కర్నూల్

పంద్రాగస్టున వరాల జల్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 14:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పాలకవర్గంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజలకు వరాలు కురిపించనున్నారని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కావడంతో ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతూ ప్రకటనలు జారీ చేస్తారని పేర్కొంటున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్రమోదీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ఎన్నికైతేనే 2019 ఆగస్టు 15వ తేదీ మరోమారు జాతీయ జెండా ఎగురవేసే అవకాశం దక్కుతుంది. దీంతో ఎన్నికల్లో విజయం కోసం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వేదికగా చేసుకుని ప్రజలను ఆకర్శించే విధంగా పలు కొత్త పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కోడై కూస్తోంది. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుని నామమాత్రపు రుసుముతో ఆరోగ్య రక్ష పథకం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద నలుగురు సభ్యులున్న కుటుంబానికి కేవలం రూ. వెయ్యి బీమా ప్రీమియంగా చెల్లిస్తే దేశంలో ఏ ఆసుపత్రిలోనైనా ఏ వ్యాధికైనా రూ. 5లక్షల వరకూ ఉచిత వైద్య సదుపాయం కల్పించనున్నారని స్పష్టమవుతోంది. ఇక ధనిక వర్గాల కోసం ఆదాయ పన్నులో భారీ రాయితీ లేదంటే బ్యాంకుల ద్వారా నిర్వహించే ఆదాయ, వ్యయాలపై పన్నుల మినహాయింపు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి గతంలో ప్రకటించిన జన్ ధన్ బ్యాంకు ఖాతాల వారికి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఇప్పుడు రూ. 5వేలు ఉండగా దాన్ని రూ. 10వేలకు పెంచనున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందరికీ పక్కా గృహం పేరుతో ప్రస్తుతం నిర్మిస్తున్న గృహాల రాయితీని, బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణ మొత్తాన్ని కూడా ప్రధాని మోదీ పెంచుతారని ప్రచారం జరుగుతోంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి వ్యక్తికీ ఆరోగ్య రక్ష కోసం వారి గ్రామంలోనే ఉచిత వ్యాధి నిర్ధారణ సౌకర్యం ప్రకటించి ఆ సదుపాయాన్ని రానున్న అక్టోబర్ 2వ తేదీ ప్రారంభిస్తారని వెల్లడవుతోంది. ప్రస్తుతం వ్యాధి ఉందని అనుమానం ఉన్న వారు పూర్తిస్థాయి పరీక్షలు చేయించుకుని వ్యాధి నిర్ధారణ అయితే ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స పొందుతున్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యగా వ్యాధి ఉన్నా లేకపోయినా ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునే సదుపాయం కల్పిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రూ. 1200గా ఉన్న ఆరోగ్య కార్డుల ధరను తగ్గించి పేద ప్రజలు కూడా ఆయా కార్డులను కొనుగోలు చేసి ఏ వ్యాధికైనా ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు కల్పిస్తారని ప్రచారంలో ఉంది. పురపాలక, నగర పాలక సంఘాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను ఇక మేజర్ పంచాయతీల్లో కూడా ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటిస్తారని వెల్లడవుతోంది. ఇక రేషన్ కార్డు, ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులను అర్హులైన 2.52లక్షల మందికి రానున్న అక్టోబర్ 2వ తేదీ నాటికి అందజేస్తామని పంద్రాగస్టు వేడుకల్లో సీఎం చంద్రబాబు ఆ మేరకు ప్రకటిస్తారని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తోంది. ఇవే కాక మరిన్ని పథకాలను కూడా ప్రజలకు అందజేస్తారని వాటి వివరాలు తెలియాలంటే పంద్రాగస్టు వరకూ ఆగాల్సిందేనని ఊరిస్తున్నారు. కాగా ఎన్నికలకు ముందు బాబు, మోదీ ఎలాంటి పథకాలు ప్రారంభిస్తారోనన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.