కర్నూల్

పులకుర్తి ఎత్తిపోతలను వేగవంతం చేస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, అక్టోబర్ 17:తుంగభద్ర దిగువ కాలువ చివరి ఆయకట్టు రైతుల సంక్షేమం కోసం రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మండల పరిధిలోని పులకుర్తి గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ ఆధ్వర్యంలో ఇంటింటికీ టిడిపి కార్యక్రమం నిర్వహించారు. అందులో డిప్యూటీ సిఎం కెఇతో పాటు కెఇ ప్రభాకర్, కర్నూలు మార్కెట్ యార్డు చైర్మన్ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం కెఇ పులకుర్తి గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం పులకుర్తి సంతమార్కెట్ ఆవరణలో జరిగిన సభలో ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం పులకుర్తి రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి ఆ తరువాతే ప్రజలను ఓట్లు అడిగేందుకు వస్తామన్నారు. పులకుర్తి గ్రామం ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎంతో నష్టపోయిందని, ప్రస్తుతం టిడిపి ప్రభుత్వం చొరవ వల్ల గ్రామంలో ప్రశాంత వాతవరణం నెలకొందని గుర్తుచేశారు. ఇక్కడి ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. సిఎం చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు జనం నీరాజనాలు పడుతున్నారన్నారు. టిడిపికి పెరుగుతున్న ఆదరాభిమానాలను చూసి ఓర్వలేక వైకాపా అధినేత జగన్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉనికిని కాపాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. గత పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏనాడూ బిసిల గురించి పట్టించుకోని జగన్ నేడు బిసిలపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష నేత ప్రతి విషయానికి అడ్డుపడుతున్నారని వెల్లడించారు. అంతేగాక రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఎంతో లబ్ధి పొందుతున్నారని, వీటిపై కూడా జగన్ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.రాంభూపాల్‌రెడ్డి, డా. గిడ్డయ్య, అయ్యపురెడ్డి, పులకుర్తి రాజారెడ్డి, సత్రం రామకృష్ణ, ఆకెపోగు ప్రభాకర్, సుందర్‌రాజు, కెఇ మల్లికార్జున, కెఇ రాంబాబు, కెఇ రవీంద్ర, కెఇ గిడ్డయ్య, హనుమంతప్ప, చిల్లబండ చాంద్‌బాషా, దుబ్బన్న పాల్గొన్నారు.
టిడిపితోనే రాష్ట్భ్రావృద్ధి
* డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
పత్తికొండ, అక్టోబర్ 17: టిడిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం పత్తికొండ పార్టీ కార్యాలయంలో రైతు రతం పథకం కింద సబ్సిడీ కింద మంజూరైన 52 ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రైతులు, కార్యకర్తల నుద్దేశించి మంత్రి కెయి కృష్ణమూర్తి, ఎపిఎం ఐడిపి చైర్మన్ కెయి ప్రభాకర్ మాట్లాడారు. విభజన అనంతరం వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది చేయటంతోపాటు రైతు, రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ పథకాలకు కోట్లాది రూపాయాలను ఖర్చు చేసిన ఘనత సిఎం చంద్రబాబునాయుడుతో దక్కిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చూసి ప్రతి పక్షానికి చెందిన కర్నూలు ఎంపి బుట్టారేణుక నేడు సిఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిందన్నారు. పార్టీ అభివృద్ధికి సిఎం పని చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకే ప్రజలు అధికారం కట్టబెడుతారని మంత్రి కెయి జోష్యం చెప్పారు. 106 చెరువులకు హంద్రీకాలువ నీళ్లను సరఫరా చేసే పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. దీంతో ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జి కెయి శ్యాంబాబు నెలలో పత్తికొండకు వస్తారని ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ఆయన చెప్పారు. ఈసమావేశంలో తెలుగుదేశం నాయకులు కెయి హరిబాబు, మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, జడ్పీటీసీలు సుకన్య, వరలక్ష్మీ, పురుషోత్తంరెడ్డి, దేశం నాయకులు బ్రహ్మయ్యచౌదరి, చెన్నంనాయుడు, నరసింహచౌదరి, తిరుపాల్, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు, అక్టోబర్ 17:రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగ ధర్మంగానే గాక మానవతా దృక్పథంతో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై వుందన్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ప్రుమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బి, పంచాయతీ రోడ్లలో ప్రమాదాల నివారణకు అవసరమైన ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో అప్రోచ్‌రోడ్డు ఏర్పాటు చేసి ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. గ్రామాల మధ్య వెళ్తున్న జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బి రోడ్ల వద్ద గ్రామస్థులు రోడ్డును సులభంగా దాటేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. మలుపుల వద్ద సోలార్ బ్లింకర్స్, రేడియం స్టిక్కర్స్, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా వున్న రోడ్డు ప్రాంతాలను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గుత్తిరోడ్డు జంక్షన్ వద్ద గుంతలు పడి పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వాటిని పూడ్చి వేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో వెళ్తున్న జాతీయ రహదారిపై బారీకేడింగ్ సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే బారీకేడింగ్‌ను నిర్మించడంతో పాటు ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిద్దిదాలని ఆదేశించారు. రాజ్‌విహార్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బస్ స్టాపింగ్ పాయింట్‌కు అన్ని ఆర్‌టిసి బస్సులు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్‌టిసి అధికారులను ఆదేశించారు. రవాణా, పోలీసు, జాతీయ రహదారి అధికారులు సంయుక్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి రోడ్డు సేఫ్టీ ఆడిట్ నిర్వహించేందుకు రూట్ మ్యాప్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ బృందం జాతీయ రహదారులు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులపై సర్వే చేసి ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌టిఓ జగదీశ్వరరాజు, నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీనివాస్, డీఎస్పీలు, జాతీయ రహదారుల అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆ అధికారి రూటే సెప‘రేటు’!
* కలెక్టర్ మందలించినా మారని తీరు.. * నిబంధనలకు విరుద్దంగా డిప్యూటేషన్లు, బదిలీలు..
ఆత్మకూరు, అక్టోబర్ 17:జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డబ్బులు ఇస్తే నిబంధనలను తుంగలో తొక్కి కావాల్సిన పనిని ఓ ఉన్నతాధికారి చేస్తున్నారని కిందిస్థాయి అధికారులు, సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఆ అధికారికి రూ. 40 వేలు ఇస్తే కోరుకున్న చోటికి డిప్యూటేషన్, బదిలీపై వెళ్లవచ్చని వైద్య ఆరోగ్యశాఖలో ప్రచారం జరుగుతోంది. ఆ అధికారి 2014 నవంబర్‌లో నిబంధనలకు విరుద్దంగా జిల్లాలో 150 మందిని డిప్యూటేషన్, బదిలీలు చేస్తే జిల్లా కలెక్టర్ మందలించారు. అయినా ఆయన ప్రవర్తనలో మార్పురాలేదని అనడానికి శ్రీశైలం నియోజకవర్గం ఐసిడిఎ పరిధిలోని కొట్టాలచెరువు చెంచుగూడెం, బైర్లూటిగూడెం, పాములపాడు, కొత్తపల్లె, వెలుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగిన డిప్యూటేషన్, బదిలీలు నిదర్శనం అని సిబ్బంది బహిరంగంగా చర్చించుకుంటున్నారు. జూన్ 24వ తేదీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిప్యూటేషన్, బదిలీలు చేయరాదని జీఓ జారీ చేశారు. అయితే మామూళ్లకు అలవాటుపడ్డ ఆ ఉన్నతాధికారి కొట్టాలచెరువు చెంచుగూడెం పిహెచ్‌సిలో స్ట్ఫా నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న సత్యవతిని కొత్తపల్లి సిహెచ్‌సికి డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. అలాగే అదే పిహెచ్‌సిలో పని చేస్తున్న ఫార్మాసిస్టు స్వరూప వెలుగోడు పిహెచ్‌సికి వారం రోజుల క్రితమే డిప్యూటేషన్‌పై వెళ్లింది. ఎంఎల్‌ఓ మల్లేశ్వరిని గతంలోనే కురుకుందకు బదిలీ చేశారు. అలాగే పాములపాడు పిహెచ్‌సిలో ఫార్మాసిస్టు సత్యనారాయణరెడ్డి కర్నూలుకు బదిలీ అయ్యారు. అదే సెంటర్‌లోనే హెల్త్ ఎడ్యుకేటర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున కూడ కర్నూలు పిహెచ్‌సికి డిప్యూటేషన్‌పై వెళ్లినట్లు తెలుస్తోంది.
కొట్టాల చెరువు చెంచుగూడెంలో ఒకే వైద్యుడు
సదరు జిల్లా ఉన్నతాధికారి చేతివాటం ప్రదర్శించడంతో కొట్టాలచెరువు చెంచుగూడెం పిహెచ్‌సిలో ఒకే ఒక వైద్యుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ పిహెచ్‌సి పరిధిలో ఎక్కువ మంది చెంచులు ఉన్నారు. వారికి ఏ చిన్న జబ్బు చేసినా ఈ సెంటర్‌కు రావాల్సిందే. రోజుకు దాదాపు 40మంది వైద్య చికిత్స చేయించుకునేందుకు వస్తూ ఉంటారు. వీరికి తోడు గర్భిణులైన చెంచు మహిళలు ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు చెప్పుకోవడానికి వస్తుంటారు. అయితే వైద్యుడు పురుషుడు కావడంతో వారు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై కలెక్టర్ దృష్టి సారించి ఆయా సమస్యలను పరిష్కరించాలని చెంచు గూడెం ప్రజలు కోరుతున్నారు.
పదవికి రాజీనామా చేయించి చేర్చుకో..
* చంద్రబాబుకు వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామయ్య సవాల్
కర్నూలుసిటీ, అక్టోబర్ 17:సిఎం చంద్రబాబుకు ధైర్యం ఉంటే వైకాపా ఎంపిలు, ఎమ్మెల్యేల చేత పదవులకు రాజీనామా చేయించి టిడిపిలో చేర్చుకోవాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివై రామయ్య సవాల్ విసిరారు. నగరంలోని వైకాపా కార్యాలయంలో మంగళవారం రామయ్య పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. సిఎం చంద్రబాబు వైకాపా ఎంపిలు, ఎమ్మెల్యేలను డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తూ అందుకు లొంగకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒక వ్యాపారం చేస్తుంటాడని, వ్యాపార నిర్వాహణలో ఏదో ఒక చిన్న తప్పు జరగటం సహజమని అటువంటి తప్పును పట్టుకుని సిఎం చంద్రబాబు వారిని బెదరించి తమ పార్టీలో చేర్చుకోవడం సిగ్గు చేటన్నారు. ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్న వారిని తీసుకొచ్చి జగన్ వైకాపా సింబల్ ఇచ్చి ప్రచారం చేసి గెలిపించి రాజకీయ భిక్ష పెడితే తమ స్వార్థం కోసం పార్టీ మారుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానని ఎంపి బుట్టా రేణుక చెప్పడం శోచనీయమన్నారు. వైకాపా జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో, జిల్లాలో అనేక సమస్యలుంటే వాటిని పరిష్కారించాల్సింది పోయి అవినీతి సొమ్ముతో ఎంపిలు, ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. ఎంపిలు, ఎమ్మెల్యేలను కొంటే అభివృద్ధి చేసినట్లా అని ప్రశ్నించారు. పంద్రాగస్టు సందర్భంగా జిల్లాకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిలో ఒక్క దానిని కూడా నెరవేర్చలేదన్నారు. ఎమ్మెల్యేలను కొన్న డబ్బుతో జిల్లా అభివృద్ధి చెందేదని విమర్శించారు. ఇకనైనా ఎమ్మెల్యేలు, ఎంపిలను కొనటం మాని అభివృద్ధి పట్ల దృష్టి సారించాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో రమణ, కర్నాటి పుల్లారెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.
నగరాన్ని కమ్మేసిన పొగమంచు
కర్నూలు ఓల్డ్‌సిటీ, అక్టోబర్ 17:ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కర్నూలు నగరాన్ని కమ్మేసింది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ కొత్తబస్టాండ్-బళ్లారి చౌరస్తా రహదారిలో పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు, ఆటోలు లైట్లు వేసుకుని వెళ్లాయి. అలాగే బళ్లారి చౌరస్తాలోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని పొగమంచు కమ్మేయడంతో ఆ దృశ్యాలను చూడటానికి ప్రజలు బారులుతీరారు. ఇక బళ్లారి చౌరస్తాలోని జాతీయ ఉపరితల వంతెనపై పొగమంచు కమ్ముకోవడంతో లారీలు, కారులు, ద్విచక్ర వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణించాయి. ఈ సుందర దృశ్యాలు చూపరులకు కనువిందుచేశాయి.
స్మార్ట్‌సిటీతో మరింత అభివృద్ధి
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలుసిటీ, అక్టోబర్ 17 : ప్రభుత్వం నగరాన్ని స్మార్ట్‌సిటీగా ప్రకటించిందని, దీంతో మరింత అభివృద్ధి జరగనుందని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. నగర పాలక సంస్థ కమిషనర్ ఛాంబర్‌లో మంగళవారం కర్నూలు స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ మొదటి సమావేశం నిర్వహించి, అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్మార్ట్‌సిటీ గురించి వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ, నగర పాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మాణం కానున్న స్మార్ట్‌సిటీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతున్న స్మార్ట్‌సిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో 6 స్మార్ట్‌సిటీలను ఏర్పాటు చేస్తుందని అందులో కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఒంగోలు, ఏలూరు, శ్రీకాకుళం మున్సిపాలిటీలు ఉన్నాయన్నారు. ఒక్కో స్మార్ట్‌సిటీ నిర్మాణానికి మొదటి విడతగా రూ. 33 కోట్లు కేటాయించి, రూ. 15కోట్లు మంజూరు చేసిందన్నారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్‌లో చైర్మన్‌గా కలెక్టర్, డైరెక్టర్లుగా ఎస్పీ, నగర పాలక సంస్థ కమిషనర్ ఉంటారని, అందులో భాగంగా మొదటి బోర్డు మీటింగ్‌ను నిర్వహించామన్నారు. మొదటి దశ కింద ప్రధాన రోడ్లలో కూడళ్ల అభివృద్ధి, రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ తర్వాత చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ, పార్కింగ్ అభివృద్ధి, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, ప్రాంతాల పేర్లను సూచించే సూచికలు ఏర్పాటు చేసి సిటీ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే హంద్రీనది, కెసి కెనాల్‌లో పూడికతీత, సుందరీకరణ వంటి పనులు చేపట్టాలని బోర్డు మీటింగ్‌లో చర్చించామన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి, ఎస్‌ఈ శివరామిరెడ్డి, ఏపి అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించండి
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు ఓల్డ్‌సిటీ, అక్టోబర్ 17 : ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అన్ని హెడ్‌ఓడి బ్లాకుల్లో అవసరమైన అధునాతన వైద్య పరికరాలు కొనుగోలు చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సూపర్ స్పెషలిటీ బ్లాక్‌లో మంగళవారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. అందులో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి.చంద్రశేఖర్, కమిటీ సభ్యులు కెఇ.అనురాధ, కె.మహేష్‌గౌడ్, రవికుమార్, నగరపాలకసంస్థ కమిషనర్ హరినాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్‌ఓడి బ్లాకుల్లో రూ. 3.41 కోట్లతో ప్రతిపాదించిన పరికరాలను ఆమోదిస్తూ పారదర్శకంగా కొనుగోలు చేయాలన్నారు. ఆసుపత్రి నిధులు రూ. 1.63 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవా నిధులు రూ. 7 కోట్ల మేరకు ఉన్నాయన్నారు. అత్యవసర వైద్య పరికరాలు, ఔట్‌సోర్సింగ్‌పై ల్యాబ్ టెక్నీషియన్లు, ఇసిజి, ఇఎన్‌ఎంజిలు, పిఎఫ్, టెక్నీషియన్లు, రేడియాలజిస్టులను నియమించి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఎంసిఐ నిబంధనల ప్రకారం సెంట్రల్ స్టెరిలైజేషన్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సూపరింటెండెంట్ ఆఫీసు ఆధునీకరణతో పాటు కంప్యూటర్ పరికరాల కొనుగోలుకు కలెక్టర్ ఆమోదించారు. ఎంసిహెచ్ బ్లాక్ సమీపంలో 300 గజాల స్థలాన్ని గుర్తించి ఇస్తే కేంద్ర ప్రభుత్వం వన్‌స్టాప్ సెంటర్ ఏర్పాటుకు రూ. 48లక్షల నిధులు మంజూరు చేస్తుందన్నారు. అత్యాచారానికి గురైన మహిళల వైద్య చికిత్స కోసం వన్‌స్టాప్ సెంటర్‌ను వినియోగిస్తారని తెలిపారు. కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఆసుపత్రి అభివృద్ధికి చేపట్టిన అంశాలపై నివేదికలు అందజేయాలన్నారు. ఆసుపత్రిలోని డైట్ సెంటర్‌లో మెనూ సక్రమంగా ఇవ్వడం లేదని పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర కేసులు ఉన్న సమయంలో డ్యూటీ డాక్టర్లు ఖచ్చితంగా ఉండాలని లేనిపక్షంలో సంబంధిత డాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏపిడిఐసి ఇఇ విజయభాస్కర్, సంబంధిత శాఖల అధిపతులు పాల్గొన్నారు.