కర్నూల్

కర్నూలుపై వివక్ష ఎందుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 19 : రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో తొలి పంద్రాగస్టు వేడుకలు నిర్వహించి హామీల వర్షం కురిపించిన సీఎం చంద్రబాబులో జిల్లాపై కోపం తారస్థాయిలో ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ కోపం ప్రజలకు కనిపించకుండా కక్ష తీర్చుకోవడానికి కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి చాంతాడంత హామీలు గుప్పించారని ఆయా పార్టీలు చాలా కాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నాయి. అయితే జిల్లా ప్రజలు మాత్రం అవేమీ పెద్దగా పట్టించుకోకపోయినా తాజాగా చంద్రబాబు నిజంగానే కర్నూలుపై కక్ష పెంచుకున్నట్లు కనిపిస్తోందన్న చర్చ రైతుల్లో ప్రారంభమైంది. ప్రధానంగా కరవుకు చిరునామాగా ఉన్న పడమర ప్రాంత రైతులు చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జిల్లా ప్రజలు 2014లో టీడీపీకి ఓట్లు వేయలేదన్న కోపం చంద్రబాబులో ఉందన్న విశ్వాసం వారిలో కనిపిస్తోంది. పడమర ప్రాంత రైతులకు ప్రాణాధారమైన తుంగభద్ర దిగువ కాలువ సమస్య, ఏళ్ల తరబడి కోరుతున్న గుండ్రేవుల జలాశయం, వేదవతి నదిపై ఎత్తిపోతల పథకాల ప్రస్తావనే లేకుండా నాలుగేళ్లు గడిపి ఇప్పుడు అనంతపురం జిల్లాకు మేలు చేసే విధంగా తుంగభద్ర నదిపై కొత్తగా ఎత్తిపోతల పథకం నిర్మించాలన్న ప్రతిపాదనలను ఆమోదించడంతో రైతులు మరింత భగ్గుమంటున్నారు. తుంగభద్ర నదిపై ఎత్తిపోతల నిర్మించి అనంతపురం జిల్లాకు 20 టీఎంసీల నీటిని తరలిస్తే ఇక జిల్లాలోని పడమర ప్రాంతం పూర్తిగా కరవుకు నిలయంగా మారే ప్రమాదం పొంచి ఉంది. అలాగే కేసీ కాలువపై ఆధారపడిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. గత ఏప్రిల్ 13వ తేదీ జీఓ 277ను జారీ చేసిన ప్రభుత్వం ఆ విషయం బహిరంగపడకుండా జాగ్రత్త పడుతూ రహస్యంగా ఉంచింది. అయితే సర్వే పనులు జరుగుతుండటంతో ఇదేమని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రబాబుకు కర్నూలుపై కోపం, అనంతపురంపై ప్రేమ ఉన్నాయని ప్రజలు నిర్ధారణకు వచ్చారు. కృష్ణా జలాల నుంచి హంద్రీ-నీవా ఎత్తిపోతల ద్వారా పడమర ప్రాంతంలో కాలువ ద్వారా నీటిని తీసుకుపోతూ కరవు రైతులకు సాగునీరు అందించడానికి చెరువులు నింపాలని గత నాలుగేళ్లుగా కోరుతున్నా పట్టించుకోని చంద్రబాబు అనంతపురం జిల్లాకు ఆగమేఘాల మీద ఆమోదముద్ర వేయడంపై రైతులు మండిపడుతున్నారు. పడమర చెరువులకు కృష్ణా నీళ్లను అందించడానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించి ఆ తర్వాత ఆ కార్యక్రమం రద్దు చేసి మేధావుల సదస్సు నిర్వహించి వెళ్లిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. జిల్లాలో గత ఎన్నికల్లో ఓట్లు వేయకపోగా ఇప్పటికీ పార్టీకి ప్రజలు సానుకూలంగా లేరన్న సర్వేల కారణంగానే చంద్రబాబు అనంతపురం జిల్లాకు నీటిని తరలించడానికి ఆమోదించి ఉంటారని రైతులు అనుమానిస్తున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో కూడా తుంగభద్ర జలాశయంలోని కేసీ కాలువ నీటిని 5 టీఎంసీలు అనంతపురం జిల్లాకు తరలించగా ఆ తరువాత వైఎస్ 2006లో ఏకంగా 10 టీఎంసీలు కేటాయించారు. ఈ 15 టీఎంసీల నీటిని కృష్ణా జలాల నుంచి ఇస్తామని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నిర్మించి దాన్ని కూడా హంద్రీ-నీవాకు అనుసంధానించి అనంతపురం జిల్లాకు నీటిని తరలించడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. కాగా జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ స్పందించకపోవడం ఓట్ల రాజకీయమేనని రైతులు మండిపడుతున్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి దీనిపై స్పందించి సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాకు లబ్ధి చేకూరుస్తూ కర్నూలుకు అన్యాయం చేసే జీఓ 277ను రద్దు చేయని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని కోట్ల చేసిన హెచ్చరికతో ఆయన వెంట ఉద్యమంలో పాల్గొనేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో శరవేగంగా మారుతున్న ప్రజాభిప్రాయం నేపథ్యంలో చంద్రబాబు జీఓ 277ను రద్దు చేస్తారా లేదంటే కర్నూలుపై కక్ష వాస్తవమేనని నిరూపించుకుంటారో వేచిచూడాలి.
జీఓ 277కు వ్యతిరేకంగా పాదయాత్ర!
* చివరి వారంలో భారీ జనంతో కోట్ల నిరసన

కర్నూలు, జూలై 19 : కేసీ కాలువకు రావాల్సిన తుంగభద్ర జలాలను అడ్డుకుంటూ ఎత్తిపోతల పథకం ద్వారా అనంతపురం జిల్లాకు తరలించాలన్న ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోకుంటే తుంగభద్ర నది వెంట లేదంటే కేసీ కాలువ వెంట పాదయాత్ర చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి భావిస్తున్నారు. తుంగభద్ర నదిపై సుంకేసుల జలాశయానికి ఎగువన, ఆర్డీఎస్‌కు దిగువన ఎత్తిపోతల పథకం నిర్మించి తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలో ప్రతి రోజూ సగటున 2,500 క్యూసెక్కుల చొప్పున 20 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా అనంతపురం జిల్లా పెన్నహోబిలం జలాశయానికి తరలించాలన్న అనంతపురం అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి తోడు అందుకు అవసరమైన సర్వే నిర్వహించాలని జీవో 277ను జారీ చేసింది. దీంతో కేసీ కాలువకు తీవ్ర సాగునీటి సంక్షోభం తలెత్తుతుందని, అంతేగాక సుంకేసుల నుంచి బ్రాహ్మణకొట్కూరు వరకూ కర్నూలు నగరంతో కలిసి వందల గ్రామాల్లో తాగునీటి కొరత ఏర్పడుతుందని కోట్ల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి విదితమే. జిల్లా ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదన్న కోపంతో సీఎం చంద్రబాబు ఇక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. వారంలోపు సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయాలని, లేనిపక్షంలో సుంకేసుల నుంచి ఆర్డీఎస్ వరకూ పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటారని కోట్ల సన్నిహితుల ద్వారా తెలిసింది. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే రైతులతో కలిసి భారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.
పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
* కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వాసుపత్రులు * మంత్రి భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, జూలై 19 : పేద ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో గురువారం రక్త నిధి కేంద్రాన్ని, రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరంలో రక్తదాతలను ఆమె అభినందించి ప్రశంసాపత్రం, మెడల్‌ను ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ వైద్యశాలలకు ధీటుగా ఉచితంగా వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారన్నారు. అలాగే సిబ్బంది కొరత కూడా లేకుండా ఖాళీగా వున్న పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ వైద్యశాలలకు పేదలు మాత్రమే వెళ్లే వారని, నేడు సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యల ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ వైధ్యశాలలకు వెళ్తున్నారన్నారు. ఆళ్లగడ్డకు రక్తనిధి కేంద్రాన్ని తీసుకు వస్తామని గతంలో తాము హామీ ఇచ్చామని, ఇప్పుడు అది నెరవేరిందన్నారు. రక్త నిధి కేంద్రం వుండడం వల్ల రక్తం అందుబాటులో వుంటుందని ఫలితంగా రక్తం లేక ఇబ్బందులు పడాల్సిన అవసరం వుండదన్నారు. అత్యవసర కేసుల కోసం నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం వుండదన్నారు. ఆళ్లగడ్డ వైద్యశాలను తమ తల్లిదండ్రులు కన్న కలల విధంగా 100 పడకల వైద్యశాలగా త్వరలో మారుస్తామన్నారు. ప్రస్తుతం నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతూ వుందని, ఎన్నికలు వచ్చేలోగా హామి నెరవేరుస్తామన్నారు.
పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టాలి
* 1 నుంచి జొన్నలు, ఉప్పు, కారం పంపిణీ * రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ చల్లా
అవుకు, జూలై 19 : రాష్ట్రంలోని పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ చల్లా రామక్రిష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ఆగస్టు 1వ తేదీ నుంచి జొన్నలు, రాగులు, కారంపొడి, ఉప్పు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవుకు పట్టణంలోని చల్లా భవన్‌లో గురువారం కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన జోనల్, జిల్లా మేనేజర్లతో ముఖ్య సమావేశం నిర్వహించారు. తొలుత ఆయా జిల్లాల వారీగా పౌర సరఫరాల శాఖ ఆధీనంలో ఉన్న గిడ్డంగులు, వాటి స్థితిగతులు, ధాన్యం నిల్వ సామర్థ్యం, వాటి అద్దెలు, బస్తాల సరఫరా, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గిడ్డంగుల్లో మెరుగైన సౌకర్యాల కోసం మార్గదర్శకాలను అందజేశారు. అనంతరం చల్లా మాట్లాతూ పౌర సరఫరాల శాఖ ద్వారా ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతికార్డుదారుడికి నెలకు 2కిలోల జొన్నలు, కిలో ఉప్పు, 250గ్రాముల కారం, 3కిలోల రాగులు అందిస్తామన్నారు. జొన్నలు వద్దనుకునే వారికి రాగులు అందిస్తామన్నారు. 13 జిల్లాల్లోని ఎంఎల్‌ఎస్ గోదాములు, చంద్రన్న విలేజ్ మాల్స్‌ను తనిఖి చేస్తానన్నారు. పేద వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 32తో కిలో బియ్యం సేకరించి రూ. 1 కే కార్డుదారుడికి అందిస్తుదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నట్లు దేశంలో ఎక్కడా అందలేదన్నారు. ఇక సీఎం చంద్రబాబు తనపై ఎంతో నమ్మకంతో పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారని, ఆయన నమ్మకం వమ్ము కాకుండా ప్రతి కార్డుదారుడికి అన్ని వస్తువులు అందేలా చుడడమే తన కర్తవ్యమన్నారు. అధికారులు కూడా మరింత నిబద్ధతతో పని చేసి పౌర సరఫరాల కార్పొరేషన్‌కు మంచిపేరు తీసుకురావాలని కోరారు.