కర్నూల్

శ్రీరాఘవేంద్రునికి ధనుర్మాస పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, డిసెంబర్ 17: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మొదటి రోజు శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందానానికి వేకువ జామన విశేష పంచామృతాభిషేకం, కనకాభిషేకం, ఉత్సవ రాయల పాదపూజ, సుప్రబాత సేత తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీమూలరాములు, జయరాములు, దిగ్విజయరాములు, సంతాన గోపాల కృష్ణ వాసుదేవామూర్తులకు వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. అంతక ముందు స్వామి బృందావన ప్రతిమను స్వర్ణపల్లకిలో ఉంచి మఠం ప్రాకారంలో ఊగించారు. రాత్రి ఉత్సవమూర్తి శ్రీప్రహ్లాదరాయలను గజ, వెండి, స్వర్ణ రథోత్సవాలపై ఊరేగించారు. అనంతరం ఉత్సవ మూర్తికి ఉయ్యాల సేవ నిర్వహించి ప్రత్యేక హారతి ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు శ్రీమంచాలమ్మను, స్వామి బృందావవనాన్ని దర్శించుకుని, రథోత్సవాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
పత్తి రైతు కంటతడి!
* వ్యాపారులకు ప్రాణసంకటం * మూతబడుతున్న జిన్నింగ్ పరిశ్రమ
ఆదోని, డిసెంబర్ 17: ఈ ఏడాది పత్తిపంట రైతుల పాలిట యమపాశంగా తయారైంది. దిగుబడి లేక పత్తి రైతులు కంట తడి పెట్టుకుంటున్నారు. కోట్ల రూపాయాలు ఖర్చు చేసి, బ్యాంకుల్లో అప్పులు చేసి పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటే పత్తిలేక జిన్నింగ్ ఫ్యాక్టరీలు మూసుకునే పరిస్థితి ఉందని, మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలపైన వడ్డీ పెరుగుతూ వస్తోందని పత్తి వ్యాపారులు ప్రాణ సంకటంతో విలవిలాడుతున్నారు. రైతుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. రైతులకు సైతం బ్యాంకుల్లో, వ్యాపారుల వద్ద తీసుకున్న సొమ్ముకు వడ్డీ పెరిగిపోయి అనేక మంది రైతులు తీవ్ర మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల గోడు, వ్యాపారుల ఆవేదన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రజా ప్రతినిధులు ఏమీ పట్టన్నట్లు సభలు.. సమావేశాలు నిర్వహణకు, ఓట్లను దండుకోవడం కోసం ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇంతవరకు నష్టపోయిన రైతులకు చిల్లిగవ్వకుండా చెల్లించిన పరిస్థితి ఉంది. ఆదోని డివిజన్‌లో గత మూడు సంవత్సరాల నుంచి పత్తి పంట రైతులు మొగ్గుచూపారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రెండు కలిసి దాదాపు మూడు లక్షల ఎకరాల్లో కేవలం పత్తి పంట వేశారు. అయితే రబీ, ఖరీఫ్ రెండు సీజన్లలో కూడా వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో అప్పడే పత్తి పంటలు ఎండిపోయాయి. వస్తావానికి మార్చి నెల వరకు పత్తిపంట కాపుకు వచ్చేది. కాని ఇప్పుడు ఆపరిస్థితి ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఏగ్రామానికెళ్లినా ఎండిన పత్తిపంటలే కనిపిస్తాయి. ఎకరాకు 20 క్వింటాళ్లు రావాల్సిన పత్తి కేవలం నాలుగు నుంచి ఆరు క్వింటాళ్లు మాత్రమే రావడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని డాణాపురం రైతు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సీజన్ ప్రారంభంలో పత్తి ధర రూ.5వేల వరకు క్వింటాల్ ధర పలికింది. అయితే ఇప్పుడు క్వింటాల్ రూ.4వేల నుంచి రూ.4,600కు అమ్మకం సాగుతోంది. ధర తగ్గింది. దిగుబడి తగ్గింది, దీంతో రైతులు అప్పులపాలై కడుపు చేతబట్టుకొని బతుకు దెరువుకోసం పట్టణాలకు వలసబాట పట్టారు. గ్రామాలన్నీ ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఆదోని బస్టాండ్ నుండి ప్రతి రోజూ బెంగళూరుకు వలస కూలీలతో ఐదు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. అయితే ఈప్రాంతంలో ఉన్న దుర్భిక్ష స్థితికి అద్దం పడుతుంది. అయినా ప్రభుత్వం ఆదుకోలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కరువు గురించి మాట్లాడలేదు. టీడీపీ నాయకులు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలేదు. ఈ ప్రతిపక్షాలు నోరేమెదపలేదు. కరువు పరిస్థితుల మూలాన పత్తి దిగుబడి తగ్గడంతో రాష్ట్రంలోని పత్తి అమ్మకాలలో రెండవ స్థానంలో ఉన్న ఆదోని మార్కెట్‌కు పత్తి అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. 2017 నవంబర్ నాటికి ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు 97,703 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. నవంబర్ 2018 నాటికి కేవలం 20,556 క్వింటాళ్ల పత్తి మాత్రమే అమ్మకానికి వచ్చింది. 2017 నవంబర్ నాటికి మొత్తం కలిపి లక్ష 64వేల 63 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా 2018 నవంబర్‌నాటికి మొత్తం కలిపి కేవలం 51వేల 9201 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. ఈ ఏడాది అతి తక్కువ పత్తి మార్కెట్‌లోకి అమ్మకానికి రావడం వల్ల వ్యాపారులు పత్తి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదోనిలో 30 జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కనీసం రోజుకు ఐదువేల క్వింటాళ్లు పత్తి అమ్మకానికి వస్తే తప్ప జిన్నింగ్ ఫ్యాక్టరీలకు కూడా పత్తి సరిపోదు. అలాంటి 800 క్వింటాళ్ళ నుంచి 1000 క్వింటాళ్లలోపు పత్తి అమ్మకానికి రావడంవల్ల పత్తి కొరతతో జిన్నింగ్ ఫ్యాక్టరీల యజమానులు పత్తి దొరకక జిన్నింగ్ ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. జిన్నింగ్ ఫ్యాక్టరీ యజమానులు సోమశేఖర్‌గౌడ్, పత్తి వ్యాపారులు హరీ, రాము, శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు వస్తున్న పత్తి కేవలం ఒక్క ఫ్యాక్టరీకి మాత్రమే సరిపోతుందని, దీంతో పత్తి ముడి సరుకు దొరకక జిన్నింగ్ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తాము కోట్ల రూపాయాలు అప్పులు తెచ్చి స్థాపించిన జిన్నింగ్ పరిశ్రమలు పత్తిలేక మూత వేసుకునే పరిస్థితలు వచ్చాయని వాపోతున్నారు. వడ్డీ బ్యాంకుల్లో పెరిగిపోతుందని యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పత్తి వ్యాపారుల సైతం పత్తి లేక తమ సంస్థల్లో ఖాళీగా కూర్చూనే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ఆదోని మార్కెట్‌లో ఎప్పుడూ లేదని వ్యాపారులు అంటున్నారు. తీవ్ర కరువు పరిస్థితుల వల్ల రైతులు, వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కరువు పరిస్థితుల వల్ల పత్తి లేక మూత పడిన జిన్నింగ్ ఫ్యాక్టరీల యజమానులకు బ్యాంకుల్లో వడ్డీపై రాయితీలు కల్పించాలని , వడ్డీలు కట్టేందుకు సమయం గడువు పెంచాలని యజమానులు, తమను ఆదోకోవాలని పత్తి వ్యాపారులు కోరుతన్నారు. ప్రభుత్వం ఆదుకోక పోతే జిన్నింగ్ పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టబడటం ఖాయం. రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదు. రైతులు వలస బాట పట్టడం మరింత పెరుగుతుందని పలువురు అంటున్నారు.
టీడీపీ హయాంలోనే బీసీలకు పెద్దపీట
* ఎంపీ రేణుక, ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి
ఎమ్మిగనూరు, డిసెంబర్ 17: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బీసీలకు పెద్దపీఠ వేసిందని ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కుర్ణి కల్యాణ మండపంలో జయహో బీసీ కార్యక్రమం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈసందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని వాల్మీకి విగ్రహం, మాచాని సోమప్ప విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని జనాభాలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన బీసీలను రాజకీయంగా అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించి తీర్మాణాన్ని అసెంబ్లీలో చేపట్టడం జరిగిందన్నారు. బీసీలకు రాష్ట్రంలోని వివిధ పథకాలలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, ఆదరణ పథకం కింద సంవత్సరానికి నాలక్షల 2వేల మందికి రూ.750కోట్లతో పని ముట్లను అందజేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనాల నిర్మాణం కోసం రూ.5వేలు వేచ్చించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు రూ.1200కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిపుల కింద మంజూరు చేశారన్నారు. బీసీల అన్ని రకాల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో జయహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టి బీసీల సమస్యలను తెలుసుకొని వారికి కావాల్సిన పథకాలు వాటి అమలుపై తీర్మాణాలు చేసి ఈనెల 30వ తేదీన రాజమహేంద్ర వనంలో జరిగే జయహో బీసీ సదస్సులో అజెండాలో పొందు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
అమరావతి, పోలవరం జపం తప్ప కరువు ఊసేదీ..
* 27న కరువు మండలాల్లో బంద్
* వామపక్షపార్టీల రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ
కర్నూలు సిటీ, డిసెంబర్ 17:సీఎం చంద్రబాబు నిత్యం అమరావతి, పోలవరం జపం చేయడం తప్ప కరువు నివారణ ఊసే ఎత్తడం లేదని వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని ఎంపీపీ హాలులో వామపక్ష పార్టీల నాయకులతో పాటు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులతో సీపీఎం, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్‌రెడ్డి, గిడ్డయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కరువు, తుపానులో ఏదో ఒకటి మాత్రమే వస్తుందని అలాంటిది వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రమైన కరువు ఏర్పడితే మరొక పక్క తుపాను వంటి విపత్తులు వచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే అన్నారు. రాష్ట్రంలో ఉన్న 670 మండలాల్లో 552 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ ప్రకటిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 9 జిల్లాల్లో 347 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించిందన్నారు. అయితే ఇప్పటి వరకూ కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడంతో బతుకుతెరువు కోసం వలస పోతున్నారన్నారు. అలాగే కేంద్ర బృందం కూడా కరువు మండలాల్లో పర్యటించింది కానీ ఇంత వరకూ సహాయక చర్యలు చేపట్టలేదని, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టి వలసలను నివారించేందుకు ఉపాధి పనులను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాభావంతో వ్యవసాయం దెబ్బతినటంతో రైతాంగంతో పాటు వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండాపోయిందన్నారు. పశుగ్రాసానికి పనికి వచ్చే వేరుశెనగ, జొన్న లాంటి పంటలు దెబ్బతినడంతో పశుగ్రాసానికి తీవ్రమైన కొరత ఏర్పడిందని, పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టి, ఎకరాకు రూ. 25వేల పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అలాగే 4,5 విడతల రుణమాఫీని తక్షణమే విడుదల చేసి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలన్నారు. కరువు మండలాల్లోని విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేసి, ఉపాధి కూలీలకు 50శాతం కరువు అలవెన్స్ ఇచ్చి, పాడి రైతులకు లీటర్‌కు రూ. 10 బోనస్ ఇచ్చి, గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించి, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీ రాష్ట్ర బంద్ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులతో పాటు రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విద్యార్థులు టెక్నాలజీని
ఉపయోగించుకోవాలి
* ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి
బనగానపల్లె, డిసెంబర్ 17:విద్యార్థులు చదువులో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి సూచించారు. పట్టణ శివారులోని రవ్వలకొండపై ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌ను సోమవారం ఎమ్మెల్యే బీసీ ఎంఈఓ స్వరూపతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రయోగశాల పరికరాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే బీసీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తుందని, సైన్స్ అండ్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. నేటి విద్యార్థులు రేపటితరం మేధావులు, శాస్తవ్రేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసేందుకు టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు తెలివి తేటలను పెంచుకుని సమాజాభివృద్ధికి ఉపయోగపడాలన్నారు. టెక్నాలజీలో బయటి దేశాలతో పోటీ పడాలని, క్రమశిక్షణతో చదువులో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థులకు వైఫై సదుపాయానికి సొంత నిధులు రూ. 20వేలు ఇచ్చారు. త్వరలోనే మోడల్‌స్కూల్‌కు రూ. 30 లక్షల వ్యయంతో ప్రహరీ నిర్మిస్తామని, రూ. 1.7 కోట్ల వ్యయంతో పాఠశాల వరకూ సిమెంట్ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు.
జగన్ అధికారంలోకి వస్తే
ముస్లింలకు స్వర్ణయుగం
* ఎమ్మెల్యే ఐజయ్య
నందికొట్కూరు, డిసెంబర్ 17:వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వస్తే ముస్లింలకు స్వర్ణయుగం ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే ఐజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ముస్లింల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా సోమవారం పట్టణంలో ముందుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జైకిసాన్ పార్కులో ఏర్పాటు చేసిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ముస్లింల ఓట్లు పొందేందుకే సీఎం చంద్రబాబు బీజేపీకి దూరమై కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ముస్లింలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లింల సంక్షేమానికి నాంది పలికారన్నారు. కాగా టీడీపీ హయాంలో ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. వైసీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌బాషా మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్లను 5 శాతానికి పెంచేందుకు వైసీపీ కృషి చేస్తుందన్నారు. అలాగే ఇమామ్, వౌజంలకు జీతాలు పెంచుతారని, ముస్లింల కోసం ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ నిధులు కేటాయించడమేగాక, రూ. 50కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు జగన్ సిద్ధంగా వున్నారన్నారు.
గజవాహనంపై మద్దులేటయ్య
బేతంచెర్ల, డిసెంబర్ 17:శ్రీమద్దులేటి నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీమద్దులేటి నరసింహస్వామి గజ వాహనంపై కొలువుదీరి ఆలయ మాడవీధుల గుండా ఊరేగారు. అర్చకులు వేకువజాము నుంచి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, తిరుమంజనం, శ్రీసుదర్శన హోమం, బలిహరణం, మహానివేదనం, సాయంత్రం కలశారాధన, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రత్యేకంగా అలంకరించిన గజ వాహనంపై స్వామి వారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి ఆలయ మాడ వీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఉత్సవాల్లో భాగంగా మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ పోటీల్లో గౌతమి, విజయలక్ష్మి, రేణుక, మాధవి, కామేశ్వరీ వరుసగా 1,2,3,4,5 స్థానాల్లో నిలిచి రూ. 10 వేలు, 8వేలు, 6వేలు, 4వేలు, 2వేల నగదు గెలుచుకున్నారు. విజేతలకు ఆలయ కమిటీ చైర్మన్ జీసీ వెంకటస్వామి, ఈఓ తిమ్మనాయుడు, ధర్మకర్తలు కేవీ సుబ్బారెడ్డి, గంధం వరలక్ష్మి, క్రిష్ణమోహన్ బహుమతులు అందజేశారు. అలాగే పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను ఆలయ కమిటీ చైర్మన్, ధర్మకర్తలు, ఈఓ ప్రారంభించారు. ఈ పోటీల్లో 17 జతల వృషభరాజములు పోటీ పడ్డాయి. కబడ్డీ పోటీలు కూడా ఉత్సాహంగా సాగాయి. ఆయా పోటీలను మాణిక్యంశెట్టి, విజయలక్ష్మి, అంకిరెడ్డి, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన శ్రీమద్దులేటి నరసింహస్వామికి కటికి రెడ్డి సుధాకర్‌రెడ్డి 1.8 కిలోల వెండి హారతి పల్లెంను అందజేశారు.
మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలి
* ఎమ్మెల్యే ఐజయ్య
నందికొట్కూరు, డిసెంబర్ 17:దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన మాజీ సైనికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఐజయ్య డిమాండ్ చేశాడు. పట్టణంలోని సాయిబాబాపేటలో ఏర్పాటు చేసిన మాజీ సైనికోద్యోగుల సంక్షేమ సంఘం కార్యాలయాన్ని సోమవారం ఎమ్మెల్యే ఐజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిహద్దుల్లో ఇతర దేశస్థులను వణికించిన సైనికులు ఉద్యోగ విరమణ అనంతరం సరైన సౌకర్యాలు లేక అవస్థలకు గురవుతున్నారన్నారు. వారి సంక్షేమం కోసం పలు చట్టాలు వున్నా అవి అమలుకు నోచుకోకపోవడంతో మాజీ సైనికుల కుటుంబాలు ధీనావస్థలో వున్నాయన్నారు. పదవీ విరమణ పొందిన సైనికులకు ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు, పొలం ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంటున్నా వారికి అధికారులు సహకరించకపోవడం విడ్డూరమన్నారు. దేశ రక్షణ కోసం తెగించి పోరాటం చేసిన సైనికులు పదవీ విరమణ అనంతరం తమ హక్కుల కోసం పోరాడాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి మాజీ సైనికులను ఆదుకోవాలన్నారు.

ప్రాథమిక సహకార
సంఘాల్లో సీఈఓల సమ్మె
నందికొట్కూరు, డిసెంబర్ 17:ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పని చేస్తున్న సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా నందికొట్కూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆవరణలో సోమవారం సహకార సంఘాల సీఈఓలు పాపన్న, ఖాజాబాషా, రబ్బాని, చంద్రశేఖర్‌గౌడ్‌తో పాటు సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగులు మేనేజర్ పులిరాజు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్‌బాబు, సూపర్‌వైజర్ రమణ, చక్రపాణిరెడ్డి, సిబ్బంది సైతం వీరి సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఈఓలు మాట్లాడుతూ ఏళ్ల తరబడి సహకార సంఘాల్లో విధులు నిర్వర్తిస్తున్న 6వేల మందికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వం రైతాంగానికి అందజేసే సంక్షేమ పథకాల అమలులో సొసైటీలో పని చేసే సిబ్బంది పాత్ర కీలకంగా వుందన్నారు. కావున వారికి కనీస వేతన చట్టం ప్రకారం రూ. 18,200 వేతనం ఇవ్వాలని, కమిటీ సిఫారసు చేసిన 10 శాతం వేతనం పెంపును 50 శాతానికి పెంచాలని, ఐదవ కేడర్ ఉద్యోగులుగా పరిగణించి సీనియారిటీ ప్రకారం డీసీసీబీలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. అలాగే గ్రాట్యుటీ రూ. 5 లక్షల వరకూ, పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలన్నారు. సీఈఓ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను సంఘాల్లో పని చేసే సిబ్బందితో భర్తీ చేయాలన్నారు.