కర్నూల్

పార్టీ, వ్యక్తిగతంగా బలోపేతమవ్వడం ఒక్కటే మార్గం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 8:జిల్లాలో తమ స్థానాలు పదిలంగా ఉండాలంటే రానున్న రెండు నెలల్లో వ్యక్తిగతంగా, పార్టీ పరంగా బలోపేతం కావడం ఒక్కటే మార్గమని ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులకు మంత్రులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు, పార్టీ సమీక్ష సమావేశం నిర్వహణపై శనివారం నగరంలో పార్టీ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి కాలవ శ్రీనివాసులుతో పలువురు జిల్లా నేతలు ఆంతరంగిక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలపై పార్టీ వ్యూహంపై నాయకుల నుంచి మంత్రులకు ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయా అనే అంశంపై మంత్రులు మాట్లాడుతూ పొత్తులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం ఉందని వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. అధికారికంగా ఎలాంటి నిర్ణయం జరుగలేదని, అయితే తప్పకపోవచ్చని అభిప్రాయపడుతున్నట్లు వెల్లడవుతోంది. ఇక జిల్లాలో అధిక స్థానాలు కాంగ్రెస్‌కు ఇచ్చే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, అయితే అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు సర్వేలు చేయిస్తున్న విషయం విదితమే అన్నట్లు తెలిసింది. ఆయన సర్వేలో బలమైన అభ్యర్థులు, గెలుపు ఖాయమని తేలితే ఆ స్థానం ఎవరికీ కేటాయించే ప్రశే్న లేదని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. బలంగా లేని చోట కాంగ్రెస్‌కు కేటాయించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ నేతలు ఎక్కడ బలంగా లేరో ఇప్పటికే చంద్రబాబు నివేదికలో ఉందని, అందులో పేరు లేకుండా చూసుకోవడం నేతలదే బాధ్యత అని స్పష్టం చేసినట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. బలంగా లేని చోట కాంగ్రెస్‌కు ఇవ్వడమో, కొత్త అభ్యర్థిని ప్రకటించడమో ఖాయమని పేర్కొన్నట్లు తెలిసింది. కాగా రానున్న ఎన్నికల్లో పొత్తులపై డిసెంబర్ 11 తర్వాత స్పష్టత వస్తుందని టీడీపీ నేతలు వెల్లడిస్తున్నారు.
తమ్ముళ్లకు 14న జాగరణే
జిల్లాలోని తెలుగుదేశం కార్యకర్తలకు ఈ నెల 14వ తేదీ రాత్రి జాగారం చేయక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా పర్యటనలో భాగంగా 14, 15న రెండు రోజుల పాటు ఆయన పర్యటించాల్సి ఉంది. ఇందులో భాగంగా 14వ తేదీ ఉదయం ఆలూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో పర్యటించి సాయంత్రం 5 గంటలకు కర్నూలు చేరుకోనున్న ముఖ్యమంత్రి 7 గంటల నుండి పార్టీ గ్రామ సర్పంచు నుండి రాష్ట్ర మంత్రి వరకు పాల్గొనే కార్యక్రమంలో పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారు. సర్పంచు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు సుమారు 20 వేల మందితో ఆయన స్థానిక ఎస్‌టీబీసీ కళాశాల మైదానంలో మాట్లాడనున్నారు. అర్థరాత్రి తరువాత నియోజకవర్గ సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ప్రత్యేకంగా భేటీకానున్నారు. తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉందని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. ఆ తరువాత 15వ తేదీ ఉదయం 8 గంటల నుండే మళ్లీ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యనేతలతో ముచ్చటించి దిశా నిర్ధేశం చేస్తారని వెల్లడవుతుంది. అనంతరం 10 గంటలకు జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షించేందుకు సిద్దమవుతారు. అనంతరం 2 గంటలకు భోజన కార్యక్రమాలు ముగించుకొని రాజధాని అమరావతికి తిరిగి ప్రయాణం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజధాని అమరావతిలో 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి పాల్గొనాల్సిన సమావేశం ఉండడంతో జిల్లా పార్టీ సమీక్ష సమావేశాన్ని రాత్రే నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా వెల్లడవుతుంది.
సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు
* భవిష్యత్ అభివృద్ధిపై సమీక్ష * ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు
కర్నూలు సిటీ, డిసెంబర్ 8:సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారైందని ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక అశోక్‌నగర్‌లోని తనిష్క్ ఫంక్షన్ హాలులో శనివారం టీటీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మంత్రి కాలవ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారన్నారు. ఈ పర్యటనలో 14వ తేదీ జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా సీఎం చంద్రబాబు మొదట గ్రామదర్శిని, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అదే రోజు అధికారులతో సమీక్ష సమావేశం, రాత్రి నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశంలో పాల్గొని మాట్లాడతారన్నారు. 15వ తేదీ ఉదయం నుంచి జిల్లా కేంద్రంలోనే ఉంటారని ఆ సందర్భంగా మొదట భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారన్నారు. ఆ తర్వాత 20వేల మంది క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు, ప్రజలతో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. కావున ముఖ్యమంత్రి పర్యటనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ దేశంలోని ప్రముఖులందరూ ఒక ఎత్తయితే సీఎం చంద్రబాబు ఒక ఎత్తు అన్నారు. ఆయన ‘ప్రజల వద్దకు పాలన’ నినాదంతో ముందుకెళ్తుతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారన్నారు. జిల్లాలో ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు వంటి నియోజకవర్గాలు అనంతపురం జిల్లా కంటే వెనుకబడిన ప్రాంతాలని, ఆయా నియోజకవర్గాల్లో నిత్యం కరువు తాండవిస్తుందన్నారు. కావున సీఎం పర్యటన ఆయా నియోజకవర్గాల్లో చేపడితే బాగుంటుందన్నారు.
ఎన్టీఆర్ వైద్యసేవ, హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరిస్తాం..
* వైద్య శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
కర్నూలు, డిసెంబర్ 8:ఎన్టీఆర్ వైద్యసేవ, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యకార్డుల బకాయిల చెల్లింపు సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని రాష్ట్ర వైద్య విద్య శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ హామీ ఇచ్చారు. నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యసేవ కింద ప్రాసెస్‌లో వున్న రూ. 254 కోట్లు, ఈహెచ్‌ఎస్ కింద రూ. 77 కోట్లలో 70శాతం మంజూరు విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ఫైనాన్స్ మంత్రి, సెక్రటరీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ, ఈహెచ్‌ఎస్ సేవలు నిలిపివేస్తామన్న నేపథ్యంలో మంత్రి సంబంధిత అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు.
ఇండోర్ స్టేడియం అభివృద్ధి చేస్తాం..
* శాప్ చైర్మన్ అంకం చౌదరి
కర్నూలు, డిసెంబర్ 8:నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియాన్ని ఆధునీకరిస్తామని శాప్ చైర్మన్ అంకంచౌదరి తెలిపారు. అంకం చౌదరి శనివారం కర్నూలుకు వచ్చిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడలకు సంబంధించి నగర ప్రజలు, క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను టీజీ వెంకటేష్ ఆయన దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన క్రీడల అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తామన్నారు. అందులో భాగంగా శిథిలావస్థకు చేరుకున్న ఇండోర్ స్టేడియం స్థానంలో కొత్తగా నిర్మాణం చేపట్టడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి టీజీ వెంకటేష్ కృషి అభినందనీయమని, ఆయన వల్లనే కర్నూలులో జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అలాగే క్రీడల అభివృద్ధిలో భాగంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడాకారులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని చౌదరి తెలిపారు. అనంతరం శాప్ చైర్మన్‌ను టీజీ వెంకటేష్ శాలువాతో సత్కరించారు.
సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
కొలిమిగుండ్ల, డిసెంబర్ 8: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 14వ తేదీన కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాల గ్రామ సమీపంలో రామ్‌కో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసే కార్యక్రమం ఉండడంతో జిల్లా అధికారుల బృందం శనివారం భూమి పూజ జరిగే ప్రదేశం, సభా ప్రాంగణం, ప్రదేశాలను పరిశీలించారు. కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి ఇతర అధికారుల బృందం ముఖ్యమంత్రి భూమిపూజ చేసే ప్రాంతాన్ని, అక్కడి పరిస్థితులను క్షున్నంగా పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాటుకానున్న ప్రదేశానికి చేరుకొని బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యక్రమం ఉండడంతో స్థానిక పరిస్థితులు, ఇతర అంశాలపై పరిశీలన చేస్తున్నామని, ముఖ్యమంత్రి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో అధికారిక సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, కలెక్టర్, ఎస్పీ ముఖాముఖి చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లు, అధికారిక సమాచారం, స్థానిక పరిస్థితులు తదితర విషయాలను చర్చించారు. ముఖ్యమంత్రి ఇక్కడి గురించి ఏదైనా సమాచారం అడిగితే తక్షణమే సంబంధిత అధికారులు ఆయనకు తెలియజేసేందుకు పూర్తి సమాచారం తమ వద్ద ఉంచుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా అధికారులు ఆదేశించారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారు తెలిపారు.
పీఠాధిపతుల నిర్వహణలో మఠాలు
* ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ
మంత్రాలయం, డిసెంబర్ 6: రాష్ట్రంలోని మఠాలన్నీ పీఠాధిపతులచే నిర్వహించబడుతాయని ఎండోమెంట్ రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ అన్నారు. శనివారం విచారణలో భాగంగా శ్రీమఠం వీవీఐపీ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో భ్రమరాంబ మాట్లాడుతూ శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలు, అలాగే దుకాణాలపై, పి.తిక్కారెడ్డి, వి.నారాయణ, శ్రీనివాస్‌కస్వే ఎండోమెంట్ అధికారులకు చేసిన ఫిర్యాదుమేరకు విచారణ చేపట్టడం జరిగిందన్నారు. మఠం ఉద్యోగుల బదిలీలపై క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక తయారు చేసి ఎండోమెంట్ కమిషనర్‌కు పంపుతామన్నారు. అలాగే ఇంతవరకు అనంతపురంలోని ఉరవకొండ, కర్నూలులోని అహోబిలం, పెరవలి మఠాలను పరిశీలించామని, ఇప్పుడు మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠంను పరిశీలించామన్నారు. అలాగే కౌతాళం మండలం ఉరుకుందు ఈరన్న దేవాలయంలో భక్తులకు సరిపడే విధంగా మెరుగైన సదుపాయాల నిమిత్తం జరుగుతున్న నూతన వసతి నిర్మాణ పనులను పరిశీలించామన్నారు. దేవాలయాలకు, మఠాలకు భక్తులు విరాళంగా సమర్పించిన భూములను అమ్మే అధికారం లేదు. స్థానిక దేవాదాయ భూములను అమ్మే హక్కు మఠాలకు లేదని, అయితే ఇతర రాష్ట్రాల్లో మఠాలకు సంబంధించిన దేవాదాయ భూములను అవసారాన్ని బట్టి అమ్మాలంటే హైకోర్టు అనుమతులను పొంది బహిరంగ వేలం (ఓపెన్ యాక్సన్) వేయాలని అన్నారు. 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే మేరకు దేవాదాయ శాఖ భూముల్లో ఒక్క అడుగు కూడా ఇతరులకు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. అయితే మఠం చుట్టపక్కల ఉన్న స్థలాలు ప్రైవేటు వ్యక్తులకు ఎలా వచ్చాయని ప్రశ్నించగా.. వాటిపై విచారణ చేసి నివేదిక తయారు చేస్తామన్నారు. దేవాలయాలు, మఠాల్లో నిర్వహించే ఉత్సవాలకు, పత్రికల వార్శికోత్సవాలకు ప్రకటలను (యాడ్స్) ఇవ్వవచ్చుననే ఆవిషయాన్ని నివేదికలో రాస్తామన్నారు. అంతకుముందు సీపీఐ మండల నాయకులు డీఎం ఎల్లప్ప, గ్రామస్థులు వడ్డే నారాయణ మఠం చిరుఉద్యోగుల పరిస్థితులను వివరించారు. వాటిపై తగు చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. అనంతరం మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థులు, మఠం అధికారులతో కలసి పరిమళప్రసాదాల తయారీ, అన్నపూర్ణ భోజనశాల, ఇంజినీర్ సెక్షన్, వంట సరుకుల గోడాన్ రికార్డులు, వివిధ మఠం అతిధిగృహాలు, మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిమళపాఠశాల, పార్కులను పరిశీలించారు.
ఉద్యాన పంటలను ప్రోత్సహించాలి
* కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
దేవనకొండ, డిసెంబర్ 8: అత్యంత లాభదాయకమైన ఉద్యాన పంటలు సాగు చేసుకున్న రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి తెలిపారు. శనివారం కరివేముల గ్రామంలో రైతు విష్ణువర్థన్‌రెడ్డి సాగు చేసిన యాపిల్ బేర్ డ్రాగన్ ఫుడ్స్ పండ్ల తోటలను ఆయన పరిశీలించారు. అనంతరం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు బావులు, బోర్ల కింద పంటలు పండించుకున్న ఉల్లి, టమోట పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. రైతులు ఉద్యాన వన పంటలు సాగు చేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. రాయలసీమలో ఎక్కడ పండించని డ్రాగన్‌ఫుడ్స్ పంటను పండిస్తున్న విష్ణువర్థన్‌రెడ్డికి ఉత్తమ రైతు అవార్డు ఇవ్వవచ్చన్నారు. అలాంటి రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తే మరి కొన్ని ఉద్యాన పంటలు పండించడం జరుగుతుందన్నారు. అనంతరం హంద్రీనీవా నీళ్లతో నిండిన దేవనకొండ చెరువును కోట్ల స్వయంగా పరిశీలించారు. దేవనకొండ చెరువు పూర్తిగా నిండినందున కొద్దిగా నీటిప్రవాహం తగ్గించి కరివేముల చెరువుకు పూర్తిస్థాయిలో నీళ్లు అందించేందుకు సంబంధిత అధికారులతో కలిసి మాట్లాడి చర్యలు తీసుకుంటామని కోట్ల తెలిపారు.
దద్దనాల ప్రాజెక్టు ఎత్తిపోతల ట్రయల్ రన్ విజయవంతం
బనగానపల్లె, డిసెంబర్ 8:జిల్లాలోనే పేరుగాంచిన చిన్న నీటిపారుదల ప్రాజెక్టు దద్దనాల ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్‌ను శనివారం అధికారులు విజయవంతంగా నిర్వహించారు. మైనర్ ఇరిగేషన్ ఏఈ రామ్మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు దద్దనాల ప్రాజెక్టు పరిధిలో 1541 ఎకరాల సాగు భూమి వుందని, 22 గ్రామాలకు భూగర్భ జలాలు పెరిగేందుకు ఇది ఉపయోగపడుతుంది. కాగా గత కొనే్నళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో దద్దనాల ప్రాజెక్టుకు నీరు చేరడం లేదని, ఫలితంగా ఆయకట్టు భూములకు నీరు అందకుండా పోయింది. దీంతో ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి 22 గ్రామాల్లో భూగర్భ జలాల పెంపు, ఆయకట్టు భూములకు నీరందించే చారిత్రకమైన దద్దనాలకు పూర్వ వైభవం కల్పించేందుకు సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమమాహేశ్వరరావుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా రూ. 22 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో జుర్రేరు వాగు వెంట పెద్ద పైపులైన్లు వేస్తూ దద్దనాల ప్రాజెక్టుకు అనుసంధానం చేశారు. బనగానపల్లె పట్టణ సమీపంలోని జుర్రేరు వాగు వద్ద పంప్‌హౌస్ నిర్మించి పైపులైన్‌ను ఎస్సార్బీసీ కాల్వకు అనుసంధానం చేశారు. దీనివల్ల కాల్వ నీరు విద్యుత్ మోటార్ల ద్వారా 11 కి.మీ దూరంలో వున్న దద్దనాల ప్రాజెక్టుకు చేరుతుంది. ఈ ఎత్తిపోతల పనులు పూర్తి కావడంతో మైనర్ ఇరిగేషన్ అధికారులు శనివారం నిర్వహించిన ట్రయల్ రన్ విజవంతమైంది. ఈ పథకాన్ని అధికారికంగా త్వరలో ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు. దద్దనాల ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో పడమటి పల్లె రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భక్తిశ్రద్ధలతో ఇస్తెమా
* 5 లక్షల మంది ముస్లింల హాజరు
* ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే ఎస్వీ
కర్నూలు సిటీ, డిసెంబర్ 8:దేశంలోనే ప్రప్రథమంగా ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూర్ గ్రామం వద్ద ఆల్ ఇండియా ఇస్తెమా కమిటీ ఆధ్వర్యంలో శనివారం మహా ఇస్తెమాను భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర, ఇస్లాం ధార్మిక విషయాలపై ప్రసంగాలతో సాగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి 1500 మంది మత గురువులు, ప్రముఖులు హాజరవుతారని ముస్లిం మత పెద్దలు తెలుపుతున్నారు. 40 సంవత్సరాల తర్వాత కర్నూలు నగరంలో జరుగుతున్న ఇస్తెమా కార్యక్రమానికి పెద్దఎత్తున ముస్లింలు తరలివచ్చారు. ఇస్తెమాలో వౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.85 కోట్లు విడుదల చేసింది. మొత్తం 865 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఇస్తెమా కార్యక్రమలో 186 ఎకరాలను కేవలం ప్రార్థనల కోసమే కేటాయించారు. 3 రోజుల పాటు జరిగే ఇస్తెమాలో ఢిల్లీకి చెందిన హజరత్ వౌలానా సాద్ సాహెబ్ ఆధ్వర్యంలో ప్రసంగాలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇస్తేమాకు హాజరయ్యే ముస్లింల కోసం 9 ఆరోగ్య కేంద్రాలు, 10 అంబులెన్స్ వాహనాలు, 4 ఫైరింజన్స్‌తో పాటు వాహనాలనకు ప్రత్యేక పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు జరిగే ఇస్తెమా నిర్వహణను రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ పరూఖ్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా హాజరవనున్న ముస్లింలకు ఏ విధమైన అంతరాయం కలగకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి రోజు దాదాపు 5 లక్షల మంది పాల్గొన్నారని, మరో రెండు రోజుల్లో 30 లక్షల మంది పాల్గొంటారన్నారు. కర్నూలులో ఇంత పెద్దఎత్తున ఇస్తెమా నిర్వహించడానికి అవకాశం కల్పించిన మతపెద్దలకు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
రాఘవేంద్రస్వామి సన్నిధిలో
కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి
మంత్రాలయం, డిసెంబర్ 8: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి, దర్వాడ బ్రాంచ్‌కు చెందిన బీఏ పాటిల్ శనివారం వచ్చారు. వారికి మఠం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని, శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు శేష వస్త్రం, ఫల మంత్రాక్షితలు, జ్ఞాపికను ఇచ్చి ఆశీర్వదించారు.
ఐదెకరాల్లో చెరకు పంట దగ్ధం
* రూ. 8 లక్షల నష్టం
నందికొట్కూరు, డిసెంబర్ 8:అరకొర వర్షాలకు బోరులో వున్న కొద్దిపాటి నీరుతో తనకున్న ఐదెకరాల్లో చెరకు పంట సాగు చేసి మరో పది రోజుల్లో పంట కోత కోసే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పంట మొత్తం కాలిబూడిదైపోయింది. పట్టణంలోని కేజీ రహదారికి సమీపంలో రైతు వెంకటేశ్వరరెడ్డి తనకు వున్న 9 ఎకరాల పొలంలో ఐదెకరాల్లో చెరుకు పంట సాగు చేశాడు. అలాగే రూ. 3 లక్షల వ్యయంతో డ్రిప్ ఏర్పాటు చేశాడు. చెరకు పంట సాగు కోసం మరో రూ. 3 లక్షలు ఖర్చు చేశాడు. పొలంలో మొదటి సారి చెరుకు సాగు చేయడం, సకాలంలో ఎరువులు వేయడంతో ఎకరాకు సుమారు 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి వుండడంతో సమీప గ్రామాల ప్రజలు వచ్చి ఈ పంటను సైతం కొద్దిరోజుల క్రితం పరిశీలించారు. పెట్టుబడి ఖర్చులు పోనూ రూ. 4 లక్షల ఆదాయం వస్తుందని రైతు వెంకటేశ్వరరెడ్డి ఎదురు చూస్తుండగా శుక్రవారం రాత్రి ఉన్నఫళంగా అతడు సాగు చేసిన చెరకు పంట దగ్ధమవుతుందని సమీప పొలాల రైతులు తెలుపడంతో కుప్పకూలాడు. సమీప రైతుల సహకారంతో కర్నూలు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా ఆ వాహనం వచ్చే లోగా చెరకు పంట మొత్తం అగ్నికి ఆహుతైంది. ఫైరింజన్ వచ్చి మంటలను అదుపులోకి తేవడంతో పక్క పొలాలను రక్షించినట్లైంది. గిట్టని వ్యక్తులే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకుని తనకు నష్టపరిహారం అందజేయాలని బాధిత రైతు రెవెన్యూ, పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశాడు.