కర్నూల్

ఏడాది ముందే కర్నూలు సీటు కోసం కుస్తీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 17: సాధారణ ఎన్నికలకు ఏడాది కంటే ఎక్కువే సమయం ఉన్నా కర్నూలు సీటు నాదంటే నాదంటూ అటు స్థానిక ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఇటు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ప్రకటిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున తాను పోటీ చేయడం ఖాయమని ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి స్పష్టం చేస్తుండగా ఆమాట చెప్పడానికి ఆయన ఎవరు, అభ్యర్థిని తేల్చాల్సింది పార్టీ అధినేత చంద్రబాబు అంటూ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ప్రశ్నిస్తున్నారు. గత రెండు, మూడు నెలలుగా ఎస్వీ మోహనరెడ్డి, టీజీ భరత్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా కుమారుడికి మద్దతుగా ఎంపీ టీజీ వెంకటేష్ స్పందిస్తూ ఎస్వీ మోహనరెడ్డి కుటుంబానికి మూడు శాసనసభ నియోజకవర్గాలు ఎందుకు, కర్నూలును వదులుకోవాలంటూ సూచించడం గమనార్హం. కర్నూలు శాసనస్థానం నుంచి 1999లో టీడీపీ అభ్యర్థిగా, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన టీజీ వెంకటేష్ ఆ తరువాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో తన స్థానంలో కుమారుడు టీజీ భరత్‌ను రాజకీయ రంగప్రవేశం చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు టీజీ భరత్ రాజకీయంగా అడుగులు వేస్తూనే ప్రజలను ఆకర్శించడానికి తమ సొంత నిధులతో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాయడానికి అవసరమైన సహకారం అందించడం, మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత నిస్తూ, మరోపక్క క్రీడాకారులకు ఆర్థికసహాయం, పేదలకు అవసరమైన సాయమందించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎస్వీ మోహనరెడ్డి సైతం నిత్యం కర్నూలులోనే ఉంటూ ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వార్డుల్లో కలియ దిరుగుతున్నారు. ఆయన 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా విజయం సాధించినా 2016లో అధికార టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయనకు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ప్రభుత్వ నిధులతో వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు, యువతను ప్రోత్సహిస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ, ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుందన్న ప్రకటనతో నగరంలోని పేద నిరుద్యోగ యువతకు డిఎస్సీ పరీక్షలు రాసేందుకు నిపుణులతో శిక్షణ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే ప్రజల్లోకి వెళ్తుండటంతో ప్రజలు ఇరువురిని ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో నెల రోజుల క్రితం ఒక సెల్‌ఫోన్‌కాల్ కలకలం సృష్టించింది. కర్నూలు టీడీపీ అభ్యర్థిగా ఎస్వీ మోహనరెడ్డి, టీజీ భరత్‌లలో ఎవరు సరైన వ్యక్తి అంటూ ప్రజాభిప్రాయం సేకరించడంతో ఎస్వీ మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వరకు వీరి మధ్య కొనసాగిన మాటల యుద్ధం మరింత ముదిరి చివరకు పాకాన పడే స్థాయికి చేరుకుంది. తాజాగా వారం క్రితం మరో మారు టీజీ భరత్ ఒక వీడియోలో ఎస్వీ మోహనరెడ్డి తానే అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడం సరైంది కాదని, దీనిపై తాను పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరవేశారు. దీనికి ఎస్వీ స్పందిస్తూ టికెట్ వస్తుందన్న ధీమాతోనే తాను చెప్పుకుంటున్నానని సమాధానమిచ్చారు. రాజకీయంగా కర్నూలు తనకు పుట్టినిల్లు లాంటిదని, తన సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డ, తన తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డికి చేయూతనందించి పత్తికొండ నియోజకవర్గాల్లో ఇప్పుడు భూమా, కెయి కుటుంబీకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారని వారిని కాదని తనకు అక్కడ టికెట్ ఎలా ఇస్తారని ఎదురు ప్రశ్న వేశారు. దీంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నూలు నుంచే పోటీ చేస్తానని మరో మారు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎంపీ టీజీ వెంకటేష్ జోక్యం చేసుకుంటూ ఎస్వీ కుటుంబంలో మోహన్‌రెడ్డితో పాటు ఆళ్లగడ్డ, నంద్యాల ఎమ్మెల్యేలుగా ఆయన కుటుంబీకులే ఉన్నారని, అలాంటప్పుడు కర్నూలును వదులుకుంటే మరొకరికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది కదా అని సూచించారు. కాగా టీజీ, ఎస్వీల మధ్య సీటు కోసం జరుగుతున్న కుస్తీ సాధారణమేనని, ఎవరికి టికెట్ ఇవ్వాలో అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఇరువురు టికెట్ కోసం కాకుండా కర్నూలు నియోజకవర్గం, పార్టీ అభివృద్ధి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తే భవిష్యత్తులో వారికే మేలు చేకూరుతుందని స్పష్టం చేస్తున్నారు.