కర్నూల్

రోడ్లు విస్తరణ పేరున మభ్యపెడుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, నవంబర్ 16: ఆదోని పట్టణంలో రోడ్లు విస్తరణ పేరుతో ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇప్పటికే రోడ్లు విస్తరణ పేరుతో నాలుగుసార్లు గుర్తులు వేశారన్నారు. అయితే పేదలు, చిరు వ్యాపారులు, దేవాలయాలు, మసీదులు ఉన్న ఎమ్మిగనూరు క్రాస్ నుండి తిక్కస్వామి దర్గా వరకు ఇప్పటికీ రెండుసార్లు విస్తరణ పనులు చేపట్టి కాలువల పూర్తి చేశారు. పట్టణంలో మిగిలిన ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ కార్యక్రమం మాత్రం అధికారులు చేపట్టలేదు. వాస్తవానికి మున్సిపల్ మెయిన్ రోడ్డు, పండిట్ నెహ్రూ రోడ్డు, పూలబజారు, బంగారు బజారు, బియన్ థియేటర్ రోడ్డు ప్రాంతాలు రద్దీగా ఉంటాయని, ఆరోడ్లు విస్తరణ చేయకుండా ఇతర రోడ్లును విస్తరణ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్ళీ రోడ్లు విస్తరణ చేస్తామంటూ అధికారుల ద్వారా ప్రకటనలు ఇప్పిస్తున్నారని, రోడ్లు విస్తరణ ప్రకటనలకే పరిమితం అయిందన్నారు. ప్రజాప్రతినిధులు ఉన్నా పట్టణ అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు పట్టణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే బైపాస్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. తెలుగుదేశం నాయకులు బైపాస్ రోడ్డు నిర్మాణంపై స్టే తీసుకొచ్చారన్నారు. గ్రామదర్శిని, గ్రామవికాసం, రెవెన్యూ సదస్సులో పేరుతో ప్రజలకు ప్రయోజనం లేని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. బసాపురం పంపింగ్ హౌస్ వద్ద మోటార్లు, జనరేటర్లు చేడిపోయాయని ఇంత వరకు వాటిని మరమ్మతులు చేయకపోవడం దారుణమన్నారు. 36 చిన్న మోటార్లతో కాలువల్లోని నీరు రిజర్వాయర్‌కు పంపింగ్ చేయడం శోచనీయమన్నారు. వెంటనే మోటార్లను, జనరేటర్లను మరమ్మతులు చేయాలని కోరారు. ఈఅంశంపై ముఖ్యమంత్రి ఫిర్యాదు విభాగానికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. అలాగే ఆదోని పట్టణంలో చెత్తను బాడుగ ట్రాక్టర్లలో తరలించడం వల్ల అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఆదోని డివిజన్‌ను కరువు కాటేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్లకు ఊర్లే ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్, ముంబాయి, గుంటూరు మొదలగు ప్రాంతాలకు వలసలు పోతున్నా అధికారులు వలసలను నివారించలేకపోతున్నారన్నారు. ఉపాధి హామీ పథకం కింద నిధులను బినామీ పేర్లతో స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోందని, అందువల్ల గ్రామాల ప్రజలు వలసలు పోతున్నారన్నారు. ఇప్పటికైనా కరువు పనులు చేపట్టి ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు.