కర్నూల్

క్వింటాల్ పత్తీ కొనలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులకు శాపంగా మారిన సీసీఐ నిబంధనలు!
* మూడేళ్లుగా పత్తి కొనుగోలు చేయని వైనం..
ఆదోని, డిసెంబర్ 13: పత్తికొనుగోలు కోసం సీసీఐ సంస్థ పెట్టిన నిబంధనలు రైతన్నలకు శాపంగా మారింది. ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో గత మూడు సంవత్సరాల నుంచి రైతుల నుంచి ఒక్క క్వింటాల్ పత్తి కూడా సీసీఐ అధికారులు కొనుగోలు చేయలేదు. ప్రతి సంవత్సరం ఆదోని వ్యవసాయ మార్కెట్‌లోపత్తి కొనుగోలు కోసం సీసీఐ సంస్థ ప్రత్యేకంగా కేంద్రం తెరిచినా రైతులు నుంచి ఒక్క క్వింటాల్ పత్తి కొనుగోలు చేయకపోవడం గమనార్హం. రైతుల నుంచి కొనుగోలు కోసం సీసీఐ సంస్థ అనేక నిబంధనలను విధించింది. దాంతో రైతులకు ఇబ్బందులను తెచ్చి పెడుతున్నాయి. అందువల్లనే రైతులు సీసీఐ కేంద్రానికి వెళ్లకుండా మార్కెట్‌లో వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం రెండున్నర లక్షల హెక్టర్లలో పత్తిపంటను వేశారు. 8లక్షల క్వింటాళ్ళ పత్తి బేళ్లు కర్నూలు జిల్లాలో ఉత్పత్తి అవుతాయని పత్తి వ్యాపారులు అంచనా వేశారు. ఒక ఆదోని డివిజన్‌లోని 50వేల హెక్టర్లలో పత్తిపంట వేయడం జరిగింది. రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఆదోని వ్యవసాయ మార్కెట్ ద్వారా పత్తి వ్యాపారులు పెద్ద ఎత్తున జరిగి ఆదోని జిన్నింగ్ ఫ్యాక్టరీల యాజమాన్యాల ద్వారా 6లక్షల పత్తి బేళ్లు ఆదోనిలో ఉత్పత్తి చేస్తారని పత్తి వ్యాపారుల సంఘం అంచనా వేసింది. అక్టోబర్ నెల నుంచి పత్తి సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటికీ ఆదోనిలో ఉన్న 33 జీన్నింగ్ ఫ్యాక్టరీల నుంచి లక్ష 85వేల పత్తి బేళ్ళు ఉత్పత్తి అయినట్లు వ్యాపారుల సంఘం నాయకులు సోమశేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. ఇంకా సీజన్ ఏప్రీల్ వరకు ఉంటుంది. సీసీఐ అధికారి తిరుమల్‌రావును కలిసి విచారించగా ఈ సంవత్సరం లక్షన్నర పత్తిబేళ్లను కొనుగోలు చేయాలని ఆదోని సీసీఐ బ్రాంచికి అధికారులు లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒక్క క్వింటాల్ పత్తి కూడా రైతులు తమ కేంద్రానికి అమ్మకానికి తీసుకురాలేదన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. సీసీఐ సంస్థ పత్తిని రైతుల నుంచి కొనుగోలు విధించిన నిబంధనలు రైతులకు అడ్డంకులుగా మారాయి. ముందుగా ఈక్రాప్ విధానం రైతులకు ఇబ్బందులను తెచ్చిపెట్టింది. పత్తిపంట పండించిన రైతులు తమ పొలాలను ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలని ఎకరానికి ఆరు క్వింటాల్ పత్తి మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధన ఉంది. మొదటి దఫగా మూడు క్వింటాళ్ళు, రెండవ దశపగా మూడు క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన ఉండడంతో చాలా మంది ఈక్రాప్‌లో తమ పేరును నమోదు చేసుకోక పోవడం వల్ల సీసీఐ కేంద్రానికి పత్తి తెచ్చిన ఈక్రాప్ వెబ్‌సెట్‌లో రైతు పొలం నెంబర్, రైతు పేరు రాకపోతే సీసీఐ అధికారులు కొనుగోలు చేయరు. అందువల్ల రైతులకు ఈ నిబంధన ఎంతో నష్టం తెచ్చిపెట్టింది. అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి సొమ్మును బ్యాంకులో సీసీఐ సంస్థ రైతున పేరున వేస్తుంది. ఇది కూడా రైతులకు ఇబ్బంది. ఎందుకంటే చాలా మంది రైతులు పంటల కోసం లేదా వారి అవసరాల కోసం బ్యాంకుల్లో అప్పులు తీసుకొని ఉంటారు. బ్యాంకుల్లో సీసీఐ సంస్థ పత్తి డబ్బులు వేస్తే బ్యాంకులు రుణం కింద జమ చేసుకుంటాయి. అందువల్ల రైతులు సీసీఐ సంస్థ వైపు మగ్గు చూపుని విధంగా ఈ నిబంధన ఉంది. అంతేకాకుండా సీసీఐ సంస్థ పత్తిని కొనుగోలు చేయాలంటే పత్తి 30 ఎంఎం స్టేబుల్ ఉండాలి. చాలా మంది రైతులు పండించిన పత్తి పంటలో సీసీ ఐ విధించిన నిబంధన మేరకు 30 ఎంఎం స్టేబుల్ ఉండదు. అందువల్ల సీసీఐ సంస్థ కొనుగోలు చేయదు. కొంత మంది రైతులకు ఆదారు కార్డు, బ్యాంకు అకౌంట్లు కూడా ఉండని పరిస్థితి ఉంది.పత్తి కొనుగోలు చేయాలంటే రైతులు ఆధారు కార్డు, బ్యాంకు అకౌంట్లు ఉండాలి. ఇవి లేని రైతుల నుంచి సీసీఐ సంస్థ పత్తి కొనుగోలు చేయదు. సీసీఐ విధించిన నిబంధనాలో రైతులకు శాపంగా మారి సీసీఐ సంస్థకు నష్టాన్ని తెచ్చి పెట్టింది. రైతుల శ్రేయస్సు కోసం రంగంలో దిగిన సీసీఐ సంస్థ నిబంధనలను మార్చాల్సిన అవసరం ఉంది. పత్తి సీజన్ ప్రారంభంలో రూ. 3,800లోపు పత్తి క్వింటాల్ ధర పలికింది. అప్పుడు సీసీఐ ప్రకటించిన క్వింటాల్ మద్దతు ధర రూ.4,320లకు పత్తి కొనుగోలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగింది. ప్రస్తుతం ఒక వారం నుంచి మద్దతు ధర రూ.4320 కన్నా ఆదోని మార్కెట్‌లో రూ.4 నుంచి రూ.5,200ల వరకు క్వింటాల్ పత్తి ధరలు వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల సీసీఐ రంగంలో ఉన్న పత్తి కొనుగోలు చేయని పరిస్థితి ఏర్పడింది. రైతులను దృష్టిలో ఉంచుకొని నిబంధనలను సీసీఐ అధికారులు మార్పు చేయాలని రైతు సంఘాలు, రైతులు కోరుతున్నారు.

ఎగువ అహోబిలంలో
నిజ రూప దర్శనం
* ముగిసిన ఆలయ జీర్ణోద్ధారణ పనులు
ఆళ్లగడ్డ, డిసెంబర్ 13: ప్రముఖ వైష్ణవ క్షేత్రం ఎగువ అహోబిలంలో స్వయంభువుగా వెలసిన నరసింహస్వామి నిజరూప దర్శనం బుధవారం ప్రారంభమైంది. ఆలయ జీర్ణోద్ధారణ పనులు ముగియడంతో స్వామి నిజరూప దర్శనం పూజల అనంతరం ఈఓ కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, అర్చక బృందం స్వామిక నిత్యారాధన, సోమ కుంభారాధన, మహా కుంభారాధన, శాంతి హోమాలను నిర్వహించారు. అనంతరం బాలాలయంలో వున్న ఉత్సవ మూర్తులు జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పూర్ణాహుతి అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. కుంభ ప్రోక్షణ చేసి భక్తులకు స్వామి వారి నిజరూప దర్శన బాగ్యం కల్పించారు.
కంది చేలో పెద్ద పులులు!
* వెలుగోడు రైతుల భయం.. భయం..
వెలుగోడు, డిసెంబర్ 13: వెలుగోడు పట్టణంలోని జమ్మినగర్ సమీపం కంది చేలో బుధవారం రెండు పెద్దపులులు రైతులకు కనిపించాయి. భయాందోళనలకు గురైన రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పులులు చేనులో నుండి బయటకు రాలేదు. రైతులు ఆత్మకూరు డీఎఫ్‌ఓ సెల్వంతో మాట్లాడుతూ మూడు నెలల క్రితమే ఒక పులి కనిపించిందని, ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి తీసుకు వస్తే అది జంగిల్ క్యాట్ అని వదిలేశారన్నారు. ప్రస్తుతం ఈ పులులు రెండింటినీ పట్టుకుని అడవిలో వదిలెయ్యాలని, అలా కాకుండా తరిమేస్తే అవి మళ్లీ ఇక్కడికి వచ్చి చేరుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీకు ఇబ్బంది కలుగకుండా పులులను పట్టుకుంటామని డీఎఫ్‌ఓ సెల్వం రైతులకు హామీ ఇచ్చారు. వీటిపై అటవీ అధికారులు మాట్లాడుతూ ఇందులో ఒకటి తల్లి పులి అని రెండవది దాని పిల్ల అని తెలిపారు. తల్లిపులికి సుమారు ఐదు సంవత్సరాల వయసు వుండవచ్చన్నారు. ఇది మొదటి సారి పిల్లను కనివుండవచ్చన్నారు. తల్లీ పిల్లా రెండూ వున్నాయని, అవి తప్పి పోకుండా కంది చేను చుట్టూ వల ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారం వాటిని పట్టి బంధించి అడవిలో వదిలేస్తామని డీఎఫ్‌ఓ సెల్వం తెలిపారు. ఈ సంఘటనలో ఆత్మకూరు, నంద్యాల
డివిజన్లకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అడవి నుండి 10 కి.మీ దాటి వచ్చిన పులులు
వెలుగోడు జమ్మినగర్ సమీపంలో కంది చేనులో కనిపించిన పులులు రిజర్వు అడవి నుండి సుమారు పది కిలోమీటర్ల దూరం వచ్చి నివాసం ఏర్పరుచుకున్నాయని రైతులు అంటున్నారు. మూడు నెలల క్రితం గాలేరు నదికి తూర్పు వైపున ఒక పులి కనిపించింది. బహుశా అదే పులి ఈనుకుని మూడు నెలల తరువాత అదే ప్రాంతంలో వున్న కందిచేనులో కనిపించాయని రైతులు తెలిపారు. ఈ పులులు రాత్రి వేళల్లో తిరుగుతున్నాయని, వాటి అడుగుజాడలు కూడా కనిపించాయని తెలిపారు. ప్రస్తుతం పులులు కనిపించిన చోటుకు జమ్మినగర్ కు చెందిన అనేకమంది గిరిజనులు తెల్లవారు జామున బహిర్భూమికి వెళ్తుంటారు. వారి పిల్లలు సైతం ఈ ప్రాంతంలోనే ఆడుకుంటూ వుంటారు. కానీ ఇప్పటి వరకు ఈ పులులు ఎవరి పైనా దాడులైతే చేయలేదు కానీ గత కొద్ది కాలంగా మేకలు, గొర్రెలు మాయమవుతున్నాయని జమ్మినగర్ వాసులు తెలిపారు. ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారని తాము అనుకుంటున్నామని ఈ పులులే వేటాడి వుంటాయని అనుమానిస్తున్నారు. అడవికి పది కిలోమీటర్ల దూరానికి పులులు రావడం ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. అటవీ అధికారుల సమాచారం మేరకు పెద్దపులులు తమదైన టెరిటరీని ఏర్పాటు చేసుకుంటాయని, తమ హద్దులోకి ఇతర పులి వస్తే మటుకు దానిని చంపేస్తాయని తెలిపారు. ఈ పులులను కూడా పట్టుకుని వేరే పులి సరిహద్దుల్లో విడిచి పెడితే తప్పకుండా ఒకపులి మృత్యువు వాత పడుతుందని, అందుకే వాటిని మెల్లగా అడవిలోకి పంపించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం కనిపించిన పులి పగ్ మార్కులను పరిశీలించి తమ వద్ద రిజిస్టరైన పగ్‌మార్కులతో సరిపోల్చి దాని హద్దులలోనే విడిపెట్టడం జరుగుతుందన్నారు.
నగరడోణ జలాశయం సాధనకు
రైతన్నల భారీ ర్యాలీ

చిప్పగిరి, డిసెంబర్ 13: నగరడోణ జలాశయ సాధన కోసం రైతులు బీజేపీ, వైఎస్‌ఆర్ పార్టీల నాయకులు స్థానిక వివిధ సంఘాలు భారీ ఎత్తన పాదయాత్రగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం నిర్వహించిన రైతుల ఉద్యమానికి ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకులు నవీన్ కిషోరులు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. నగరడోణ నుండి జలాశయం మీదుగా దాదాపు 500 మందితో ఆలూరు వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్‌ఆర్ హయాంలో జలాశయానికి రూ.11.80 లక్షల నిధులు విడుదలకాగా అవసరమైయ్యే స్థలం కూడా సమకూర్చారని, రాజశేఖర రెడ్డి మతిచెందడంతో నిర్మాణం ఆగిందని, అధికారంలో వచ్చిన టీడీపీ పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీ నాయకులు నవీన్ కిషోర్ మాటాడుతూ జలాశయం నిర్మాణం జరిగేవరకు రైతులు పోరాటానికి తాను మద్దగా వుంటానని అన్నారు. చిప్పగిరి ప్రాంతంలో సాగు, తాగునీరు సౌకర్యం కల్పించడంలో, తుంగభద్ర జలాశయ నీరు తేవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతుల మనుగడకు దోహదపడే జలాశయ నిర్మాణం పూర్తి చేసేవరకు రైతుల ఉద్యమానికి మద్దతుగా పాల్గొంటామని అన్నారు. ఆలూరు వరకు కొనసాగిన ర్యాలీలో రైతుల నాయకులు నగరడోణ భీమిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ నాగేంద్రలు, వైకాపా నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ టికెట్ చల్లాకు ఇవ్వాలి
* ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి
బనగానపల్లె, డిసెంబర్ 13: ఎమ్మె ల్సీ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డికి కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కోరినట్లు ఎమ్మెల్యే బీసీ. జనార్థనరెడ్డి బుధవారం విలేఖర్లకు తెలిపారు. జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి ఎంపికైన శిల్లా చక్రపాణిరెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరుపవలసి వచ్చిందని, ఇందుకు ఎన్నిలక నోటిఫికేషన్ కూడా విడుదల అయినట్లు తెలిపారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ సోదరుడు బీసీ. రాజారెడ్డి ఎమ్మెల్సీ సీటు రేసులో వున్నట్లు వార్తా కథనాలు వచ్చాయని, తాము ఎప్పుడు అలా ఆశించలేదని, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ఎన్నికలకు సహకరించిన సీనియర్ నాయకుడు, అనుభవశాలి చల్లా రామకృష్ణారెడ్డికి ఇవ్వాలని తాము చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ. కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులును వ్యక్తిగతంగా పలుమార్లు వెళ్లి కలిశామన్నారు. తమ తమ్ముడి కంటే చల్లాయే తమకు ఎక్కువగా తెలిపారు. రానున్న రోజుల్లో తాము మళ్లీ ముఖ్యమంత్రిని కలిసి మరోసారి ఎమ్మెల్సీ టికెట్ చల్లాకు ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను కూడా కలుసుకుని వారి సహకారం కోరతామని ఎమ్మెల్యే తెలిపారు.
మినుము రైతుల ధర్నా
ఆళ్లగడ్డ, డిసెంబర్ 13: మినుము పంట కొనుగోలు చేయడం నిలుపుదల చేయడంతో నియోజకవర్గంలోని మినుము రైతులు బుధవారం ధర్నా చేశారు. మార్క్‌ఫెడ్, నాపెడ్‌ల ఆధ్వర్యంలో మినుము పంట కొనుగోలు కేంద్రాన్ని ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేశారు. అయితే కేవలం ఒక్క రోజు మాత్రమే మినుము పంట కొనుగోలు చేసి, రెండో రోజు పంటను కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు నాలుగు రోడ్ల కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మినుము పంట కొనుగోలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో తాము గ్రామాల నుండి మినుము పంటను ట్రాక్టర్లలో తీసుకుని ఆళ్లగడ్డక వచ్చామన్నారు. అయితే తీరా ఇక్కడికి వచ్చాక అధికారులు మరో నాలుగు రోజుల పాటు మినుము పంటను కొనుగోలు చేయలేమని చెప్పారని, దీంతో మేము ఏమి చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని, అయితే పంటను తీసుకుని వచ్చాక ఇప్పుడు కొనుగోలు చేయలేమని అధికారులు చెప్పడంతో గోరు చుట్టుపై రోకలి పోటులా తమ విషయం వుందన్నారు. తాము ఏమి చేయాలో పాలుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి రైతులను శాంతింపజేసి ధర్నా విరమింపజేశారు.

జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు
* కర్నూలులో తల్లీ, నలుగురు చిన్నారులు ఐసీడీఎస్‌కు అప్పగింత
కర్నూలు, డిసెంబర్ 13: జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని సబ్‌డివిజన్లలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం రాత్రి 11 గంటల నుండి 2వరకు తనిఖీలు చేపట్టారు. నంద్యాలలోని నందమూరినగర్‌లో కార్డన్‌సెర్చ్ ఆపరేషన్ చేసి అనుమానితులను విచారించారు. వాహన తనిఖీల్లో ద్రువపత్రాలు లేని 2 మోటార్‌బైక్‌లను సీజ్ చేశారు. గ్యాంబ్లింగ్, వ్యభిచారం గృహాలపై డాడులు చేసి, నంద్యాల శివారు ప్రాంతాల్లో డంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. గడివేములలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి గ్రామసభ నిర్వహించారు. కర్నూలులోని 2వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేయగా నలుగురు చిన్నారులతోపాటు ఉన్న తల్లిని చేరదీసి 2వటౌన్ ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి ఐసీడీఎస్‌కి అప్పగించారు. 3వ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఓపెన్‌డ్రింగ్ చేస్తున్న 9మందిపై కేసులు నమోదు చేశారు. ఆదోని తాలుకా పోలీసుస్టేషన్ పరిధిలో లాడ్జీలు, రైల్వేస్టేషన్‌లను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో కర్నూలు సబ్‌డిజన్‌లో డిఎస్పీ ఖాధర్‌భాషా, నంద్యాల సబ్‌డివిజన్ డిఎస్పీ గోపాలకృష్ణ, ఆదోని సబ్‌డివిజన్ డిఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
జిందాల్ లారీలను
అడ్డుకున్న ప్రజలు
నందికొట్కూరు, డిసెంబర్ 13: పట్టణంలోని నంద్యాల రహదారిలో జిందాల్ ఫ్యాక్టరీకి చెందిన భారీ వాహనాలు తిరుగరాదంటూ బుధవారం ప్రజలు వాటిని అడ్డుకున్నారు. రెండు రోజుల క్రితం పాదచారిపై వాహనం వెళ్లడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జరిగిన మరుసటిరోజే అదే ప్రాంతంలో ఈ కంపెనీ వాహనం కుక్కపై వెళ్లడంతో అది చనిపోవడంతో అక్కడే వున్న ప్రజలు వాహనాలను నిలిపివేశారు. నందికొట్కూరు మీదుగా ఈ వాహనాలను వెళ్లనిచ్చేది లేదని ధర్నా చేశారు. కాగా ఎస్‌ఐ లక్ష్మినారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాలు జరుగకుండా పట్టణంలో వాహనాలు నడపాలని, అనుమతులు లేకపోతే ఈ రహదారిలో రాకూడదని సర్దిచెప్పి సమస్య పరిష్కరించారు.
మొక్క ఎదుగుదల లేక
జొన్నపంట తొలగింపు
ఉయ్యాలవాడ, డిసెంబర్ 13: ప్రకృతి వైపరీత్యాల వల్ల వాతావరణం అనుకూలించక, వరుణ దేవుడు కరుణ చూపకపోవడంతోరైతు నష్టాలు చవి చూడడం సహజం. విత్తనోత్పత్తి కంపెనీలు కూడా నాణ్యమైన విత్తనాలు ఇవ్వకపోవడం వల్లనే మరో సారి మోసపోయిన సంఘటన ఉయ్యాలవాడలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు ఆవుల మద్దిలేటి తనకున్న 3 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. 20 రోజులు దాటినా మొక్క ఎదుగుదల లేకపోవడంతో పంటను అంతా దున్నివేసేందుకు బుధవారం రైతు మొదలుపెట్టాడు. పంట సాగు కోసం ఎకరాకు రూ. 10 వేలు చొప్పున విత్తనాలు, ఎరువులు, రసాయనిక మందులకు వ్యయం చేసి నష్టపోయానని బాధిత రైతు కన్నీరు మున్నీరయ్యారు. సంబందిత శాఖ అధికారులు దునే్నసిన పంటను పరిశీలించి బాధిత రైతును ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
సిరి కంపెనీ విత్తనం సాగు చేశా..
- ఆవుల మద్దిలేటి, రైతు
నంద్యాల పట్టణంలోని నంది ట్రేడర్సు నుండి సిరి కంపెనీకి చెందిన మొక్క జొన్న విత్తనాలు కొనుగోలు చేశాను. ప్యాకెట్ రూ. 800లు చొప్పున 7 ప్యాకెట్లు తీసుకుని వచ్చి గత నెల 28వ తేదీన విత్తనం సాగు చేశాను. మొక్క ఎదుగుదల లేదని కంపెనీకి ఫిర్యాదు చేసినా పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. ఇంత వరకు కంపెనీ వారి జాడ లేదు.
సంపన్నులు పేదలకు
ఆపన్నహస్తం అందించాలి
* ఎమ్మెల్యే బీసీ. జనార్థనరెడ్డి
బనగానపల్లె, డిసెంబర్ 13: సమాజంలో ఉన్నత కులాల్లో కూడా పూటగడవని పేదలు ఉన్నారని అలాంటి వారికి సంపన్నులు ఆపన్నహస్తం అందించాలని ఎమ్మెల్యే బీసీ. జనార్థనరెడ్డి కోరారు. బుధవారం పట్టణంలోని కొండపేట చెంచుతోటలో గాధంశెట్టి వేణుగోపాల్ కుటుంబీకులు 26 మంది ఆర్యవైశ్య పేదలకు ఉచితంగా ఒకటింపావు సెంటు ఇంటి స్థలాల పట్టాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాధంశెట్టి కుటుంబం ఉదారులని వారి తల్లిదండ్రులు సుబ్బరాయుడు, వెంకటసుబ్బమ్మలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, వారి సంతతి వారి పెద్దల పేరును నిలుపుతూ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారని అభినందించారు. సంపన్నులు పేదలను గుర్తించి వారికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, వివాహాలకు సహాయం చేయడం తదితర చర్యలవల్ల వారు నిరాశను వదలి జీవితంలో నిలదొక్కుకుంటారన్నారు. ఈ 26 మందికి ప్రభుత్వం తరపున పక్కా గృహాలు మంజూరు ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.1.50 లక్షలు సహాయం అందిస్తామన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే భగవంతుడు కూడా మరింత సంపదను కల్పిస్తాడని తెలిపారు. గాధంశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ తాము 26 మందికి 45 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇస్తున్నామని, దీని విలువ రూ.50 లక్షల వరకు వుంటుందన్నారు. అలాగే గతంలో తాము సరస్వతీ శిశుమందిర్‌కు 60 సెంట్ల స్థలాన్ని ఉచితంగా ఇచ్చామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గాధంశెట్టి రవికుమార్, గాధంశెట్టి రాజేశ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టంగటూరు శీనయ్య, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు బింగిమళ్ల సత్యంశెట్టి, మోహన్, నల్లగట్ల వెంకటేశ్వర్లు, గుండా శ్రీనివాసులు, బలరామ్, రామకృష్ణ, నూకల విజయకుమర్, జంగంశెట్టి, ఆర్యవైశ్య సోదరులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అహోబిలంలో ఆధ్యాత్మిక వేత్త
జ్యోతిర్మయి పూజలు
ఆళ్లగడ్డ, డిసెంబర్ 12 : పుణ్యక్షేత్రమైన అహోబిల శ్రీ లక్ష్మి నరసింహస్వామిని ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. దిగువ అహోబిలంలో వెలసిన ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లను, ఎగువ అహోబిలంలో నరసింహస్వామి, చెం చులక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో వున్న తమ నవనారసింహ క్షేత్రాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గురువారం అహోబిళంలో జరగనున్న స్వాతి వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు.
వేరుశెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఆదోనిటౌన్, డిసెంబర్ 13: వేరుశెనగ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.4450లు కల్పించాలని ఏపీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం ఆదోని మార్కెట్‌యార్డులో వేరుశెనగ కొనుగోలు కేంద్రాన్ని కేడీసీ ఎంఎస్ ఆధ్వర్యంలో గ్రేడ్ 1 కార్యదర్శి లావణ్య ప్రారంభించారు. రైతులకు మద్దతు మార్కెట్‌యార్డులో లభించడం లేదని ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభించిందని తెలిపారు. ఇందులో రైతులు తమ వేరుశెనగ పంట ఉత్పత్తులను అమ్ముకొని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఒక రైతు కనీసం 70 బస్తాల వరకు అమ్ముకునే అవకాశం ఉంటుందని కేడీ సీఎంఎస్ అధికారి శంకర్ అన్నారు. బుధవారం యార్డులో 15 మంది రైతుల నుంచి 1050 బస్తాలు కొనుగోలు చేయడం జరిగిందని, క్వింటాల్‌కు రూ.4450లు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందని, రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముందుగా రైతులకు గుర్తించి టోకన్లు ఇస్తున్నామని, అందువల్ల రైతులు మందస్తుగా తమ పేర్లును నమోదు చేసుకోవాలని తమకు కేటాయించిన రోజుల్లో వేరుశెనగ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకురావాలని కోరారు. ఈకార్యక్రమంలో అదనపు కార్యదర్శులు ఆదిశేషులు, సుబ్బారెడ్డి, డీఈ సుబ్బారెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ధనుర్మాస మహోత్సవ ఆహ్వానపత్రిక విడుదల
నంద్యాలటౌన్, డిసెంబర్ 13: పట్టణంలోని సంజీవనగర్ కోదండ రామాలయంలో బుధవారం ధనుర్మాస మహోత్సవ ఆహ్వాన పత్రికను శ్రీ్భగవత్ సేవా సమాజ్ అధ్యక్షులు సూరయ్య, ప్రధాన కార్యదర్శి మధుసూధనరావు, శ్రీనివాసులు విడుదల చేశారు. ఈసందర్భంగా సూరయ్య మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస పూజలను శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి వారికి విశేష అభిషేకం, దివ్యదర్శనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సాయంత్రం వేళల్లో తిరుప్పావై దివ్య ప్రవచనాలు ఉంటాయన్నారు.
వైభవంగా బంగారమ్మ దేవర
ఆదోనిటౌన్, డిసెంబర్ 13: మండలంలోని గణేకల్ గ్రామంలో వెలసిన బంగారమ్మ దేవర మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి ఏడాది జరిగే దేవర మహోత్సవంలో సాంప్రదాయం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి నుంచి దేవర ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. బుధవారం తెల్లవారు జామున బంగారమ్మ దేవాలయం వద్ద పెద్ద సంఖ్యలో జంతుబలులు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రజలు భక్తిశ్రద్ధలతో కుంబాలను ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. ఒక్కసారిగా గ్రామానికి చెందిన కుంబాలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో దేవాలయం ఆవరణ భక్తులతో నిండిపోయింది. రాత్రి వరకు దేవాలయం వద్ద పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసు కోకుండా పెద్దతుంబళం ఎస్‌ఐ ఉసేన్‌బాషా, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
ఘనంగా మారెమ్మ దేవర
కోసిగి, డిసెంబర్ 13: మండల పరిధిలోని దుద్ది, చిర్తనకల్, కందుకూరు, వందగల్ గ్రామాల్లో బుధవారం ఘనంగా మారెమ్మ అవ్వ జాతర నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పూర్ణకుంభాలతో డప్పువాయిద్యాల మధ్య గ్రామస్థులు నైవేద్యం పెట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారిని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ ముత్తురెడ్డి, వక్రాణి వెంకటేశ్వర్లు, రామిరెడ్డి వచ్చి దర్శించుకున్నారు. ఈజాతర ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.

తృట్టిలో తప్పిన ప్రమాదం
* కారు బోల్తా... ప్రయాణికులు సురక్షితం
కల్లూరు, డిసెంబర్ 13: డోన్ వైపునుండి కర్నూలు వస్తున్న కారుకు బ్రేకులు ఫెయిల్ అవడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై పల్టీలు కొడుతూ రోడ్డుపక్కన పడిపోయింది. బుధవారం మధ్యాహ్నం మండల పరిధిలోని గ్యాస్ ఫ్యాక్టరీ వద్ద డోన్ వైపునుండి కర్నూలుకు నలుగురు యువకులు అతివేగంగా కారు డ్రైవ్ చేసుకుంటు వస్తుండగా రోడ్డుపై వెళ్తున్న లారీ, ఆటోను క్రాస్ చేయబోయే బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. దీంతో అక్కడ హమాలీలు, గ్యాస్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న ప్రజలు చూస్తుండగానే కారు రోడ్డుపై పల్టీలు కొడుతూ కంపచెట్లలోకి పడిపోయింది. స్థానికలు వెంటనే అక్కడి చేరుకుని కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు బయటకు తీసి రక్షించారు. ప్రాణాపాయం తప్పి చిన్నపాటిగాయాలతో వారు బయటపడ్డారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
కౌతాళం, డిసెంబర్ 13:మండల పరిధిలోని హాల్వి గ్రామంలో పేకాట ఆడుతున్న 11 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ సుబ్రమణ్యంరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గ్రామంలో 11 మంది పేకాట ఆడుతుండగా దాడులు నిర్వహించి వారి వద్ద ఉన్న రూ.22,080లు, సెల్‌ఫోన్లు, ఆటో, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈదాడుల్లో నాగరాజు, షఫీతోపాటు పలువురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
పశుగ్రాసం దగ్ధం
చాగలమర్రి, డిసెంబర్ 13: మండలంలోని మల్లెవేముల గ్రామ సమీపంలో బుధవారం ట్రాక్టర్‌లో తీసుకొస్తున్న పశుగ్రాసం దగ్ధమైంది. మల్లెవేముల గ్రామానికి చెందిన రైతు జయరామిరెడ్డి, కడప జిల్లా బ్రహ్మంగారి మఠం ప్రాంతం నుండి ట్రాక్టర్‌లో పశుగ్రాసాన్ని తీసుకొని వస్తుండగా విద్యుత్ తీగల నుండి పడ్డ నిప్పురవ్వల కారణంగా దగ్ధమైంది. ఈ ప్రమాదం వద్ద సుమారు రూ.30 వేలు నష్టపోయినట్లు బాధిత రైతు తెలిపారు. కేవలం ఐదు నిమిషాల్లో గ్రామం చేరుతామనుకొనేలోపే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను ఆర్పివేసింది.