కర్నూల్

నిబంధనలకు తిలోదకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 14 : జిల్లాలోని పలు ప్రైవేట్ ఏజెన్సీల యాజమాన్యాలు సిబ్బంది శ్రమను దోచుకుంటున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతి యాజమాన్యం వారి ఏజెన్సీల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించాల్సి ఉండగా చాలా వరకూ ఏజెన్సీలు చెల్లించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో వందల ఏజెన్సీలు పని చేస్తూ వాటిలో వేలాది మంది ఉద్యోగులను నియమించుకున్నారు. అయితే కొన్ని ఏజెన్సీల యాజమాన్యాలు నిబంధనలను తుంగలో తొక్కి కార్మికుల కోసం పీఎఫ్, ఈఎస్‌ఐకు నగదును చెల్లించడం లేదు. మరికొన్ని ఏజెన్సీలు ఉద్యోగుల నుంచి వసూలు చేసిన ఆ మొత్తాలను స్వాహా చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 45 నుంచి 50 వరకూ ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 4,500వేల మంది వరకూ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆయా ఏజెన్సీల యాజమాన్యాలు ఉద్యోగుల జీతాల్లో నుంచి కొంత మొత్తాన్ని భవిష్యనిధికి జమ చేయాలని, అనారోగ్యం పాలైతే మెరుగైన వైద్యం అందించేందుకు ఈఎస్‌ఐ కింద కొంత మొత్తాన్ని తీసుకుంటారు. ఉద్యోగుల జీతంలో తీసుకోవడంతో పాటు సదరు ఏజెన్సీ నిర్వాహకులు సైతం ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఏజెన్సీ మారినప్పటికీ కొత్తగా నిర్వహణ చేసి ఐదుగురు ఉద్యోగుల కంటే ఎక్కువ మంది పని చేస్తున్న సంస్థ తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తాలను చెల్లించాల్సి ఉంది. అయితే జిల్లాలో చాలా ఏజెన్సీలు ఎక్కువగా రాజకీయ పలుకుబడితో పాటు అధికారుల అండ

దండలతో కాంట్రాక్టును దక్కించుకుంటున్నారు. ఈ ముసుగులో ఉద్యోగాల నియామకం పేరుతో నిర్వాహకులు నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. కనీసం ఉద్యోగాల్లో చేర్చుకున్న తర్వాత నిబంధన ప్రకారం తప్పనిసరిగా వారి వేతనాల్లో పీఎఫ్, ఈఎస్‌ఐ వసూలు చేయడంతో తాము సైతం ఆయా మొత్తాలను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇలా చేయడం ద్వారా సదరు ఉద్యోగులకు భరోసా కలుగుతోంది. కానీ చాలా ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఉద్యోగుల నుంచి నగదు వసూలు చేస్తున్నా దానిని ప్రభుత్వానికి చెల్లించకుండా లక్షల రూపాయలు స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు ఆయా శాఖల అధికారులు ఏజెన్సీలతో కుమ్మక్కై ముడుపులు తీసుకుంటూ ఈ విషయాలను బయటకు రాకుండా చూస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పురపాలక సంఘాలు, పలు ప్రాంతాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేసే ఉద్యోగుల నిర్వహణను చూస్తున్న ఏజెన్సీలు ఉద్యోగుల జీవితాలకు భవిష్యత్తు లేకుండా చేస్తుండటం గమనార్హం. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తీవ్రంగా నష్టపోతున్న ప్రైవేట్ ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పల్లెల్లో ఉట్టిపడిన
సంక్రాంతి శోభ..
* ఊరూరా సంబరాలు..

కర్నూలు, జనవరి 14 : రైతుల పండుడగా చెప్పుకునే సంక్రాంతి పండుగ వేడుకలను జిల్లా వ్యాప్తంగా గ్రామీణులు అత్యంత ఉత్సాహంతో జరుపుకొంటున్నారు. పల్లెల్లో జరిగే సంక్రాంతి పండుగ కోసం పట్టణాల్లో ఉద్యోగం, వ్యాపారాలు చేసుకునే వారంతా బంధువుల ఇళ్లకు తరలివెళ్లడంతో అన్ని పట్టణాల్లో జన సంచారం భారీగా పడిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం భోగి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పల్లెలు, పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. భోగి పండుగ సందర్భంగా ఆడపడుచులు రాత్రంతా కష్టపడి వేసిన ముగ్గుల నడుమ తెల్లవారుజామున కొత్త కుండలో ఆవుపాలు, కొత్తగా ఇంటికి చేరిన ధాన్యంతో పొంగలిని పొంగించారు. అదే సమయంలో యువకులు ఉత్సాహంగా వేసిన భోగి మంటల పక్కన కూర్చొని పెద్దలు, వృద్ధులు చలి కాచుకుంటూ గత ఏడాదంతా తాము పడిన కష్టాలు, వ్యవసాయంలో కష్టనష్టాల గురించి చర్చించుకుంటూ పండుగ వేడుకలను ప్రారంభించారు. తెల్లవారుజామునే తమ ఇష్ట దైవాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భోగి పండుగ రోజు నువ్వులతో చేసిన జొన్నరొట్టె, గుత్తి వంకాయ కూరను ప్రత్యేకంగా తయారు చేసి ఇంటిల్లిపాదీ ఆరగిస్తారు. మధ్యాహ్నం నుంచి యువకులకు బరువు ఎత్తే పందేలు, యువతులకు ముగ్గుల పోటీలు వంటివి నిర్వహించి వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటున్నారు. ఇక మకర సంక్రాంతి అయిన సోమవారం కూడా తెల్లవారుజాము నుంచే పల్లెల్లో ఉత్సాహంగా వేడుకలు ప్రారంభిస్తారు. పండుగ సందర్భంగా పల్లెల్లో ప్రజలంతా ఒక చోట చేరి ఉత్సాహంగా గడుపుతూ సాయంత్రం తమ గ్రామ దేవతకు నైవేద్యం సమర్పించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలను పల్లెలకు పోటీగా పట్టణాల్లో కూడా నిర్వహించుకుంటున్నారు. పల్లెలకు వెళ్లలేని వారు పట్టణాల్లో తమ ఇళ్ల ముందు ముగ్గులు

వేశారు. ఆ ముగ్గుల మధ్యన భోగి మంట వేసి పాలను పొంగించి సంప్రదాయం వీడకుండా పండుగను నిర్వహించుకుంటున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన ప్రజలు ఇళ్లలో ఇష్టదైవాలకు పూజలు నిర్వహించి సాయంత్రం ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకోనున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు
రాష్ట్ర విభజన అనంతరం సంక్రాంతి పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఆదివారం కర్నూలు నగరం సహా అన్ని పురపాలక సంఘాలు, మండల కేంద్రాల్లో అధికారులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భోగి మంటలతో ప్రారంభించి మహిళలకు రంగవల్లులు, వంటల పోటీలు, యువకులకు గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, తదితర పోటీలు నిర్వహించి విజేతలకు ప్రభుత్వం తరఫున బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి సంబరాల్లో గ్రామీణ వాతావరణం ఉట్టి పడేలా ఏర్పాట్లు చేసి పట్టణ వాసులు సంక్రాంతిని పల్లెల్లో చేసుకున్న అనుభూతి కలిగేలా అధికారులు కృషి చేశారు. సంక్రాంతి వేడుకలు ఊరూరా ఉత్సాహంగా జరుగుతున్నాయి.

రావణ వాహన సేవలో దర్శనమిచ్చిన
పార్వతీపరమేశ్వరులు
శ్రీశైలం, జనవరి 14 : శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన శనివారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు రావణ వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరింపచేయించి అలంకరణ పూజలు అర్చక వేదపండితులు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరోమారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఉత్సవ పూజలను నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు ఇచ్చి ఆలయ రాజోగపురం గుండా గ్రామోత్సవానికి తోడ్కొని వచ్చారు. ఈ గ్రామోత్సవం ఆలయ రాజగోపురం నుండి మాడవీధుల్లో ఎంతో వైభవంగా మేళ తాళాల నడుమ ఎంతో వైభవంగా సాగింది. ఈ గ్రామోత్సవంలో ఉత్సవ మూర్తులను

భక్తులు, స్థానికులు దర్శించుకుని అడుగడుగునా స్వామి అమ్మవార్ల ఉత్సవానికి కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. విద్యుత్ దీపకాంతుల నడుమ గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమంలో ఈవో నారాయణ భరత్ గుప్తా దంపతులు, ఏఈఓ రాజశేఖర్, అర్చక వేదపండితులు, ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళారాధనలో భాగంగా దేవస్థానం వారు ఏర్పాటు చేసిన శశికళ నంద్యాల వారి సంప్రదాయ నృత్య ప్రదర్శన భక్తులను ఎంతో ఆకట్టుకుంది.
మటన్ షాపుల తనిఖీ
కర్నూలు సిటీ, జనవరి 14:నగరంలోని సంతోష్‌నగర్, బాలాజీనగర్, వెంకటరమణ కాలనీల్లో నిర్వహిస్తున్న మటన్ షాపులను ఆదివారం మున్సిపల్ ఆరోగ్య అధికారి డా. ఉస్మాన్ అలీఖాన్, పశువైద్యాధికారి డా. రవిబాబు తనిఖీ చేశారు. అందులో సంతోష్‌నగర్, బాలాజీ నగర్‌లలో 6 షాపులు, వెంకటరమణ కాలనీలోని 6 షాపుల్లో తనిఖీలు చేసి దాదాపు రూ. 23,500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆరోగ్య అధికారి డా. ఉస్మాన్ ఆలీఖాన్ మాట్లాడుతూ జబ్బు పడ్డ జీవాలను కోస్తూ వాటి మాంసాన్ని ప్రజలకు విక్రయిస్తున్నారని, దీని వల్ల ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు.
అలాగే మిగిలి పోయిన మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు షాపులో పెట్టి అమ్ముతున్నారని వెల్లడించారు. జబ్బు పడి, లివర్ చెడిపోయిన జీవాలతో పాటు చిన్న పిల్లలను కోస్తూ ప్రజలకు రోగాలను అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మటన్ షాపులో పశువైద్యాధికారి జీవాన్ని పరీక్షించి ఏ రోగం లేకపోతే ఆ జీవాన్ని కోయాలన్నారు. అయితే మటన్ షాపుల నిర్వాహకులు అవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారన్నారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్కెట్‌లోని దుకాణాల్లోనే మాంసం విక్రయించాల్సి ఉందన్నారు. అయితే కొందరు వ్యాపారులు ఇష్టానుసారంగా రోడ్ల మీదనే జీవాలను కోస్తూ దుమ్ము, ధూళి మధ్యన మాంసం విక్రయిస్తున్నారని తెలిపారు. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని ప్రభుత్వమే వాటిని రద్దు చేసిందని, కొన్ని మటన్ షాపుల్లో ఇప్పటికీ మాంసాన్ని ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ప్రజలకు ఇస్తున్నారని వివరించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌బాబు, పరుశురాం, సిబ్బంది పాల్గొన్నారు.
తలాక్ చట్టాన్ని
రద్దు చేయాలి
* ముస్లిం పర్సనల్
లా బోర్డు సభ్యులు
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 14 : ఇస్లాం ధర్మం, ఇస్లాం సంస్కృతికి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెచ్చిన తలాక్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు సయ్యద్ జాకీర్ అహ్మద్ కోరారు. ఈ విషయంపై ఈ నెల 19వ తేదీ ఆల్ ఇండియా ముస్లం పర్సనల్ లా బోర్డు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఉస్మానియా కళాశాలలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, లాబోర్డు సభ్యులు ఉలేమా హాజరవుతారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇస్లాం మతంలో కుట్ర పూరిత జోక్యం చేసుకుని తలాక్ చట్టాన్ని తెచ్చి ముస్లిం సమాజంలో గందరగోళం సృష్టించిందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15 ప్రకారం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించి తమ హక్కులను కాలరాస్తోందని ధ్వజమెత్తారు.
సెప్టిక్ ట్యాంకర్ బోల్తా.. డ్రైవర్ మృతి
బేతంచెర్ల, జనవరి 14:మండల పరిధిలోని బుగ్గానిపల్లె సమీపంలో ఆదివారం సెప్టిక్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్ మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. సీఐ కంభగిరి రాముడు తెలిపిన వివరాలు.. నంద్యాలకు చెందిన సెప్టిక్ ట్యాంకర్ బేతంచెర్లలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసి తిరిగి వెళ్తుండగా మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ట్యాంకర్ డ్రైవర్ శ్రీరామచెన్నయ్య(34) అక్కడికక్కడే మృతి చెందగా, అందులోని కూలీలు యాకుబ్, మగ్బుల్ గాయపడ్డారు. దీంతో వారిని 108 వాహనంలో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అలాగే చెన్నయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. కాగా చెన్నయ్యకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.