కర్నూల్

జిల్లాలో జనసేన లేనట్లేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 13:జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ పార్టీ రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభావం చూపుతున్నా జిల్లాలో మాత్రం ఎక్కడా పార్టీ జెండా కనిపించని పరిస్థితి నెలకొని ఉంది. గత సాధారణ ఎన్నికలకు ముందు సినీనటుడు పవన్‌కల్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించి ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు తన మద్దతు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆ పార్టీ ఒంటరిగా రానున్న సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆయన పొరుగున ఉన్న అనంతపురం జిల్లాలో సైతం పర్యటించినా కర్నూలులో మాత్రం ఇప్పటి వరకూ రాజకీయ యాత్ర చేపట్టలేదు. జూలైలో ఆలూరు నియోజకవర్గంలోని హత్తిబెళగల్ గ్రామం వద్ద క్వారీలో జరిగిన పేలుళ్ల సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ తరువాత కర్నూలులో బాధిత కుటుంబాల వారిని పరామర్శించి వెళ్లారు. అంతే తప్ప జనసేన పార్టీ కార్యక్రమాలేవీ జిల్లాలో చేపట్టలేదు. దాంతో జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేయబోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. జనసేన పార్టీకి కనీస పార్టీ ప్రతినిధి కూడా లేకపోవడం గమనార్హం. పార్టీ జిల్లా కమిటీని నియమించకపోవడం, పార్టీ కార్యక్రమాలేవీ చేపట్టపోవడంతో రానున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేయకపోవచ్చన్న వార్తలకు బలం చేకూరుస్తోంది. జనసేన జిల్లాలో ఏ మాత్రం ప్రభావం చూపకపోవడానికి కారణం వైసీపీతో కుదిరిన ఒప్పందమేనని టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. జనసేన తరఫున అభ్యర్థులు ఎన్నికల బరిలో దిగితే ఆ ప్రభావం అత్యధికంగా వైసీపీ ఓటు బ్యాంకుపై పడుతుందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. అంతేగాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు సైతం వైసీపీ కంటే జనసేనకే ఎక్కువగా పడతాయని వారు అంచనా వేస్తున్నారు. జిల్లాలో నందమూరి అభిమానులకు దీటుగా మెగా అభిమానులు ఉన్నారని రాజకీయ విశే్లషకులు సైతం వెల్లడిస్తున్నారు. అంతేగాక ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బలిజ, కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నట్లు వారు లెక్కలు వివరిస్తున్నారు. వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్‌పై ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం కూడా జనసేన పార్టీకి ఓట్లను రాబట్టడంలో అనుమానాలేవీ లేవని వారంటున్నారు. అయితే పార్టీ అభ్యర్థుల ఎంపిక తరువాతే జనసేన విజయంపై విశే్లషించవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన మంచి ఓట్ల శాతాన్ని సంపాదించుకుంటుందనడంలో సందేహం లేదని వారు వెల్లడిస్తున్నారు. టీడీపీ అనుమానిస్తున్నట్లుగా జనసేనకు వచ్చే ఓట్లలో ఒక్క వైసీపీకే కాకుండా టీడీపీకి కూడా నష్టం తప్పదని వారంటున్నారు. ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు విషయంలో వైసీపీకి భారీ నష్టం తప్పదని వారు విశే్లషిస్తున్నారు. కాగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున జనసేన పార్టీ నిర్మాణంపై పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దృష్టి సారించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అలా కాకుండా జనసేన రానున్న ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, నామమాత్రంగా పోటీ చేసినా టీడీపీ ఆరోపణలకు బలం చేకూరుస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో వైసీపీ కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా లబ్ధి పొందే అవకాశాలు లేకపోలేదని వారు భావిస్తున్నారు.
నిరుపేదలకు గృహాలు నిర్మించి ఇస్తాం
* పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, అక్టోబర్ 13:నిరుపేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా గృహాలు కూడా నిర్మించి ఇస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. మండల పరిధిలోని బాచేపల్లె గ్రామంలో శనివారం మంత్రి అఖిల 177మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా తల్లిదండ్రులు శోభానాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, మా పెదనాన్న శేఖర్‌రెడ్డి ఆళ్లగడ్డ తాలూకా అభివృద్ధికి చేసిన కృషి మరచిపోలేనిదన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనైనా ప్రజలకు అండగా నిలిచారన్నారు. వారి ఆశీస్సులతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో బాచేపల్లె గ్రామంలో పింఛను రాని వారు, రేషన్‌కార్డు లేని వారు, ఇళ్ల స్థలాలు లేనివారు చాలా మందిని చూసి బాధపడ్డానన్నారు. ఈనాడు మంత్రి పదవి రావడంతో నేను మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నానన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ, మాకు స్థలాలు ఎక్కడ వున్నాయో చూపించడం లేదని లబ్ధిదారులు అంటున్నారని, అధికారులు హడావిడిగా పట్టాలు ఇవ్వడంతో పనైపోలేదని వారికి స్థలాలు చూపించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలతో పాటు పేద ప్రజలకు ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాదేనని మంత్రి అన్నారు. పాఠశాలకు ఆట స్థలం, పొలం రస్తాలు, సీసీ రోడ్లు వేయిస్తామన్నారు. మసీదుకు రూ. 5 లక్షలతో రోడ్డు వేయిస్తామని, ఈద్గాకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రూ. 21 లక్షలతో గోకులం ప్రారంభించామన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో మురికి కాలువలు ఏర్పాటు చేశాకే సీసీ రోడ్లు వేయిస్తామన్నారు. బాచేపల్లె తండా వాసులకు రేషన్‌కార్డులు ఇప్పిస్తామన్నారు. నాన్న, అమ్మలను ఎలా చూసుకున్నారో నన్ను కూడా మీరు అలాగే చూసుకోవాలని మంత్రి కోరారు. నేను మీ సమస్యలు పరిష్కరించేందుకే రాజకీయాలు చేస్తున్నానన్నారు. మీరు తప్ప నాకు ఎవరూ లేరని ఆమె ప్రజలతో అన్నారు.