కర్నూల్

నీటి కరవు తప్పదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 15 : కర్నూలు నగర ప్రజల గొంతెండే రోజు దగ్గరపడుతోంది. నగర దాహార్తి తీర్చేందుకు పని చేయాల్సిన అధికార యంత్రాంగంలో సమన్వయ లోపం కారణంగా మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం నగర దాహార్తి కోసం నిర్మించిన మునగాలపాడు వద్ద నిర్మించిన సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయి మరో 15, 20 రోజులకు మించి ప్రజల అవసరాలను తీర్చే పరిస్థితి లేదు. దీంతో మే నెలలో నగర ప్రజలు గుక్కెడు నీటి కోసం అలమటించే ప్రమాదం పొంచి ఉందని అధికారులే అనధికారికంగా అంగీకరిస్తున్నారు. ప్రజల దాహార్తి తీర్చడానికి పని చేయాల్సిన నగర పాలక సంస్థ, నీటి పారుదల శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రజల కష్టాలు రెట్టింపు కానున్నాయి. కర్నూలు నగర ప్రజల దాహార్తి తీరాలంటే ప్రతి రోజూ 70మిలియన్ లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో వ్యక్తికి రోజుకు 160 లీటర్ల నీరు సరఫరా చేయాలని నిబంధన ఉన్నా ప్రస్తుతం 120 లీటర్ల నీరు అందుతోంది. ఇది కూడా సక్రమంగా సరఫరా కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా సుమారు 5.5 లక్షలు. రోజురోజుకూ శివారు కాలనీల్లో జనాభా పెరుగుతున్నా అక్కడ నగర పాలక సంస్థ నుంచి నీరు సరఫరా కావడం లేదు. వారు సొంతంగా బోర్లు వేసుకుని ఇంటి అవసరాలకు వినియోగించుకుంటూ తాగునీటి కోసం ప్రైవేట్ వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. నగర ప్రజల దాహార్తి తీర్చడానికి మునగాలపాడు వద్ద నిర్మించిన సమ్మర్ స్టోరేజీ నీటి నిల్వ సామర్థ్యం 0.155 టిఎంసిలు కాగా ప్రస్తుతం 0.05టిఎంసిలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. తుంగభద్ర జలాశయం నుంచి సుంకేసుల జలాశయంలో నగర నీటి అవసరాల కోసం నిల్వ ఉంచాల్సిన 0.5 టిఎంసిల నీరు జనవరిలో కెసి కాలువకు పంట పొలాల అవసరాలకు విడుదల చేయడంతో నగర ప్రజల తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని నగర పాలక సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గాజులదినె్న ప్రాజెక్టు నుంచి సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు నీటిని తరలిస్తున్నారు. జిడిపిలో 0.56 టిఎంసిల నీరు నిల్వ ఉందని ఇవి జూన్ 15వ తేదీ వరకూ వినియోగించుకోవచ్చని నగర పాలక సంస్థ అధికారులు పేర్కొంటుండగా జిడిపి కింద ఉన్న పంటలు, సమీప గ్రామీణ ప్రాంతాల తాగునీటి అవసరాలకు పోనూ నగర ప్రజలకు 0.2 టిఎంసిల నీరు మాత్రమే ఇవ్వగలమని పేర్కొంటున్నారు. జిడిపి నుంచి ప్రస్తుతం వస్తున్న నీరు ఆవిరి, సరఫరా నష్టాలు పోనూ 0.5 టిఎంసిలను ఖచ్చితంగా వినియోగించుకుంటామని, ఇందుకు ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు వస్తాయని నగర పాలక సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. అయినా ఈ నీరు మే 3వ వారం వరకూ సరిపోతాయని సాగునీటి అధికారులు అంచనా వేస్తున్నారు. జిడిపి నీటిపై పూర్తిస్థాయిలో ఆధారపడకుండా నీటి సరఫరా కోసం నగరంలో నీరు పుష్కలంగా ఉన్న బోర్లను స్వాధీనం చేసుకుని నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. జిడిపి నీటి కోసం తమపై వత్తిడి తీసుకువస్తే ప్రయోజనం లేదని తాము అంగీకరించినా కాలువ వెంట ఉన్న గ్రామాల నుంచి సమస్య వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. జిడిపి, సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో ఉన్న నీటి నిల్వలు, నగర పాలక సంస్థ, నీటి పారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారం మే 3వ వారం నుంచి నగర ప్రజలకు తాగునీటి కష్టాలు తీవ్రస్థాయిలో ఉంటాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు రంగంలోకి దిగితే తప్ప నీటి సమస్య నుంచి ప్రజలను గట్టెక్కించలేరని అభిప్రాయపడుతున్నారు. అయితే నగర పాలక సంస్థ అధికారులు నీరు ఉన్న ప్రైవేట్ బోర్లను స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
తాగునీటి ఎద్దడిని
ఎదుర్కొనేదెలా!
* నేడు కెఇ ఆధ్వర్యంలో సమీక్ష

కర్నూలు, ఏప్రిల్ 15:జిల్లాలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సత్వర చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రజలకు ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని సూచించారు. జిల్లాలో సుమారు 150 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, మరో వంద గ్రామాల్లో పాక్షికంగా ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక అన్ని పురపాలక సంఘాల్లోనూ నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి 2 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. అయితే వేసవి ధాటికి జలాశయాల్లో నీరే కాకుండా భూగర్భ జలాలు కూడా అట్టడుగుకు చేరుతున్నాయి. ప్రధానంగా కర్నూలు నగరంలో నీటి సమస్య తీవ్రంగా ఉందన్న సమాచారంతో పురపాలక శాఖ మంత్రి నారాయణ కర్నూలుకు వచ్చి అధికారులతో సమీక్షించారు. ఆయన నీటి పారుదల శాఖ అధికారులతోనూ చర్చించి నీటి ఇబ్బందులు లేకుండా పురపాలక శాఖ అధికారులకు సహకరించాలని ఆదేశించారు. ఇదే సమయంలో సిఎం చంద్రబాబు నుంచి కెఇకి అందిన సమాచారం మేరకు అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ సైతం అమరావతి నుంచి బయల్దేరినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమస్య తీవ్రతపై కెఇ చర్చిస్తారు. వారి నుంచి తెలుసుకున్న సమాచారం మేరకు కలెక్టర్ విజయమోహన్, సాగునీరు, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు. ఆ తరువాత ప్రతి రోజూ సాయంత్రం నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఎం చంద్రబాబుతో పాటు కెఇ, అఖిలప్రియ, ఆయా నియోజకవర్గాల ఎంపి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అధికారులు సమాచారం పంపాల్సి ఉంటుంది. అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలించి ప్రజాప్రతినిధులు సైతం ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి నీటి ఎద్దడి నుంచి ప్రజలకు సమస్యలు రాకుండా పర్యవేక్షించాల్సి ఉందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి.
15 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి
* నగర దాహార్తికి ముచ్చుమర్రినే శాశ్వత పరిష్కారం..
* పురపాలక శాఖ మంత్రి నారాయణ
కర్నూలు సిటీ, ఏప్రిల్ 15:రాష్ట్ర ప్రభుత్వం హౌస్ ఫర్ ఆల్ పథకం కింద జిల్లాకు 10వేల ఇళ్లు కేటాయించిందని వాటిని 15 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. మంత్రి శనివారం నగర సమీపంలోని జోహరాపురం డంపింగ్ యార్డు, టివి-9 కాలనీ, మయూరి గ్రీన్‌హిల్స్‌తో పాటు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌ను పరిశీలించారు. అనంతరం నగర పాలక సంస్థ కమిషనర్ ఛాంబర్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యటించి ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఇళ్లను నిర్మించనున్నామని, అందులో జిల్లాలో కూడా 10వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే వాటిలో సంక్రాంతి పండుగ నాటికి 5వేల ఇళ్లను పూర్తి చేసి మిగతా వాటిని 15నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం త్వరలో టెండర్లు పిలుస్తామని, టెండర్లు దక్కించుకున్న వారు గడువులోగా ఇళ్లను పూర్తి చేయకపోతే పెనాల్టీ విధిస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం అధునాతన టెక్నాలజీతో షెరివాల్(కాంక్రీట్) పద్ధతిన ఒకేసారి నాలుగు దిక్కులా గోడల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. గతంలో నిర్మాణం చేపట్టిన వాటి కంటే అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లను నగర పరిధిలో టివి-9 కాలనీకి సమీపంలో ఉన్న జగన్నాథగట్టుపై చేపడుతామన్నారు. ఇళ్ల నిర్మాణంలో డోర్లను అత్యంత విలువైన టేక్‌వుడ్‌తో చేపట్టి క్వాలిటీగా నిర్మిస్తామన్నారు. ఒకే చోట 10వేల ఇళ్ల నిర్మాణం చేపట్టి వాటికి కోసం ప్రత్యేక రవాణా సౌక ర్యం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 10వేల ఇళ్లలో దాదాపు 30 నుంచి 40వేల మంది జనాభా దాకా నివసించటానికి వీలుంటుందన్నారు. తద్వారా చిన్న మున్సిపాలిటీ ఏర్పాటవుతుందని మున్సిపాలిటీకి తగ్గట్టుగా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. ముచ్చుమర్రి నుంచి కర్నూలు వరకూ పైపులైన్ వేసి తద్వారా కర్నూలు ప్రజలు ఏ కాలంలోనూ తాగునీటి కోసం అవస్థలు పడకుండా చూస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు రెండవ సమ్మర్ స్టోరేజీకి అయ్యేంత ఖర్చు అవుతుందని భావించి ముచ్చుమర్రి నుంచి నీటిని తరలించి ప్రజల దాహార్తి తీరుస్తామన్నారు. నగరాభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేసిందని సకాలంలో పనులు పూర్తి చేయటమే తరువాయి అన్నారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యులు టిజి.వెంకటేష్ ఉన్నారు. సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు.