రామకృష్ణారెడ్డి, రాఘవేంద్రారెడ్డి, జాఫర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్మశాన వాటిక అభివృద్ధి పనులు ప్రారంభం
నంద్యాల, ఫిబ్రవరి 3: పట్టణంలోని నూనెపల్లె ప్రాంతంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు న్యాయవాది, హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ నిర్వాహకులు శంకరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్‌జీవో కాలని, లలితానగర్ మురుగునీరు స్మశాన వాటికలోకి వెళ్లడంతో దుర్గంధంగా మారిందని తెలిపారు. ఈ విషయాన్ని మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రస్తావించగా కౌన్సిలర్లు అనిల్ అమృతరాజ్ ప్రతిపాదన పెట్టగా ఆమోదించడం జరిగిందని తెలిపారు. దీంతో 2.16 ఎకరాల హిందూ శ్మశాన వాటిక స్థలం చుట్టూ ప్రహరీగోడను నిర్మించడానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. హిందూ శ్మశాన వాటిక కమిటీకి అధ్యక్ష, కార్యదర్శులుగా పార్థసారధి, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శంకరయ్యను ఎన్నుకున్నారు. ఈ శ్మశాన వాటికలో మురికి కాల్వల నిర్మాణానికి మాజీ కౌన్సిలర్ సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో రంగనాయకులు, కొండారెడ్డి, సుబ్బయ్య, వెంకట స్వామి, శ్రీనివాసులు శెట్టి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవి నేత్రాలు దానం
బేతంచెర్ల, ఫిబ్రవరి 3: తోడికోడలు పెద్దకర్మకు వచ్చి అకస్మాత్తుగా మృతిచెందిన పోల లక్ష్మిదేవి(43) నేత్రాలను ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం దానం చేశారు. బేగర్‌పేటలో 12 రోజుల క్రితం పోల చెన్న మ్మ కూలి పనికి వెళ్తూ ఉన్నఫళంగా కుప్పకూలి మృతిచెందింది. ఆమె పెద్దకర్మ కోసం వచ్చిన తోడి కోడలు లక్ష్మిదేవి బాత్‌రూంలో కుప్పకూలి పడిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. భర్త కేశవులు, కుమారుడు శివకుమార్, కూతురు శ్రావణి ఆమె నేత్రాలు దానం చేయడానికి ముందుకురాగా విషయం తెలిసిన వెంటనే లైఫ్ రక్తసహాయక బృందం కర్నూలు ప్రభుత్వ ఐ బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. దీంతో టెక్నీషియన్లు రంగారెడ్డి, రాఘవేంద్ర బేతంచెర్లకు వచ్చి మృతురాలి నేత్రాలను సేకరించారు. కార్యక్రమంలో లైఫ్ యువ నేత్ర సభ్యులు విజయేంద్రరెడ్డి, అక్బర్‌హుసేన్, రాజశేఖర్, రాము, తదితరులు పాల్గొన్నారు.